బాలోచిత హితోపదేశము

పార్వతి వీరకుని తన కడకు పిలుచుకొనుచు “రారమ్ము నాయనా! వీరకా! దేవదేవుడు నాకు నిన్ను పుత్రునిగా నిచ్చినాడు; కావున నీవు నాకు కుమారుడ వైతివి! అనుచు అతనిని తన తొడపై కూర్చుండబెట్టుకొని చెక్కిళ్ళు నిమురుచు అతని ముద్దు మాటల కానందించుచు తల మూర్కొని అవయవముల (ధూళి) తుడిచి దివ్య భూషణములతో కోమల పల్లవములతో గజ్జెలు మొలత్రాడు అందెలు రత్నాల భుజకీర్తులు హారములు పుష్పమాలలు మొదలగు వానితో స్వయముగా నలంకరించెను. శుభ్ర విభూతులతో మంత్రించిన ఆవాలతో శరీర రక్షచేసెను. పిమ్మట ఆమె వీరకునితో ఇట్లు బాలురకు చేయదగిన హితోపదేశము చేసెను; నాయనా! జాహ్నవీ జలమున ప్రవేశింపకుము. కల్లోలితమగు నీటితో వ్యాప్తమయిన చోట్ల నది యొడ్డునకు కూడ పోవకుము. బహుదుష్ట వ్యాఘ్రములతో నిండిన అడవులు కలవు. వానియందు ప్రవేశింపకుము అనెను.

అసంఖ్యాకులగు గణేశులయందును తన కతి ప్రీతిపాత్రుడగు ఈ వీరకుని విషయమున దుర్గామూర్తియగు పార్వతి పుత్ర భావముతో సంతుష్టాంతరంగయై వాత్సల్యముతో నుండును. అందుచేతనే ఆమె అతనితో పైవిధముగా చెప్పెను. ఈవిధమగు వాత్సల్యము తమతమ పుత్రుల విషయమున లోకమునందలి మాతా పితరు లెల్లరు కోరుకొనునదే; కాని వారి వాత్సల్యములో మాయావరణము ఉండును, పార్వతి చూపు వాత్సల్యము మాయ నతిక్రమించినది, మాయాతీత మయినది; ఆ వీరకుడును చిలిపి చేష్టలకు పోక సర్వగణ ప్రమథులతో కూడి బాల్యమునకు తగిన ఆటల వలని ఆనందరసమనుభవించు ఆసక్తితో ఇట్లు పలికెను: ఇదుగో! ఇచ్చట మా అమ్మ నాకు తాను స్వయముగా చేసిన భూషణాలంకార సంస్కారము; ఇదిగో వస్త్రము; ఇవిగో దీనియందు సన్నని చుక్కలు; సింధువార పుష్పములతో కూర్చినది మాలతులనడుమ కూర్చునది యగు మాల ఇదిగో! మా అమ్మ నాతలలో ఉంచినది; వాద్యములు మ్రోయించెడి ఈ గణనాథులకీ ఆటవస్తువునిత్తును; అనుచు అడుచున్న ఆ వీరకునివైపు పార్వతీదేవి తన చెలితోకూడి గవాక్షము నుండి దక్షిణమునుండి పడమటకు అటనుండి ఉత్తరమునకు అటనుండి తూర్పునకు వచ్చుచు పోవుచు చూచుచు అతని ఆటల ముచ్చట కనుచుండెను. జగన్మాతకును ఇట్టి చిత్తభ్రమ మాశ్చర్య కరముగదా! ఆమెయే ఇట్లైనచో అల్పబుద్ధులు, జడులు మాంసరక్త మలమూత్ర సముదాయ నిర్మిత శరీరులునగు సాధారణ జనులు పుత్రులుపై మోహమందుటలో ఆశ్చర్యమేమి?

ఇది ఇట్లుండ ఇంతలో శివుని దర్శింపగోరి దేవతలు తమతమ వాహనములపై వచ్చి వాటిని దిగి కక్ష్యాంతరములు ప్రవేశించుచుండిరి. అంతలో ప్రమథగణనాధులు వచ్చి వారి వాహనములు (అల్లరిగా) ఎక్కుచు దిగుచు ఇట్లనుచుండిరి: అరే! ఈ యముడు తక్కిన లోక పాలురతో కలిసి ముద్గరము మాత్రము చేతిలో ఊగించుచు ఖడ్గము పాశము అని (ఒక విధ మగు ఖడ్గము) దండము మొదలగు ఆయుధములందు మమకారమేలేక యున్నాడే ఈతడు ఎవరివాడు? వీనిని ఇట్లు చూచి ఎవరైన పట్టుకొని కొట్టినచో ఏమి గతి! దీనికి ఇది ఏమీ! ఇంత అలక్ష్యము! ఈతని భయంకర ముఖమును ఆకారమును చూచి ఎవరు భయపడుదురు? ఈ పర్వతమున ఇట్టి యాకారముతో పని మాత్రమేమి ఉన్నది. ఈతని ఆకారము చూచి ఇతడు అస్త్రనిపుణుడని ఈతని నెవ్వరు కొట్టకుందురు. అనుచునే వేకోళములాడుచున్న ప్రమథులను చూచి దేవతలు యమునితో “ఆఁ! వీరి చిలిపి చేష్టలును కొంటె మాటలును ఇంతియేలెమ్ము! లోకపాలానుచరులారా! మీరును వీరికి భయపడకుడు” అని ధైర్యము చెప్పుచుండిరి. వారిలో చేరి ఈ వీరకుడును ఆడుచుండెను.

దేవికి అతని మీది మమకారము అమితము; అందుచే అతడు వనములం దాడుకొన బోవునపుడు రక్ష సేయగోరి వన పర్వత నిర్హరములందును అగ్ని దేవతా మార్గములందును ప్రకృతియందు సంచరించుచు భూతములను పొదరిండ్ల యందు సంచరించు జలప్రపాతము లందు మునిగియుండు-పుష్పజాల వ్యాప్త స్థానములందు సంచరించు-ఉన్నత నానా పర్వత నికుంజములందు ధ్వనించు వాయువుల నుద్దేశించి ఆమె “ఓవాయువులారా! మీరు విజృంభణము తగ్గించి వీరకుని ఇచ్చకు తగినట్లు వీచుడు” అని పలికెను. మేరు పర్వతపు ఎత్తైన శిఖరముల నుండి దిగుచు (జారుడుబండ ఆట) ఆడి బంగారు రేఖలతో బంగారు ధూళితో ఒడలు నిండి పోవగా దేవతలు సంచరించు వన రమ్య దేశములందు ప్రమథ గణములు తన వెంటనుండి కొలువగా సుందర మందార పుష్పములు చిగురాకులు పద్మములు గల మందర పర్వత కందరము లందు సిద్ధ స్త్రీలు తన రూపామృతము త్రావుచుండ పార్వతి అతని వినోదములకు వేడుకపడుచు నిమిషము కూడ తెప్ప వాల్పక విప్పారిన కన్నులతో పుత్ర వాత్సల్యముతో వీరకుని చూచుచుండెను. అతడును అట్టి ఉత్సవముల ననుభవించ గల్గుట తన పుణ్యోదయ మనుకొనుచు తాను పూర్వ జన్మాంతరమందును ఆమెకు పుత్రుడై ఉండెనని గుర్తించి ఎంతకును తృప్తినందక అడుకొను చుండెను. ఆ శుభరూపుడు బ్రహ్మదేవుని తేజముతో సృష్టింపబడినవాడుకాని సామాన్యుడు కాడు, ప్రతిక్షణమునను దివ్యులు పాడు గీతముల వినుచు వారి నృత్యముల నాసక్తితో చూచుచు గణేశుల వందనము లందుకొనుచు రత్నజాలపూర్ణమై పెద్ద సాలతాలవృక్ష పూర్ణమయి సింహ నాదాకులమగు గండ శైలములందు విచ్చిన నానా తమాల వృక్షములుకల తావులందు క్రీడించు హంసలుగల తావులందు చెట్ల మొదళ్ళయందు బురద అంతగా లేని తామర కొలకుల జలము లందు శుభము, నిష్కలంకమునగు తల్లి ఒడియందు ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షణకాలము గణేశులకును అధిపతియగు ఆ వీరకుడు బాలక్రీడలతో విహార వినోద మనుభవించుచు ఆడుకొను చుండెను. అతడు దేవతల కానందము కలిగించుచు తిరుగుచుండెను. విద్యాధరు లాతనిపై గీతములను పొదరిండ్లయందు కూర్చుండి పాడుచుండెడివారు. ఆతడు మహాదేవుడును, పినాకధారియునగు శివుని కంటె తక్కువ వాడు. ఐనను ఈతడును అతని వలెనే లీలా విలాసములతో కూడి క్రీడించుచుండెను.

భువన విస్తారమును ప్రకాశింపజేసి ఆస్త పర్వతమునకు వెనుక దూరమున నున్న దేశాంతరమునకు రవి వెడలిపోయెను. మేరుపర్వతము తాను అవనీధరమే (భూమికి గల సుఖదుఃఖముల బరువును మోయునదే) కదా! రవియును (తనకును లోకమునకు వలెనో) మిత్రుడు (స్నేహముతో నుండువాడు-రవి-అని రెండర్థములు-ఇది కాక-ఉదయించు సూర్యునికి మిత్రుడు అనియు అస్తమించు రవికి వరుణుడు అనియు శాస్త్ర వ్యవహారము.) కదా! అతని దృఢ మిత్రత్వమును ఆలోచించియే కాని ప్రతినిత్యమును ఆ రవి తను ఆరాధించుచున్నాడు కదా! (రవి సదా మేరువును ప్రదక్షిణించుచుండును) అని ఆలోచించి విశాలమగు మూలము (మూలధనము) లోకమందంతటను కల మేరువు పడమటి సముద్రములో ఆస్తపర్వతమునకు వెనుకగా పడిపోవుచున్న (చిక్కులలో పడిపోవుచున్న) రవికి ఏమియు ఉపకారము చేయలేదు (ఇది దుష్టుని స్వభావము కావున) వివేకి ఎప్పుడును ఉత్తమునినే ఆశ్రయించవలయును. పాపము ఆమేరు పర్వతము రవిని “ఓయీ! నీవు మనస్సులో చింతపడకుము; నీ పునర్వృద్ధికయి యత్నించు’ ‘నని మాట మాత్రమైన అనలేదే! ఐనను చింతపడక భానుడు దినాంతమను అవసాన దశ తన వెంటరాగా బాధనందక తాను సర్వ ప్రాణులకును స్వజనుడు అను మాటను నిలువబెట్టు కొనెను. రవికి రాబోవు భావి దుర్దశా దుఃఖమును ఆత్మల (తమ మనస్సుల) యందే అణచుకొని మునులు బద్ధాంజలి పుటులైరవి కభిముఖులయి మరల శీఘ్రముగ రమ్మని ప్రార్థింప సాగిరి.

క్రమముగ ఈ లోకమునందంతట విభావరికి (లోగడ బ్రహ్మ ఏ దేవిని-ప్రళయాధి పాత్రిని-యోగమాయను-ప్రార్థించెనో ఆ దేవియే ఈ విభావరి-రాత్రి) సంబంధించిన చీకటులు చెల రేగెను. అది సజ్జనుల మనస్సునుకూడ కలుషితము చేయు దుర్జనుల హృదయము లందలి మాలిన్యమువలె నుండెను. శివుని శయనమందిరము నందలి గోడలు మహానాగముల పడగ లందు జ్వలించు రత్నదీపములతో మిగుల ప్రకాశించుచుండెను. అందలి పానుపు నానా రత్న కాంతులతో ఇంద్రధనువువలె మెరయుచుండెను. దానిపై చంద్రుల సముదాయము వంటి తెల్లదుప్పటి పరచి యుండెను. దానిపయి రతనాల చిరుగజ్జెలు వ్రేలాడుచుండెను. ఇట్టి మందిర మున ఇట్టి పాన్పుపై శంకరుడు మంద సంచారుడయి మెల్లగా గిరిసుతతో కూడి కూర్చుండెను. క్రమముగా ఆతని కంఠము పార్వతీ బాహులతా లింగనములో మునిగెను. అతని శిరమందలి చంద్రుని తెల్లని వెన్నెలలతో నిండి ఆపరిసరము లన్నియు పవిత్రములును నిర్మలములు అయ్యెను. పార్వతి యును స్వాభావికముగనే నల్లని కడగన్నులు కలది; ఆమె మేనిచాయ నల్లకలువ పూరేకుల చాయను పోలినది; ఈ కాంతి విభా వరీ (రాత్రి) కాంతితో సంపర్కమునంది అతి తమోమయమై కడు నల్లనయి తోచెను. తనతో క్రీడించుచు తమకమున ఆ కళల నెరిగి తనకడనున్న యాదేవితో మహాదేవుడు చిన్నగ నవ్వుచు ఇట్లు పలికెను.