శూరవంశ వృత్తాంతము

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: వృష్ణికుమారులలో నొకడు దేవమీఢ్వాన్ (దేవమీఢుష్). అతనికి ఇక్ష్వాకి (ఇక్ష్వాకు రాజపుత్రి) యందు శూరుడను కుమారుడు కలిగెను. పురుషుడను రాజు కూతురగు భోజయందు శూరునకు పదిమంది కుమారులు కలిగిరి. వారు వసుదేవుడు దేవభాగుడు దేవశ్రవసుడు అనాధృష్టి శిని నందుడు సృంజయుడు శ్యాముడు సామీకుడు సంయూపుడు అనువారు. ఐదుమంది కుమార్తెలు-శ్రుతకీర్తి-పృథ-శ్రుతదేవి-శ్రుతశ్రవ-రాజాధిదేవి అనువారును శూరునకు కలిగిరి. వీరందరును వీరమాతలు. వీరిలో శ్రుతదేవికి కృతుడను భర్తవలన సుగ్రహుడును, శ్రుతకీర్తికి కైకేయుని వలన సునీథుడను కుమారుడును, రాజాధిదేవికి బర్హిషుని వలన ధర్మాత్ముడగు అరిమర్దనుడును కలిగిరి. వృద్ధుడగు శూరుడు తన మిత్రుడగు కుంతిభోజునకు పృథను కూతునిగా నిచ్చెను. ఇందుచే వసుదేవుని చెల్లెలగు పృథకు కుంతి అను పేరువచ్చెను. తండ్రి యనంతరము వసుదేవుడు పృథను (కుంతిని) పాండున కిచ్చి పెండ్లి చేసెను. పాండునకు ఆమెయందు తరువాత ధర్మదేవుని వలన యుధిష్ఠిరుడు వాయువు వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు, రెండవ భార్య అగుమాద్రికి అశ్వినులవలన నకుల సహదేవులు కుమారులు పుట్టిరి.

పూరువంశ సంజాతయగు రోహిణియందు వసుదేవునకు రాముడు సారణుడు దుర్దముడు ధమనుడు, శుభ్రుడు, పిండకుడు, మహాహనుడు అను కుమారులును చిత్ర-క్షేత్ర అను కుమార్తెలును కలిగిరి. దేవకియందు సుషేణుడు, కీర్తిమాన్, ఉదాసి, భద్రసేనుడు, ఋషిదాసుడు, భద్రుడు, విదేహుడు అనుకుమారులు కలిగిరి. వీరినందరను కంసుడు చంపెను. కృష్ణుడును, అతని చెల్లెలు సుభద్రయు దేవకికి కలిగినవారే. శ్రీకృష్ణుడు వర్షాకాలమునందలి మొదటి అమావాస్యనాడు (శ్రావణమాసమున) పుట్టెను.

ఇంకను వసుదేవునకు తామ్రయందు సహదేవుడు దేవరక్షితయందు ఉపాసంగధరుడను ఒక కుమార్తెయు కలిగిరి. ఈ కన్యను కంసుడు చంపెను. ఉపదేవియందు విజయుడు రోచమానుడు వర్ధమానుడు దేవలుడు ఉపదేవియందు అవగాహుడు నందకుడు వనవిహారమున తాను కూడిన వైశ్య జాతీయయగు శ్రద్ధాదేవియందు కౌశికుడు గవేషణుడు అనువారును మరియొక భార్య యందు ముండుడు కపిలుడు అనువారును జరుడు సౌభద్రుడు భవుడు అను నిషాదులును దేవభాగయందు దేవశ్రవసుడని ప్రసిద్ధుడైన మహాపండితు డగు ఉద్ధవుడును కలిగిరి. యశస్వినియగు ఐక్ష్వాకి అనునామెను అనాధృష్టి అను వాని వలన శత్రుఘ్నుడు కలిగెను.

శ్రీకృష్ణుడు అనపత్యుడగు గండూషుడను వానికి తన కుమారుడును బలవీర్య సంపన్నుడునగు సుచంద్రుడను వానినిఇచ్చెను. శ్రీకృష్ణునకు జాంబవతియందు చారుధేష్ణుడు, సాంబుడు అను కుమారులు కలిగిరి. నందనుడను వానికి తంత్రీపాలుడు తంత్రి అనువారు కుమారులు.

శమీకునకు మహాబల విక్రమ సంపన్నులగు విరజుడు ధనువు శ్యాముడు సృంజయుడు అను నలుగురు కుమారులు కలిగిరి. వీరిలో శ్యామునకు సంతతి కలుగలేదు. సృంజయుడు వానప్రస్థుడయ్యెను. అతడు భోజుడుగా-లోక సుఖానుభవమున-ఉండుటకు అసహ్యపడి ఇట్లు రాజర్షియయ్యెను.

శ్రీకృష్ణ భగవానుని జన్మాభ్యుదయమును అనుదినము కీర్తించువాడును వినువాడును సర్వపాపములనుండి విముక్తుడగును.