శర్కరాఫల సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇంకను ఇట్లు చెప్పెను, ఇట్టిదేయగు శర్కరా సప్తమీ వ్రతమును తెలిపెదను. అది కల్మషనాశకమును-అనంతాయురారోగ్యైశ్వర్య ప్రదమును.

మాఘ శుక్ల సప్తమినాడు ఉదయమున తెల్లని నూవుల (పొడితో- నూనె)తో స్నానము చేసి తెల్లని వస్త్రమాల్యముల ధరించవలెను. అరుగు అలికి దానిపై కుంకుమతో పద్మమును దాని నడుమ కర్ణికను వేయవలెను. ‘నమ! సవిత్రే’ అను మంత్రముతో దానిపై గంధపుష్పము లుంచవలెను. దాని నడుమ నీటి కలశముంచి దానిపై శర్కరాపాత్ర నుంచవలెను. బంగారు గుర్రపు ప్రతిమను దానియందుంచి తెల్లని వస్త్రములతో మాల్యములతో గంధములతో ప్రతిమ అలంకరించవలయును. రవిని ఈ అర్థము వచ్చు మంత్రముతో పూజించవలెను. (అర్థము): “దేవేశా! సర్వదేవ మయుడవుగా నీవు వేదములందు పఠింపబడుచున్నావు. కనుక ఈ చరాచర జగత్తంతయు నీవే.” తరువాత పంచగవ్యము త్రావి (ఉపవాసముతో) ఆ అరుగునకు దగ్గరగా నేలపయి శయనించవలెను. సౌరసూక్తములనో పురాణములనో చదువుచు కాని వినుచు కాని ఆ పగలును రాత్రియు గడుపవలెను. అష్టమినాడు నిత్యానుష్ఠానము నెరవేర్చికొని అదియంతయు బ్రాహ్మణునకు దానము ఈయవలయును. తన శక్తికొలదిగా బ్రాహ్మణులకు నేతితో శర్కరా పాయ సములతో భోజనము పెట్టవలెను. తానును మౌనముతో నుండి తైల లవణరహితముగా భుజిం చవలెను. ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరకాలము చేసి పిమ్మట శర్కరా పూర్ణకలశముతో సర్వో పస్కర (సర్వసామగ్రీ) సహితమగు మంచమును పడకను పాడి ఆవును శక్తి ఉన్నచో గృహమును కూడ సర్వోపకరణములతో ఈయవలయును. వేయి- లేదా- నూరు- లేదా మూడు లేదా ఒక నిష్కము (పూర్వపు ఒక బంగారు నాణెము) తూకముతో బంగారు గుర్రములను (యథాశక్తి) చేయించి విప్రులచే సౌరసూక్తపాఠము పురాణ పఠనము చేయించి వారికిది దాన మీయ వల యును. ధనమునకు లోభించి లోపము చేయుట దోషకరము.

సూర్యుడమృతము త్రావునపుడు అతని నోటినుండి పడిన అమృతపు బొట్టులే వడ్లు పెసలు చెరకు ఐనవి. ఇక్షుసారము శర్కర; అందుచే ఈ మూటిలో అది గొప్పది. హవ్య కవ్యములందు అమృత స్వరూపము అయినది. అందుచే శర్కర రవికి ప్రీతికరము. ఈ శర్కరా సప్తమీ వ్రతానుస్థానము అశ్వమేధయాగ ఫలమును ఇచ్చును. సర్వదుఃఖ శాంతిని పుత్రపౌత్రవృద్ధిని పరబ్రహ్మత్వమును కూడ కలిగించును. అట్టివాడొక కల్పము కాలము స్వర్గమందుండి పిదప ముక్తి నందును.

దీనిని చదివినను వినినను తలచినను ఉత్తమ జ్ఞానవంతుడై స్వర్గలోకమున అప్సర! సమూహముచే పూజింపబడును.