అరువది వ్రతముల కథనము

నందికేశ్వరుడు నారదునితో ఇట్లు చెప్పనారంభించెను, ఇకమీదట సర్వోత్తమములగు అరువది వ్రతములను నీకుతెలిపెదను. ఇవి సాక్షాత్ రుద్రుడు చెప్పినవి. సర్వపాప ప్రణాశనములు.

1. ఏడాదిపాటు నక్తవ్రతము జరిపి కుటుంబియగు విప్రునకు పాడిగోవును బంగరు త్రిశూల చక్రములను వస్త్రములను ‘శవోఽహమస్మి’ ‘రుద్రోఽహమస్మి’ అను భావనతో దాన మీయవలెను. దీని ఫలమున శివలోకమున పూజితుడై సుఖించును. ఇది మహాపాతక నాశనమగు దేవవ్రతము.

2. దినము విడిచి దినము సంవత్సరకాలము నక్తవ్రతము జరిపి సంవత్సరాంతమున బంగారు కలువ పూవు శర్కరా పాత్రను బంగరు వృషభ ప్రతిమను విప్రునకు ఈయవలయును. ఇట్టివారు విష్ణు స్థానమందుదురు. ఇది లీలావ్రతము.

3. ఆషాఢాది మాస చతుష్టయమున అభ్యంగముచేయక బ్రాహ్మణునకు కాని పాత్రునకు ఎవనికైన కాని భోజన సామగ్రిని ఇచ్చుచుండవలెను. ఇట్టివాడు విష్ణుభవనము చేరును. ఇది జనప్రీతికరమగు ప్రీతి వ్రతము.

4. చైత్ర మాసము పొడవున పాలు పెరుగు నేయి చెరకు రసము వదలి విప్రదంపతులను పూజించి ‘గౌరీ మే ప్రీయతామ్’ అనుచు రసపాత్రను (ఈ వదలిన నాలుగిటిలో దేనితో నిండిన దైనను) సన్నని వస్త్రములను దానమీయవలెను. ఇది అజ్ఞాన నాశమగు గౌరీవ్రతము.

5. వసంత ఋతువును ఆరంభమున (చైత్ర శుక్ల) త్రయోదశినాడు నక్తముండి బంగరు అశోక పుష్పమును పది అంగుళముల చెరకుగడను నూతన వస్త్రద్వయమును బ్రాహ్మణునకు ‘ప్రద్నుమ్ణ్నః ప్రీయతామ్’ అను మంత్రముతో దానమీయవలెను. సదాశోక వినాశనమగు కామవ్రతము ఇది. దీని నాచరించినవారు ఒకకల్పమంత కాలము విష్ణు లోకమున సుఖింతురు.

6. ఆషాఢాది తిథియం దీ వ్రతమును పూని నాటినుండి వరుసగ నాలుగు మాసములు గోళ్లు కత్తిరించుకొనకుండవలెను. అంతకాలమును వార్తాకము (పందిరి వంగకాయ) తేనె నేయి, బెల్లము తినకుండవలెను. కార్తీకమాసారంభమున బంగారు వార్తాకమును బ్రాహ్మణునకు దానమీయవలెను. ఇది ఆచరించినవాడు రుద్ర లోకమును చేరును. దీనిపేరు శివవ్రతము.

7. హేమంతశిశిర ఋతువులయందు ఏ పుష్పములను (తనకై) ఉపయోగించకుండ వలెను-ఫాల్గున మాసమున (కడపట) బంగారుతో (ఆ రెండు ఋతువులలో పూచెడి) మూడు పూవులు చేయించి మూడు వేళలందు మూడిటిని వేరువేరుగా ‘శివకేశవౌ ప్రీయేతామ్’ అనుచు విప్రునకు దానమీయవలెను. దీనిచే పరమపదమందును. దీనిని సౌమ్య వ్రతమందురు.

8. ఫాల్గుణ శుక్ల తృతీయ మొదలు మాసాంతమువరకు లవణము విడువవలెను. కడపట విప్రదంపతులను పూజించి వారికి సర్వోపస్కరములతో ఇంటిని, మంచమును ‘భవానీ ప్రీయతామ్’ అనుచు దానమీయవలెను. దీనిచే కల్ప కాలము గౌరీ లోకవాసము లభించును. ఇది సౌభాగ్య వ్రతము.

9. సంధ్యా కాలములందు (కొంత కాలము) మౌనము పాటించి వ్రతాంతమున నేతి పాత్రను వస్త్రముల జతను నూవులను ఘంటను బ్రాహ్మణునకు దానమీయవలెను. దీనిచే ఇహమున రూపవిద్యా లాభమును పరమున పునరావృత్తి రహితమగు సారస్వత లోకమును సిద్ధించును. దీనిని సారస్వత వ్రతమందురు.

10. పంచమినాడు ఉపవసించి ఉపవాసాంతమున షష్ఠినాడు బంగారు పాత్రయందు బంగార ముంచి విప్రునకు దానమీయవలెను. అతడు జన్మజన్మమందును సంపద్యుక్తుడై విష్ణు లోకమందును. దీనిని సంపద్ర్వతమందురు. ఇది దుఃఖ శోక వినాశకము.

11. సంవత్సరకాలము శివసన్నిధిలోకాని విష్ణు సన్నిధియందుకాని నిలిచి గంధాను లేపన ములు (బొట్టుకాని) ధరించి కడపట పాడియావును ఉదకుంభమును (విప్రునకు) దానమీయ వలెను. దీనిచే పదివేల జన్మములందు రాజుగా జన్మించుచుండి కడపట శివలోక ప్రాప్తుడగును. సదా పాప వినాశనమగు ఇది శుద్ధి వ్రతము.

12. సంవత్సరముపాటు విమత్సరుడై (అకలుష చిత్తముతో) ఒకే స్థానమునందు అశ్వత్థమునకు భాస్కరునకు గంగకు ప్రణమిల్లి మౌనవ్రతుడై ఏక భుక్తముతో ఉండవలెను. వ్రతాంతమున విప్ర దంపతుల నర్చించి మూడు పాడియావులను వృషభమును బంగరుతో చేయించి దానమీయ వలెను. దీనిచే అశ్వమేధ మాచరించిన ఫలము లభించును. కీర్యైశ్వర్యములు సిద్ధింపజేయు దీనిని కీర్తి వ్రతమందురు.

13. గోమయముతో మండలము నేర్పరచి అచట శివునకుగాని కేశవునకుగాని నేతితో అభిషేకము జరిపి పిమ్మట ఆ దేవునికి అక్షతలతో పుష్పములతో పూజను జరిపి అది ముగసిన తరువాత సామగానమున నిపుణుడగు విప్రునకు తిలలను పాడి ఆవును ఎనిమిది అంగుళముల పొడవు కల స్వర్ణకమలమును దానమీయవలెను. దీనిచే శివలోక ప్రాప్తియగును. ఇది కామధుగ్ర్వతము.

14. నవమినాడు ఏకభుక్తముండి యథాశక్తిగ కన్యను కూడ భుజింపజేసి ఆమెకు బంగరు జరీగల రవికను, చీరను ఈయవలెను. బ్రాహ్మణునకు బంగారు దానమీయవలెను. దీనిచే ఇహమున అర్బుద జన్మములందు చక్కని రూపము శత్రువులచే అపరాజితత్వము పరమున శివలోక ప్రాప్తియగును. ఇది వీరవ్రత మనబడును. ఇది స్త్రీలకు పుణ్యమును ఆనందమును ఇచ్చునది.

15. పూర్ణిమనాడు పాలు మాత్రము త్రాగి ఉపవాసముండి అది ముగియగానే పాడ్యమినాడు పితరుల నుద్దేశించి శ్రాద్ధము జరిపి బ్రాహ్మణులకు ఐదు పాడియావులను పిశంగ (ఎరుపు పసుపు వన్నెలు కలిసిన రంగుగల) వస్త్రములను ఐదింటిని ఉదకుంభములను ఐదింటిని దానము ఈయవలెను. దీనిచే తానును తన పితరులును తరింతురు. విష్ణులోకమునందుందురు. కల్పాంతా (ప్రళయా) నంతరమున కల్పాదియందు సృష్ట్యారంభమున చక్రవర్తియై జన్మించును. ఇది పితృవ్రతము.

16. చైత్రము మొదలుగ నాలుగు మాసములపాటు అయాచితముగ జలదానము చేయవలెను. వ్రతాంతమున మణికమును (దుత్త అనెడి మట్టిపాత్ర) అన్న వస్త్రములను తిలపాత్రమును బంగారును ఈయవలెను. దీనిచే బ్రహ్మలోక ప్రాప్తియగును. కల్పాంతము (అయిన తరువాతను సృష్ట్యాదియందు) రాజై జన్మించును. ఇది ఆనంద వ్రతము.

17. ఏడాదిపాటు శివునకు పంచామృత స్నానము జరిపించి వ్రతాంతమున ధేనువును పంచామృతములను శంఖమును బ్రాహ్మణునకు దానమీయవలెను. దీనిచే శివలోక ప్రాప్తి యగును. కల్పాంతమున(మరల సృష్ట్యాది యందు) రాజైజన్మించును. దీనిని రాజ్య వ్రతమందురు.

18. ఏడాదిపాటు (మాంసాహారులగు వారు) మాంసము తినకుండి కడపట పాడియావును బంగారు లేడి ప్రతిమను దానమీయవలెను. దీని నహింసావ్రతమందురు. దీనిచే అశ్వ మేధఫల మంది పునరావృత్తి రహిత బ్రహ్మలోకప్రాప్తుడై కల్పాంతమున (మరలసృష్ట్యాది యందు) నృపతియై జన్మించును.

19. మాఘ మాసమున ఉషస్సున స్నానముచేసి (మాసాంతమున) వస్త్రమాల్యభూషణము లతో దంపతుల నర్చించి భుజింపజేయవలెను. దీనిచే కల్పకాలము రవిలోకవాసి యగును. దీనిని సూర్యవ్రతమందురు.

20. ఆషాఢాది మాస చతుష్టయమున వరుసగా ప్రాతః స్నానముచేసి కార్తీకారంభమున బ్రాహ్మణులకు భోజనము చేయించి ధేను దానము చేయవలెను. దీనిచే విష్ణులోక ప్రాప్తుడగును. ఇది విష్ణువ్రతము.

21. ఒక అయనమున పూవులను మరియొక ఆయనమున నేతిని విడువవలయును. ఇట్లు సంవత్సరమయిన తరువాత పూలదండలను (లోగడ చెప్పిన) ఘృత ధేనువును దానము చేయవలెను. విప్రునకు నేతిపాయసముతో భోజనము పెట్టవలెను. దీనిచే శివలోక ప్రాప్తుడగును. ఇది ఇహమున శీలారోగ్య ఫలప్రదము. దీనిని శీలవ్రతమందురు.

22. సంవత్సర కాలము తైలమును (ఆహారమున గ్రహింపక) విడువవలెను. (ఇంత కాలము) సంధ్యాకాలమున (దేవునికడ) దీపము వెలిగించవలెను. సంవత్సరాంతమున బ్రాహ్మణునకు బంగారు చక్రశూలములను వస్త్ర యుగ్మమును దానమీయవలెను. దీనిచే తేజస్వీయగును. రుద్రలోక ప్రాప్తుడగును. ఇది దీప వ్రతము.

23. కార్తీకమున కృత్తికానక్షత్ర దినము మొదలు (సంవత్సరము వరకు) గోమూత్రమును గోధుమ రవ్వను పాలతో వండిన అన్నమును తినుచు ఏడాదిపాటు నక్తము ఆచరించవలెను. కడపట[vs1]  గోదానము చేయవలెను. కల్పకాలము వరకు గౌరీలోక వాసియై పిమ్మట సృష్టియందు రాజై పుట్టును. ఇది కల్యాణకరమగు గౌరీ వ్రతము.

24. చైత్ర మాసమంతయు గంధాను లేపనములు విడిచి మాసాంతమున విప్రునకు గంధముతో నిండిన ముత్తెపు చిప్పను తెల్లని వస్త్రములను దానమీయవలెను. దీనిచే వరుణలోక ప్రాప్తుడగును. దీనిని దీప్య వ్రతమందురు.

25. వైశాఖ మాసమంతయు పూవులను ఉప్పును విడువవలెను. మాసాంతమున లవణ ఘటములనుగాని లవణ ధేనువునుగాని దానమీయవలెను. దీనిచే ఇహమున కాంతికీర్తులు పొందును. పరమున కల్పకాలము విష్ణులోక మనుభవించును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజై పుట్టును. ఇది కీర్తివ్రతము.

26. మూడు పలములకు తక్కువకాని తూకపు బంగారుతో బ్రహ్మాండమును చేయించవలెను. తిలరాశి నేర్పరచవలెను. మూడు దినములు ఆ తిలలతో వహ్నియందు హోమముచేసి కడపట విప్రులకు భోజనముతో సంతర్పణముచేసి ఒకపుణ్యదినమున విప్రదంపతులను వస్త్రమాల్య భూషణములతో పూజించి ‘విశ్వాత్మా ప్రీయతామ్’ అనుచు ఆబ్రహ్మాండమును వారికి దానమీయవలెను. దీనిచే పునర్జన్మమేలేక పరబ్రహ్మమును పొందును. ఇది మోక్షప్రదమగు బ్రహ్మ వ్రతము.

27. చాల బంగారుతోకూడ ఉభయముఖీ గోదానము (అప్పుడే ఈనుచున్న గోదానము) చేసిన ఆదినము అంతయు పాలుఆహారముగా నుండవలెను. దీనిచే పునరావృత్తి రహిత పరమ పదము లభించును. ఇది సువ్రతమను వ్రతము.

28. మూడు దినములు పాలు ఆహారముగా (పయోవ్రతముతో) ఉండి నాల్గవనాడు పలమునకు తక్కువకాని బంగారుతో కల్పవృక్షముచేయించి దానిని బియ్యముతో కూడ దానము చేయవలెను. దీనిచే బ్రహ్మలోకము ప్రాప్తించును. ఇది కల్పవ్రతము.

29. నెలపాటు (ఏకభుక్తముతోకాని నక్తవ్రతముతోకాని) ఉపవసించి మాసాంతమున విప్రునకు పాడి ఆవును ఈయవలెను. దీనిచే విష్ణులోక ప్రాప్తుడగును. ఇది భీమవ్రతము.

30. ఇరువది పలములకు తక్కువకాకుండా చేయించిన భూప్రతిమ విప్రునకు దానమిచ్చి ఒక దినమంతయు పయోవ్రతముతో (పాలు ఆహారముగా) ఉండవలెను. దీనిచే రుద్రలోకప్రాప్తుడగును. దీనివలని పుణ్యము సప్తకల్పములపాటు వెంటవచ్చును. ఇది ధరావ్రతము.

31. మాఘమునకాని చైత్రమునకాని శుక్ల తృతీయనాడు గుడాన్నము (బెల్లముతో వండిన పాయసము) ఆహారముగా ఉండి గుడధేనుదానము చేయవలెను. దీనిచే గౌరీలోకప్రాప్తు డగును. ఇది సరసమును ఆనంద ప్రదమునగు మహావ్రతము.

32. పక్షము దినములు (ఏకభుక్తముతోనో నక్తముతోనో) ఉపవసించి కడపట రెండు కపిల గోవులను దానమీయవలెను. దీనిచే దేవాసుర పూజితుడగుచు బ్రహ్మలోకమున సుఖించును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజైపుట్టును. ఇది ప్రభావ్రతము.

33. ఏడాదిపాటు ఏకభ(భు)క్తము చేయుచు ఉపవసించి కడపట భక్ష్యములతోను జలముతోను నిండిన కడవలను దానమీయవలెను. దీనిచే కల్పకాలము శివలోకప్రాప్తుడగును. ఇది ప్రాప్తి వ్రతము.

34. ఏడాదిపాటు అష్టమి తిథులయందు నక్తవ్రతము చేయుచు కడపట గోదానము చేసినచో ఇంద్రపద మందును. ఇది సుగతివ్రతము.

35. వర్షాకాలపు నాలుగునెలలు విప్రునకు వంటకట్టెలనిచ్చుచు కడపట ఘృతధేను దానము చేయవలెను. ఇది సర్వపాపప్రణాశనమగు వైశ్వానరవ్రతము. దీనిచే పరబ్రహ్మ ప్రాప్తుడగును.

36. ఏడాదిపాటు ఏకాదశులందు నక్తవ్రతముచేసి కడపట బంగారు విష్ణుచక్రము దానమీయవలెను. దీనిచే విష్ణులోకప్రాప్తుడగును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజై పుట్టును.

37. ఏడాదిపాటు పాలఅన్నము మాత్రమేతిని కడపట విప్రునకు రెండు పాడిఆవుల నీయవలెను. కల్పకాలము లక్ష్మీలోకప్రాప్తి నిచ్చు ఇది దేవీ వ్రతము.

38. ఏడాదిపాటు సప్తమీ తిథులయందు నక్తముండి కడపట పాడియావును దానమీయవలెను. దీనిచే రవి లోకప్రాప్తుడగును. ఇది భానువ్రతము.

39. ఏడాదిపాటు చవితి తిథులయందు నక్తముండి కడపట బంగారు ఏనుగు ప్రతిమ దానమీయ వలెను. ఇది శివలోక ఫలదమగు వైనాయకవ్రతము.

40. అషాఢాది మాస చతుష్టయమునందు మహా (ఆ ఋతువునందు లభించు) ఫలములను విడిచి కార్తీకమున ఆ ఫలముల బంగారు ప్రతిమలు చేయించి వాటిని రెండు పాడి ఆవులను విప్రులకు దానమీయవలెను. ఇది విష్ణులోకఫలప్రదమగు కాలవ్రతము.

41. హేమంతఋతువు మొదలుగ సంవత్సరకాలము సప్తములందు ఉపవసించుచు సంవత్సరాంతమున హేమంతమునందు యథాశక్తిగ బంగారు కమలమును గోవును ఉదకుంభమును దానమీయవలెను. ఇది సూర్యలోకఫలప్రదమగు సౌరవ్రతము.

42. పండ్రెండు ద్వాదశుల యందు ఉపవసించి కడపట గోవస్త్ర కాంచనములతో విప్రుల నర్చించవలెను. ఇది పరమప్రదమగు విష్ణువ్రతము.

43. కార్తీక మాసమున వృషోత్సర్గము చేసి నక్తవ్రతము పాటించవలెను. దీనిచే శివస్థాన ప్రాప్తుడగును. ఇది వృష వ్రతము.

44. చాంద్రాయణమువంటి కృచ్ఛ్రవ్రతము పాటించి కడపట గోదానము చేసి యథాశక్తిగా విప్రులకు భోజనము పెట్టించి తానును భుజించవలయును. ఇది ప్రాజాపత్య వ్రతము.

45. చతుర్దశీ తిథులందు ఏడాదిపాటు నక్తవ్రతము పాటించి కడపట గోవులను, ధనమును దానమిచ్చినచో శివపదప్రాప్తుడగును. ఇది త్రైయంబక వ్రతము.

46. ఏడు దినములపాటు ఉపవాసముండి కడపట విప్రునకు ఘృతకుంభమును దానమీయ వలెను. ఇది బ్రహ్మలోక ఫలప్రదమగు ఘృతవ్రతము.

47. ఏడాదిపాటు దర్భలపై శయనించుచు కడపట సువర్ణమును పాడియావును దానమీయ వలెను. దీనిచే కల్పకాలము ఇంద్రలోకమున సుఖించును. ఇది ఇంద్రవ్రతము.

48. (ఏడాదిపాటు) తదియలందు అగ్నిపై ఉడుకని ఆహారము తినుచు కడపట గోదానము చేసినచో పునరావృత్తి రహిత శివలోకప్రాప్తుడగును. ఇది మహానందకరమగు శివవ్రతము.

49. రెండు పలములకు తగ్గని బంగారుతో రథమును రెండు గుర్రములను చేయించి దానమిచ్చి అనాడుపవసించినచో నూరు కల్పములు స్వర్గమున వసించి కల్పాంతమున సృష్ట్యాది యందు చక్రవర్తియై పుట్టును. ఇది అశ్వవ్రతము.

50. బంగారు రథమును రెండు ఏనుగులను రెండు పలములకు తక్కువకాని బంగారముతో చేయించి దానమిచ్చి ఆనాడు ఉపవాస ముండవలెను. దీనిచే సత్యలోక ప్రాప్తుడై కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది కరివ్రతము.

51. సంవత్సరముపాటు (ఏక భుక్తముతోగాని నక్తముతోగాని) ఉపవసించి సంవత్సరాంతమున గోదానము చేయవలెను. దీనిచే యక్షాధిపతిత్వము లభించును. ఇది నిర్దుఃఖ వ్రతము. సంవత్సరముపాటు చేయు వ్రతముల విషయమున ఆ ఏడాది నడుమ అధిక మాసము వచ్చినచో దానిని పండ్రెండు మాసములలోని దానినిగా లెక్కించరాదు.

52. ఒక రేయి అంతయు నీటియందు గడపి ఆ రాత్రి గడచిన తరువాత ఉదయమున గోదానము చేయవలెను. దీనిచే వరుణులోక ప్రాప్తుడగును. ఇది వరుణ వ్రతము.

53. (నెలపాటు) చాంద్రాయణ వ్రతము జరిపి వ్రతాంతమున బంగారు చంద్రుని దానమీయ వలెను. చంద్రలోక ప్రాప్తిఫలమునిచ్చు ఇది చంద్రవ్రతము.

54. జ్యేష్ట శుక్లమున అష్టమీ చతుర్దశులందు పగలు పంచతపస్కుడై (నాలుగు వైపుల అగ్నియు పైని రవియు వెలుగుచుండ నడుమ నిలిచి) సాయంకాలమున గోదానము చేయవలెను. ఇది రుద్రవ్రతము; దీనిచే స్వర్గప్రాప్తియగును.

55. ఏడాదిపాటు ప్రతి తదియనాడు చాందినీ నిర్మింపజేసి వ్రతాంతమున గోదానము చేయవలెను. భవానీ లోక ప్రాప్తి కలిగించు ఇది భవానీ వ్రతము.

56. మాఘ శుక్ల సప్తమి రాత్రి అంతయు తడిబట్టలతో ఉండి గడపి మరునాడు గోదానము చేయవలెను. స్వర్గమున కల్పముపాటుండి కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది స్నాపక వ్రతము.

57. ఒకనాడు ఉపవసించి ఆనాటి మూడు సంధ్యలయందును భూషణములతో దంపతుల నర్చించవలెను. దీనిచే ముక్తి లభించును. ఇది ఇంద్రవ్రతము.

58. ప్రతి శుక్ల ద్వితీయనాడు చంద్రునుద్దేశించి ఏడాదిపాటు లవణ పాత్రను దానమిచ్చుచు కడపట విప్రునకు గోదానము చేసినచో శివలోక ప్రాప్తుడగును. కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది సోమవ్రతము.

59. ఏడాదిపాటు పాడ్యమ తిథులయందు ఏకభుక్తముచేయుచు కడపట పది ఆవులను గోదానము చేసినచో అగ్నిలోక ప్రాప్తుడగును. ఇది వైశ్వానర వ్రతము.

60. ఏడాదిపాటు ప్రతి దశమినాడును ఏకభుక్తము చేయుచు కడపట పది గోవులను బంగారుతో చేసిన దానిని దశదిశలను దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు రుద్రులను ద్విజోత్తములను అర్చించవలెను. ఇది మహా పాతకనాశనమగు విప్ర వ్రతము.

సర్వోత్తమమగు ఈ షష్టి వ్రతకల్పమును వినినను చదివినను నూరు మన్వంతరముల కాలము గంధర్వాధి పతియగును. నారదా! ఇది పుణ్యకరము; విశ్వజన వంద్యము; వినగోరిన బ్రాహ్మణులకును ఇతరులకును కూడ దీనిని వినిపింపుము. నీకు ఈ విషయము చెప్పవలసిన పని ఏమున్నది?