సప్తమాతృకామూర్తి లక్షణము

నామానుపూర్వముగా మాతృకల లక్షణమును చెప్పెదను: బ్రహ్మాణి బ్రహ్మ వలెనే ఉండును; ఆమె చతుర్ముఖములతో చతుర్భుజములతో హంసవాహనయై అక్షసూత్రమును కమండలువును ధరించి ఉండును. మహేశ్వరి మహేశ్వరునివలె ఉండును; ఆమె జటాముకుటధారిణి; వృషభ వాహన. చంద్రార్ధశేఖర యుక్తురాలు; కపాలము శూలము ఖట్వాంగము వరదముద్రకల చతుర్భుజములతో నుండును.

కౌమారి కుమారస్వామి రూపుతో నుండును. ఆమె మయూరవాహన. రక్త వస్త్రధర, శూలశక్తిధర. హారకేయూరాలంకృత, కుక్కుటధారిణి. వైష్ణవి విష్ణునివలె నుండును. ఆమె గరుడవాహన. చతుర్భుజ. వరద, శంఖచక్రగదా హస్త. సింహాసనారూఢ, బాలక సమన్విత.

వారాహీ వరాహ సమానరూప, మహిషారూఢ. ఘంటాచామర గదాచక్రధారిణి; దానవేంద్ర వినాశిని ఇంద్రాణి ఇంద్రుని పోలియుండును. ఈమె వజ్రశూల గదాధర. గజాననగత. బహునేత్ర సహిత. కాచిన బంగారు కాంతి వంటి కాంతిగలది. దివ్యాభరణ భూషిత. తీక్ష్ణఖడ్గధారిణి. దానవేంద్ర వినాశిని.

చాముండాదేవీ రూపమును ఆమెకుండు ఆయుధములను తెలిపెదను. ఆమె పొడవు నాలుక, పొడవు కేశములు. మాంసఖండములతో నిండినది. కోరలతో భయంకర వదనము కలది. చిక్కిన పొట్టగలది. కపాలమాలలను ధరించినది; వామహస్తమున మెదడుతో పూయబడిన రక్త మాంస పూర్ణకపాలమును దక్షిణ హస్తమున శక్తిని ధరించి యుండును. గృధ్రమును కాని వాయసమును కాని ఆరోహించి యుండును. మాంసరహిత దేహ. వంగిన ఉదరము కలది. భయంకర వదనముతో లోచనత్రయముతో నుండును. ఘంటలు శరీరమున కట్టుకొని వ్యాఘ్ర చర్మము ధరించి యుండును. శుభ స్వరూప. కాళికాదేవి దిగంబర. గర్దభ వాహన. కపాలధారిణి. మిగుల ఎర్రని పూవు లామెకు ఆభరణములు. ఆమె ధ్వజముతో వర్ధనియను జలపాత్ర విశేషముతో నుండును. మాతృకలకు ముందుగా ఎల్లప్పుడును వినాయకుని నిలుపవలెను. వృషభ మారోహించి ధనుర్ధరుడును వీణా హస్తుడును త్రిశూలధారియునగు వీరేశ్వర భగవానుడును మాతృకలకు ముందుండును.