మత్స్య మహా పురాణము
తారకామయ యుద్ధమునకు దేవతల సన్నాహము
శ్రీమత్స్యనారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను. రవికుమారుడవగు మనూ! దైత్య సేనా విస్తారమును దాని సన్నాహమును నీకు తెలిపితిని. ఇక విష్ణు పక్షీయమగు దేవసేనా విస్తారముకూడ వినుము; వీరిలో ఆదిత్యులు వసువులు రుద్రులు మహాబలులగు అశ్వినులు (ఆదిత్యులు 12+వసువులు 8+రుద్రులు 11+అశ్వినులు 2=33: ) వీరు తమ తమ బలములతో అనుచరులతో కూడ యథాక్రమముగా యుద్ధ సన్నాహ మొనర్చిరి. పలు పేరులతో యజ్ఞము లందు పిలువబడువాడు వేయి కన్నులు కలవాడు లోకపాలుడు అగు ఇంద్రుడు సర్వ దేవతలకు నాయకుడై వారి ముందుండి అందరికంటె ముందుగా దేవగజమగు ఐరావత మెక్కెను. అది మిగుల అందమగు చక్రములును పాదములనబడు దారు పరికరములును కలది; బంగారుతో వజ్రములతో అలంకృతము; వేలకొలదిగ దేవగంధర్వ యక్షులు దానివెంట నుండిరి. ప్రకాశవంతులగు దేవర్షులు బ్రహ్మర్షులు యజ్ఞ సదస్సులందుండువారు ఆ రథమున కన్ని వైపుల నిలిచి స్తుతించుచుండిరి. వజ్రముల (పిడుగుల)తోను వాని ధ్వనులతోను మెరుపులతోను ఇంద్రధనువులతోను కూడినవియు పర్వతములవలె నున్నవియు సంకల్పానుసారముగ సంచరించునవియు అగు మేఘ సమూహములతో అది కూడి ఉండెను. దాని నారోహించియే ఆ ఇంద్రదేవుడు సకలజగత్తునందును సంచరించుచుండును. యజ్ఞారంభములందు హవిర్ధానములను ప్రదేశములందునిలిచి ఈరథమును విప్రులు కీర్తించుచు వేదగానము చేయుదురు. స్వర్గము నందు యుద్ధ సన్నద్ధమయిన సేనయందు దేవతా వాద్యములను మ్రోగించుచు వాదకులు వెంట వచ్చుచుండ అప్సరసలు వందల కొలదిగ నాట్య మాడుచుండిరి. మనో వాయువేగముగల వేయి గుర్రములను పూంచినది నాగరాజ ధ్వజముతోకూడినది అగు ఆ రథశ్రేష్ఠము మాతలియను సారథిచే రక్షితమగుచు రవివలె ప్రకాశించుచుండెను. అది అన్ని వైపులను సూర్య తేజస్సుతో క్రమ్మ బడిన మేరువో అనునట్లుండెను. యముడు కాలపాశముతోకూడ దండమును ఎత్తి పట్టి ముద్గరమును ధరించి తననాదముతో దైత్యులకు భయము గొల్పుచు దేవతా సేనయందు నిలిచెను.
వరుణుడు చతుస్సాగరములతోను నాలుకలు క్రోయు సర్పములతోను కూడి శంఖము లతో ముత్యములతో కూర్చిన భుజకీర్తులను జలమయ శరీరమును కాలపాశములను ధరించి వాయువుచే కదలించబడిన జలముల వలెను చంద్రకిరణముల వలెను ఉన్న హయములతో వేలకొలది క్రీడలు క్రీడించుచు తెల్లనగు మేలయిన వస్త్రముదాల్చి పగడములతో కూర్చిన మనోహరమగు భుజకీర్తులదాల్చి మణులతో నీలమైన ఉత్తమశరీరముతో లావగు ముత్తెముల హారములతో నిండిన ఉదరము కలిగి దేవసేన మధ్యమున నిలిచియుండెను. అతడు యుద్ధ సమయ మెపుడెపుడు వచ్చునాయని కోరుచు చెలియలికట్ట దాటి వచ్చిన సముద్రమువలె ఉండెను. నిధులకు అధిపతియు రాజులకు రాజులకును ఈశ్వరుడు (రాజరాజేశ్వరుడు) ధనదుడు (మహాధనవంతుడు - ధనమును ఇచ్చువాడు అని మాత్రమే కాదు) అగు కుబేరుడు యక్షరాక్షస గుహ్యక సేనతోను శంఖపద్మములనబడు నిధులతోను కూడి గదాపాణియై పుష్పక విమానము వాహనముగా కలిగి దానియందుండెను. ధనేశుడును రాజ రాజును అగు ఆ కుబేరుడు నరవాహనుడై - వృషభమారోహించిన సాక్షాత్ శివునివలె యుద్ధ(రంగ)మున నిలిచెను. ఇంద్రుడు తూర్పున యముడు దక్షిణమున వరుణుడు పడమట కుబేరుడు ఉత్తరమున - ఇట్లు ఎల్లరుము తమతమ దిక్కులందు ఉండి, మహాబలులా లోకపాలురు దేవబలమును రక్షించుచుండిరి. ద్వాదశాత్ముడు (పండ్రెండు రూపములు గలవాడు) దినమునకు (పగటికి) ఈశుడు అగు సూర్యుడు ఏడు గుర్రములను పూంచినదియు, అమితవేగమున పోవునదియు మిగుల ప్రకాశించు కాంతిగలదియు ఇట్టి కిరణములతో ప్రకాశించునదియు ఉదయాస్త పర్వతముల నడుమ సంచరించునదియు మేరుపర్వతము వరకుపోయి చేరునదియు స్వర్గద్వారము వరకును తన చక్రములు పోగా అవ్యయము (నాశములేని) ఆన్వర్గలోకమును గూడ ప్రకాశింప (తపింప) జేయునదియు సహస్ర కిరణయుక్తము అయి తనతేజముతో ప్రకాశించు రథమును ఆరోహించి దేవతల (సేనల) నడుమ సంచరించుచుండెను. సోముడు తెల్లని అశ్వములను పూన్చిన రథము నందు ఎక్కి చల్లని కిరణములు కలిగి హిమజలముతో నిండిన కాంతులతో లోకముల కాహ్లాదము కలిగించుచు సంచరించుచుండెను. నక్షత్ర సమూహములచే అనుసరించబడువాడును చల్లని కిరణములుకలవాడును నక్షత్రములకు అధిపతియు కుందేటిమచ్చ గుర్తుగా ఉండు శరీరము కలవాడును రాత్రులందుండు చీకటులు పోగొట్టువాడును జ్యోతిర్గణములకు అధిపతియు రసములను అందించువాడును ప్రభువు (సమర్థుడు)ను పవిత్రములగు ఓషధులకును అమృతము నకును నిధియు (జగములకు సంబంధించిన సౌమ్య - రౌద్ర భాగములు రెంటిలో) మొదటిదగు సౌమ్యభాగ రూపుడును సత్యమయుడును లోకజన సంచరణమునకు) రథమువంటివాడును హిమమాయుధముగా గలవాడునగు చంద్రుని దానవులు (యుద్ధరంగమున) చూచిరి.
ఎవరు ఐదుగా భేదించి సర్వభూతములకును ప్రాణమైయుండునో, సప్తస్కంధము లనబడు గాలుల ఏడు పొరల యందు అమరియున్న పృథివ్యంతరిక్షద్యులోకములను మూడింటిని ఎవడు ధరించునో, నిర్మించునో, ఎవడు అగ్నికి సృష్టి కర్తయనియు సర్వమునకు మూలకారణుడనియు ఈశ్వరుడు అధిపతి యనియు వేదజ్ఞులు చెప్పుదురో, ఎవరు సప్త (సంగీత) స్వరములందును నిలిచి (లయయుక్త) వాక్కుల రూపమున ఉచ్చరింపబడునో ఎవరు ఉత్తమ భూతమయి అశరీరుడో అనగా ఆకృతి లేనివాడో, ఎవడు శబ్దమునకు జన్మకారణమగు ఆకాశమునుండి జన్మించెనో, సర్వభూతములకును ఆయువుగా నుండునో అట్టి వాయుదేవత స్వతేజస్సుతో గర్వితుడై మేఘములతో కూడి దానవులకు ప్రతిలోమముగా (ఎదురుదిక్కుగా) వీచుగాలులతో వారిని చాలబాధపెట్టసాగెను. మరుత్తులు అనబడు గణదేవతలును దేవజాతీయులగు గంధర్వులతోను విద్యాధరులనెడు గణదేవతలతోను కూడి కుబుసము విడిచిన సర్పములవలెనున్న ఖడ్గములతో ఆడుచుండిరి. నాగశ్రేష్ఠులును రోషమయ విషమును వెలిక్రక్కుచు ద్యులోకమునందు సంచరించుచు ఇంద్రాది దేవతలకు తాము బాణములయి నోళ్ళు (భయంకరముగా) తెరచుకొని ద్యులోకమున సంచరించసాగెను. ఇతర దేవగణముల వారును దానవసేనను కొట్టుటకయి పర్వతములతో కొండల శిలామయ శిఖరములతో వందల కొలది శాఖలుగల వృక్షములతో నిలిచిరి. దేవుడును (ప్రకాశించువాడు) హృషీకేశుడు (విషయేంద్రి యాధిపతి) పద్మనాభుడు (నాభియందుండి పద్మముద్భవించినవాడు) త్రి - వి - క్రముడు (మూడు పాదవిన్యాసములతో లోకముల కొలిచి అందు వ్యాపించినవాడు) యుగా (కల్పాం)తమందు నల్లని కాంతిగలవాడు సర్వజగత్ప్రభువు సర్వకారణుడు మధుదానవుని చంపినవాడు, క్రతువుల యందు సన్నిహితుడై హవిస్సుల భుజించువాడు, భూమి జలాకాశాది భూతరూపుడు, వాటికిని ఆత్మయగువాడు (దేహమందు అత్మ వ్యాపించి దానికి పనులు చేయుశక్తి నిచ్చినట్లు ఆయా భూతముల యందుండి వానికి శక్తిని ప్రసాదించువాడు) చామన చాయవాడు శత్రునాశకుడు (ఆరి - హా) గదాధరుడునగు నారాయణుడు రవిదీప్తితో నిండి ప్రకాశించునది దివ్యము ఉత్తమోత్తమ తేజోవంతము దేవతలు మొదలగు సాధుజనుల శత్రువులను చంపునది అగు చక్రమును కుడిచేతితోను పెద్దదియు సర్వా సుర వినాశనియు అగు గదను ఎడమ చేతితోను ధరించెను. సర్వశత్రుడగు గరుడుడు ధ్వజముగా గలవాడు ప్రభుడు మహాబలుడు అగు నారాయణుడు ప్రకాశించు ఇతర భుజములతో శార్ఙ్గము మొదలగు ఆయుధములను ధరించెను.
శ్రీమంతుడు విభుడునగు విష్ణువు గరుడుని ఆరోహించెను. అతడు కశ్యప ప్రజాపతి పుత్రుడు - పక్షిజాతీయుడు - సర్పభోజనుడు - వాయువుకంటె అధికముగా ఆకాశమును క్షోభింపజేయుచు ఆకాశమున సంచరించువాడు (ఖ - గ); నోటియందు భుజగరాజము నుంచుకొని ప్రకాశించువాడు, అమృతము విషయమయి ఇంద్రుడు వైచిన వజ్రపు (దెబ్బ) మచ్చగలవాడు అమృత నిమిత్తమయిన కార్యమునుండి బయట ఠీవితో తల ఎత్తుకొని ఉన్నత మయియున్న మంథర పర్వతము వంటివాడు - చాలామార్లు దేవదానవ యుద్ధములందు తన విక్రమమును ప్రదర్శించిన వాడు శిఖ గలవాడు బలశాలి - కాచిన బంగారుతో చేసిన కుండల ములు భూషణములుగా గలవాడు వన్నెలుగల రెక్కలు ఈకలు కలిగి గైరిక ధాతువులతో నిండిన కొండవలె ఉన్నవాడు బలిసిన వక్షమున వ్రేలాడుచున్నదియు చంద్రుని కాంతివంటి కాంతి కలదియు, నాగముల పడగలయందు అమరియున్నదియు ప్రకాశించుచున్నదియు అగు మణి శ్రేష్ఠముతో కూడినవాడు; ప్రళయకాలమందు ఇంధ్ర ధనువులతో కూడిన మేఘములవలె ఉన్న అందమగు ఈకలు కల రెక్కలతో ఆకాశమును ఆవరించినవాడు; నీలము ఎర్రనివి పచ్చనివి అగు పతాకలతో అలంకరింపబడినవాడు; పతాక వేషముతో కప్పబడిన మహాశరీరము అనెడు గ్రహముగా ఉన్నవాడు; రవి రథ సారథియగు అరుణునకు తమ్ముడు; మంచి వన్నెగల బంగారు కాంతిగల దేహముతో కూడి మంచి రెక్కలు కలవాడు అను అర్థముతో సుపర్ణుడని ప్రసిద్ధుడగుపక్షి శ్రేష్ఠుడు అతడు. ఇట్టి గరుడుని ఆరోహించిన విష్ణుని అనుసరించి వెంటనంటి పోవుచు దేవతలును సమాహితులగు మునులును పరమోత్తమ మంత్ర పవిత్రములగు వాక్కులతో ఆ జనార్దనుని స్తుతించుచుండిరి.
ఇట్లు సన్నద్ధమయిన ఆ దేవసేన కుబేరునితో కూడి యముని తన ముందుంచుకొని పక్షి రాజగు గరుడునిచే చుట్టుకొనబడి దేవరాజగు ఇంద్రునితో కూడి ప్రకాశించుచు, చంద్రుని కాంతులతో విస్తరిల్లి వాయువు వీచుటచే ధ్వనుల నిచ్చుచు, జయశీలుడు మిగుల ప్రకాశించువాడు అగు విష్ణునితేజస్సుతో ఆవృతమై ప్రజ్వలించు అగ్నివలె ఒప్పుచు బలశాలియు గర్వించి నదియునై యుద్ధమునకు సిద్ధమయ్యెను.
అంత - దేవతలకు శుభమగుగాక అని బృహస్పతి పలికెను. దానవ సేనకు శుభమగుత అని శుక్రుడనెను.