మత్స్య మహా పురాణము
అగస్త్యగోత్ర ప్రవరాను కీర్తనము
మత్స్య జనార్ధనుడు వైవస్వత మనువునకు ఇట్లు చెప్పెను. అగస్త్యుడు, కరంభుడు, కౌసల్యుడు, కరటుడు, సుమేధసులు, మయోభువులు, గాంధార కాయణులు,పౌలస్త్యులు, పౌలహులు, క్రమవంశ భవులు-ఈ ఋషులు (గోత్రముల వారల)కు అగస్త్యుడు, మహేంద్రుడు, మయోభువుడు అనువారు ప్రవరఋషులు; వీరు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు.
పౌర్ణమానులు పురాణులు అను ఋషుల (గోత్రముల వారల)కు అగస్త్యుడు, పౌర్ణమాసుడు, పారణుడు అను ముగ్గురు ప్రవరఋషులు; వీరు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు.
ఇట్లుచెప్పి మత్స్యనారాయణుడు నీకింతవరకును ఉత్తమ పురుషులతో ఏర్పడిన ఋషుల వంశమును తెలిపితిని; ఇకమీదట మరి ఇంకేమి చెప్పుదునన మనువు-పులస్త్య “పులహక్రతువుల వంశములకు కూడ అగస్త్య వంశమను పేరేల వచ్చెనో తెలుపుము” అనెను. మత్యుడిట్లు చెప్పెను:
వైవస్వత మన్వంతరమున క్రతుప్రజాపతి అనపత్యుడై అగస్త్య పుత్రుడును ధర్మజ్ఞుడునగు ఇధ్మవాహుని తన కుమారునిగా గ్రహించెను. ఇందుచే క్రతు సంతతి వారును అగస్త్యులయిరి.
పులహుని పుత్రులు ముగ్గురు; వారి విషయమున ఇకముందు చెప్పెదను. ఏమయినను వారి విషయమున పులహునకు మనస్తృప్తి కలుగక అగస్త్యుని కుమారుడగు దృఢాన్యుని తన కుమారునిగా తీసికొనెను. అందుచే ఈ పులహుని సంతతి వారును అగస్త్యులయిరి. పులస్త్యుడు వంశము వారు రక్షోజాతి యగుట చూచి అగస్త్యుని కుమారుని (ఒకనిని) తన కుమారునిగా చేసికొనెను. అంతటి నుండి పులస్త్యుని సంతతివారును అగస్త్యులయిరి.
ఇట్లు వీరందరును సగోత్రులు కావున వీరు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు. మహానుభావులును గోత్రకారులును అగు విప్రఋషులు పేర్కొంటిని; వీరి నామములు స్మరించినను పాపముక్తి యగును.