శర్కరా పర్వత దానస

ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను, ఇకమీదట శర్కరా పర్వతదాన విషయము తెలిపెదను. అది ఉత్తమము. దాని దానమున విష్ణు రవి రుద్రులు శాశ్వత తృప్తి నందుదురు. దీనికై ఎనిమిదికాని, నాలుగుకాని, రెండుకాని బారువల చక్కెర కావలెను. శక్తిలేనివారు ఒక బారువతోనో అరబారువతోనైన చేయవచ్చును. మొత్తము చక్కెర తూకములో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతములు చేయవలెను. ధాన్య పర్వతమునందువలెనే ఆయా పర్వతములను వానిపై దేవతలను నిలుపవలయును. అందునను మేరు పర్వతముపైని మిగిలిన వానిమీదను మందార పారిజాత-కల్ప వృక్షములనెడు మూడు (జాతుల కల్ప) వృక్షములను బంగారుతో చేయించి అమర్చవలెను. వాని శిరోభాగములందు హరిచందనము-మందారము (అను కల్ప వృక్షజాతు) లను ఆ పర్వతముల తూర్పు పడమరలందు అమర్చవలెను. ఇవి(లోగడ చెప్పిన) అన్ని పర్వతము లందును విశేషించి శర్కరాచలమునందును చేయవలెను. విష్కంభ పర్వతములందును-మందరమున పడమటి మొగముగా మన్మథుడుండవలెను. గంధమాదనమున కుబేరుడు ఉత్తరపు మొగమై ఉండవలెను. విపులపర్వతమున హంసప్రతిమ తూర్పుమొగమై ఉండవలెను. సుపార్శ్వమున కామధేనువు దక్షిణపుమొగమై ఉండవలెను. ఆవాహన హోమాదికమంతయు ధాన్య పర్వతమునందువలెనే. పైవలెనే నడిమి పర్వతమును సౌభాగ్యామృతసారమును; ఇట్టి నీవు మాకు సదా ఆనందము కలుగజేయుము. దేవతలు అమృతము త్రావునపుడు నేలపై చిందిపడిన అమృత బిందువులే చక్కెర అయ్యెను. దానితో ఏర్పడిన శర్కరాచలమా! నన్ను రక్షించుము. మన్మథుని ధనువు నడుమనుండి ఉత్పన్నము ఈ శర్కరాచలము. అట్టి నీవు శర్కరాచలమా! మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.

ఈ విధానముతో శర్కరా శైలదానము చేసినవారు వెంటనే విష్ణుని కాంతివంటి కాంతి కలవారై తన అనుజీవులతోకూడ చంద్రతారా సూర్యులవలె ప్రకాశించు విమానమునెక్కి సర్వపాప వినిర్ముక్తులై శివ భవనమున కేగుదురు. ఇట్లు నూరు కల్పము లచట సుఖించి మరల కల్పాది సృష్టియందు వరుసగా ముప్పదివేల జన్మముల వరకు ఆయురారోగ్య సంపన్నుడగు సప్త ద్వీపాధి పతిగా జన్మించుచుండును. అన్ని పర్వత దానములందును ఇతరులతో పోటీపడక తన శక్తి కొలది భోజన దానము చేయవలెను. అన్ని వ్రతములయందును ఆపెద్దల అనుమతితో ఉప్పు కారము (పులుపు) లేని ఆహారము తినవలెను. పిమ్మట పర్వతోపస్కరములగు సామగ్రులన్నియు ఆయా బ్రాహ్మణుల ఇండ్లకు పంపవలయును.