దేవాలయ, ప్రాసాద వాస్తు శాంతి

ఋషులు సూతునిట్లడిగిరి, సూతా! అభ్యుదయమును కోరువాడు ఎటువంటి ప్రాసాదము అనగా దేవాలయములను నిర్మించవలయును? ఆలయముల ప్రమాణము (కొలతల)ను లక్షణమును విస్తరించి మాకిప్పుడు తెలుపుము అన సూతుడు ఇట్లు పలికెను. మీరు జిజ్ఞాసువులయి యున్నారు. కావున ఇపుడిక ప్రాసాద (దేవగృహ) విధాన నిర్ణయక్రమమును తెలిపెదను. ‘వాస్తు’ ను లెస్సగా పరీక్షించిన తరువాత వాస్తు పురుషుని దేహ స్వరూపమును అతని ఆయా అవయవముల స్థానములను బాగుగ ఎరిగినవాడై సమిధల (తోడి హోమము) తోను బలి ప్రధాన కార్యముతోను వాస్తుశాంతి జరుపవలయును; ఈ విషయములను బాగుగ ఎరిగి యజమానుడు జీర్ణ గృహాలయాదుల ఉద్గార కార్యములందును ఉద్యాన-గృహ నివేశన నిర్మాణ-నూతన ప్రాసాద (దేవాలయ-రాజభవన) నిర్మాణ-ప్రాసాద పరివర్తన- ద్వారాభివర్తన - ప్రాసాద సంబంధ్యుపవన నిర్మాణాది సందర్భములయందు ఆ కార్యారంభమునకు ముందుగానే వాస్తుశాంతిని జరుపవలయును.

‘వాస్తు’ అనగా గృహప్రాసాదాది నిర్మాణమునకో, వాని ఉద్దారమునకో ఉపయోగించు స్థలము అని అర్థము. ‘వాస్తు’ మధ్యమునందు పిండులతో ఏకాశీతి పదవాస్తు రూపమునువ్రాసి ఆస్థలమందే మూడు మేఖలలతో ఆవరింపబడిన హస్త ప్రమాణక (ఒక మూర-లోతు వెడల్పు పొడవులుకల) కుండమందు యవలు కృష్ణతిలలు క్షీరవృక్షములనుండి ఉత్పన్నములయిన సమిధలు పాలాశ ఖాదిర (చండ్ర) సమిధలు కుశలు దూర్వలు పంచబిల్వ ఫలములు బిల్వ బీజములు - ఇవి తేనెతో నేతితో తడిపి వానితో హోమము జరుపవలెను; హోమము ముగిసిన తరువాత వాస్తు ప్రదేశమునందు భక్ష్యభోజ్యములతో బలిని వాస్తుపురుషాది దేవతలకు ఉపహారమును ఈయవలెను; తరువాత ఈవిధముగా క్రమమున విశేష నైవేద్య మర్పించవలయును.

1. ఈశాన్యమున ‘శిఖి’కి ఘృతాన్నమును- ఇట్లే ప్రదక్షిణ క్రమమున, 2. పర్జన్యునకు మృతఫలయుక్తాన్నమును, 3. జయంతునకు పీతధ్వజములను పిష్టముతో చేసిన కూర్మమును, 4. ఇంద్రునకు పంచరత్నములను పిష్ట వజ్రమును, 5. సూర్యునకు వితానకము (మేల్కట్టు)ను ధూమ్రవర్ణపు సక్తువును, 6. సత్యునకు నేతి గోధూమాన్నమును, 7. భృశునకు మత్స్యమును,

8. ఆకాశునకు చక్కిలములను, 9. వాయువునకు సక్తువులను, 10. వూషునకు లాజములను, 11. వితథునకు శనగలతో వండిన అన్నమును, 12. గంధర్వునకు గంధాన్నమును, 13. భృంగరాజునకు ఆడుతుమ్మెదను, 14. గృహ క్షతునకు తేనె అన్నమును, 15. యమునకు మాంసాన్నమును, 16. మృగునకు యావక (పాలతో గోధుమ రవ్వతో వండిన యన్నమును, 17. పితరులకు పులగమును, 18. దౌవారికునకు దంతకాష్టమును పిండితో చేసిన నల్లని వన్నెగల బలియును, 19. సుగ్రీవునకు పూరికను, 20. పుష్పదంతునకు పాయసమును, 21. వరుణునకు దర్భ దుబ్బుతో కూడిన బంగరు పద్మమును, 22. అసురునకు పిండిని మద్యమును, 23. శో(శే)షునకు ఘృతాన్నమును, 24. పాపయక్ష్మునకు ఘృతాన్నమును, 25. రోగునకు నేతి లడ్డులను, 26. నాగునకు పుష్పములను ఫలములను, 27. ముఖ్యునకు భక్ష్యమును, 28. భల్లాటునకు ముద్గాన్నమును, 29. సోమునకు ఘృతపాయసమును, 30. భగునకు శాలి ధాన్యపు పిష్టమును, 31. అదితికి పూరికలను, 32. దితికి ఒకేఒక పూరికను అని ఇట్లు బహిఃపదముల యందు ఈయవలసిన బలిక్రమము. ఇక అంతర పదములందు ఈయవలసిన బలిక్రమము; 33. అపునకు క్షీరమును, 34. అవవత్సునకు దధిని, 35. సావిత్రునకు ఒక లడ్డును మిరియాలతో సంస్కరించినదియు దర్భ యుక్తమునగు అన్నమును, 36. సవితకు బెల్లపు అప్పములను, 37. జయునకు నేతిని చందనమును, 38. వివస్వంతునకు రక్తచందనమును పాయసమును, 39. ఇంద్రునకు నేతి అన్నమును, హరితాళమును, 40. మిత్రునకు ఘృతాన్నమును, 41. రుద్రునకు ఘృతపాయ సమును, 42. రాజయక్షునకు ఆమ (పచ్చి) పక్వమాంసములను, 43. పృథ్వీధరునకు కూశ్మాండములను మాంసమును, 44. ఆర్యమునకు శర్కరాపాయసమును, 45. బ్రహ్మకు పంచగవ్యమును యవలను తిలలతో అక్షతలతో నిండిన చరువును వివిధ భక్ష్యభోజ్యములను నివేదించవలయును. ఇట్లు సంపూజితులయి దేవతలు ఎల్లప్పుడును శాంతిని కల్గింతురు.

ఎల్లరకును బంగారమును బ్రాహ్మణున(ల)కు పాడియావును ఈయవలయును. రాక్షసీ జనమునకు ఎటువంటి బలినీయవలయునో తెలిపెదను వినుము. 1. ఈశానదిశయందలి ‘చరకి’ కి మాంసాన్నమును నేతిని పద్మకేసరమును రక్తమును, 2. ఆగ్నేయమునందలి ‘విదారి’కి మత్స్యాన్నమును రక్తమును మరిద్రాన్నమును, 3. నైరృతమునందలి ‘పూతన’కు దధ్యాన్నమును రక్తమును అస్థిఖండములును, 4. వాయవ్యమందలి ‘పాపరాక్షసి’కి మత్స్యమాంసమును సురా అసవమును గాని, పాయసమునుగాని ఆయా దేవతల నామముల నుచ్చరించుచు (ఆ నామమును చతుర్థీ విభక్త్యంతముగా మార్చి) ప్రణవాదిగా ‘నమః’ శబ్దము చివరకు వచ్చునట్లుగా పలుకుచు ఈయవలెను; తరువాత యజమానుడు సర్వౌషధీ స్నానమును జరిపించుకొనవలయును; ద్విజులను ఇంటికి వచ్చిన ఇతరులను భక్తితో సంపూజించవలయును, ఈ విధమగు ‘వాస్తు శాంతిని’ జరిపిన తరువాతనే గృహ ప్రాసాది నిర్మాణాది కార్యము నారంభించవలయును.

ప్రాసాదములు భవనములు ఉద్యానములు ఆరంభము చేయునపుడును ముగించునపుడును పురప్రవేశాదులందును సర్వదోష పరిహారమునకై రక్షోఘ్న (రాక్షసబాధానివారకమగు) పవమానసూక్త పారాయణముతో కూడ భవనాది నిర్మాణ జీర్ణోద్ధారాది కార్యములను ఉద్దేశించి నృత్య మంగళవాద్యాదికము జరుపవలయును; బ్రాహ్మణులచే స్వస్తివాచనము జరిపించవలయును; దీని నెరిగి ప్రతిసంవత్సర మందును ఈ విధానముతో గృహమందు గాని దేవాలయమునందుగాని వాస్తు శాంతిని జరిపించుకొనువానికి దుఃఖములు ఏవియు కలుగవు. అతనికి వ్యాధి భయ-బంధు జనక్షయములు కలుగవు; అతడు సమగ్రముగ నూరేండ్లు జీవించును, కల్పకాలము స్వర్గ సుఖమందును.