మహావిష్ణువు గ్రసనాసురుని చంపుట

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పసాగెను. దానవులు అతనిని చూచి క్రుద్ధులయి తమతమ బలములతో కూడి తేనెటీగలు తేనెను తెచ్చుటకై కదలిపోవునట్లు అన్నివైపులకును కదలిరి. నల్లని చామరముల సమూహముల రాసులును అమృతముతో చేసినట్లున్న దంతపు మొలకలును పలువన్నెల ఐదు పతాకలును కలిగి గండ స్థలపు అంచులనుండి మదము స్రవించుచు పర్వతమువలె నున్న దుర్దరమగు భయంకర గజము నారోహించి బలశాలి యగు నిమిదైత్యుడు హరివైపునకు పోయెను. ఆతని గజమును రక్షించుటకు కిరీటములతో కవచములతో ప్రకాశించు రాక్షసు లిరువదియేడు వేలమంది రౌద్ర దైత్యులుండిరి. అశ్వమునెక్కి మథనుడు ఉష్ట్రముపై జంభకుడు ప్రకాశించు శుంభుడు విపులమగు మేషము నారోహించియు వచ్చిరి. ఇతర దానవేంద్రులును ఖడ్గములను నానాస్త్రములను ధరించి క్రుద్ధులయి ఆశ్చర్యకర కర్మాచరణ సమర్థుడగు విష్ణునితో యుద్ధమునకు వచ్చిరి. నిమిదైత్యుడు పరిఘముతో మథనుడు ముద్గరముతో శుంభుడు శూలముతో గ్రసనుడు వాడియగు ప్రాసముతో క్రుద్ధుడై మహిషుడు చక్రముతో జంభ సురుడు శక్తితో మిగిలిన మహాసురులు అందరును వాడి అమ్ములతో విష్ణుని కొట్టిరి. వారు విడిచిన అస్త్రశస్త్రములు హరి శరీరమును గురువుచేసిన సదుపదేశము శిష్యుని హృద యమునందువలె ప్రవేశించెను.

అంతట విష్ణువు ఏమియుతడబాటులేక ధనువునుతీసికొని సర్పములవంటి శరములను, తైలముతో శుద్ధ పరచబడినవియై సూటిగాపోవు వానిని, వింట సంధించి ధనువాకర్ణాంతముగా లాగి ఆ అతిపౌరుషశాలి క్రుద్ధుడై ఆ దేవ శత్రువులపయికి పరుగెత్తెను. అతడు అగ్ని తేజస్కములగు ఇరువది బాణములతో నిమిని పది బాణములతో మథనుని ఐదింటితో శుంభుని ఒకదానితో వక్షము నందు మహిషుని పండ్రెండింటితో జంభుని ఒక్కొక్కరిని మూడేసి బాణములతో మిగిలిన వారిని క్రుద్ధుడయి కొట్టెను. అతని ఆ శీఘ్రవేగమును చూచి దానవులు క్రోధమూర్ఛితులయి ప్రయత్నపరులయి అద్భుతమగు రణమొనరించిరి.

అంతట నిమిదానవుడు బాణముతో విష్ణుని ధనువును ఖండించెను. సంధించు చున్న బాణములు ఇంకను చేతియందుండగనే మహిషాసురుడది ఖండించెను. జంభుడు వాడి యమ్ములతో గరుడుని నొప్పించెను. మేఘసమానుడగు శుంభుడు నారాయణుని భుజమును గాఢముగా కొట్టెను. గోవిందుడంతట భయంకరమగు గద తీసికొని మహాయుద్ధమున వేగముతో మథనునిపయి ప్రయోగించెను. అది ఇంకను చేరులోపలనే నిమి దానిని నూవు గింజలంతగా చేసెను. హీనుని విషయమున ప్రార్థనవలె అ గద వ్యర్థముకాగా హరి దివ్య రత్నాలంకృతమగు ముద్గరము తీసికొని నిమి దానవునిపయి ప్రయోగించెను. అది వచ్చుచు ఇంకను ఆకాశ మందుం డగనే గదతో జంభ దానవుడును పట్టిసముతో గ్రసనుడును శక్తితో మహిషుడును ఇట్లు ముగ్గురును స్వపక్ష జయకాంక్షతో దాని నడ్డగించిరి. దుర్జనుని విషయమున చూపిన ప్రీతివలె ఆ ముద్గరము వ్యర్థముకాగా చూచి అత్యుగ్రమును అష్టమంటలతో భయంకర ధ్వని కలదియు అగు శక్తిని తీసికొని దానిని జంభునిపై ప్రయోగించెను. గజుడను దానవ నందనుడు అది నడుమ నుండగనే పట్టుకొనెను. వివేకియగు శిష్యుడు గ్రహించిన గురుశిక్షవలె అది గ్రహింప బడుటచూచి దృఢమును భారసహమును సారము కలదియునగు మరియొక ధనువును తీసికొని దాని యందు రౌద్రాస్త్రము సంధించిన బాణముల సంధించి వదలెను.

అంతట చరాచర లోకమంతయు ఆ అస్త్రతేజములో వ్యాప్తమయ్యెను. అకస మంతయు బాణమయమయి కనబడెను. భూమియు దిశలును విదిశలును బాణజాల మయమయి ప్రకా శించెను. ఆ అస్త్ర మాహాత్మ్యమును చూచి సేనాపతియగు గ్రసనాసురుడు సర్వాస్త్రములను వారించగల బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. దానితో లోకనాశకమగు రౌద్రాస్త్రము శాంతించెను. అది ప్రతిహతముకాగా దానవాంతకుడగు విష్ణువు సర్వలోక భయంకరమగు కాలదండాస్త్రమును ప్రయోగించెను. నారాయణుడది సంధించుచుండ పరుషమగు వాయువు వీచెను. భూమి కంపించెను. సముద్రములు విచ్చుకొనెను. ఉగ్రమగు ఆ అస్త్రమును చూచి యుద్ధ దుర్మదులగు దానవులు రణమున నానారూపములగు నానాస్త్రములను ప్రయోగించిరి. గ్రసనుడు నారాయణా స్త్రమును నిమి త్వాష్ట్రాస్త్రమును జంభుడు వేరుగ ఒక్కొక్క అస్త్రమును కాలదండాస్త్ర నివారణార్థము ప్రయోగించిరి. కాని దైత్యేశ్వరు లీయస్త్రములను సంధించి ప్రయోగించు లోపలనే క్షణకాలములో ఆ నారాయణ ప్రయుక్త కాలదండాస్త్రము కోటిమంది దైత్యేశ్వరులను ఎన్నో గజాశ్వములను కూడ చంపి తరువాత దానవులు ప్రయోగించిన అస్త్రములతో శాంతించెను. హరి తన యస్త్రము శాంతమగుట చూచి విక్రమముతో వ్యాప్తమగు రూపము కలవాడయి పదివేల సూర్యులవలె ప్రకాశించుచు రెండవ సూర్యునివంటి చక్రాయుధమును తీసికొని సేనాపతికి గురిపెట్టి వజ్రము వలె కఠోరమును ఉగ్రమును అగు ఆచక్రమును వాని కంఠస్థలముపై ప్రయోగించెను. ఆచక్రము ఆకాశమునందుండి వచ్చుచుండుట చూచియు దైత్యవరులు తమ వీరత్వముతో వారింపజాలక తమ పురుషకారముతో దైవమును అణగద్రొక్కయత్నించిన మానవులవలె వ్యర్థులయిరి. ఊహింప నలవికాని శక్తికలది యుద్ధజయము కలిగింప సమర్థము నగు ఆచక్రము గ్రసనుని కంఠమును రెండుగా చేసి వాని రక్తధారలతో ఎర్రనై భయంకరమగు తన నాభికలదై ప్రవర్ధమానమగు అగ్నితో సమానమయి మరల జనార్దనుని హస్తమును చేరుకొనెను.