మత్స్య మహా పురాణము
కృష్ణాష్టమీ వ్రతము
ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను, ఇక కృష్ణాష్టమీ వ్రతమును తెలిపెద వినుము; ఇది సర్వపాప ప్రణాశకము, విశేషించి నరులకు ఇది శాంతిని ముక్తిని ఇచ్చును. దీనిని కృష్ణ పక్షాష్టమినాడు చేయవలసినందున దీనికీ పేరు కల్గినది. మార్గశిరము మొదలు కార్తీకము వరకు మార్గశిరమున శంకరుడు, పుష్యమున శంభుడు, మాఘమున మహేశ్వరుడు, ఫాల్గుణమున మహాదేవుడు, చైత్రమున స్థాణుడు, వైశాఖమున శివుడు, జ్యేష్ఠమున పశుపతి, అషాఢమున ఉగ్రుడు, శ్రావణమున శర్వుడు, భాద్రపదమున త్ర్యంబకుడు, ఆశ్వయుజమున హరుడు, కార్తీకమున ఈశానుడు అను పేర్లతో పరమేశ్వరుని పూజించవలెను. శివభక్తులగు స్త్రీలను శివునితోపాటు గోభూహిరణ్య వస్త్రములతో అర్చించవలెను. ఈ వ్రతము అష్టమి తిథినాడు గోమూత్రము, ఆవు నేయి, ఆవు పాలు, నూవులు, దర్భలు వేసి ఉంచిన నీరు ఆవు కొమ్ములో పోసి ఉంచిన నీరు గోమయము తెల్ల జిల్లేడాకు, మారేడాకు, ఆవు పెరుగు వీటిని ఆహారముగా తీసికొని ఉండి రాత్రివేశ శివు నర్చించవలెను. మార్గశిరము మొదలు ప్రతి రెండేసి మాసములందు వరుసగా రావి-మర్రి-మేడి-జువ్వి-మోదుగ-నేరేడు పుల్లలతో పండ్లు తోముకొని ఆ చెట్లక్రింద భుజించుచుండ వలెను. ఇట్లొక సంవత్సరము వ్రతము జరిపి ముగిసిన తరువాత పెరుగన్నము-చాందనీ-చామరము దండములు నల్లని గోవు నల్లని (రెండు) వస్త్రములు పంచరత్నములతో కూడ రాగి కడవను దేవున కర్పించి బ్రాహ్మణునకు దానము చేయవలెను. నల్లని గోవులను బంగారమును వివిధ వస్త్రములను కూడ బ్రాహ్మణులకు దానమీయవలెను. శక్తిలేనివాడు ఒక గోవునైన అతిభక్తితో నీయవలెను. ధనమునకు లోభించినచో దోషము కలుగును. ఇట్లు ఉపవాస పూర్వకముగా కృష్ణాష్టమీ వ్రతమును జరిపినవారు ఏడువందల కల్పముల కాలము దేవతల పూజలందుకొనుచు శివలోకమున సుఖింతురు.