హిరణ్యకశిపుడు అస్త్రములు వర్షించుట

అస్త్రములన్నిటిలో గొప్పదియు మహాదారుణమునగు దండాస్త్రము ఘోరమగు కాలచక్రము, విష్ణుచక్రము, ఉగ్రమును త్రిలోక దాహకమునగు పైతామహము, విచిత్రాశని, శుష్కాశని, ఆర్ద్రాశని, ఉగ్రమగు రౌద్రము, శూలము కాలము ముసలము మోహనము శోషణము సంతాపనము (తాపము కలిగించునది) విలాపనము (ఏడ్పించునది - కన్నుల వెంట నీరు కారునట్లు చేయునది) వాయవ్యము, మథనము, కాపాలము, కైకరము ఆప్రతి హతమగు (ఎదురులేని) శక్తి క్రౌంచము బ్రహ్మశిరము సోమము శైశిరము (శిశిరము - మంచు - నకు సంబంధించినది) కంపనము (వణికించునది) శాతనము (చెక్కునది) మహాభయంకరమగు త్వాష్ట్రము అక్షోభ్యమగు (కలత పరచనలవికాని) కాల ముద్గరము మహాబలమగు తపనము సంవర్తనము మోహనము మాయాధరము ప్రీతికరమగు గాంధర్వము నూతనమగు చందనము (ఆహ్లాదకరము) ప్రస్వాపనము (నిదురింపజేయునది) ప్రమథనము వారుణము ఎదురులేని నడకగల పాశుపతము హయశిరము బ్రాహ్మము నారాయణము ఐంద్రము అద్భుతమగు సార్పము ఓటమి నెరుగని పైశాచము శోషదము శామనము మహాబలముకల భావనము ప్రస్వాపనము వికంపనము -  అను ఈ దివ్యాస్త్రములను హిరణ్యకశిపుడు ప్రజ్వలించు అగ్నిపై ఆహుతినివలె నరసింహునిపయి ప్రయోగించెను. వేసవియందు సూర్యుడు తన కిరణములతో హిమవంతునివలె ఆ అసురోత్తముడు ప్రజ్వరిల్లు అస్త్రములతో నరసింహుని క్రమ్మివేసెను.

కోపమనెడు వాయువు చెలరేపగా దైత్యసేన అనెడి సాగరము క్షణములోనే సముద్రము మైనాకునివలె ప్రాసపాశ ఖడ్గ గదా ముసల వజ్రాశనులతో అగ్ని సహితములై మండు మహా వృక్షములతో ముద్గర భిండివాల శిలలతో రోళ్ళనెడు ఆయుధములతో పర్వతములతో మండుచుండు శతఘ్నులతో, మహాభయంకర దండములతో, ఆ నరసింహ దేవుని ముంచివేసెను. ఆ దానవులు హస్తములందు పాశములు గ్రహించి మహేంద్ర వజ్రములతో అశనులతో సమాన వేగము (తీవ్రత)కలిగి పైకెత్తిన బాహువులతో ఉన్నత శరీరములతో మూడు తలల నాగకుమారుల వలె నరసింహుని చుట్టు నిలిచిరి.

బంగరు మాలలతో కల్లోలితముగా అలంకరించుకొన్న అవయవములతో విశాలములగు పట్టు వస్త్రములతో చుట్టబడిన శరీరములతో ముత్తెపుగుత్తుల సరులతో అలంకరింపబడిన దేహములతో విశాలములగు రెక్కలు గల హంసలవలె వారుండిరి. వాయు సమసామర్థ్యము కలిగి భుజకీర్తులతో కిరీటములతో హద్దుమీరిన అందము కలిగియున్న ఆ దానవ శిరములు ప్రభాత రవికిరణ సమ తేజస్సులతో అన్నివైపులకు కనబడుచుండెను. ఉగ్రులై జ్వలించుచు తనపై శస్త్రాస్త్రములు విసరు ఆ మహాబలులు ప్రయోగించు మహాస్త్ర సమూహములును బాణములును తను క్రమ్మగా ఎడతెగక తనపయినున్న దట్టములగు చెట్లతో చీకట్లు క్రమ్మిన కందరముల నడుమభాగముగల పర్వతమువలె నరసింహుడుండెను. మహా బలులగు దైత్యగణముల వారందరు కూడి మహాస్త్ర జాలములతో కొట్టుచున్నను ఆ భగవానుడా యుద్ధమున హిమాచలమువలె ఉన్నవాడున్నట్లు నిలిచెనేకాని ఏ మాత్రమును కంపించలేదు. కాని ఆ దితిసుతులు అగ్ని సమాన తేజస్కుడు నరసింహ రూపుడునగు ఆ దేవునిచే సంతాపితులై భయమంది సాగర జలములతో ఏర్పడిన పెద్ద అలలు పెనుగాలిచేవలె మిక్కిలిగ చలించిరి.