మత్స్య మహా పురాణము
వశ్యాభిచారాది హోమములు
(వశ్యకర్మ-ఇతరులను లోబరచుకొనుట; అభిచారము-ద్వేష్యులగువారికి అపకారము చేయుట; ఉచ్చాటనము-పిశాచములు మొదలగువానినుండి విడిపించుట) వశ్య కర్మము అభిచార కర్మము ఉచ్చాటన కర్మము నవగ్రహమఖము మొదట జరిపిన తరువాతనే కామ్యకర్మముల నాచరించవలెను. లేనిదే కామ్యకర్మములు నాచరించినను ఫలితమునీయవు. కనుక కామ్యములగు లక్షహోమ కోటిహోమ గ్రహయజ్ఞముల నాచరించుటకు ముందు వెనుక నాభిచార వశ్య కర్మముల యందు ఒకేముఖమును మూడు పిడి మూరల వ్యాసమును మూడు మేఖలలును కల కుండమును నిర్మించవలెను. ఈ కర్మములకై సమిధలు పలాశ (మోదుగు) సమిధలు-తేనె గోరోచనము చందనము అగురు కుంకుమము-వీనితో తడిపినవియును తేనెతోను నేతితోను తడిపిన బిల్వ ఫలములును కమలములును ప్రశస్తములు. ఇట్టివి పదివేల సమిధలు వేల్చవలయును. వశ్య కర్మాధికమునందు దాని సంప్రదాయమునెరిగి బిల్వ ఫలములను పద్మములను ‘సుమిత్రాయా న ఆప ఓషధయః’ అను మంత్రముతో హోమము చేయవలయును. వశ్యాది కర్మత్రయము నందును గ్రహ ప్రతిష్ఠచేయు యజమానుడు కుంభ జలముతో స్నానముచేసి శుక్ల పుష్పములను శుక్ల వస్త్రములను ధరించవలయును. ఋత్విక్కులకు బ్రాహ్మణులకు బంగారుతో చేసిన కంఠ సూత్రములు కడియములు మురుగులు ఉంగరములు పవిత్రములు సన్నని నూతన వస్త్రములు బంగారుతో అలంకరించిన తెల్లని అవులు దానమీయవలెను.
ఇట్లాచరించుటచే వశులుకాని వారిని వశుల చేసికొనవచ్చును. సర్వశత్రు బలములును లొంగిపోవును. అమిత్రులును మిత్రులగుదురు. విద్వేషముతో చేయు అభిచారిక కర్మములందు అన్నియు (మూడును) హస్తమాత్ర భుజములుకలిగి ద్రోణము (ఒక విధమగు జలపాత్రము) వంటి ముఖము కలిగిన త్రిభుజాకృతి కుండము కావలయును. విప్రులు ఎర్రని వస్త్రములు మాల్యములు గంధానులేపనములు తలపాగలు ధరించి జపాపుష్పములవలె వెలుగుచు నరవాహనులై హోమము చేయవలయును. వారు యజ్ఞోపవీతము నివీతముగా ధరించి జుట్టు విరియ జోసికొని ‘దుర్మిత్ర్యాస్తస్మైనన్తు’ ఇత్యాదిమంత్రములను ‘హుం ఫట్’ ఇత్యాది శబ్దములతో ముగియు నట్లు ఉచ్చరించుచు యజమానుని శత్రువునకు అశుభము కలుగవలెనని తలంపుకలిగి డేగ ఎముక ముక్కలతో జతపరచిన సమిధలనుఎడమచేతిలో పట్టుకొని వేల్చవలయును. యజమాన శత్రు ప్రతిరూపము (బొమ్మ)ను చేసి యుంచుకొని ‘శ్యేనాభిచార’ మంత్రముతో ఏడుమారులు మంత్రించిన క్షురము (చురకత్తి)తో ఆ ప్రతిరూపమును కత్తిరించి ఆ ముక్కలనుకూడ అభిచారిక మంత్రములతో వేల్చవలయును. కాని ఈవిధమగు అభిచారిక గ్రహహోమమును శాంతిక పౌష్టికాది కామనలతో చేయు గ్రహయజ్ఞముతో సమానకాలమున చేయరాదు. (దానికి ముందుగా వేరుగా చేయవలయును) ఒకవేళ దానినట్లు వేరుగానే చేసినను ఇవి శత్రు నాశము మొదలగు దుష్టము క్రూరమునైన ఐహిక ఫలములనిచ్చునేకాని పారలౌకికముగ శుభము కలిగించకపోగా అశుభమును కలిగించును. కావున ఇహమునను పరమునను వాస్తవమగు శుభమును కోరువారు శాన్తిక పౌష్టిక గ్రహ యజ్ఞమునే ఆచరించవలయును.
ధనము విషయములో శాఠ్యము (ఉండియు లోభముచే లేనట్లు నటించి వ్యయము తగినట్లు చేయక కొరత చేయుట) చూపక యథాశక్తిగా అయుత హోమ-లక్షహోమ-కోటి హోమములనెడు మూడు విధములగు గ్రహ యజ్ఞములను చేయవలయును. అట్లాచరించినవాడు పునరావృత్తి రహితమును దుర్లభమునునగు విష్ణు స్థానమును పొందును. సమాహితుడై దీనిని వినినను ఇతరులకు వినిపించినను అట్టి వారికి గ్రహపీడకాని బంధు జనులకు అరిష్టముకాని కలుగదు. ఈ గ్రహయజ్ఞత్రయ విధానమును లిఖించి ఇంటిలో ఉంచుకొనినచో అట్టివారికి బాలురకు అనారోగ్యముకాని, పీడకాని ఆ కుటుంబము వారికి రోగముకాని బంధనముకాని కలుగదు. అందు నను లక్షహోమ గ్రహయజ్ఞము అశ్వమేధయాగ ఫలదము. అయుత హోమ నవగ్రహ మఖము ద్వాదశాహమను శ్రౌతయజ్ఞము చేసి నంత ఫలమునిచ్చును.
ఈ చెప్పిన గ్రహయజ్ఞ విధానమంతయు ఉత్సవముచేసిన ఆనందమును కలిగించును; సకల కలుషములు హరించును; ప్రాసంగికముగ దీనిని చదివినవారును వినినవారును ఆయురారోగ్య యుక్తులగుదురు; శత్రువులనణగ ద్రొక్కుదురు.