మత్స్య మహా పురాణము
గంధర్వాప్సరసల విహారముల వర్ణనము
రమ్యమగు ఆ ఆశ్రమమున మద్రరాజు పురూరవసుడు ఏ పరివారమును ఏ సాధనము లును లేక ఒంటిరియై ఆహారమును కూడ విడిచి తపమాచరించుచుండ ఆ తావులందే అప్సరసలు గంధర్వులతో క్రీడించుచుండెడివారు. అతడది చూచుచునే ఉండియు వాటియం దాసక్తి లేక పూవుల సేకరించి పెద్దమాలను కూర్చి దానియందలి మొదటి అంశమును దేవదేవున కర్పించి మిగిలిన అల్ప ఖండమును గంధర్వులకు (దేవజాతివారు కదా అను ఆదరముతో) ఇచ్చెడివాడు.
దేవవేశ్యలు (అప్సరసలు) కూడ పుష్పోచ్చయము చేయుచు యథాసుఖముగా వివిధములుగ క్రీడించుచుండ అతడు అది చూచుచుండియు చూడనివాడుగనే ఉండెను.