పురాణ దాన వ్రతము

పురాణముల గ్రంథ సంఖ్యను వాటిని దానము చేయుట అను వ్రత విధానమును సవిస్తర ముగా నిరవశేషముగా మాకు దెలుపుమని ఋషులడుగ సూతుడు ఈ విషయమును పురాణ పురుషుడగు మత్స్యరూప జనార్దనుడు మనువునకు చెప్పిన విధముననే మీకు తెలిపెదనని ఇట్లు చెప్పనారంభించెను :

మత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను, బ్రహ్మకు గల ఐదు ముఖములలో ఊర్ధ్వ ముఖము నుండి సర్వశాస్త్రములకు అది భూతమగు పురాణము వెలువడెను. పిమ్మట మిగిలిన ముఖముల నుండి వేదములు వెలువడెను. పూర్వకల్పమున మొదట పురాణము ఒక్కటియే యుండెను. అపుడది శతకోటి గ్రంథ పరిమాణము కలది (ముప్పది రెండక్షరముల సముదాయమునకు గ్రంథమని వ్యవహారము) లోకములు నిశ్శేషముగ దగ్ధమైన తరువాత (ప్రళయా నంతరము) నేను హయ(గ్రీవ) రూపమున(ఆరు) వేదాంగములు నాలుగువేదములు పురాణములు న్యాయ విస్తరము మీమాంస-ధర్మశాస్త్రము(లు) అను పదునాలుగు విద్యలను (శబ్దాత్మక నిత్య తత్త్వమును) పరిగ్రహించి నాస్వాధీనము చేసికొంటిని. మరల కల్పాదియందు మహా ప్రళయ సముద్రమున మత్స్యరూపమున నేను నీటియందే యుండి పలుకగా విని చతుర్ముఖుడు మునులకును అవి దేవతలకును ప్రవచించెను. కాని కాలక్రమమున దానిని జనులు సులభముగా గ్రహింపలేకపోవుట చూచి నేను ప్రతి మహాయుగమునందలి ద్వాపరయుగమునను వ్యాసరూపుడనై చతుర్లక్ష గ్రంథ పరిమాణమునకు సంగ్రహించి ఈమొత్తమును పదునెనిమిదిగా విభజించి లోకమున ప్రకాశింప జేయుదును. దేవలోకమున మాత్రమది ఇప్పటికిని శతకోటి గ్రంథ పరిమితముగానే యున్నది. వాని వివరణమును వాటిని విభజించి దానము చేయవలసిన వ్రతవిధానమును తెలిపెదను.

బ్రహ్మ మరీచికి ప్రవచించినది బ్రాహ్మ పురాణము. దీని గ్రంథ పరిమాణము పదివేలు. దీనిని లిఖించి వైశాఖ పూర్ణిమనాడు జలధేను సహితముగా దానమిచ్చినచో బ్రహ్మలోకప్రాప్తి యగును. జగత్తు అంతయు జలమయమై పద్మముగా (జలస్థానముగా) నున్నప్పుడు బ్రహ్మ ప్రవచిం చినది పద్మపురాణము. దీని గ్రంథపరిమాణము ఏబదిఐదు వేలు. దీనిని లిఖించి జ్యేష్ఠమాస పూర్ణిమ నాడు సువర్ణ కమలముతోను తిలలతోను దానము చేసినచో అశ్వమేధ ఫలము లభించును.

పరాశరుడు వారాహ కల్ప వృత్తాంతము నాశ్రయించి అఖిల ధర్మములను ప్రవచించినది విష్ణు పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువదిమూడు వేలు. దీనిని లిఖించి ఆషాఢ పూర్ణిమనాడు ఘృతధేనువుతో దాన మిచ్చినచో విష్ణు లోకము ప్రాప్తించును.

వాయుదేవుడు శ్వేత(వరాహ)కల్ప వృత్తాంతము నాశ్రయించి రుద్రమాహాత్మ్య ప్రధాన ముగా ప్రవచించినది వాయు పురాణము. దీని గ్రంథ సంఖ్య పండ్రెండు వేలు. దీనిని లిఖించి శ్రావణ పూర్ణిమనాడు పెరుగుతో బెల్లముతో ధేనువుతో కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసినవాడు శివలోకమున ఒక కల్పకాల ముండును.

గాయత్రీతత్త్వము నాశ్రయించి వృత్రాసుర వధతో కూడ సారస్వత కల్ప వృత్తాంత ప్రధానముగా ధర్మ విస్తరమును వర్ణించినది భాగవత పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునెనిమిదివేలు. దీనిని లిఖించి భాద్రపద పూర్ణిమనాడు బంగారు సింహముతో కూడ దానము చేసినచో పరమపదమును పొందును.

నారదుడు బృహత్కల్పాశ్రయములగు కథలను ప్రవచించినది నారదపురాణము. దీని గ్రంథ ప్రమాణము ఇరువదియైదువేలు. దీనిని లిఖించి ఆశ్వయుజ పూర్ణిమనాడు ధేనువుతో కూడ దానమిచ్చినచో పునరావృత్తి లేని దుర్లభమగు పరమసిద్ధి నందును. పక్షులను ఆశ్రయముగా చేసికొని ధర్మానుష్ఠాన పరములగు పక్షులు జైమినికి ధర్మాధర్మ విచారణమును వ్యాఖ్యానించినట్లు మార్కండేయుడు ప్రవచించినది మార్కండేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము తొమ్మిదివేలు. దీనిని లిఖించి సువర్ణ గజముతోకూడ కార్తీక పూర్ణిమనాడు దానమిచ్చినచో యజ్ఞఫలము లభించును.

ఈశాన కల్పము నాశ్రయించిన వృత్తాంతములను అగ్ని వసిష్ఠునకు ప్రవచించినది ఆగ్నేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునారువేలు. దీనిని లిఖించి బంగరు పద్మముతో కూడ తిలధేనువుతోకూడ మార్గశీర్ష పూర్ణిమనాడు దానము చేసినచో సర్వక్రతు ఫలము లభించి స్వర్గ సుఖములందును.

బ్రహ్మ మనువునకు ఆదిత్య మాహాత్మ్యము నాధారముగా చేసికొని అఘోర కల్ప వృత్తాంతమును భూత సమూహ లక్షణమును ప్రాసంగికముగా జగత్ స్థితిని విశేషించి భవిష్య వృత్తాంతమును చెప్పినది భవిష్యపురాణము. దీని గ్రంథపరిమాణము పదునాలుగువేల ఐదు వందలు. (ప్రకృతము లభించు భవిష్య పురాణమున ఇంచుమించుగా ఇరువది ఏడువేల శ్లోకములున్నవి.) దీనిని లిఖించి పుష్యమాస పూర్ణిమనాడు విమత్సరుడై గుడ ధేనువుతో దానము చేసినచో అగ్నిష్టోమ యాగఫలము లభించును.

సావర్ణి మనువు నారదునకు రథంతర కల్ప వృత్తాంతమును ఆశ్రయించి ఉత్తమమగు కృష్ణ మాహాత్మ్యమును బ్రహ్మ వరాహ చరితమును చెప్పినది బ్రహ్మకై (వై) వర్తపురాణము. దీని పరిమాణము పదునెనిమిదివేలు. దీనిని లిఖించి మాఘపూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణు నకు భవనముతో కూడ దానముచేసినచో బ్రహ్మలోక ప్రాప్తియగును.

మహేశ్వరుడు అగ్ని లింగ మధ్యమున నుండి ఈశాన కల్ప వృత్తాంతము నాశ్రయించి ప్రవచించినది లైంగపురాణమని బ్రహ్మ స్వయముగా చెప్పెను. దీని పరిమాణము పదునొకండు వేలు. దీనిని లిఖించి ఫాల్గుణ పూర్ణిమనాడు తిలలతోను, నూవులతోను అర్ధ నారీశ్వరదేవుని ప్రతిమతోను దానము చేసినచో శివసాయుజ్యము కలుగును.

విష్ణువు భూమికి మానవకల్పము నాశ్రయించి మహావరాహ మాహాత్మ్యమును చెప్పినది వారాహ పురాణము. దీని పరిమాణ మిరువదినాలుగువేలు. దీనిని వ్రాసి చైత్ర పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు బంగారు గరుడునితో, తిలలతో, ధేనువుతో కూడ దానము చేసినచో వరాహదేవుని అనుగ్రహమున విష్ణు లోకము ప్రాప్తించును.

తత్పురుషకల్పవృత్తాంత మాశ్రయించి మహేశ్వర ధర్మములను షణ్ముఖుడు (స్కందుడు) ప్రవచించినది స్కాందపురాణము. దీని గ్రంథపరిమాణము లక్షపై ఒక వేయి శ్లోకములు. దీనిని వ్రాసి బంగరు శూలముతోకూడ దానము చేసిన మానవుడు బంధముక్తుడై శివలోకము నందును.

త్రివిక్రమ మహాత్మ్యము ఆధారముగాగొని కూర్మ కల్ప వృత్తాంతమును పురుషార్థము లను బ్రహ్మ ప్రవచించినది వామనపురాణము. దీని గ్రంథపరిమాణము పదునాలుగు వేలు. దీనిని వ్రాసి రాత్రింబగళ్ళు సమముగానుండు దినమున దానమిచ్చినవారు విష్ణుస్థాన మందుదురు.

కూర్మరూపుడగు జనార్ధనుడు ఇంద్ర సన్నిధియందు మునులకు ఇంద్రద్యుమ్నుని ప్రసంగము మూలముగా లక్ష్మీ కల్ప వృత్తాంతములతో నాలుగు పురుషార్థముల మాహాత్మ్యమును ప్రవచిం చినది కూర్మపురాణము. దీని గ్రంథ పరిమాణము ఆరువేలు (పదునెనిమిదివేలని మరియొక మతము.) దీనిని వ్రాసి ఆయన ప్రవేశ పుణ్యకాలమున బంగరు కూర్మముతో కూడ దానమిచ్చిన మానవునకు వేయి గోవుల దానము చేసినంత ఫలము కలుగును.

కల్పాదియందు మత్స్యరూపుడగు జనార్ధనుడు సత్యవ్రత మనువునకు సప్త (ఋషి) కల్ప వృత్తాంత మాధారముగా వేదముల ప్రవర్తిల్లజేయుటకై (కాలరూపుడగు) పురుషోత్తమ తత్త్వమును వర్ణించి చెప్పినది మత్స్యపురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగున్నర వేలు (లోగడ చెప్పబడిన) యుగాది దినమున బంగారు మత్స్యముతో ధేనువుతో అన్ని అమరికలు కల కాంస్య పాత్రముతోకూడ దీని వ్రాతప్రతిని బ్రాహ్మణునకు అనేక భూషణములతో అతని నలంకరించి దానము చేసినచో భూమినంతటిని దానము చేసినంత ఫలము కలుగును.

గారుడ కల్పమున బ్రహ్మాండమునుండి గరుడుడుద్భవిల్లిన వృత్తాంతమును విష్ణువు ప్రవచించినది గారుడ పురాణము. దీని పరిమాణము పందొమ్మిదివేలు. దీనిని లిఖించి బంగారు హంసతో కూడ దానము చేసినచో సాలోక్య ముక్తిగా శివలోకము లభించును.

బ్రహ్మ బ్రహ్మాండ వృత్తాంతము నాశ్రయించి భవిష్య కల్ప వృత్తాంత విస్తరమును ప్రవచిం చినది బ్రహ్మాండ పురాణము. దీని పరిమాణము పండ్రెండువేల రెండువందలు. దీనిని లిఖించి వ్యతీపాతయోగమున ఉన్ని వస్త్రములతో, బంగారముతో కూడ దానము చేసినచో వేయి రాజసూయముల ఫలము లభించును.

నందీశ్వరుడు ఋషులకు శివుని సృష్టి సంహార కర్తనుగాను దేవాసుర సంగ్రామ వృత్తాంతమునుకూడ ప్రవచించినది శివ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువది నాలుగు (ఇరువదియైదు) వేలు. దీనిని లిఖించి మాఘ కృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి) నాడు గంధాది ద్రవ్యములతో భోజనములతో కూడ దానము చేసినచో సంపూర్ణముగా నూరు మన్వంతరముల కాలము రుద్రలోక నివాసము సిద్ధించును.

ఆశ్చర్యకర కర్మలుచేయ సమర్థుడగు వ్యాసుడు నేటికిని దేవలోకమునందు శతకోటి గ్రంథ పరిమాణముగల ఈ పురాణ (సముదాయ)మును లోక హితమునకై సంగ్రహించి నాలుగు లక్షల పరిమాణముగలదిగా చేసెను. దీనిని అతడు మాతండ్రికి చెప్పగా అతడు నాకు ప్రవచించగా నేను మీకు ప్రవచించితిని.

లోకమునందు ప్రతిష్ఠితములైయున్న ఉప పురాణముల సంఖ్య ప్రవచింతును. పాద్మ పురాణమునందు ప్రవచింపబడిన నరసింహ విషయ వర్ణనము కలది నారసింహ పురాణము. దాని పరిమాణము పదునెనిమిది వేలు. కుమారస్వామి నందునకు (శివ) మాహాత్మ్యమును ప్రవచించినది నందా పురాణము. సాంబుని గురించి భవిష్యోపాఖ్యాన రూపమున ప్రవచించినది సాంబ పురాణము. ఇట్లే ఆదిత్య పురాణమును గలదు. ఇట్లే అష్టాదశ పురాణములలో దేనికి సంబంధించిన వేరొక పురాణము కనబడునో అది ఈమూల పురాణము నుండి ఏర్పడిన ఉప పురాణమని ఎరుగవలయును.

ఇదికాక పురాణములకు ఉండవలసిన పంచలక్షణములను పెద్దలు చెప్పియున్నారు. అవి-సర్గము-(ఆదిసృష్టి) ప్రతిసర్గము-(భూత పంచకసృష్టి) వంశము (ప్రజాపతుల సృష్టి) మన్వం తరములు-వంశానుచరితము (ప్రజాపతుల నుండి కొనసాగిన ఆయా రాజరాజర్షి మహర్త్యాది పరంపర ఇట్లీ పంచలక్షణములుకల పురాణములందు బ్రహ్మ విష్ణు రుద్ర సూర్యుల మహి మమును భువన సృష్టి సంహారములును ధర్మార్థ కామమోక్షముల ప్రకారములును ప్రవచింప బడును. అన్ని పురాణములయందును (శాస్త్రములకు ప్రతికూలముగా నడచిన దుష్టులకు) ఏతద్విరుద్ధ ఫలముకూడ (ఉదాహరణములతో) చెప్పబడును. (పురాణములు సాత్వికములు రాజసములు తామసములు మిశ్రములనని నాలుగు విధములు) సాత్విక పురాణములందు విష్ణు మాహాత్మ్యము రాజసపురాణములందు బ్రహ్మ మహిమము తామస పురాణములందు అగ్ని, శివుల మాహాత్మ్యము మిశ్రములయందు సరస్వతీ మహిమ పితృదేవతా మాహాత్మ్యములు చెప్పబడును. ఈ అష్టాదశ పురాణానుక్రమమును దేవతా కార్యములందు పఠించినచో విష్ణులోక ప్రాప్తియగును.

వ్యాసుడు పదునెనిమిది పురాణములు రచించిన పిమ్మట వాటి ఉప బలముచే కూర్చబడిన భారతేతి హాసమును లక్ష గ్రంథ పరిమాణముతో రచించెను. అది వధ ప్రధానమైనది. శతకోటి గ్రంథ పరిమాణముతో బ్రహ్మ రచించిన రామాయణమును నారదుడు బ్రహ్మ నుండి ఎరిగి వాల్మీకికి బోధించగా దాని నా ఋషి ధర్మార్థ కామమోక్ష సాధకముగా రచించెను. ఇట్లు ఈ పురాణ వాఙ్మయము సపాదపంచ లక్ష(525000) గ్రంథ రూపమయ్యెను. ఉదర్కము (అభ్యు దయము)ను కలిగించు పురాతన (వృత్తాంత)మునకు సంబంధించినది కావున ఈ వాఙ్మయము ‘పురాణము’ అనబడుచున్నది.

ఈ పురాణానుక్రమము ధన్యతను యశమును ఆయువును కలిగించునది. దీనిని చదివినను వినినను పరమపదము లభించును. ఇది పవిత్రము కీర్తికిమూలము పితృప్రీతికరము. దేవతలకును అమృతమువలె ప్రీతికరము. మానవులకు మహారోగహరము.