మత్స్య మహా పురాణము
సముద్రమునకు సంబంధించిన రహస్యములు
జలములు దీనియందు సముద్రేకించును గావున సముద్రమునకు సముద్రము అని పేరు. జరాయుజాండజ స్వేదజోద్భిజ్జములను నాల్గు విధములగు ప్రజ లెచ్చట నివసింతురో ఆనందింతురో-ఇట్లు వృష్టి-వర్షితము వాన) వారి ఆనందపూర్వకస్థితి వర్షితమును ఎచ్చట జరుగునో అది వర్షము అనబడును.
ప్రతిదినమునను చంద్రు డుదయించునపుడును చంద్రుడు పూర్ణుడైనపుడు (పూర్ణిమా తిథియందు)ను సముద్రము పూర్ణమగును. బహుళ పక్షమున చంద్రుడు ప్రక్షీణుడగుచుండ సముద్రమును క్రమముగ క్షీణించి సన్నదనమును పొందును. ఆపూర్వ మాణ (శుక్ల) పక్షమున సముద్రము క్రమముగ స్వయముగనే వృద్ధి పొందును. కనుక ఇట్లు చంద్ర క్షయముతోపాటు సముద్రక్షయమును చంద్రవృద్ధితోపాటు సముద్రవృద్ధియు నుండును. ఏలయన జలవృద్ధి క్షయములు చంద్రవృద్ధిక్షయానుసారులు. అందుచేతనే చంద్రుని ఉదయమున వృద్ధినొంది చంద్ర జలముల పరస్పరాతిరేకానుసారము సముద్రజలముకూడ హసించును. (తగ్గును) ఇదే విధముగ శుక్ల కృష్ణపక్షములందు చంద్రవృద్ధి క్షయముల ననుసరించి సముద్రవృద్ధి క్షయములును జరుగును. ఈ వృద్ధి పరిమాణము పదునైదు వందల అంగుళములుండును.
రెండు వైపులను నీరుండుటచే ద్వీపము (ద్వి+ఆప=ద్వీప) అనియు నీటిని నిలుపు కొనునది కావున సముద్రమునకు ఉదధి (ఉద+ధా=నీటిని ధరించు) అనియు వ్యవహారము కలిగినది. భూమిచేత వెలిగ్రక్కబడినవి కావున కొండలకు గిరులు (ఉద్+గౄ=వెలిగ్రక్కుట) అనియు పర్వములు కలవి కావున పర్వతములనియు (పర్వ=కణుపులు; ఉబ్బెత్తులు) వ్యవహారములు.
శాక పర్వత (వృక్ష)ముండుటచే శాకద్వీపము-దేశము నడుమ కుశస్తంబము (దర్భ దుబ్బు) ఉండుటచే కుశ ద్వీపము-క్రౌంచపర్వత ముండుటచే క్రౌంచద్వీపము-శాల్మలవృక్షము (బూరుగుచెట్టు) ఉండుటచే శాల్మల ద్వీపము-గోమేద రత్నపర్వత ముండుటచే గోమేదద్వీపము-న్యగ్రోధవృక్షము (మర్రిచెట్టు) ఉండుటచే పుష్కర (పుష్కర =మర్రి) ద్వీపము అని ఆయా ద్వీపములకు వ్యవహారము కలిగినది.
ఈ జంబూద్వీపమునందు అవ్యక్తము (మాయాశబలము) నకు కూడ మూలకారణమగు బ్రహ్మతత్త్వము కంటె అభిన్నమగు మహాదేవుడు పూజింపబడును. దీనియందే సాధ్యులతో సిద్ధులతో కూడ ప్రజాపతియగు త్వష్ట (చతుర్ముఖుడు-హిరణ్యగర్భుడు) నివసించును. ఇచటనే ముప్పది ముగ్గురు దేవతలును ఋషులును ఆరాధింపబడుచున్నారు. దేవదేవోత్తముడగు ఆ దేవుడు (నారాయణుడు) కూడ ఇచట పూజింపబడుచున్నాడు. ఈ ద్వీపమునందు అనేకములగు రత్నములును వాడుకలోఉన్నవి. ఈ చెప్పిన ద్వీపములన్నిటను అచటి ప్రజల ఆర్జవము (వక్రతలేని నడువడి) బ్రహ్మచర్యము సత్యము దమము మొదలగువానిని బట్టి వారివారి ఆరోగ్యాయుః ప్రమాణాదికము ఒకదాని యందుకంటె మరియొక దానియందు రెట్టింపు చొప్పున అధిక మగుచున్నది. ప్రజలును వారి సద్గుణములచే రక్షింపబడుచున్నారు. జరామృత్యు పీడితులు కాకున్నారు. అచటి జనులు అప్రయత్నసిద్ధమగు షడ్రసాహారమునుతిని సుఖముగ జీవింతురు.
పుష్కర ద్వీపమున కావల స్వాదూదక (మంచినీటి) సముద్రమున్నది. దాని కావల చుట్టును లోపలివైపు ప్రకాశము (వెలుగు కలది) వెలుపలి వైపు అప్రకాశము (వెలుగు లేనిది) అగు పర్వతము గుండ్రముగ ఆవరించిఉన్నది. దీని యందలి ఆలోక విస్తార మాత్రాంశము (ప్రకాశించు భాగము) పృథివీ సంబంధియై దృఢాంశముగా ఉన్నది. మిగిలిన అలోకభాగము (అప్రకాశాంశము) ఉదకముతో ఆవరింపబడియున్నది. ఇట్లీ భూమండలమునకు చుట్టును ఉదకము క్రమ్మి యుండుటతో ఇదియంతయు ఉదకముతో ప్రతిచ్ఛన్నము (పూర్ణముగా కప్పివేయబడి యున్నది) అని చెప్పవలసియున్నది.
భూమికి చుట్టును ఉన్న జలము భూమికి పదిరెట్లుండి భూమిని తడుపుచున్నది. దానికి పదిరెట్ల పరిమాణముతో అగ్ని ఈ జలములను నిలిపియున్నది. దానికి పదిరెట్ల పరిమాణముతోనున్న వాయువు అగ్నిని నిలిపి పట్టియున్నది. కాని వాయు మండలము తిర్యక్ (అడ్డముగా) ప్రసారము కలది-మిగిలిన పృథివ్యాప్తేజ ఆకాశములు గోళాకృతి వ్యాప్తి ప్రసారములు కలవి. వాయువునకు పదిరెట్ల పరిమాణము గల ఆకాశము ఇతర భూతములు గాలిచే చెదరిపోకుండ నిలిపి పట్టుచున్నది. దానికంటె అధికమగు పరిమాణము గల సదసదాత్మకమగు మహత్తు ఈ పృథివ్యాది పంచకమును దానికంటె అధిక పరిమాణముగల అవ్యక్తము ఈ పృథివ్యాది మహదంత షట్కమును ధరించు (నిలిపి పట్టు)చున్నది. ఇట్లవి వికారములు (ఉత్పన్నములు) వికారిచే (తమ మూలకారణముచే) నిలుపబడుచు పరస్పరా ధారాధేయ భావములో నున్నవి. పృథివి మొదలగునవి అన్నియు వికారములు- ఒకదానికంటె మరియొకటి పరిమాణములో పెద్దవి-ఒకదాని నింకొకటి నిలిపి పట్టినవి. అవి పరస్పరాను ప్రవేశము చేసియున్నందుననే స్థిరతరత్వము పొంది కదలకయున్నవి. వీనిలో పృథివి-నీరు – అగ్ని-వాయువు-ఇవి పరిచ్ఛిన్నములు-ఇది ఇంతవరకున్నవి అనిచెప్ప శక్యమగును. ఈ నాలుగు భూతములకు ఆవలగానున్న వెలుగుకూడ అన్నివైపుల సమముగా నుండును కావున ఆకాశమందా వెలుగు వ్యాపించి వానిని దీనియందిది. యున్నదని చెప్పగలుగుచున్నాము. ఇవి ఇట్లు పెద్దపాత్రయందున్న చిన్న పాత్రలవలె నుండి పరస్పర మాశ్రయాశ్రయి భావముతో నుంటచే ఒకదానికంటె ఒకటి చిన్నవన వీలుగుచున్నది. అట్లే ఈ ప్రాణులును ఒక విధమగు వాటికంటె మరియొక విధమైనవి అధికమైనవి అనదగియున్నవి. ఈ భూతముల వ్యాప్తియున్నంత మేర ప్రాణుల-భూతముల-ఉత్పత్తియు కలదు. ఈ ప్రాణులు సంస్కార రూపమున భూతముల యందంతర్గతములైయున్నవి. ఈ సంస్కారము జడ భూతములను త్రొక్కిపట్టి తమను లోబరచు కొని వానితోనే ప్రాణుల ఉత్పత్తిని సాగించుచున్నవి. కాని అచటి భూతముల పాళ్ళ పరిమితిని బట్టి ‘కార్యవశమున కారణనిర్ణయ’మను యుక్తిచే ఈ ప్రాణులు ఈ భూతము ప్రధానముగాగల ప్రాణులని నిర్ణయించవలెను. (మానవుల శరీరము పార్థివము-మత్స్యముల శరీరము జలప్రధానము అన్నట్లు.)
ఇట్లు పృథివ్యాదికము మహదంతము కార్యము ఏదియో కారణము ఏదియో నిర్ణయించవలెను. ఇట్లు నేను (మత్స్యుడు) పృథివి ప్రధానముగా ఆక్రమించిన సప్తద్వీపాత్మక భూమండల స్థితిని పరిమాణ విస్తరమును యథాతథ్యముతో తెలిపితిని. ఇది భూసన్నివేశ ప్రకారము. ఏది ఏమైనను ఈ కనబడు విశ్వమంతయు ప్రకృతి పరిణామమునందలి ఏకదేశము (అల్పాంశము) మాత్రమే. నేను చెప్పిన ఇంతమాత్రమే వినుటకును చెప్పుటకును శక్యము.
ఇకమీదట సూర్యా చంద్రమసులు గమన ప్రకారము ప్రతిపాదింతును.