గృహ నివేశాది కథనము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, వాస్తుశాస్త్రము బాగుగ ఎరిగినవాడు నివేశన స్థలమును బాగుగ పరీక్షించవలయును; స్థలమునందు పడిననీరు ఉత్తరదిశకుగాని, ఈశాన్యదిక్కునకుగాని ప్రవహించుచుండవలయును; నడుమ నుండుపై భాగమంతయు ఒకే మట్టముగా నుండవలెను; ఇట్లుండునట్లు పరీక్షించి చూచిన తరువాత ఆ నివేశనస్థలము నందు స్తంభమును నిలువ బెట్టవలయును.

ప్రాజ్ఞుడు దేవతాద్యూతకార, సచివాదుల గృహములకును, నాలుగు వీథులు కలియు ప్రదేశములకును దగ్గరలో గృహ నిర్మాణము చేసికొనరాదు; దానిచే దుఃఖశోక భయములు కలుగును, గృహ సన్నివేశమును గృహము నుండి నీరు బయటకు పోవుటలో దానికిగల యవ కాశమునుబట్టి నాలుగు విధములుగ విభజించవచ్చును; 1. ఉత్సర్గము-ఇంటి ముందునుండి నీరు బయటికి పోవునది-ఇది శుభకరము; 2. సవ్యావర్తము- ఇంటి వెనుకనుండి నీరు బయటకు పోవునది; ఇది మరియు శుభతరము; 3. అపసవ్యము- ఇంటికి దక్షిణముగా నీరు బయటకు పోవునది-వినాశప్రదము; 4. సంపూర్ణము- ఇంటికి ఉత్తర దిశనుండి నీరు బయటికి పోవునది- ఇది చాలమంచిది; ఇట్టి అనుకూలతలుగల ప్రదేశమును చూచికొని యత్నపూర్వకముగ యథా శక్తిగ గృహ మారంభించవలయును.

ఇది ఎట్లన -దైవజ్ఞుడు చెప్పిన శుభలక్షణయుత ముహూర్తమునందు (స్తంభమును ప్రతిష్ఠించుటకై త్రవ్విన గోతియందు) రత్నములుంచి వానిపై(దృఢమును సమతలమునగు) శిలనుంచవలెను; అచట సర్వబీజములునుకూడ చల్లవలెను; శిల్పి శుక్ల వస్త్రధరుడై వేదపారగులగు నలుగురు విప్రులు వేదములు పఠించుచుండ స్తంభమును స్నానముచేయించి వస్త్రాలంకారాదులచే భూషించి వేదధ్వనులతోను మంగళవాద్య గీతధ్వనులతోను దాని నాశిలపై నిలుపవలయును, సర్వౌషధులను నానా అక్షతఫల వస్త్రతాంబూలాదులను దాని కర్పించవలయును, వాస్తు యజ్ఞమును కూడ జరుపవలెను; 1. సూత్రపాతము (గృహము నిర్మించుటలో కావలసిన ఆయా కొలతలను బట్టి ఆయా గృహభాగములను నిర్ణయించుటకై ‘శంకుస్థాన నిర్ణయముచేసి ఆ శంకువు ఆధారముగా రజ్జువుతో కొలతల నారంభించుట); 2. స్తంభోఛ్చ్రాయము (స్తంభము ఎత్తుట); 3. ద్వారోఛ్చ్రాయము (ద్వారము ఎత్తుట); 4. గృహప్రవేశము; 5. వాస్తూపశమనము (వాస్తు శాంతి) ఈ ఐదు సందర్భములందు ఐదు విధములుగా వాస్తుయజ్ఞము జరుపవలసి యుండును; గృహనిర్మాణమునకు ఉద్దేశించిన ప్రదేశమంతటికిని సరియగు ఈశాన్యమునందు సూత్ర పాతమును-సరియగు ఆగ్నేయమునందు స్తంభోఛ్చ్రాయమును- జరుపవలయును, ఈ సమయములందు జరుపు వాస్తు యజ్ఞములందు ‘వాస్తోష్పతే ప్రతిజానీహి’ అను మంత్రముతో తేనెతోను, నేతితోను, హోమమును జరుపవలయును; బ్రాహ్మణులకు పాయసము భుజింపజేయవలయును.

(ఇంతకు ముందే ఏకాశీతి పదాత్మకమగు వాస్తు చక్రము చెప్పబడినది) ఈ వాస్తు చక్రమును గృహ నిర్మాణమునకు ముందుగా (సూత్రపాతమునను కూడ ముందుగా ఆ స్థలమునందు లిఖించి యుంచుకొనవలయును; దీనిని వాస్తు (గృహ నిర్మాణార్థమగు) ఏకాశీతి పదవిలేఖన మందురు; దీనికై రేఖాదులను లిఖించుటయు ఆయాపదము (అంకణము)లందు ఆయా స్థాన దేవతా నామములును లిఖించుటలో ప్రదక్షిణ క్రమమును పాటించవలయును; వ్రాయుటలో కుడిచేతి తర్జనీ మాధ్య మాంగుళులను బొటనవ్రేలిని ఉపయోగించవలయును; వ్రాతకై పవడములు రత్నములు బంగారు ఫలపుష్పాక్షతోదకము ఉపయోగించవలయును, బూడిద, బొగ్గులు, కట్టె ముక్కలు, గోళ్లు, ఆయుధములు, వంట ఇంటి పనిముట్టు, చర్మము, వెదురు, కర్ర, ఎముకలు, కపాలపు ముక్కలు- ఈ లేఖన కార్యములో ఉపయోగించరాదు; దీనిచే దుఃఖరోగ భయాదికము గలుగును.