మత్స్య మహా పురాణము
వాస్తుశాస్త్రము - వాస్తూత్పత్తి
ఋషులు సూతునిట్లడిగిరి, ప్రాసాదములు భవనములు మొదలగువాని నిర్మాణమును వాని అమరికను ఎట్లుచేయవలెనో విస్తరముగ తెలుపుము; వాస్తుపురుషుడన నెవరు? అన సూతుడిట్లు చెప్పసాగెను.
భృగుడు, అత్రి, వసిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నగ్నజిత్, విశాలాక్షుడు, పురందరుడు, బ్రహ్మ, కుమారుడు, నందీశుడు, శౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుక్రుడు, బృహస్పతి-ఈ పదునెనిమిది మందియు వాస్తుశాస్త్రమును ఉపదేశించిన (మొదట ప్రవర్తిల్ల జేసిన) వారు, ఇది అనుత్తమ (దీనికంటె గొప్పదిలేని) శాస్త్రము; దీనినిపుడు మీకు తెలిపెదను.