బ్రహ్మ ఆధిపత్యము లిచ్చుట

శౌనకాది ఋషులు సూతు నిట్లడిగిరి, అయ్యా! మీరు మాకు పరమాత్మ చేసిన ఆది సర్గమును (ప్రథమసృష్టిని) తెలిపితిరి. దీని తరువాత చేసిన ప్రతి సర్గమును ఆ సృష్టియందలి ఆయా భూతములకును పదార్థములకును అధిపతులను విశదీకరింపుడు.

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను, అమరాధిపుడగు బ్రహ్మ సకల ధరిత్రికి పృథువును అధిపతిగా చేసెను. అట్లే ఓషధులకు యజ్ఞ కర్మలకు తపస్సులకు సోముని-నక్షత్రములు తారలు పక్షులు వృక్షములు గుల్మము (పొద)లు లతలు మొదలగు వానికి హిరణ్య గర్భుని జలములకు వరుణుని, ధనములకు రాజులకు కుబేరుని, ఆదిత్యులకు విష్ణువను ఆదిత్యుని, వసువులకు అగ్ని అను వసువును, ప్రజాపతులకు దక్షుని, దేవతలకు ఇంద్రుని, దైత్యదానవులకు ప్రహ్లాదుని, పితృ దేవతలకు యముని, పిశాచములకు రక్షస్సులకు పశువులకు యక్ష భూత బేతాళములకు శూలపాణిని, పర్వతములకు హిమవంతుని, సరిత్తులకు (జల ప్రవాహములకు) నదులకు సముద్రుని, గంధర్వులకు విద్యాధరులకు కింనరులకు చిత్రరథుని, నాగులకు వాసుకిని, సర్ప ములకు తక్షకుని, దిగ్గజములకు ఐరావతమును, పక్షులకు గరుడుని, అశ్వములకు ఉచ్చైః శ్రవమును, మృగములకు సింహమును, వనస్పతులకు అనగా పూయకయే కాయలు కాచెడు చెట్టులకు జువ్వి చెట్టును అధిపతులనుగా చేసెను. సుధర్ముని తూర్పునకు శంఖుని దక్షిణమునకు సుకేతు మంతుని పశ్చిమమునకు హిరణ్యరోముని ఉత్తరమునకు అధిపతులనుగా బ్రహ్మ అభిషేకించెను. వారు ఇప్పుడును (మత్స్యనారాయణుడు మనువునకు ఈ వృత్తాంతము చెప్పు నాటికి) ఈ నలుగురు దిక్పాలురును పృథుని మొదటి భూలోకాధిపతినిగా అభిషేకించిరి. ఆ మన్వంతరము గడచిన తరువాత సూర్య వంశజుడగు వైవస్వతుని భూలోకాధిపతినిగా చేసిరి. అనగా చాక్షుష మన్వంతరము గడువగా వైవస్వత మన్వంతరము ప్రారంభము కాగా సూర్య వంశ మునకు పతాక వంటి వాడగు వైవస్వతుడు భూలోక చక్రవర్తిగా ప్రజాపతిగా అభిషిక్తుడయ్యెను.