ఐలుడు పితరులను తృప్తుల జేయుట

ఇలా పుత్రుడగు పురూరవసుడు ప్రతి మాసమున అమావాస్యనాడు స్వర్గమునకేగి తన పితరులకు తృప్తిచేయు విధము తెలుపుమని ఋషులు సూతు నడిగిరి. పూర్వము మనువు ఇదే ప్రశ్న మడుగగా మత్స్యనారాయణు డతనికి ఈ విషయమును పురూరవసుని ప్రభావమును చెప్పెను. అదియే నేనిపుడు మీకు తెలిపెదనని సూతుడు ఋషులకిట్లు చెప్ప నారంభించెను. పురూరవసుడు ప్రతి మాసమున స్వర్గమునకేగి సోమునితో కూడి అతని నుండి అమృతమును సంపాదించి తన పితరులకు తృప్తి కలిగించును. అతనిచే తృప్తినందు పితరులు (సౌమ్యులు) బర్హిషదులు కావ్యులు అగ్ని ష్వాత్తులునను వర్గములవారు. అమావాస్యనాడు స్వర్గమున సూర్య చంద్రులిద్దరు ఒకేరాత్రి ఒకే నక్షత్రమున ఒకటిగా ఏకమండలము (భాగ)లో కూడియుండు సమయమున పురూరవసుడుపోయి సూర్యచంద్రులను దర్శించును. అట్టి అమావాస్య నాడతడు స్వర్గమున కేగి తన మాతామహులు పితామహులునగు రవిచంద్రులను దర్శించి నమస్కరించి తగిన సమయమున కెదురు చూచుచుండును. అతడు సోముని నుండి క్షణము కూడ ఎటు కదలక తన పితరుల తృప్తిపరచుటకై పరిశ్రమము చేయుచుండును. అతడు శాస్త్రమును సంప్ర దాయమును ఎరిగిన విద్వాంసుడు కావున అమావాస్యనాడు తన పితరులకు శ్రాద్ధము చేయగోరి తన పితరులను సోమునికూడ ఇట్లు సేవించును. అమావాస్యనాడు చంద్రరేఖకొంచెమైన కనబడుచో అది ‘సినీవాలి’- కనబడనిచో అది ‘కుహూ’- అనబడును. పురూరవసుడు ‘సినీవాలి’ ని విడిచి ‘కుహూ’ యందలి బలముకల ద్విలవ పరిమాణ పర్వసంధి కాలమునకై కనిపెట్టుకొని యుండును. ఆ సమయమున సోమునినుండి లభించు సుధ పితరులకు తృప్తికలిగించునుకదా! ఏలయన కృష్ణపక్షమున చంద్రుని నుండి లభించు పదునైదు పరిస్రవముల (ప్రవాహ భేదముల)తో కూడిన చంద్రుని ఉత్తమ కిరణములతో పితరులకు తృప్తి కలుగును. అది ఎరిగిన పురూరవసుడు సోమునినుండి అమావాస్య నాడు కుహూ క్షణములందు లభించు అమృతము స్రవించుచుండగనే దానిని తానందుకొని తన పితరులకందించి తృప్తి నొందించుచుండును. దీనిచే తృప్తి నొందుదురని తెలిపిన సౌమ్యులు అగు బర్హిషదులు కావ్యులు అగ్ని ష్వాత్తులునను పితృవర్గముల విషయము తెలిపెదను.

విప్రులు-వేదములచే ప్రతిపాదింపబడిన సకల విషయములను తాత్త్వికముగా ఎరిగిన వారు–అగ్నిని ‘ఋతువు’ అని వ్యవహరింతురు. వారే సంవత్సరమును కూడ ఋతువు అనియే తలంచుచున్నారు. (కావున సంవత్సరావ యవములగు పక్షములు-మాసములు-రెండేసి మాసములతో ఏర్పడు కాలపరిమాణము-అయనములు - కూడ ‘ఋతువు’ అనదగియున్నవి.) పితరులు ఋతువులనుండి జనించినవారు కావున వారికి ‘ఆర్తవులు’ అనియు సంప్రదాయము నందు వ్యవహారము. పితృ-పితామహ-ప్రపితామహులు అను మూడు తరములకు చెందిన పితరులకు అభిమాని దేవతలగు పితృదేవతలలో - పితృశ్రేణికి చెందినవారు సంవత్సరావ యవము లగు పక్షముల నుండి జనించినారు. పితామహ శ్రేణికి చెందిన పితృదేవతలు ‘అష్టకలు’ అనబడు పర్వకాలముతో కూడిన మాసము అనెడు సంవత్స రావయవముల నుండి జన్మించినవారు. ప్రపితామహ శ్రేణికి చెందిన పితృదేవతలు పంచాబ్దా (పంచ సంవత్సరా)త్మకుడగు బ్రహ్మకు (ప్రజాపతికి) కుమారులు.

సౌమ్యులు అను సామాన్య నామముకల 1. కావ్యులు, 2. బర్హిషదులు; 3. అగ్నిష్వాత్తులు అను మూడు వర్గముల పితరులు పైని పేర్కొనబడినారుగదా! వారి స్వరూపము చెప్పబడుచున్నది.

‘గృహస్థులుగా నుండి హవిర్యజ్ఞములతో ఋతురూప (సంవత్సరాత్మక) ప్రజాపతిని యజించిన యజ్వలగు మహాత్ములు ‘బర్హిషదులు’ అను వర్గమునకు చెంది అమూర్త పితృదేవతలు అని శాస్త్రములందు స్మరింపబడుచున్నారు’ అని ఈపురాణమునందు గడచిన అధ్యాయములందు ఈ శబ్దపు నిర్వచనముతో కూడ నిశ్చయింపబడియున్నది. ఇదేవిధముగ యజ్వలుగా నుండిన గృహమేధులే అగ్నిష్వాత్తు లనబడు అమూర్త పితృదేవతా వర్గము వారు కూడను. ‘అష్టకలు’ మొదలగు పర్వదినము లందు మానవులలో చతుర్వర్ణులచే జరుపబడు శ్రాద్ధములను అనుభ వించుచు వాటికి పతులుగా-అధిష్ఠాతలుగా-ఉండు మూర్త పితృదేవతా వర్గముల సమిష్టియగు వారు కావ్యులు.

ఇక ఇప్పుడు ప్రపితామహ శ్రేణికి చెందిన పితరులకు జన్మహేతువగు ప్రజాపతి రూప పంచాబ్ద (పంచ సంవత్సర) స్వరూపమును తెలిపెదను; వినుడు. పంచ సంవత్సరాత్మకమగు (యుగమునకు అవయవములగు ఐదు అబ్దములను వివరింతును. వానిలో మొదటిదగు 1. ‘సంవత్సరము’ అగ్నిదేవతాత్మకము; 2. రెండవదియగు ‘పరివత్సరము’ సూర్యదేవతా రూపము; 3. మూడవది యగు ‘ఇద్వత్సరము’ సోమాత్మకము; 4. నాలుగవదియగు ‘అనువత్సరము’ వాయుదేవ తాత్మకము; 5. ఐదవదియగు ‘వత్సరము’ రుద్ర దేవతాత్మకము) ఈ ఐదింటితో ఏర్పడినదగు పంచ సంవత్సరమయ ‘యుగము’ సాక్షాత్ కాలాత్మక ప్రజాపతియే.

ఇట్లు సోముడు ప్రతి మాసమునందును చంద్రుడు విశేష రూపమున స్రవించు అమృతము సోముని నుండి లభించు స్వధామృతమును మాత్రమే అనుభవించుటచే తృప్తినందు పితరులకు ఆహారమగుచున్నది. దానిచేతనే వారికి సోమపులనియు వ్యవహారము. ఈ సోమా మృతమునకు అమృతమనియు సోమమనియు మధువనియు పేరులు కలవు. పితరులు సోమ పానముచేసిన తరువాత అమృత శూన్యుడై పోయిన చంద్రుని సూర్యుడు తన సుషుమ్నయను కిరణముతో మరల పూరించును. ఇట్లు దినదిన క్రమమున చంద్రుని ‘కల’లన్నియు శుక్లపక్షమున పూర్ణముల గుచు పోవుచుండును. కృష్ణపక్షమున క్షీణములగుచు పోవును. ఈ చెప్పిన విధమున చంద్రుని శరీరము సూర్యుని వీర్యముతో నింపబడుచుండును. క్రమవృద్ధితో పూర్ణిమాతిథినాడు చంద్ర మండలము షోడశ కళలతో నిండి అతడు సంపూర్ణమండలుడై యుండును. ఇచట ఇదియొక చమత్కారము: ఏమన–కృష్ణపక్షమున పితరులు చంద్రుని పానము చేయ(త్రావ)గా శుక్లపక్షమున ప్రతిపదాదిగా రవియు చంద్ర మండలమును పానము చేయును. (వ్యాపించును; పానము అనగా ఇచట ఈరెండర్థములు సంప్రదాయమున వచ్చినవి.) ఇదేవిధముగా శుక్లపక్షము నందును కృష్ణపక్షమునందును చంద్రుడు వృద్ధినొందుచునే యుండును. (ఇచట వృద్ధియను మాటకు గూడ రెండర్థములు. శరీరము బలియుట ఒకవిధమగు వృద్ధి తాను అమృతము నిచ్చి పితరులకు శరీరపుష్టి కలిగించుట మరియొక విధమగు వృద్ధి. వృద్ధి=శుభము) ఈ కారణముల తోనే సోమునకు ‘పితృమాన్-పితరులు కలవాడు (పితరులను పోషించువాడు) అనియు ‘సుధాత్మకుడు (అమృతము తన ఆత్మ-దేహము-గా కలవాడు) అనియు పేరులు కలిగినవి. అతడిట్లు తననుండి స్రవించు అమృత ప్రవాహముతో పంచదశ తిథులందును కాంతుడు - చూచువారికి ఇంపు కలిగించువాడు-గానే యుండును. (శుక్లపక్షమున మండలము పూర్ణమగు చుండుటచేత మానవులకును-తమకు ఇతనినుండి అమృతము లభించును గదాయని పితరు లకును - చంద్రుడు ఇంపుగొలుపును. అట్లే కృష్ణ పక్షమున పితరులకు అతడు చేసిన ఉపకారమును బట్టి మానవులకును పితరులకును చంద్రుని చూడగానే ఆనందము కలుగును.)

ఇకమీదట పర్వ సంధుల విషయము తెలిపెదను. చెరకు గడలకును వెదురు గడలకును కలకణుపులకు ముడులు ఉన్నట్లే సంవత్సరమునకును అయనములు ఋతువులు మాసములు అర్ధ మాసములు తిథులు మొదలగునవియు కణుపులుగాను ఆ(పర్వముల) కణుపుల నడుమ వాటిని కలుపుచునుండు సంధికాలము ఆకణుపుల ముడులుగా నమరియున్నవి. పూర్ణ (శుక్ల) కృష్ణపక్షాత్మకమగు మాసమునకు శుక్ల కృష్ణ పక్షములు కణుపులును వాటి సంధి కాలములు (పూర్ణిమా మావాస్యలు) ముడులునైనట్లే పక్షములకును ప్రతిపత్ మొదలు పూర్ణిమామావాస్యల వరకుగల (విదియ మొదలగు ) కాలము కణుపులును పూర్ణిమకును కృష్ణ ప్రతిపతులను అమా వాస్యకును శుక్ల ప్రతిపత్కును నడుమగల కాలము గ్రంథులు (ముడులు)ను అగుచున్నవి. (వెదురు-చెరకు-మొదలగువానియందు ముడులవలె నుండు కఠినభాగము గ్రంథి-ఆ గ్రంథులకు రెంటికి నడుమ నుండు భాగము పర్వము-కణుపు) ఇట్టి పర్వముల సంధి కాలము లందు అగ్న్యా ధానము మొదలగు కర్మములు నాచరించ వలయును. పూర్ణిమనాటి సాయాహ్న కాల మందలి రెండు లవముల కాలము ‘అనుమతి’ అదే నాటి అపరాహ్ణపు రెండు లవములకాలము ‘రాకా’ అనబడును. కృష్ణ ప్రతిపత్నాటి అపరాహ్ణము గడచి సాయాహ్నము అరంభమగు సమయము పౌర్ణమాసేప్టికి సముచిత సమయము. ఏ పూర్ణిమనాడు రవి క్రాంతివృత్తమున సంపాత స్థానమందుండగా చంద్రుడు రవినుండి ఆరు రాసులు దూరములో విషువద్వృత్త సంధిస్థానము నందుండి అతనిని చూచుచుండునో ఆ కాలమును కృష్ణ ప్రతిపత్ ఆరంభము కాకుండు నంతలో సూర్యుని గతిని అనుసరించి గణనచేసి తెలిసికొన వలెను. సరిగా అసమయము వషట్కార సహితమగు శ్రౌతస్మార్త సత్కర్మాను ష్ఠానమునకు తగిన సమయము.

దీనినే షష్ఠకాలము అనియు పిలుతురు, రవి కిరణములలో నొకటగు సుషుమ్నా కిరణముతో పూరింపబడుచుండు అమృతము కల చంద్రుడు పూర్ణిమనాటి అర్ధరాత్ర సమయమున నిండుగా అమృతము కలిగియుండును. అందుచే అతిథికి ‘పూర్ణిమా’ ‘నిండుదనము గలది’ అని పేరు. ఆ అమృతముతోనే అనాడు చంద్రుడు ప్రాణులకును అప్యాయనము (పరితృప్తి) కలిగించును. అనాడు చంద్రుడును రవియును పగలు అపరాష్ట్ర సమయమున క్రాంతి వృత్త విషువ వృత్తముల సంపాత ప్రదేశమందుండి పరస్పరము నిండు చూపుతో (పూర్ణ దృష్టితో) చూచుకొందురు. అందుచే గూడ ఈ తిథికి పూర్ణిమాయని పేరు. ఇట్టి పూర్ణిమా తిథిని పితరులును దేవతలును అనుమతింతురు కావున దీనికి అనుమతి యనియు వ్యవహారము. ఈనాడు చంద్రుడు మిక్కిలిగా (మేర మీరి) రాజిల్లును కావునను ప్రాణులను అతడు రంజిల్ల (ఆనందింప)జేయును గావునను ఈ విధమగు పూర్ణిమకు ‘రాకా’ అనియు నామము. చంద్రసూర్యులు కలిసి (అమా-కలిసి) ఉండు తిథికి అమావాస్య (అమా-కూడి ఒకటిగా, వసతః-వసింతురు) అని వ్యవహారము. ఈ అమావాస్యనాడు చంద్రసూర్యులు ఒకేచోట కూడి దర్శనము ఇత్తురు. కావున ఈ తిథికి దర్శ’ అనియు పేరు కలిగినది. పూర్ణిమా-కృష్ణ ప్రతిపత్లకు నడుమ కాని అమావాస్యా -శుక్ల ప్రతి పత్లకు నడుమకాని ఉండు సంధికాలము రెండు లవముల పరిమాణముతో నుండును. ఇది కోకిల ‘కుహూ’ అని రెండక్షరములు పలికినంత కాలమే; కనుక అమావాస్యనాటి ఇట్టి పర్వ సంధి కాలమును ‘కుహూ’ అందురు. (ఇది వింతగా కనబడు అర్థము. వాస్తవమున ఈ ‘కుహూ’ పదము ‘గుహూ’ పదమునుండి మారినది; అనగా చంద్రకళ పూర్తిగా మరుగుపడి కొంచెము కూడ అనాడు కనబడదని అర్థము.) ఇది శ్రౌత కర్మలకు తగిన పర్వకాలము.

అమావాస్యనాడు వలెనే ఇతర తిథులందును పర్వ సంధికాలము రెండు లవముల పాటే యుండును. ఇదియు ‘కుహూ’ అను కోకిల కూతయంత కాలమే యగును. ఏనాడు మధ్యాహ్న సమయమున అమావాస్య ఆరంభమగునో ఆనాడు చంద్రు డుదయించవలసిన వేళకే అతనితో పాటు కలిసి సూర్యుడును ఉదయించుచుండును; కనుక చంద్రునిలో మిగిలిన ఒకకళకూడ కనబడదు. కావున ఆ అమావాస్యను ‘నష్టచంద్రా’ ‘చంద్రుడు కనబడనిది’ అందురు. ఇదియే వాస్తవమయిన ‘కుహూ’ అగును. అమరునాడు మధ్యాహ్నసమయము మీదట చంద్రుడు రవినుండి వేరుపడుట ఆరంభమగును. అట్టి పర్వ సంధికాలము (అమావాస్య ముగిసి ప్రతిపత్ ఆరంభమగు సమయము) ‘అన్వాహుతులు’ అను శ్రౌత కర్మలకును ‘దర్శ’యందు చేయదగిన వషట్కార (శ్రౌత) కర్మలకును సముచిత సమయము. ఇట్టి అమావాస్య నాటి పర్వ సమయమునకు ‘ఋతుముఖ మని వ్యవహారము. ఇట్లు అనాడు చంద్రుడు ఒక్క కళ కూడ బొత్తుగా కనబడకుండ పోవు అఅమావాస్య శుక్ల పక్షారంభమగు మధ్యాహ్న కాలము వరకు ఉండి ఆ సమయపు రవి అమావాస్యకు చెందిన రవిగా గ్రహింపబడును. కావున అది శ్రౌత కర్మానుష్ఠానమునకు ప్రశస్త కాలము. పర్వ (అమావాస్యా) శుక్ల ప్రతిపత్ సంధి కాలములో సరిగి రెండు లవముల (కోకిల ‘కుహూ’ అని పలుకునంత) కాలము సరియగు కుహూ అని గ్రహించవలయును. క్షీణించినంత క్షీణించినను మిగిలిన చంద్రకళ ఎంతసేపు కనబడునో అంతకాలము అ అమావాస్య ‘సినీవాలీ’ అనబడును. అట్టి అమావాస్యతో రవికి సంబంధ ముండుటచే అ తిథికి ఈ పేరు వచ్చినది. (‘సిని’ అనగా చంద్రుడు; అతనితో సంబంధము గల తిథి ‘సినీవాలీ’) ఈ విధముగా ‘కుహూ’ అను రెండక్షరముల ఉచ్చారణ కాలము అగు ద్వి లవముల కాలమే అనుమతి-రాకా-సినీవాలి – కుహూ-అను నాలుగు పర్వ సంధులకును కాలపరిమితి అని తెలియవలెను. పర్వకాలముల పరిమితి వలెనే వాటిని ఆశ్రయించి చేయవలసిన ఆహుతి-వషట్కార పూర్వక శ్రౌతకర్మల-కాల పరిమితియు సమానముగా నుండును. చంద్ర సూర్యులకు వ్యతీపాతము సంభ వించుట (క్రాంతివృత్త విషువవృత్త సంపాతము లందు ఇద్దరును 180 భాగల దూరమందుండి పరస్పరము చూచుకొనుట) చేతనే రాకా- అనుమతి- అను రెండు విధములగు పూర్ణిమలును ఏర్పడుచున్నవి. అట్లే పూర్ణిమా కృష్ణ ప్రతిపత్ల పర్వ సంధికాలముకూడ ద్వి లవపరిమితమే. కుహూ- సినీవాలీ - అను రెండు పర్వముల కాల పరిమితియు ద్వి లవములే. చంద్ర సూర్యాదుల తేజః కళల సంబంధము చేతనే పర్వ సమయములు ఏర్పడును. కావున సూర్యాగ్ని తేజః కళా సంబంధముగల చంద్రునికళలును పర్వకాలములందు అందుల కనుగుణముగా అగ్ని సూర్యుల సంబంధానుసార ముందును. (అందుచేతనే చంద్ర సంబంధముపై ఆధారపడి ఏర్పడు పర్వ దినములు శ్రౌత కర్మలకు ప్రశస్తము లనబడును.) సోముడు దినమున కొక కలవంతున కలా పూర్తి నొందుచు పూర్ణిమనాడు పదునైదు కళలు కలవాడగును. (ఇదికాక అతనియందు ఎప్పుడును (సదా) తరుగక పెరుగక యుండుపదునారవ కళయొకటి (సాదా) కలదు అది వృద్ధిక్షయములలో పాలుపంచుకొనదు.) కావున నేను పంచదశ కళలతోనే చంద్రుడు వృద్ధి క్షయములకు పాలు పడునని చెప్పితిని. సోమపులు (సోముని అమృతమును త్రావువారు) ‘సోమవర్దనాః’ (సోమునిచే వృద్ధి నొందుచు సోముని కూడ వృద్ధి ఒందించువారు) అనబడు పితరులనబడు దేవతల విషయము ఇట్లుండును. వీరికి ఋతువులు-ఆర్తవులు అనియు వ్యవహారము కలదనియు వీరిని (ఆజాన-కర్మ) దేవతలు కూడ కర్మానుష్ఠానమున భావన చేయుచుందురనియు ఎరుగ వలయును. ఇకమీదట శ్రాద్ధములను అనుభవించు పితృదేవతలు ఎవరో-వారి గతులు (వారి ఆశ్రయ స్థానములును ప్రవృత్తులును) ఎట్టివో లోకమందలి ఆయా వర్ణములవారు ఇచ్చు శ్రాద్ధములు వారికెట్లు అందునో తెలిపెదను; వినుము. ఏలయన ప్రాణులు మృతులైన తరువాత ఆ జీవుల గతి-లోకములందు వారెచ్చట సంచరించుచుందురో- మరల వారెట్లు ఈలోకములో ఎక్కడకు వత్తురో తెలియుట (శాస్త్ర ప్రమాణముతోనే తప్ప) శక్యము కాదు.

మృతులైన జీవులు ఏ గతి కేగుదురను విషయమును ప్రసిద్ధమగు మహాతపస్సుతో కూడ తెలియుట సాధ్యము కాదనిన మాంస నిర్మితమగు కంటితో చూచి ప్రత్యక్ష ప్రమాణముతో తెలి యుట ఎట్లు సాధ్యమగును!

లౌకికులగు పితరులు (శ్రాద్ధము చేయు యజమానుని మృత పితృ పితామహ ప్రపితా మహాదులు) ద్యులోకవాసులగు పితృదేవతలను ఆశ్రయించి (వారి ద్వారమున) సద్గతిని పొందుదురు. వారు వారాచరించిన ధర్మపు సామర్థ్యముచే ద్యులోకవాసి దేవతలును పితృ దేవతలును ఈ లౌకిక పితృ పితామహ ప్రపితామహాది పితరులకు తమతోడి సాయుజ్యమునో తమ లోకమందు వీరి నివాసమునో అనుగ్రహించి సుఖింపజేయుదురు. ఈ లౌకిక పితరులు గాని వారిపుత్ర పౌత్రాది సంతతికాని తమతమ ఆశ్రమ ధర్మములను ఆయా కర్మానుష్ఠాన సంప్రదాయములను చక్కగా పాటించుచు వ్యవస్థానుసారము జీవించుటచే వీరికి పరలోకమున సద్గతి కలుగును. ఈ లౌకిక పితృ పితామహాదుల పుత్ర పౌత్రాదులు వీరి నుద్దేశించి శ్రద్ధాయుక్తు లయి కర్మల నాచరించుటచే గూడ ఈ లౌకిక పితరులకు సద్గతి కలుగును. బ్రహ్మచర్యము తపస్సు-యజ్ఞము ఆచరించుట -సత్సంతానమును కనుట - శ్రాద్ధ కర్మలను శ్రద్ధతో ఆచరించుట- విద్యాధ్యయనము చేయుట అన్నదానము చేయుట-ఇవి ఏడును లౌకిక పితరుల సద్గతికి హేతువులు. కావున దేహము పడిపోవు వరకును ఇవి విడువక ఆచరించుచుండవలయును. పితరుల యందు శ్రద్ధాభక్తులు గల తమ పుత్ర పౌత్రాదులను ఉపాసించి (ఆధారముగా చేసికొని) ఈ లౌకిక పితరులు లోగడ చెప్పిన సోమపులు-ఊష్మపులు అను పితృదేవతలతోను దేవతలతోను కూడి స్వర్గలోకమున మోదముతో నుందురు. సంతానవంతులగు ఈ లౌకిక పితరులు తమ పుత్ర పౌత్రాదులు చేయుశ్రాద్ధాది కర్మలతోను వారి వంశని బాంధవులు గాని ఇచ్చు తర్పణోదకము మొదలగు వానితోను వీరు జరుపు మాస శ్రాద్ధము మొదలు వానితోను తృప్తి చెంది సోముని అమృతము అందెడి లోకములలో ఆనందించుచుందురు. మాస శ్రాద్ధముల ననుభవించు అదృష్టముపట్టు మానవ (లౌకిక) పితరుల విషయము ఇది.

ఈ చెప్పిన విధమగు ఆచరణములతో తమ జీవితము గడుపక ఆయా పుణ్యాపుణ్య సంమిశ్రమగు సంకీర్ణ కర్మములను (శాస్త్రవిధి నిషేధములను పట్టించుకొనక తమకు తోచినట్లు చేయు కర్మలు సంకీర్ణ కర్మములు) ఆచరించుచు దానిచే లభించు ఆయా వివిధ జన్మములందును తమ వర్ణాశ్రమ ధర్మములను శాస్త్రానుసారము పాటించక భ్రష్టులై స్వాహా - స్వధాకారములతో దేవపితృ కర్మములు ఏవియు ఆచరించక జీవించినవారు తమ దేహము పోయిన తరువాత ప్రేత భూతులయి యముని లోకమునకు పోయి దురవస్థల పాలయి యాతనానుభవ స్థానమున కేగి తాము ఈలోకమున చేసిన ఆయాకర్మములను తలచుకొని పశ్చాత్తాపపడుచు శోకించుచు ఉందురు. అచ్చట వీరు పొడవగు దేహములతో రక్త మాంసములు లేక శుష్కించి గడ్డములు మీసములు తెగ పెరిగి వస్త్రములు లేక ఆకలి దప్పులతో బాధపడుచు యాతనా లోకములో అటుఇటు పరుగెత్తుచుందురు. ఆయా యాతనాస్థానములందు పడవేయబడుచు వారు యాతనల ననుభవింతురు. ఇతరులెవరైన అన్నము పెట్టుదురాయని పరాన్నములు కోరుచు నదులు సరస్సులు చెరువులు కోనేరులు (నీటికై) వెదకుచు పోయి పోయినచోటినుండి (యమదూతలచే) తరిమివేయబడుచు తిరుగుచుందురు. అచట వీరిని ఆ దూతలు శాల్మలి (ముండ్ల బూరుగు) వైతరణి (నెత్తురు-చీము మొదలగు కశ్మలముతో నిండిన నది) కుంభి-కారంభ వాలుకము-అసిపత్రవనము మొదలగు యాతనా స్థానములందు తమతమ కర్మానుసారము పడద్రోయ బడుదురు. వారచట ఎంతో దుఃఖమనుభవించుచు పండుకొనుటకు తావు దొరుకక బాధపడు చుందురు. ఇట్టివారు లోకాంతరములందు యాతనా స్థానములందు ఉన్నను వారి బాంధవులు ఈ లోకమందు ఈ ప్రేతల నామగోత్రముల నుచ్చరించుచు భూమిపయి దర్భలను పరచి మూడు పిండములను ఉంచగా అవి ఈ శ్రాద్ధకర్తృ యజమానుని పితృ పితామహ ప్రపితా మహులకు అంది వారికి తృప్తికలిగించును. ఒకవేళ ఈ శ్రాద్ధకర్తృ యజమానుని మృతలౌకిక పితరులు లోకాంతరము లందు యాతనా స్థానము లందుండక అచటి నుండి ఈవలకు పడి దేవాసుర మానవ తిర్యక్ స్థావర జన్మములు అను ఐదింటిలో దేనియందైన నున్నను స్వకర్మాను సారము స్థావర జన్మములందు భూతత్వ మాత్రమును సూచించుచు ఎంత క్షుద్ర జన్మమునందు, ఉన్నను తిర్యక్ (పశుపక్షి మృగ) జన్మములందలి నానా రూపములుగల యోనుల (జన్మముల)లో ఏయోని యందు ఏమూర్తితో నున్నను అందు ఆప్రాణి ఏఆహారమును తినునదియైనచో ఈ శ్రాద్ధకర్తృ యజమానుడు ఇచ్చిన శ్రాద్ధీయాహారము ఆ ఆహారముగా మారి అప్రాణిని తృప్తి నొందించును. అంతేకాక ఈప్రేతప్రాణి తనజీవితకాల మందు తానుకాని అతని పుత్ర పౌత్రాదులు ఇప్పుడు కాని తమన్యాయార్జిత ధనము నుండి సత్పాత్రము నందు శాస్త్ర విదిననుసరించి ఇచ్చిన దానపు ఫలముకూడ దేవతలచే గ్రహింప (అందుకొన)బడి అది వారిచే ఈ మృత ప్రేత ప్రాణికి -అ ప్రాణి ఏ జన్మమునందున్నను-అందజేయబడును. గోవులు తప్పిపోయి ఎచ్చట ఏవిధముగా నున్నను దూడ పోయి తన తల్లిని గుర్తించగలదు. అట్లే మంత్రము శ్రాద్ధ దానాది ఫలమును ఆ ప్రేత ప్రాణికి అందజేయును అను ఈ లౌకిక దృష్టాంతముతో ఇది శాస్త్రములందు చెప్పబడియున్నది.

ఇట్లు శ్రద్ధతో జరిపిన శ్రాద్ధము అవి కలము- సంపూర్ణము-సమగ్రము-అగునని మనువు చెప్పెను అని సనత్కుమారుడు తన దివ్యతపోమయ నేత్రముతో చూచి ప్రేతల గతాగతము లను వారికి శ్రాద్ధఫలములు అందు విధమును ఎరిగి చెప్పెను. ఈ పితృలోకస్థ పితరులకు (పితృదేవతలకు, లౌకిక పితరులకు కాదు) మానవుల కృష్ణపక్షము పగలుగా- శుక్లపక్షము రాత్రిగా అగును. ఇట్లు పితృదేవతలు-దేవతలు-(లౌకిక) పితరులు అను మూడు విధములగు వారి విషయమును చెప్పబడినది. పితృదేవతలును దేవతలును ద్యులోకమున వీరికివారును వారికివీరిని పరస్పరము పితరులుగా ఆరాధనలందుకొందురు. మనుష్య పితరులు లేదా లౌకిక పితరులు అనగా మానవలోకమునందలి శ్రాద్ధకర్తృ యజమానులు పితృపితామహ ప్రపితామహులు అని తెలియవలయును. సోమ పాయులగు (సోమునినుండి లభించు అమృత మును త్రావు) పితరుల విషయము ఇది; అన్ని శాస్త్రములందును ప్రవచింప బడిన దానిని నీకు చెప్పితిని. ఇదియంతయు పురాణమునందు పితృ మహత్త్వము (పితరుల గొప్పదనము) అను పేరుగల ప్రకరణమునందు చెప్పబడియున్నది.

ఇట్లు నీకు ఇచట ఇలాపుత్రుడగు పురూరవసుడు తన మాతామహుడగు సూర్యుని - పితామహుడగు చంద్రుని కలియుటయు శ్రద్ధాయుక్తుడై అతడచట శ్రాద్ధకాలమెరిగి ఆకాలమునకు వేచి యుండుటయు పితరుల నతడు తృప్తి నొందించుటయు పర్వకాల పరిమాణ స్వరూపమును మృతప్రేత ప్రాణుల యాతనాస్థాన స్థితిని నీకు సంక్షేపముగ తెలిపితిని. ఇది సనాతనము (నిత్యమును అతి ప్రాచీనమును) అగు సృష్టి వ్యవస్థా ప్రకారము. నీకు దీనియందు వైదుష్యము (సంపూర్ణ పాండిత్యము) కలుగునంత విస్తరముగకాక ఏకదేశము - అల్ఫాంశము-మాత్రము తెలిపితిని. ఇదియంతయు పరిసంఖ్యానము చేయుట (పరితః-సమగ్రముగా; సంఖ్యాయ- లెస్సగా ఎరిగి-ప్రతిపాదించుట) ఎట్టివారికిని శక్యముకాదు.