మత్స్య మహా పురాణము
దైవ-పురుషకారములు
“దైవ పురుషకారములలో ఏది మేలైనదో నాకు తెలుపుము; దేవా! ఈ విషయమున నాకు కలిగిన సంశయము ఛేదింప వేడుచున్నాను” అనిన మనువుతో మత్స్యుడిట్లనెను, దేహాంత రార్జితమగు స్వకర్మఫలము దైవమనబడునని ఎరుగుము. కనుక ఇందు మానుషమే (పౌరుషము - పురుషకారము) గొప్పదని మనీషులందురు. ఇంతేకాదు; ప్రతికూల దైవమును పౌరుషముతో విహతమగును; పురుషకారము సరిగనున్నచో దురదృష్టము కూడ అదృష్టముగా మారి ఫలమునిచ్చును. శుభము నాచరించువారును నిత్యమును ప్రయత్నపరులునునగు కొందరకు ఈ జన్మమందు పౌరుషము (పురుష యత్నము) లేకయే ఫలము కనబడుచున్నదనినచో వారి పూర్వజన్మ కృతకర్మము సాత్త్వికమయి ఫలము నిచ్చినది అని అర్థము. పురుషాకార (కర్మ)ముతో ఫలము కనబడువారి పూర్వజన్మకృత కర్మము (దైవము) రజోగుణ ప్రధానమై ఉండును; ఎంతో శ్రమతో చేసిన పురుషకారముతో ఫలము కలిగిన వారి పూర్వజన్మ కృతకర్మము తామసము (తమోగుణ ప్రధానము) అయియుండును.
రాజా! నరులు తమ ప్రార్థితఫలమును పురుష ఆకారముతోనే పొందుదురు, అయినను పౌరుష (పుషకార-పురుషయత్న) రహితులగువారు (సోమరులు) దైవమును మాత్రమే గొప్పదిగా ఎరుగుదురు (భావింతురు). కావున ఇట్లు త్రికాల (కృతపురుషకార) సంయుక్తమగు దైవము మాత్రమే సఫల మగును; పురుషకారము దైవసంపత్తితో కూడినదై ఫలించును; మనుజోత్తమా! దైవమును పురుషకారమును కాలమును-మూడును కలిసియే మనుష్యునకు ఫలము కలిగించును; కృషియు వర్షమును కలిసినచో ఫల(పంటల) సిద్ధులు కనబడుచున్నవి; అవియును కాలమునందే కాని అకాలమందెప్పుడును కావుకదా! కావున మానవు లెప్పుడును ధర్మయుక్తమగు పురుషకారము నాచరించుచుండవలయును. ఆపదలయందును ఇట్లుండు వానికి ఇహపరములు రెండును నిశ్చయముగా ఫలము చేకూర్చును; అలసులను దైవ పరాయణులును ఫలమును అందజాలరు. కావున సర్వ (ప్రతియొక విధమగు) యత్నముతో ధర్మ మాచరించవలయును. నృపేంద్రా! లక్ష్మి అలసులను దైవపరులను విడిచి ఉత్థాన(నిరంతర ప్రయత్న)పరులను మాత్రము వెదకి యత్న పూర్వకముగా వరించును; కావున సదాఉత్థాన (సతత ప్రయత్న) పరుడు కావలయును.