మత్స్య మహా పురాణము
భేదోపాయ విచారము
శ్రీమత్స్యు డిట్లు మనువుతో చెప్పెను. రాజు తనకుగల శత్రువు లనేకులు పరస్పరము (ఒకరి విషయమున మరియొకరు) దుష్టులుగా క్రుద్ధులుగా ఒకరిని చూచి మరియొకరు భయపడు వారుగా ఒకరివలన మరియొకరు అవమానితులుగా ఉన్నచో (వారొకరితో మరియొకరు కలియ కుండునట్లు) వారిపై భేదోపాయము ప్రయోగించవలెను; ఏలయన ఇట్టివారు భేదోపాయ సాధ్యులు; ఎవరు ఏదోషము కలవారై ఉండి గర్వించి ఇతరుల వలన భయపడరో వారియందా దోషమునే ప్రయోగించి వారిని భేదోపాయముచే పరస్పరము విడదీయవలెను; అందులకై వానికి తనవలని ఆశనుగాని పరులనుండి భయమునుగాని చూపవలెను; ఇట్లువారిని భేదపరచనిదే వారిని ఓర్చుకొనుట ఇంద్రునకు కూడ సాధ్యము కాదు; కావున నీతిశాస్త్ర విశారదులు భేదోపాయమునే ప్రశంసింతురు; భేదోపాయమును తాను స్వయముగనైన ప్రయోగించ వచ్చును; పరుల ద్వారముననైన ప్రయోగించవచ్చును. ఈ రెండవ విధమయిన దానిని తాను పరీక్షించి దాని ఔచిత్యమును నిర్ణయించుకొనవలెను; ఇంతేకాదు; రాజు తన కార్యసిద్ధి నుద్దేశించి తన శత్రువులను పరస్పరము భేదపరచిన తరువాత గూడ వారు భేదపడినారు లెమ్మని నమ్మియుండరాదని అర్థశాస్త్రకుశలురగు అర్థ (రాజనీతి) వాదులందురు.
రాజుపై కోపించియుండు వారి కోపము అంతఃకోపము బహిఃకోపమునని రెండు విధములు; ఈ రెండింటి యందును అంతఃకోపము బలవత్తర మగుటలో గొప్పది. అది రాజులకు నాశము కలిగించును. సామంతుల కోపము బాహ్య కోపము; మహిషీ, యువరాజ, సేనాపత్య మాత్య మంత్రి రాజపుత్రాదుల కోపమంతః కోపమునని మనీషులందురు. ఇదిరాజులకు దారుణ తరమయినది; ఇందుచేతనే బాహ్యకోపము చాల గొప్పదిగా ఉత్పన్నమయియున్నను అంతఃకోపము శోధితమయినచో ఈరెండవ దానినతడు సులభముగా శీఘ్రముగా జయించును. ఇంద్ర సముడగు రాజు కూడ అంతఃకోపముచే నశించును. కావున రాజెప్పుడును అంతఃకోపమును(నుండి)యత్నముతో రక్షించుకొనవలెను. భేదో పాయముతో శత్రువులు జయింప గోరురాజు శత్రు పక్షము నందలి జ్ఞాతుల నడుమ మరి ఇతరులగు (మూడవ) వర్గము వారి ద్వారమున భేదము పుట్టించి వారిని చీలదీసి వశపరచుకొన వలెను. ఇట్లే- తన విషయమున శత్రువులు ఈ జ్ఞాతి భేదోపాయమును ప్రయోగింతురేమో యని ఎచ్చరికతో నుండవలయును; ఏలయన - జ్ఞాతులు ఎల్లప్పుడును మొదలే తమజ్ఞాతుల విషయమున లోలోపల మండిపడుచుందురు. వారిని ఇంకను రెచ్చగొట్టిన మరింత పరితాప(మండి) పడుచుందురు. అయినను రాజు తనశత్రురాజులు తనకును తన జ్ఞాతులకును నడుమ భేదము పుట్టించకుండుటకై అతి గంభీర చిత్తుడై దానముతో (సం) మానముతో వారిని తనవైపునకు త్రిప్పియుంచుకొనవలెను. ఏలయన వారినుండి తనకు భేదము కలుగుచో అది చాలభయంకరమగును. ఏలయన జ్ఞాతి ఎల్లప్పుడును తన జ్ఞాతిని దహింపగోరునే కాని అనుగ్రహించడు. కావున రాజులెల్లప్పుడును తమ శత్రువులను వారి జ్ఞాతులనుండి భేదపరచవలెను.
శత్రువులు అధిక సంఖ్యాకులును ప్రబలురును ఐనను వారిని భేదపరచిన మీదట స్వల్ప సేనతోగూడ యుద్ధమున చంప(జయింప)సాధ్యులగుదురు. కావున నయ (రాజనీతి) శాస్త్ర వేత్తలగు రాజులు తమ శత్రువులు సుసన్నిహితులుగా (పరస్పరము దృఢమిత్రులుగా) ఉండినను వారిని భేదపరచ వలయును.