మత్స్య మహా పురాణము
లక్షణోద్ధారము
తరువాత స్థాపకుడు మిగుల అవధానముకల మనస్సుతో లింగమునకు (అర్చామూర్తికి) ‘లక్షణోద్ధారము’ జరుపవలయును; అర్చాలింగము పూజింపబడు భాగమునందు - అనగా లింగపు ముఖము అనదగినచోట, ఈ లక్షణమును, గురుతును ఏర్పరచ వలయును; ఎట్లనగా ముఖ భాగమును నిలువున మూడుగా విభజించుకొని వానిలోని పైభాగమును వదలి మిగిలిన రెండు (దిగువ) భాగములందు క్రమ్మునట్లుగా మూడు అడ్డు గీతలు చెక్కవలయును. అవి ఒకదానికి మరియొకటి ఎనిమిదియవల (ఒక భారతీయాంగులము) ఎడములో నుండవలయును. ఇవి అంతగా లావుగనుండరాదు; అంతగా సన్నగా నుండరాదు, ఎట్లన - లోగడ తెలిపిన వానిలో జ్యేష్ఠపరిమాణక లింగమునందు ఈ రేఖలలోతు ఒకయవ పరిమాణము (1/8 భారతీయాంగుళము)తో నుండవలెను. మధ్యమ పరిమాణక - కనిష్ఠ పరిమాణక లింగములందు ఇవి ఇంకను తక్కువ లోతుననే ఉండవలయును. తరువాత లింగపు నిలువుటెత్తును ఎనిమిది భాగములుచేసి పైమూడు భాగములను వదలి అక్కడి నుండి దిగువకు - లోగడ చెక్కిన అడ్డురేఖలకు రెండు పార్శ్వములందును వచ్చునట్లు సమదైర్ఘ్యముగల ఏడు రేఖలను నిలువుగా చెక్కవలెను. వానిలో నాలుగవ భాగమందలి రేఖ దిగువకొన ఐదవ భాగమందలి రేఖపై కొనను తాకునంతవరకు తెచ్చి ఆరెంటిని కలుపవలెను. ఇట్లు రేఖాద్వయ సంగమ స్థానమునందును దానివెనుక భాగము నందును రెండు వేరువేరు భాగము లేర్పడును.