అగస్త్య పూజా విధానము

నారదుడు ఈశ్వరు నిట్లడిగెను, “ఇహలోకమున శుభమగు రూపమును ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును పరమున క్రమముగా భూర్లోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములనెడి ఊర్థ్వలోకములను పొంది సుఖించుటకు సాధనమగు విధానమును ఉపదేశింప వేడుచున్నాను.”

ఈశ్వరుడు నారదున కిట్లు చెప్పెను, పూర్వము ఇంద్రుడు అగ్ని వాయువులను అసురు నాశము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. వారును వేలకొలదిగా దానవులను దహించిరి. తారకుడు, కమలాక్షుడు, కాలదంష్ట్రుడు, పరావసువు, విరోచనుడు, సంగ్రామమునుండి తప్పించు కొనిపోయి సముద్రాంతర్భాగమున నివసింపసాగిరి. వీరు చేతకాని వారు కదా! యని అగ్ని వాయువులు వారిని కాల్చక విడిచిరి. నీటినుండి వారందరును దేవ, మనుష్య, నాగులను, మునులను బాధించి మరల నీటిలో ప్రవేశించుచుండిరి. ఇట్లు పండ్రెండు వేల యుగములు లోకత్రయమును ఈ జలదుర్గము నందుండి బాధించిరి.

అంతట దేవేంద్రుడు అగ్ని వాయువులను మరలపిలిచి ‘ఈ దేవ శత్రువులకు సముద్రము ఆవాసముగా నున్నది. కనుక మీరు ఈ సముద్రమును ఎండింపజేయుడు అని కోరెను. వారును “ఇంద్రా! సాగరమును శోషింపజేయుట ఎంతో అధర్మము. ఏలయన అందుచే వానియందలి ప్రాణులకు ఎన్నిటికో నాశము కలుగును. సముద్రమునందే కాదు-సముద్రమునకు యోజనముల దూరమునకూడ దాని నాధారముగా చేసికొని వందలకొలది ప్రాణులు జీవించుచున్నవి. ఇట్టి దానిని ఎండింపజేయుట తగునా? ఇట్టిపాపము మేము చేయలేము” అనిరి. ఈ మాట విని ఇంద్రుడు కోపముతో కనులెర్రజేసి నిప్పులే కక్కుచున్నాడేమో అన్నట్లు చూచుచు రోషవచనములు ఇట్లు పలికెను: “దేవతలకు పాపమంటుట ఎక్కడనులేదు. విశేషించి మహా మహిమవంతులగు మీకు అట్టిది లేనేలేదు. ఐనను మీరు నా ఆజ్ఞను ఉల్లంఘించితిరి. దీనిచేత మునులకు హింస దానవులకు రక్షణ మొదలగు దోషములెన్నియో సంభవించును. ఇది ధర్మార్థ శాస్త్ర విరుద్ధము. కనుక మీరు ఇద్దరును మానవలోకమున ఒకేఒక మానవ దేహముతో మునులుగా జన్మింతురు గాక! అందునను అగ్నీ! నీవు అప్పుడుకూడ నీపుక్కిటితో సముద్రమును ఎండింపజేయుదువు. అపుడు మరల నీకు దేవత్వము లభించును” అనగానే అగ్ని వాయువులు ఇద్దరును భూతలమునకు వచ్చిపడిరి. మిత్రా వరుణుల (మిత్రుడు, వరుణుడు అను జంటదేవతల) వీర్యమువలన కుంభము నుండి ఒకే దేహముతో జన్మించిరి. అగ్నిదేవుడు అగస్త్యమునిగా వసిష్ఠునికి తమ్ముడై జన్మించెను.

ఈశ్వరుడిట్లు చెప్పగా నారదుడు ‘అగస్త్యుడు కుంభమునుండి ఎట్లు జన్మించెను? వసిష్ఠునకు తమ్ముడెట్లయ్యెను? వీరికి మిత్రావరుణు లెట్లు తండ్రులైరి? ఇదంతయు తెలుపుము’ అని వేడెను. ఈశ్వరుడిట్లు చెప్పెను: ఒకానొక సమయమున పురాణ పురుషుడగు విష్ణుడు ధర్ముని కుమారుడగు నారాయణుడను మునియై గంధమాదన పర్వతమున విస్తృత తపమాచరించెను. అతని తపమునకు భయమందిన ఇంద్రుడు అతని తపము భగ్నమొనర్పగోరి వసంతుని మన్మథుని వారి కప్పరాగణములు తోడుగా అటకుపంపెను. వారు ప్రయోగించిన నాట్యగీత వాద్యములతో గాని వసంత మన్మథుల ప్రవృత్తులతోకాని అముని విషయ సుఖముల వైపునకు ప్రవృత్తుడు కాలేదు. తమ యత్నములు వమ్ముకాగా వారందరును విషాదమందిరి. వారి నింకను కలత పరచదలచి నారాయణముని ఈన తొడలనుండి త్రైలోక్య జన మోహినియగు యువతిని జనింప జేసి చూపెను. చూచి వారును కలతపడిరి. నాఊరువులనుండి జనించినందున ఈమెకు ఊర్వశియను నామమున ప్రసిద్ధయై (అప్సరయై) యుండునని నారాయణముని వసంత మన్మథు లకును అప్సరలకును ఇతర దేవతలకును చెప్పెను.

ఆమెను చూచి కామ వశీభూతుడై మిత్రుడు (ఉదయించు సూర్యునకు అభిమానియగు దేవత) తన్నానందింప జేయుమని ఊర్వశిని కోరెను. ఆమె అంగీకరించెను. నల్లకలువలవంటి కన్నులుకల ఆసుందరి అతనివెంట కొంచెను దూరము పోగానే వరుణుడు (అస్తమించు సూర్యున కభిమానియగు దేవత) ఆమెను చూచి అతడును ఆమెను తన్నానందింప జేయుమని కోరెను. నన్ను ముందుగా మిత్రుడు వరించెను కావున నేనిప్పుడు అతనికి భార్యగా ఉన్నాను. (అతని కోరిక తీర్చువరకు) నేను నీకోరిక తీర్చజాలనని ఆమె వరుణుని కోరిక అంగీకరించకపోయెను. అట్లయినచో నీవు నీచిత్తమునైన నాయందు నిలిపిపొమ్మని వరుణుడు పలికెను. ఊర్వశి సరేయని మిత్రునితో వెళ్ళెను. నీవుచేసిన ఈపని వేశ్యాధర్మము. కావున నీవు భూలోమునకుపోయి ఆచట సోముని పౌత్రుని (కి భార్యపై అతనిని) ఆశ్రయింతువు అని మిత్రు డామెనుశపించెను. (అతడును ఆమెతో సుఖించ లేదు.) (ఊర్వశీ విషయకమయిన కామ వశమున స్థానము తప్పిన) తమ వీర్యమును మిత్రావరుణులు ఇద్దరును (అపుడచట లభించిన ఒక జలకుంభమున నిలిపిరి. (దానినుండి) లోగడ చెప్పిన ముని సత్తములు వసిష్టాగస్త్యులు జనించిరి.

పూర్వము ఒకనాడు నిమి అనురాజు తన భార్యలతో జూదమాడుచుండెను. అట్టి సమ యమున బ్రహ్మ మానసపుత్రుడు వసిష్ఠుడచటికి పోయెను. నిమి అతనిని ఆదరించలేదు. అందుచే నీవు విదేహుడవు (దేహము లేనివాడవు) కమ్ము- అని వసిష్ఠుడు నిమిని శపించెను. నిమికూడ వసిష్ఠుని శపించెను. దానిచే నిమి విదేహుడయ్యెను. వసిష్టుడు చేతస్సు (చిత్తవృత్తి ప్రవృత్తులు) లేనివాడయ్యెను. (ఇద్దరును ఇట్లు కావలసియుండగా శాపనాశమునకై ఇరువురును బ్రహ్మకడకుపోయిరి. బ్రహ్మదేవుని ఆదేశమున నాటినుండి ‘నిమి’(భూలోక జీవుల) కన్నులయందు నివసింపసాగెను. అతని విశ్రాంతికై అప్పటినుండి మానవులు మొదలగు ప్రాణులకు నిమే(మి)షములు ఏర్పడెను. (నిమ-శ-నిమిః శేతే అస్మిన్-’నిమి’ దీనియందు శయనించుచు కనుక నిమిశ-నిమేశ > నిమిష నిమేష) ((బ్రహ్మదేవుని ఆజ్ఞచేతనే) వసిష్ఠుడును జలకుంభము నందుచేరి లోగడ చెప్పినట్లు మిత్రావరుణుల కుమారుడయ్యెను. అతనితో పాటు ఆ కడవ నుండియే తెల్లని మేనిచాయ నాలుగు బాహువులు జపమాల కమండలువు కలిగి శాంతాత్ముడగు అగస్త్యమహర్షి ఉద్భవించెను. ఆయన మలయపర్వత భాగమున తన భార్యతోకూడి విప్రపరి వృతుడయి వైఖానస(వానప్రస్థ) విధానముతో దుష్కరమగు తపమాచరింపసాగెను.

ఇట్లు చాలాకాలము గడచెను. ఈ అగస్త్యుడు తారకాదిదానవులు జగములను పీడించుట చూచి కోపవశమున సముద్రమును త్రాగివేసెను. వింధ్య పర్వతవృద్ధిని ఆటంకపరచెను. రెండవ మృత్యువును సృష్టించెను. కాలకూట విషమును వ్యర్థమయిన దానినిగా (శక్తిహీన మగునట్లు) చేసెను. శ్వేతకేతువను నాతని చంపెను. ఇట్టిమహాకార్యములు చేసినందున సంతసించి శంకరుడు బ్రహ్మ విష్ణువు మొదలగువారు అగస్త్యునకు వరమీయదలచివచ్చి “మునీ! నీకభీష్టమగు వరమేదియో కోరుము. ఇత్తుము” అనిరి. అగస్త్యుడిట్లు వరముకోరెను. “ఇరువదియైదు కోట్ల సంవత్సరముల కాలము నేను దక్షిణ (మలయ) మార్గమున వైమానికుడనై (అంతరిక్షమున వెలుగు జ్యోతిర్గోళమునై) ఉండవలయును. నావిమానము (జ్యోతిరూపము) ఉదయించినపుడు నన్ను పూజించినవాడు క్రమముగా భూర్లోకమాదిగా ఏడు ఊర్ధ్వలోకములకు అధిపతి (వాటి యందు సుఖించుటకు అధికారి) కావలయును” అని కోరగా అట్లే అగునని వరమిచ్చి ఆదేవతలు వచ్చిన త్రోవను వెళ్ళిరి. కావున ఈ విషయము నెరిగి వివేకులై అగస్త్యునకు అర్ఘ్యము నీయవలెను.

ఈశ్వరుడిట్లుచెప్పగా విని నారదుడు అగస్త్యునకు అర్ఘ్యమిచ్చుటకును పూజ సేయుటకును కల విధానమేదో తెలుపుమని ఈశ్వరుని ప్రార్థించగా ఆదేవుడిట్లు చెప్పెను: ప్రభాత కాలమున అగస్త్య నక్షత్రము ఉదయించు వేళకు సంప్రదాయ మెరిగిన గృహస్థుడు నిద్ర మేల్కాంచి తెల్లని నూవులతో (నూవుపిండితో నూవులనూనెతో) స్నానమాడవలయును. తెల్లని పూలను వస్త్రములను ధరించవలెను. పూలను వస్త్రములను చుట్టునుచుట్టి అలంకరించిన కలశమును (నీటితో నింపి) నిలిపి దానియందు పంచరత్నములను (ముత్యము పగడము మొదలగునవి) వేయవలెను. దాని దగ్గర ఒక నేతి పాత్ర ఉంచవలెను. బంగారుతో బొటన వ్రేలంత పరిమాణము కలిగి పొడవయిన నాలుగు బాహువులుకల పురుషుని ప్రతిమ చేయించి ఆ ఘృతపాత్ర దగ్గర ఉంచ వలయును. ఆ ప్రతిమతోపాటు ధాన్యములు రత్నములు నూతన వస్త్రములు కంచుపాత్రము అక్షతలు ముత్తెపు చిప్పలు చేర్చవలెను. ఇవన్నియు మంత్రపూర్వకముగా దానము చేయవలెను. ఈ దానము చేయునపుడు దాత ఉత్తరాభిముఖుడై తన దీర్ఘబాహువులను పైకెత్తవలయును. అనన్యచిత్తుడై యుండవలయును. శక్తియున్నచో తెల్లనివన్నె కలిగి వెండి గిట్టలు, బంగరు మొగపుపట్టె మెడలో గంటలు, మువ్వలు కలిగి దూడకల పాడి ఆవునుకూడ దానము చేయవలెను. ఇట్లు అగస్త్యోదయ దినము మొదలు ఏడు దినములు ఈ విధమగు దానముతోపాటు అర్ఘ్యము నగస్త్యున కీయవలయును.

ఇట్లు వరుసగా పదునేడు సంవత్సరములు చేయవలయును. అంతకంటె ఎక్కువ కాలము వరకుకూడ చేయవలయు(వచ్చు)నని కొందరందురు.

ఫలత్యాగమంత్రము, “ఱెల్లుపూవువంటి దేహప్రకాశము కలిగి అగ్నిమారుతల వలన జనించినవాడవై మిత్రా వరుణదేవుల పుత్రుడవై జలకుంభము నుండి ఉత్పన్నుడవైన అగస్త్యా! నీకు నమస్కారము.” సంప్రదాయ మెరిగి ప్రతి ఏడు ఇట్లు అర్ఘ్యము నీయవలెను. తరువాత హోమము జరిపి మనఃపూర్వకముగా ఫలత్యాగము చేయవలెను.

ఈ విధానానుసారము అగస్త్యునకు అర్ఘ్యము నర్పించు పురుషుడు ఈ భూర్లోకమున రూపాయురారోగ్యములతో సుఖించును. తరువాత క్రమముగ భువర్లోకము మొదలగు ఊర్ధ్వ లోకములను అన్నిటిని పొంది అచ్చటను సుఖించును. అష్టవసువులలోని వారగు అగ్ని మారుతుల అంశవలన జనించిన (వారి కుమారుడే యగు) అగస్త్యుని అర్ఘ్యదాన విధానమును చదివినను వినినను ఉత్తమజ్ఞానమును పొంది విష్ణు లోకమును చేరి అచట దేవతలచేత పూజల నందు కొనును.