అగ్నివంశ వర్ణనము

ఋషులు సూతుని ఇట్లు అడిగిరి, నూతా! ద్విజులు సర్వకాలములందును (ఆయా విహిత కాలములందు) ఆరాధింపవలసిన అయా అగ్నులను ఆ అగ్నుల వంశములను అను పూర్వితో అనగా దేని తరువాత ఏది చెప్పవలెనో ఆ క్రమమున చెప్పవలసినదిగా గోరుచున్నాము.

అనగా సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను, స్వాయంభువ మన్వంతరమున జరిగిన సృష్టియందు మొదట అవ్యక్తతత్త్వమునుండి వ్యక్తమయిన అగ్నియను భూతమునకు అధిష్ఠాతగా ఉండు అగ్నియను దేవత చెప్పబడెను. ఈ తత్త్వము అగ్న్యభిమాని దేవత యనబడును. (అగ్న్యభిమాని దేవతయనగా పంచ స్థూలభూతములలో ఒకటియగు అగ్ని అను పదార్థమును ఆశ్రయించి తాను ఉండి ఇది నాదియను నభిమానముతో వర్తించుచు అగ్నిని ఆరాధించిన వారికి ఆయా ఫలములను ఇచ్చుచు అగ్నియందు చేసిన హవనాది ప్రయోజనము లను ఇంద్రాది దేవతలకు అందించుచు ఉండు దేవతా తత్త్వము అని యర్థము. అగ్నియందు వ్యాపించియుండు దేవతా తత్త్వము ఇదియని తలచబడు తత్త్వము అనియును అర్థము.) ఈ అగ్ని దేవునకు స్వాహా అను పత్నియందు 1. పావకుడు; 2. పవమానుడు; 3. శుచి యను ముగ్గురు కుమారులు కలిగిరి. వీరిలో పవమానుడు భూర్-భువః-సువః-అను మూడు వ్యాహృతులలో మొదటి వ్యాహృతికి అర్థము అగు భూలోకమునకు సంబంధించిన అగ్నికి అధిష్ఠాత. అతని కుమారుడు 4. నిర్మథ్యాగ్ని (అరణులతో నిర్మథనము చేయుటనే ఉత్పన్నుడగు అగ్ని); పావకుడు అనునతడు భువః అను రెండవ వ్యాహృతికి అర్థమగు అంతరిక్ష లోకమునకు సంబంధించిన అగ్నికి అధిష్ఠాత; అతని కుమారుడు 5. వైద్యుతాగ్ని, శుచి అనునతడు సువః అను మూడవ వ్యాహృతికి అర్థమగు ద్యులోకమునకు సంబంధించిన అగ్నికి అధిష్టాత; అతని కుమారుడు; 6. సౌరాగ్ని (పవమాన-పావక-శుచుల కుమారులు ఈ రూపములు భౌతిక-జడ-రూపములు) ఇక ఈమూడు అగ్నుల దేవతాత్మక రూపములగు కుమారులు ఇట్లు చెప్పబడు చున్నారు. పవమానుని దేవతా తత్త్వాత్మక కుమారుడు. హవ్యవాహుడు (హవ్యములను దేవతలకు కొనిపోయి అందించువాడు. పావకుని దేవతా తత్త్వాత్మక కుమారుడు. 8. సహరక్షుడు: శుచి అను అగ్నికి కలిగిన దేవతా తత్త్వాత్మక కుమారుడు; 9. (కవ్యవాహుడు (పితరులకు కవ్యము నందించువాడు) కావుననే హవ్యవాహుడు దేవతలకును సహరక్షుడు రాక్షసులకును కవ్యవాహుడు పితరులకును సంబంధించినవారు.

ఈ చెప్పిన పావక-పవమాన శుచులను ముగ్గురకును కలిసి సాముదాయకమగు నామము సూనులు (సూనులు అనగా తేజఃకిరణములని ఆర్షమగు సంప్రదాయమున అర్థము.)

మూలతః ఉన్న ఈ ముగ్గురగ్నులకును కలిగిన సంతతియును ఈ ముగ్గురగ్నులును కలిసి మొత్తము నలువది తొమ్మిది మంది యగుదురు.

వారినందరను వేరువేరుగ వారివారి ప్రవృత్తి ప్రవిభాగముతో కూడ క్రమముగ చెప్పెదను.

ఈ చెప్పిన బ్రహ్మమానస పుత్రుడగు ప్రాథమికాగ్ని దేవుని తత్త్వ భేదమగు పావకుడను అగ్నికి 10. భరతుడను కుమారుడు కలిగెను. ఇతనికే బ్రహ్మోద(రా) (ఇచట ఉదర-శబ్దము ‘ఉదరణ’ ‘ఉదీరణ’ శబ్దములతో సమానార్ధకము. మాట-ఉచ్చారణము-వాక్కు అని అర్థము. బ్రహ్మన ఉదరణమని-బ్రహ్మణ ఉదీరణమని-అని శ్రుతి.) నాగ్ని అనియు లౌకికాగ్ని అనియు దక్షిణాగ్ని అనియు వ్యవహారము. ఈ పావకాగ్నికే మరియొక కుమారుడు 11. వైశ్వానరుడు. ఇతడు హవ్యమనెడు మహారసమును ఆయాదేవతలకు వహించును. (కొనిపోవుచుండును.) భృగుని కుమారుడు దధ్యజ్ అథర్వా అను ఋషి (దక్షిణాథర్వా అనియు మరియొక పాఠము) అతడు ప్రపంచము అను పుష్కర(పద్మ)మును మధించి ఈ అమృతమును (దక్షిణాగ్నిని) ఉత్పన్న మొనర్చెను. (అథర్వన్ అను ఋషికి కుమారుడు అంగిరుడు. ఇతడును అగ్న్యాత్మక తత్త్వముగా శ్రుతులలో ప్రసిద్ధుడు. ముఖ్య ప్రాణతత్త్వమును ‘అంగిరాః’ అని ఉపనిషదృషులు చెప్పినారు.  ‘అథర్వాణః’ ‘అంగిరసః’ అనువారు అథర్వణ మంత్ర ద్రష్టలుగా ప్రసిద్ధులు) ఈ దక్షిణాగ్నికే పాచ్యః-అన్వాహార్యవచనః ఇత్యాది వ్యవహారమును సంప్రదాయమునందున్నది. అన్వాహార్య మనగా దర్శ పౌర్ణమాసాదీష్టుల యందు ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చు అన్నము. అది దీనిపై పాకము చేయబడును కావున ఈదక్షిణాగ్నికి అన్వాహార్యవచనః అని శాస్త్ర వ్యవహారము.

లోగడ చెప్పిన నిర్మథ్యాగ్నియగు పవమానుడు (త్రేతాగ్నులలో) గార్హపత్యాగ్ని స్థానీయుడు. అతనికి 12. సభ్యుడు; 13. ఆవసథ్యుడు అను ఇద్దరు కుమారులు. వీరి తల్లి శంసని అనునామె.

ఈ పదునారు మందియు ఉపస్ఘేయులు విహరణీయులు అని రెండు విధములుగా నున్నారు. వీరందరును హవిర్వహులగు (యజ్ఞములందు హుతమొనర్చిన హవిస్సును వహించుకొనిపోయి దేవతలకు అందజేయు) వారే. వీరిలో అందరకుగల స్థానము లును ధిష్ట్యములు ఐనను ఆవశ్యకతను బట్టి ఒక స్థానమునుండి మరియొక స్థానమునకు తీసికొనిపోబడుటకును అర్హులగు వారు) వీనికి స్థితిభేదమును బట్టి సంజ్ఞా భేదమును కలిగినది. ఈ సంజ్ఞాభేదానుసారము వీరి విషయమును క్రమముగా తెలిపెదను; వినుడు.

అధ్వర్యుని కుమారుడు (అధ్వర్యు స్థానము నందుండువాడు) పావకుని కుమారుడు (పావకాగ్ని సంబంధి) అవభృథ స్నాన సమయమందు వరుణునితో పాటుగ ఆరాధించబడువాడు నగు అగ్నియొకడు కలడుగదా! అతని కుమారుడు హృదయుడు; ఇతడు మానవుల జఠరము నందుండి వారి ఆహారమును పచనము చేయుచుండును. అతని కుమారుడు మన్యుమాన్; ఇతడు దేవపుడను అగ్నికి కుమారుడుగా (కూడ) చెప్పబడును. ఈ అగ్ని పరస్పర ఘర్షణముచే జనించి చెలరేగి ప్రాణులను దహించివేయును. అతని కుమారుడు సంవర్తకుడు; అతడు భయం కరుడు; ఇతడు బడబాముఖరూపమున సముద్రమున నుండి దానిని త్రాగుచుండును. అతని కుమారుడు సహరక్షుడు; అతని కుమారుడు క్షాముడు; ఇతడు నరుల గృహములయం దుండును. అతని కుమారుడు క్రవ్యాదాగ్ని; అతడు మరణించిన పురుషులను తినుచుండును.

పావకాగ్ని పుత్రులుగా ద్విజులు పేర్కొను అగ్నులు వీరు ఆరుగురు.

పూర్వము గంధర్వులు సూర్యునినుండి తెచ్చిన వసురూపుడు శుచియను అగ్ని, (ఇతడు వారిచే పురూరవునకు ఈయబడిన తరువాత వృక్షములయందు దాగగా మరల ఆ రాజు వారి యుపదేశముచే) అరణియందు మథించగా ఉత్పన్నుడై అగ్నినుండి మరియొక యగ్ని అను క్రమమున ప్రజ్వలించుచు (లోకమున నీతడు నిర్మథ్యాగ్నిగానే) ఉన్నాడు. అతని నామము ఆయువు (ఇతడు ఊర్వశీ పురూరవసుల కుమారుడుగా ప్రసిద్ధుడనుట గమనింపదగినది.) ఈ అగ్ని భగవానుడు ఆహవనీయాగ్నిగా పశు యజ్ఞములందు ప్రణయనము చేయబడుచున్నాడు. అతని కుమారుడు మహిషుడు; అతని కుమారుడు నహసుడు; ఈతడు పాక యజ్ఞాభిమానియై వాటియందు వేల్చబడిన హవిస్సును అనుభవించుచుండును. ఈతని కుమారుడు మహాయశుడగు అద్భుతుడు అతని కుమారుడు (మహాన్) గొప్పవాడు-పూజ్యుడు సర్వదేవాంశుడు అగు వీరుడు అనునతడు: (వీరుడను అగ్నికి కుమారుడు కంఠుడు; కంఠుని కుమారుడు కవియనునతడు.) ఈ వీరుడు అనునతడు ప్రాయశ్చిత్త కర్మాణుష్ఠానాభిమానియై యుండును. అతని కుమారుడు వివధాగ్ని; వివిధాగ్ని కుమారుడు అర్కుడు; ఈతని కుమారులు ఎనిమిదిమంది. వీరిలో మొదటి వాడు కామ్యాదికములగు ఇష్టులకు అభిమానియై యుండు రక్షోహా (రక్షాంసి-హంతి-రాక్షసులను చంపువాడు) అను అగ్ని ఇంకను ప్రతికృత్ (ఇతరులు చేసిన అపకారములకు ప్రతీకారము చేయువాడు) సురభి-వసు మర్యాదుడు హర్యశ్వుడు రుక్మవాన్ ప్రవరుడు క్షమవాన్ అను వారును కలిసి వీరు మొత్తము ఎనిమిదిమంది.

ఈవిధముగా అధ్వరములందు ప్రణయనముచేయబడు అగ్నులవిషయము ప్రతిపాదింప బడినది. వీరందరును సృష్టికి ఆరంభమునందు నుండియు యాములు అనబడు దేవ శ్రేష్ఠులతో కూడియుందురు (ఏకభావము నొందియుందురు.) వీరందరును పూర్వము స్వాయంభువ మన్వంతరము నందును ఆయా వైదిక కర్మానుష్ఠానములకు అభిమానులై విహరణీయులై (అర్థము లోగడ చెప్పబడినది) సృష్టియందలి చేతనములు అచేతనములునగు పదార్థములందు స్థానాభిమానులై ఆయా అగ్నులకు అభిమానులునై (ఈ స్థానమునకు వీరు అధిష్ఠాతలు అని విద్వాంసులచే భావన చేయబడువారై-(ఈ స్థానము నాది- ఈ స్థానమునకు నేను అధిష్ఠాతను అను అభిమానము కలవారై) ఉండిరి.

స్వారోచిష మన్వంతరము మొదలుకొని సావర్ణి మన్వంతరాంతముగా నుండు (స్వాయం భువము కాక మిగిలిన అన్ని) మన్వంతరములందును ఇంతవరకు గడచిన- గడచుచున్న-ఏడు మన్వంతరముల యందువలెనే నానారూప ప్రయోజనముల ననుసరించి అతీతులును వర్తమానులునగు ఆయా అగ్ని సంబంధులగు యామాది దేవ గణములతో కూడి ఆయా అగ్నులుందురు. ఇక అనాగత(రాబోవు) మన్వంతరములయందు రాబోవు ఆయా దేవ గణాంత ర్భూతులగు వారితో కలిసి రాబోవు అగ్నులు ఉపాసింపబడుదురు. ఈ విధముగా అగ్నుల వర్గము(వారి నామకర్మ ప్రవిభాగము)ను ఆనుపూర్వితో సవిస్తరముగా నేను ప్రతిపాదించితిని. మరిఇంకను ఏమి వినగోరెదరో తెలుపుడు అని సూతుడు ఋషులతో పలికెను.