యయాతి-తత్పుత్త్రుల సంవాదము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను, ఇట్లు వార్ధకమును పొందిన యయాతి తన రాజధానిని చేరి తన పెద్ద కుమారుడును అందరిలో మేలైనవాడును అగు యదుని పిలిచి ఇట్లు పలికెను. “కుమారా! కవి మునికుమారుడగు ఉశనసుని శాపమువలన నాకు శరీరము ముడుతలు పడినది; జుట్టు నెరసినది. నాకో-యౌవనసుఖముల విషయమున ఇంకను తృప్తి కలుగలేదు. నీవు నా దోషమును ఆ దోషమునకు ఫలమగు వార్ధక (లక్షణ)మును స్వీకరింపుము. యౌవనముతో నేను విషయముల ననుభవింతును. వేయి సంవత్సరముల తరువాత మరల నీయౌవనము నీకుఇచ్చి నాపాపమును వార్ధకమును తీసికొందును.” యదువు: “తండ్రీ! ముసలి తనము కలిగినచో దానివలన పాన భోజనాది విషయములందు ఎన్నియో దోషములు ఏర్పడును. అందుచే నీముసలితనమును నేను తీసికొనను. ఇది నానిశ్చయము. ముసలితనముచే దేహము శిథిల మగును. మీసములు తెల్లని వగును. శరీరము ముడుతలు పడును. వంగిపోవును. చూచుటకు బాగుగా నుండదు. చిక్కిపోవును. ఇట్టివాడు పనులు చేయుటకు అశక్తుడగును. యౌవనము నందున్న వారును తనపై ఆధారపడి జీవించువారు కూడ అవమానింతురు. అందుచే నాకు ముసలితనము ఇష్టము కాదు. నీకు నాకంటెను ప్రీతిపాత్రులగు కుమారులు ఇంకను చాలమంది ఉన్నారుగదా! వారిలో ఇంకెవ్వరినైన మీవార్ధకమును తీసికొమ్మని అడుగుడు. మీరు అన్ని ధర్మములను ఎరిగినవారు.” యయాతి: “నాహృదయమునుండి పుట్టినవాడవై (“హృదయాదధి జాయసే.” అని శ్రుతి.) ఉండియు నీవు నాకు నీవయస్సు నీయకున్నావు. కావున నాయనా! నీ సంతతికి రాజ్యాధికారము లేకుండును” అని అతడు తుర్వసునితో ఇట్లనెను. “కుమారా! తుర్వసూ! నా పాపదోషమును వార్ధకమును కూడ గ్రహింపుము. నీ యౌవనముతో విషయ సుఖముల ననుభవింతును. వేయి సంవత్సరముల తరువాత తిరిగి నీ యౌవనమును నీకిత్తును. నా పాపదోషమును ముసలితనమును తీసికొందును.” తుర్వసుడు: “తండ్రీ! వార్ధకము కామ సుఖానుభవములను తదితర భోగానుభవములను కూడ లేకుండ జేయును. బలమును రూపమును బుద్ధిని ప్రాణశక్తిని నశింపజేయును. కనుక నేనది గ్రహించ ఇష్టపడను.” యయాతి: “నీవు నా హృదయమునుండి పుట్టిన వాడవై ఉండియు నీ వయస్సును నాకీయకున్నావు. కనుక నీ సంతతి తుదివరకు కొనసాగక సముచ్ఛిన్నమగును. నీవు సంకీర్ణమగు ఆచారములను ధర్మములను పాటించువారు ప్రతిలోమ జాతులవారు (తక్కువ వర్ణపు పురుషునకు ఎక్కువ వర్ణపు స్త్రీతో సంగమముచే కలిగినవారు) పచ్చిమాంసమునైన తినువారు అంత్య వర్ణములవారు (ఊరి చివర నివసించువారు)-ఇట్టి వారి నడుమ రాజు వగుదువు. ఇది నిశ్చయము. గురు పత్నితోనైన తిర్యక్-(పశుపక్ష్యాది) ప్రాణులతోనైన సంగమించువారు మ్లేచ్ఛులు అనగా స్పష్టోచ్ఛారణము మొదలగు పవిత్ర రూపములేని భాషలు మాటలాడువారు) పశువులవలె జీవించు- వ్యవహరించు పాపులు మొదలగు వారినడుమ ఉండుచు సంతతిని కనెదవు.” తుర్వసుని ఇట్లు శపించి యయాతి శర్మిష్ఠకు పెద్దకొడుకగు ద్రుహ్యునితో ఇట్లు పలికెను.

“ద్రుహ్యూ! జర అనునది దేహపువర్ణమును రూపమును నశింపజేయునదియే. ఐనను వేయి సంవత్సరములపాటు నాజరను నీవు తీసికొని నీ యౌవనమును నాకు ఇమ్ము. వేయేండ్లు కాగానే నీ యౌవనమును నీకిత్తును. నా పాపదోషమును ముసలితనమును తిరిగి తీసికొందును.” ద్రుహ్యుడు: “జరచే శిథిలుడయినవాడు రాజ్యమును రథమును అశ్వమును స్త్రీలను వేటిని కూడ అనుభవించ జాలడు. వాటియందు ఇష్టము కూడ ఉండదు. కనుక నాకు అది ఇష్టము కాదు.” యయాతి: “నీవు నాహృదయము నుండి పుట్టినవాడవై యుండియు నీ వయస్సు నాకీయ కున్నావు. కావున ద్రుహ్యూ! నీకు ఇష్టమగు ఏ కామమును (కోరికయు) నెరవేరకుండు గాక! నిత్యమును తెప్పలపై దాటియే వేరొక చోటికి పోవలసియుండు దేశమున రాజ్యభ్రష్టుడవై జీవింతువుగాక! నీ సంతతివారును ఇట్లే అయి రాజ్యాధికారము లేకుందురుగాక!” యయాతి: “అనూ! నా పాపదోషముతో కూడ నావార్ధకమును నీవు తీసికొనుము. నీ యౌవనముతో వేయేండ్లు విహరింతును.” అనువు: “జరచే శిథిలుడయినవాడు శిశువు వలెను అశుచియేమో అన్నట్లును ఏదో సమయమున అన్నమును తినుచుండును. తగిన సమయములో అగ్నికి హోమము చేయజాలడు. కనుక జర నాకు ఇష్టముకాదు.” యయాతి: “నాహృదయమునుండి పుట్టినవాడవై ఉండియు నీ యౌవనమును నాకీయకున్నావు. కనుక నీవు అనిన జరాదోషము నీకే ప్రాప్తించు గాక! నీ వంశము వారందరును యౌవనము రాగానే నశించుచుందురుగాక! నీవును, నీవనినట్లే అగ్ని ప్రస్కందన మనస్కుడవు (అగ్నిమీదుగా దుముకుట యందు ఇష్టము కలవాడవు) అగుదువు గాక! (ఇది మహాదోషము).”

పిమ్మట యయాతి, “పూరూ! నీవు నా ప్రియ పుత్రుడవు. అందరలో గొప్పవాడవు కూడ అయ్యెదవు. కవి ముని కుమారుడగు ఉశనసుని శాపమువలన నన్ను ముడుతలును నరలును క్రమ్ముకొన్నవి. యౌవనముచే కలుగవలసిన తృప్తి నాకింకను కలుగలేదు. కనుక నీవు నాపాప దోషమును జరను గ్రహింపుము. నీవయస్సుతో కొంత కాలము విషయ సుఖముల ననుభవింతును. అట్లు నిండుగా వేయేండ్లున్న తరువాత నీయౌవనము నీకిత్తును. నా పాప దోషమును వార్ధకమును నేను తీసికొందును.” ఇట్లు పలికిన యయాతితో వెంటనే పూరు డీ విధముగా ననెను: “మహారాజా! నీవు చెప్పినట్లే చేయుదును. నీ పాపదోషమును వార్ధకమును నేను తీసికొందును. నానుండి యౌవనమునుగ్రహింపుము. ఈప్సితములగు కామములు అనుభవింపుము. (ఇతరుల బలాత్కారముచే కాక) నా యథేచ్ఛతోనే నా యౌవనమును నీకిచ్చి నీవార్ధక్యముతో కప్పబడి నీవయస్సును రూపమును ధరించి వ్యవహరింతును.”

అని పలుకగా యయాతి: “నాయనా!పూరూ! నేను నీ విషయమున ప్రీతుడనైతిని. నా ముసలితనమును నీకిత్తును. నీ ప్రజలు (సంతతివారు) సర్వకామ సమృద్ధులు అయ్యెదరు. నీకు (నీ సంతతి వారికికూడ) రాజ్యాధికారము ఉండగలదు.”