గజానన జననము

ఇట్లు చాలకాలము గడచెను. గిరిజ కుమారులు కావలెనను మక్కువ ఎక్కువయి చెలులతో కూడి బొమ్మలతో ఆడుకొనుచుండెను. ఒకమారామె తన యెడల సుగంధతైలము అభ్యంగము చేసికొనెను. నలుగు పొడితో శరీరపు మురికి నలచుకొనెను. ఆ మురికి నలుగుతో గజముఖమున ఆకృతిగల బొమ్మ చేసెను. శివ ఆ బొమ్మతో చెలులతో కూడి ఆడుచునే, అది గంగాజలములో వేసెను. అంత అది తన శరీరముతో జగము నిండునంత పెద్దదయ్యెను. ఆ బొమ్మను గంగయు గౌరియు నాకొడుకు-నాకొడుకు-అనిరి. దేవతలు ఆ గజాననుని గంగా సుతుడని ఆరాధించిరి. బ్రహ్మ అతనికి వినాయకా (ప్రమథ గణనాథా)ధి పత్యము నిచ్చెను.

ఆ వరవర్ణిని (ఉత్తమ సుందరి) ఇంకను కల్పిత పుత్రకులతో ఆడుట మానలేదు. ఆ శుభానన అపుడే మొలకెత్తిన అశోకపు మొలకకు పుత్రోచితములగు మంగళ సంస్కారములు జరిపించ నారంభించెను. అది చూచి ఇంద్రుడు బృహస్పతి మొదలగు దేవతలును మునులును ఆదేవి కడకువచ్చి ఇట్లనిరి: భవానీ! నీవు లోకక్షేమమునకై ఉద్భవించినదానవు; శుభరూపవు! లోకమున ప్రాణులకు పుత్రులు జనించుటయే జన్మఫలము; పుత్రులు పౌత్రులు ఉన్ననే ఉత్తమ లోకములభించును. కాని దైవికములగు హేతువులతో కొందరు ఆ పుత్రులగుటయు కనబడు చున్నది. ఈనాడు లోకమునకు పెద్దలు ఏమార్గమును చూపియున్నారో అమార్గముననే నీవును నడచి మర్యాదను (లోక వ్యవస్థను) నిలుపవలయునని వేడుచున్నాము. దేవీ! చెట్ల (మొక్కల)ను పుత్రులనుగా చేసికొనుటచే కలుగు ఫలము ఏమి? అని వారామెతో పలికిరి.

మునులు ఇట్లు పలికినది విని తన మనస్సంతయు హర్షముతో నిండ పార్వతి ఇట్లనెను. పెద్దలు ఇట్లు చెప్పుదురు; జలమే లేని దేశమున కూప నిర్మాణము చేసిన వివేకి ఆ కూపమందలి జలమున ఎన్ని బిందువులుండునో అన్ని సంవత్సరములు స్వర్గమున వసించును; పది బావులును ఒక హ్రదమును (పుణ్యమునిచ్చుటలో) సమానము; పది హ్రదములు ఒక పుత్రుడును సమానము; పదిమంది పుత్రులు ఒక వృక్షముతో సమానము; లోకస్థితికరమగు మర్యాద (వ్యవస్థ) పెద్దలచే ఇట్లేర్పరచబడినది. ఇట్లు ఆమె పలికిన పలుకులు విని బృహస్పతి మొదలగు ఆ విప్రులు భవానికి సాదరముగ నమస్కరించి స్వగృహములకేగిరి. వారు వెళ్ళిన తరువాత శంకరదేవుడును శుభ రూపయగు పర్వతపుత్రిని చెట్ట పట్టుకొని గోపురములతో కూడినదియు చిత్తమునకు హాయిని కలిగించు నదియునగు ప్రాసాదమును ప్రవేశింపజేసెను. మరియు ఆ ప్రాసాదము ముత్తెముల దండలు వ్రేలాడుచున్నట్టిది; నిరుపమానమైనది; రత్న వేదికలు కలది; పుటమువేసి శుద్ధి చేసిన బంగారు కట్టడములు కలది; క్రీడాగృహములు కలిగి మనోరమమయినది; అంతట వెదజల్లబడి యున్న పూలవాసనతో మత్తెక్కిన తుమ్మెదల గుంపుచేయు ఝంకారపు రొదలతో నిండినది; కిన్నరులు ఉచ్ఛైఃస్వరమునపాడు సంగీత ధ్వనులు కలది; గదుల నడుమ చక్కని గోడలు కలది; సువాసనలుకల పొగలగుములతో మనస్సు ఆకర్షించునది; ఇదివరకు ఎవరును ఎక్కడను చూచి ఉండనిది; ఆటనెమిళ్ళతోను (సుందరులగు) స్త్రీలతోను వీణాది వాద్యముల మ్రోయించు వారితోను కూడినది; గుంపులై ధ్వనులు చేయుచున్నట్టి హంసలు కలది; స్ఫటిక మణి నిర్మిత ములగు స్తంభములును వేదికలును కలది; ఏ మాలిన్యమును లేనిది; అతి ప్రీతి యుక్తులైయున్న కిన్నరులతో నిండినది; దానియందలి పద్మరాగ మణుల గోడలను చూచి దానిమ్మ గింజలను భ్రాంతితో చిలుకలు వాటిని తమ ముక్కులతో పొడుచు చుండును. ముత్తెములా ప్రాసాదపు గోడలందు ప్రతిబింబించి (రెట్టింపై) కనబడుచుండును.

ఇట్టి ప్రాసాదమునందు పరమేశ్వరుడు పార్వతితో పాచికలాడుట మొదలు పెట్టెను. స్వచ్ఛమగు ఇంద్రనీల ఫలకము నందాడుచు దానియందు ప్రతిబింబించిన తమ శరీరములే తోడుగా వినోదరస పారవశ్యముతో పార్వతీపరమేశులుండిరి. ఇట్లా దేవీ శంకరు లాడుచుండ ఆ భవనాంతరాళము నుండి మహాధ్వని యుత్పన్నమై వినబడెను. అది విని శుభ శరీరయగు దేవి కుతూహలముతో విస్మయముతో ఇది ఏమియని శంకరు నడిగెను. శివుడును శుచియగు చిరునగవు కలదానా! నీవిదివరకు కని విని యుండవు; నా ప్రీతికిపాత్రులగు గణాధిపతులీ శైలమున సదా క్రీడించుచుందురు! అదియే ఇది అనెను. తపముచే బ్రహ్మచర్యముచే నియమములచే క్షేత్ర సేవనములచే పూర్వ జన్మములందు నన్ను మెప్పించినవారే వీరు, శుభాననా! ఆ మనుజులట్లు నా హృదయమును తమ వశమొనర్చుకొని నన్నుచేరి తమ కామముల (కోరికల) నీడేర్చుకొనిన మహోత్సాహులు; మహారూపులు, సద్గుణాన్వితులైన వీరిని చూచి నాకే యాశ్చర్యము కలుగుచుండును. దేవాదులతో కూడ ఈ జగమంతయు సృష్టింప-సంహరింప-గలవారు వీరు; బ్రహ్మ విష్ణ్వంద్ర గంధర్వ కిన్నర మహోరగాదులెవ్వరు నాకడ లేకున్నను వీరు నన్నెప్పుడును విడువరు; వీరు మనోహర సర్వావయవులయి నామనస్సు లోగొనువారు, అట్టి వీరు ఇపుడీ శైలమున క్రీడించుచున్నారు. అనిన శివుని వచనములు విని వెంటనే దేవి ఆశ్చర్యవశురాలై ఆట విడిచి గవాక్ష రంధ్రములనుండి అది చూచుచు వికసితముఖి యయ్యెను. వారెందరందరును చిక్కినవారు పొడగరులు పొట్టివారు లావగువారు పెద్ద కడుపులవారు పులుల-ఏనుగుల మొగ ములవారు, మేకల, గొర్రెల రూపములవారు-అనేక ప్రాణి రూపములవారు మండెడి మొగముల వారు నల్లనివారు పింగళవర్ణులు సౌమ్యులు భయంకరులు స్మిత ముఖులు నల్లని-పింగ వర్ణపు-జడలు జూలు కలవారు-నానా పక్షిముఖులు నానా మృగ ముఖములు పట్టువస్త్రములు-మృగ చర్మములు దాల్చినవారు దిసమొలవారు-విరూపులు-ఆవు చెవులవారు ఏనుగు చెవులవారు బహుముఖ నేత్రోదరములవారు బహుపాదులు బహుభుజులు దివ్యనానాస్త్రములు చేబూనినవారు అనేక కుసుమములు కొప్పు లందు దాల్చినవారు నానా సర్పభూషణులు తోడేళ్ళ మోములవారు నానాయుధధారులు నానా కవచ నానా భూషణధారులు విచిత్ర వాహనారూఢులు దివ్యరూపులు గగన సంచారులు వీణాది వాద్యముల మ్రోయించువారు నానా వేషములు దాల్చి నృత్యము లొనరించువారు అయియుండిరి.

అట్లున్న ఇట్టి గణనాధులు చూచి దేవి శంకరునితో ఇట్లనెను, గణేశులెందరు? వారి పేరులేమి? వారి తాత్త్విక రూపమేమి? వారెవరెవరేయే స్థానములు నాశ్రయించి యుందురు? ఒక్కొక్కటియే వేరువేరుగా నాకు చెప్పవేడుచున్నాను. అనగా శంకరుడు దేవికిట్లు చెప్పెను. దేవీ! వీరు నానాకోట్ల సంఖ్యలతో నున్నారు, అసంఖ్యాకు అనవచ్చును; వీరి పౌరుషములు విఖ్యాతములును నానావిధములును; అజ్ఞులకు దుష్టులకు భయంకరులును మహా బలులునునగు వీరి అందరతో జగము పూరితమై యున్నది; సిద్ధక్షేత్రములందును రచ్చపట్టులందును జీర్ణోద్యాన ములందును జీర్ణగృహములందును దానవుల శరీరములందును బాలురందును ఉన్మత్తుల యందును వీరు సంతోషపూర్వకముగా ప్రవేశింతురు; నానా ప్రాణుల నపహరించుచుందురు, వీరు ఊష్మపులు ఫేనపులు ధూమపులు మధుపులు రక్తపులు సర్వభక్షులు వాయుభోజనులు జలభోజనులు (ఆవిరిని నురుగును పొగను తేనెను రక్తమును త్రావువారు, ఏడయినను తినువారు వాయువునో జలమునో ఆహారముగా గ్రహించువారు) గానము నృత్యము వీరికి ప్రియములగు కానుకలు; నానావాద్య రవములు వీరికి ప్రీతికరములు; వీరి వైభవము నూహించుటయు వీరి గుణముల పేర్కొనుటయు సాధ్యమేకాదు; అనగా దేవి ఇట్లనెను: దేవా! జింక చర్మ ముత్తరీయ ముగా శుద్దాంగుడై ముంజదర్భతో చేసిన మొలత్రాటితో నుండి ఎడమవైపు (చంకయందు) చిక్కము (ఉట్టి) దాల్చి చపలుడై మొగమున రంగులు పూసికొని కలువల మాలల దండలు దాల్చి మిగుల ఇంపుగొల్పుచు మధురాకృతి కలిగి శిలా ఖండముల-తెరచిన కంచు తాళములను- మ్రోయించుచు మ్రోయింప జేయుచు కొన్నరులు తనవెంట రాగా ప్రమథగణములు పాడు గీత ములకు మాటిమాటికి చెవి ఇచ్చుచు ఉండిన ఈ గణాధిపతి నామము ఏమి? అనగా ఈశ్వరుడిట్లు పలికెను: దేవీ! ఈతని పేరు వీరకుడు; నాకు హృదయప్రియుడు, నానాశ్చర్య గుణాశ్రయుడు; గణేశ్వర గణము లీతని కనుచరులయి యుండును అనెను.

అది విని దేవి ఇట్లనెను, పురహరా! నాకిట్టి కొడుకు కావలెనని ఎంతయో తహతహగా నున్నది, ఆనందదాయకుడగు ఇట్టి పుత్రుని ఎప్పుడు కనెదనో కదా! అన ఈశ్వరుడు ఈతడే నీకు నయనాంద హేతుకుడుగు సుతుడు కానిమ్ము, అందమగు నడుముదానా! నీ తాత్త్వికమగు ఆంతర రూపము సర్వ జగదానందకరము. నీవు తల్లివి కాగా ఈ వీరకుడును కృతార్థుడగును అన విని హిమశైలపుత్రి హర్షముతో కుతూహల ముతో ఎప్పుడెప్పుడును తహతహపాటుతో కూడినదయి వీరకుని పిలిచికొని రమ్మని తన సఖిని విజయను పంపెను.

ఆమెయు ఆకసమంటు ఆ ప్రాసాదమునుండి త్వరతో దిగి ప్రమథగణమధ్య క్రీడా ప్రవర్తకుడుగా ఉన్న వీరకునితో ‘వీరకా! నీవు చేసిన చిలిపి పనులకు మహాదేవునకు కోపము వచ్చినది; ఏమి ఉత్తరము ఇత్తువో వచ్చి ఇమ్ము; పార్వతియు నృత్యరంగశాల యందున్నది, రమ్ము” అనెను. ఈమాటవిని వెంటనే వీరకుడు (తాను తాళములుగా మ్రోయించుచున్న) శిలా ఖండములను విడిచి మొగము తుడిచికొనెను; ఆమె ఎందులకై పిలిచెనో ఆవిషయమును మూలముట్టుగా చెప్పదలచి బయలుదేరెను. విజయతనవెంట వచ్చుచుండ మెల్లగా దేవి కడకు వచ్చెను; దేవి తాను ప్రాసాద శిఖరమందుండియే వీరకుని చూచెను. వికసించిన ఎర్రదామర కాంతివంటి కాంతి గల దేవి స్తనముల యందు పాలు చేసెను. ఇట్టి యానంద దశానుభావిని యగు దేవి మధుర వర్ణయుతమగు వాక్కుతో స్నేహ పూర్వకముగా వీరకునితో ఇట్లు పలికెను.