దేవతామూర్తి విశేష లక్షణములు

సూతుడు ఋషులకు ఇట్లుచెప్పెను. ఇక మీదట ఆయా దేవతారూపములను విశేషాకారమున, వేరువేరుగా చెప్పెదను. రామమూర్తియు, విరోచన పుత్రుడగు బలిమూర్తియు, వరాహ మూర్తియు, నరసింహమూర్తియు - దశతాల ప్రమాణములు; వామనమూర్తి సప్తతాళ ప్రమాణము, మత్స్య కూర్మమూర్తులు శోభగా ఉండునట్లు ఎంత పరిమాణముతోనైన నిర్మించ వచ్చును అని స్వయంభూ బ్రహ్మ చెప్పెను.

ఇక మీదట రుద్రాది మూర్తుల లక్షణములు చెప్పెదను. ఈశ్వరమూర్తి  -  బాగుగ బలిసిన ఊరువులు భుజములు భుజస్కంధములు తప్తకాంచన సమానశోభ శుక్ల రవి కిరణరాశి ప్రకాశము చంద్రాంకిత జటాకలాపము పదునారు సంవత్సరముల వయస్సు జటామకుట భూషణములు గజహస్త సమాన బాహువులు వృత్త జంఘ ఊరు మండలములు, ఊర్ధ్వ కేశములు, దీర్ఘాయత విలోచనములు, వ్యాఘ్ర చర్మ వస్త్రము, మూడుకటి సూత్రములు హారకేయురాలంకారములు భుజగ ఆభరణములు నానాభరణ భూషిత బాహువులు బలిసిన విశాలగండ ఫలకము కుండలాలంకారములు ఆజాను లంబి బాహువులు సౌమ్యమగు మూర్తి కలిగి శోభించుచుండును, ఎడమచేతులందు ఖేటకము కపాలము నాగము ఖట్వాంగమును కుడిచేతులందు ఖడ్గశక్తి దండ త్రిశూలములు ఉండును.

తాండవేశ్వర మూర్తికి - ఒక చేతియందు వరద ముద్ర రెండవ చేతియందు అక్షమాల యుండును. ఇతడు వైశాఖమను స్థానకము (నృత్యభంగి విశేషము)తో నృత్యాభినయ మందు ఉండును; దశ భుజుడును గజ చర్మధారియునై నృత్య మొనర్చు చుండును.

త్రిపురదాహేశ్వర మూర్తికి షోడశ బాహువులు; దశభుజ మూర్తియందు కంటె ఈ మూర్తి యందు శంఖము చక్రము గద శార్ఙధనువు ఘంట పినాక ధనువు విష్ణుమయ శరము అను ఆరు ఆయుధములు అధికముగా నుండును.

యోగేశ్వర మూర్తియందు చతుర్భుజములో అష్ట భుజములో ఉండును. భైరవేశ్వర మూర్తికి నాసాగ్రమును దంతములును తీక్ష్ణములయినవి, ముఖము భయంకరము, ఈ మూర్తిని ప్రత్యాయ తనము (ఉపాలయము) నందేకాని మూలాయతనము (ప్రధానాలయము) నందు ప్రతిష్ఠించరాదు.

(ఈ భైరవేశ్వరమూర్తియే కాదు) నారసింహ భయంకరమూర్తులు ఏవియు అధికాంగములుగా గాని, హీనాంగములుగా గాని ఎక్కడను ఎప్పుడును చేయరాదు. భయంకరముఖముగల మూర్తులనుగా చేసినచో స్వామికిని శిల్పికిని నాశము కలిగించును; అర్ధనాశమును చేయును; వక్రనాసికగల మూర్తి దుఃఖమును, తక్కువ పరిమాణముగల అవయవములతో నున్నచో భయమును, కృశోదరియగు మూర్తి దుర్భిక్షమును, మాంసము (పుష్టి)లేని మూర్తి ధననాశమును, చప్పిట ముక్కుగల మూర్తి దుఃఖమును, రోగమును, కన్నులులేని మూర్తి నేత్రనాశమును, ముఖము హీనమయినచో దుఃఖమును పీలగానున్న కాలుసేతులు గలదియు హీనాంగయు హీనజంఘయు భ్రమోన్మాదములను కలిగించును, ముఖముగాని కటిగాని లోపముతోనున్నచో రాజును చంపును; కాలుసేతులలో లోపమున్నను అమూర్తి అధికముగా మృత్యువును కలిగించును, పిక్కలును, మోకాళ్లును సరిగాలేని మూర్తి శత్రువులకు క్షేమకరము; వక్షఃస్థలమున లోపమున్నచో పుత్రమిత్ర వినాశకరము; సంపూర్ణావయవమూర్తి ఆయువును, ఐశ్వర్యమును కలిగించును.

ఈలక్షణ దోషములవలన హాని నెరిగి అవిలేని లక్షణములతో పరమేశ్వర మూర్తిని నిర్మించవలయును. ఆమూర్తిని అన్నివైపుల యందుండి సకలసురులును స్తుతించుచుండ వలయును; ఇంద్రుడు, నంది, మహాకాలుడు, లోకపాలురు పార్శ్వములందు గణనాయకులు ప్రణతులయియుండ నృత్యమాడుచున్న భృంగిరిటియు, భూతబేతాళులును, హర్షపూర్ణులై ఆయనను స్తుతించుచున్నట్లును గంధర్వ విద్యాధర కిన్నరాప్సరోగుహ్యకాది దేవతాగణములును అమర నాయకులును మునిప్రవీరులును ఆయనకు నమస్కరించుచున్నట్లును మూర్తిని నిర్మించవలెను. అసురులును మానవులును అక్షసూత్రములను ప్రవాళములను పుష్పములను ధరించి యుండి ఉపహారములుగా ఈశ్వరునకు అవి అర్పించుచుండ త్రినేత్రముగ పరమేశ్వరమూర్తి భేదములు ఉండవలయును.