హిరణ్య గర్భదాన విధానము

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను, ఇంతవరకును మహాదాన షోడశకములో మొదటిదానిని తెలిసికొంటివి; కనుక ఇప్పుడు ఆ క్రమములో రెండవదాని విషయము నీకు తెలిపెద వినుము, ఇది హిరణ్య గర్భమను నామముగల అను (మహో)త్తమ మహాదానము; మహాపాతక నాశకము; పుణ్యకరమగు తిథియందు తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను భూషణ వస్త్రాదికమును సమకూర్చుకొని ఉపవసించవలయును; విషయమెరిగి యజమానుడు పుణ్యాహవాచనమును లోకపాలక ఆవాహనమును దేవతాధి వాసనమును జరిపించవలెను. తరువాత బ్రాహ్మణులచేత అందమగు బంగారు కడవను తెప్పించ వలయును. దానియందు నడుమ బంగరు పద్మపు ప్రతిమయు బ్రహ్మ ప్రతిమయు ఉండ వలయును. డెబ్బది రెండంగుళముల ఎత్తును ఇందు మూడవవంతు తగ్గించిన అంగుళముల అడ్డుకొలతతో (నలువది ఎనిమి దంగుళముల వ్యాసముతో) పొట్టలావును కలదై అది యుండవలయును; దానిని నేతితోనో పాలతోనో నింపవలయును; దాని సమీపమున పది విధములగు ఆయుధములు (ఆయుధములు అనగా ఇచట గృహోపకరణములు; ఈ పదియు ఏవి అనునది సంప్రదాయమున తెలిసికొనవలయును) రత్నములు, రాగి, సూది, బంగరు గొట్టము, బుట్ట సూర్య ప్రతిమ యుండవలయును; నాభికి ఆవరణమగు మేఖలయు ఉపవీతమును బంగారపువి ఉంచవలెను; రెండు ప్రక్కలందును బంగరు దండమును కమండలువును ఉంచవలెను; కడవపై అన్ని వైపులను రెండంగుళముల కంటె ఎక్కువ పొడవు పరిమాణముగా గల బంగరు పద్మముల ప్రతిమలు ఏర్పరచవలెను. ఈ కడవకు ముత్తెముల దండలు వేయవలెను; తామరపూవులకు పద్మరాగ దళములు అమర్చవలెను; ఈ కడవను నూవులతో నింపిన ద్రోణము (అను తూమెడు కొలత పాత్ర) పైనుంచి ఇదియంతయు మండపమందలి వేదీ మధ్యమందుంచ వలెను. తరువాత మంగళకర వాద్యవేదధ్వనులతో యజమానుడు బ్రాహ్మణ శ్రేష్ఠులచే సర్వౌషధీ జలముతో స్నానము చేయించుకొని తెల్లని వస్త్రములను పూవులను ధరించి సర్వాభరణభూషితుడై దోసిట పూవులు పట్టుకొని ఈ చెప్పబోవు మంత్రమును ఉచ్చరించవలయును.

హిరణ్యగర్భుడు, హిరణ్మయ కవచము కలవాడు, సప్త లోకములకు అందలి సురలకు అధ్యక్షుడు, లోకములను నిర్మించువాడు అగు నీకు హిరణ్యగర్భా! నమస్కారము; భూర్లోకము మొదలగు లోకములును, బ్రహ్మాది దేవతలును, నీ గర్భమందున్నారు; భువనాధారా! భువనా శ్రయా! హిరణ్యగర్భా! పితామహులకును పితామహా! నమస్తే, భూత భూత మందును ఉండు భూతాత్ముడవు పరుడవు నీవు, కావున ఇట్టినీవు అశేష దుఃఖ సంసార సాగరమునుండి నన్నుద్ధరించుము. ఇట్లు హిరణ్యగర్భుని ఆమంత్రించి, మండప మధ్యమును ప్రవేశించి ఉత్తరముఖుడై కూర్చుండి ధర్మరాజును చతుర్ముఖుని పిడికిళ్ళతో పట్టుకొని మోకాళ్ళ నడుమను తల ఉంచుకొని ఐదు ఉచ్ఛ్వాసములను జరుపగా, తరువాత ద్విజపుంగవులు హిరణ్యగర్భునకు గర్భాధాన పుంసవన సీమంతోన్నయనము లనెడు మూడు సంస్కారములను జరుపవలయును; తరువాత ఆచార్యుడు యజమానుని గీత మంగళ ఘోషములతో అక్కడినుండి లేవదీయవలెను, తరువాత జాతకకర్మాది షోడశ కర్మములను జరుపవలయును, రాగి సూది మొదలగునవి గురువునకు యజమాను డీయవలెను, తరువాత “ఓం నమో హిరణ్య గర్భాయ విశ్వగర్భాయవై నమః చరాచరస్య జగతో గృహభూతాయవై నమః” అను ఈ మంత్రమును పఠించవలయును.

హిరణ్యగర్భునకు విశ్వగర్భునకు చరాచర జగత్తునకు గృహమగు వానికి నీకు నమస్సు, సురోత్తమా! నేను మొదట మనుష్య ధర్మములతోనే జనించితిని కావున ఇప్పుడు నీ గర్భము నందు జనించి నేను దివ్యదేహుడనయ్యెదను.”

తరువాత బ్రాహ్మణ శ్రేష్ఠులు ప్రసన్న దేహులును సర్వాభరణ భూషితులునునయి నలుగురును నాలుగు కలశములతో మరల యజమానుని స్నానము చేయింతురు, చేయించునపుడు వారు ఈ మంత్రము పఠింతురు, “కనకాసన మందు కూర్చున్నవాడవు ఇపుడే పుట్టిన వాడవు అగు నీ అంగములను మేము ‘దేవస్యత్వా’ అను మంత్రముతో అభిషేకించుచున్నాము, ఈ దివ్య దేహముతో చిరకాలము జీవించుము  -  సుఖివికమ్ము.”

తరువాత విచక్షణుడగు ఆ యజమానుడు హిరణ్యగర్భుని (ప్రతిమను) ఆ విప్రులకు వారినందరను సర్వభావముతో పూజచేసి  -  అందరకుగాని ఇతరులకు కూడ మరికొందరకుగాని గురుని యనుమతితో దానముచేయవలెను; అచ్చటి సర్వోపకరణములను ఇంకను తనకు ప్రీతికరములగు పాదుకలు చెప్పులు చ్ఛత్రము పీఠము పాత్రలు గ్రామము  -  దేశము - మొదలగునవి ఆచార్యునకు దానము చేయవలయును.

ఈ విధానమున పుణ్యకర శుభదినమున హిరణ్య గర్భదానము చేయువాడు బ్రహ్మ లోకమున ఈ పూజ్యుడగును, ఒక్కొక్క లోకపాలుని లోకమునందు ఒక్కొక్క మన్వంతర కాలము వసించును; నూరు కోట్ల కల్పములపాటు బ్రహ్మలోకమున వసించి పూజలందుకొనును, కలి దోష విముక్తుడై సిద్ధ సాధ్య పూజితుడై అమరలోక చమరీ మృగములనుండి ఏర్పడిన చామరమాలలతో అప్సరల చేత వీజింపబడు చుండును; తానొక్కడే నూరుమంది తన పితరులను బంధువులను పుత్ర పౌత్రులనేకులను నరక నిమగ్నులను కూడ తరింపజేయును.

దీనిని లెస్సగా చదువువాడును వినువాడును కూడ మధురాక్షస హంతయగు విష్ణువువలె సర్వ సిద్ధ పూజితుడగును, హిరణ్యగర్భ ప్రీతిగా ఈ దానము చేయువాడు జనులకు ఉత్తమజ్ఞానము కూడ కలిగించును, విబుధ నాయకులకును నాయకుడగును.