మత్స్య మహా పురాణము
రాజు అపరీక్షితాన్నమును తినరాదు
దుర్గమునందు ఉంచుకొనవలసిన రాజరక్షా రహస్యములు ఏవి? రాజు ఇట్టివి ఏవి ఏర్పాటు చేయించు కొనవలయును తెలుపుమనిన మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను: రాజా! శిరీషము, ఉదుంబరము, శమి, బీజపూరము-వీటిని నేతితో తడిపి పదునైదు దినములుంచి సేవించిన యెడల ఆకలిని తట్టుకొను శక్తి కలుగునని పురాతనులు చెప్పిరి. కశేరు ఫలములును కశేరు మూలములును, చెరకువేళ్లు, తామరతూడు, దూర్వ వీటిని పాలతో నేతితో మండముచేసి మాసకాలముంచి సేవించినచో శస్త్రఘాతము తగిలినవాడు చావకుండును. కల్మాష వేణువను వెదురుతో అగ్నిని నిర్మించి దాని జ్వాలలను ఇంటిలో అపసవ్యముగా మూడు మారులు త్రిప్పినచో అఇంట ఇతరములగు అగ్నులు జ్వలించవు. పాముల ఎముకల పొడిని ప్రత్తితో చేర్చి, దాని పొగవేసినచో అచ్చటికి పాములు రావు. ఉన్న పాములు బయటకు పోవును; సముద్ర లవణము, యవలు, విద్యుద్దగ్ధమయిన మృత్తిక-ఇవి కలిపి పూసిన ఇంటికి అగ్ని భయము ఉండదు; రాత్రింబవళ్లును ముఖ్యముగా గాలి వీచునపుడును దుర్గమును అగ్ని నుండి రక్షించవలయును; రాజును విషమునుండి రక్షించవలయును; దానికి ఉపాయమును చెప్పెద; వినుము.
క్రీడార్థమయి రాజు మృగములను పక్షులను ఉంచుకొనవలెను; రాజు భుజించుటకు ముందుగా వీటియందును అగ్నియందును ఆహారమును పరీక్షించవలయును; పరీక్షించని వస్త్రపుష్పాలంకార భోజనాచ్ఛాదనములలో వేనిని కాని తాకనైన తాకరాదు.
పరీక్షా విధానము ఇట్లుండును. విషము పెట్టినవాని నోరు ఎండిపోవును; అతడు గాబరాతో చూచుచుండును; విషయుక్త పదార్థమును పరీక్షించుట ఆరంభించగానే వాని ఉత్తరీయము జారిపోవును; మనస్సు వికలమగును; స్తంభముల చాటున వాడు నక్కును; సిగ్గుపడును; తందర బిందరలాడును; నేలను గీయును; మెడ కదలించును, ముఖము తడవుకొనుచు తల గోకికొనును; వాని సహజ స్వభావమునకు విరుద్ధములుఅగు ఇంకెన్నెన్నో చేష్టలు చేయనారంభించును; ఈ మొదలగు చిహ్నములను బట్టి పరీక్షించి విషము పెట్టినవాడెవ్వడో నిర్ణయించవచ్చును. ఇట్లు విష సంసర్గము కలదేమోయని శంకించబడిన ఆహారమును మండెడు అగ్నిలో వేయవలెను. అది విషమిశ్రితమేయైనచో చిటచిట ధ్వనితో మిగుల చిట్లుచు రూక్షమగు దుర్వాసనతో అది మండుచుండ ఇంద్రాయుధ సమాన వర్ణమగు పొగవెడలును; ఆ పొగను సేవించుట అనగా పీల్చుటచే ప్రాణికి శిరోరోగము కలుగును. సవిషాన్నమున ఈగలు వాలవు. వాలినను వెంటనే చనిపోవును. విషాన్నము దృష్టికి తగిలినచో చకోరపక్షి చూపు విరక్తి చెందినదగును. కోకిల స్వరము వికార మందును. హంస నడక తొట్రుపడును. తుమ్మెద రొదచేయును. క్రౌంచ పక్షికి మదమెక్కును. కోడి గట్టిగా కూయును. చిలుక భయ దుఃఖములతో అరచును. గోరువంక వమనము అనగా వాంతి చేసికొనును. చామీకర పక్షి ఆ స్థలము విడిచిపోవును. కోతికి మలమూత్రములు వెడలును. జీవ జీవకము బడలును. ముంగిసకు రోమములు నిక్క పొడుచును. జింక ఏడ్చును. నెమిలి సంతోషపడును.
సవిషాహారము ఉడుకుటకు చాలసేపుపట్టును. ఉడికిన తరువాతకూడ వెంటనే అప్పటి కప్పుడే చెడిపోవును. మూతతీసి చూచుటకే రోతపుట్టును. పదునైదుదినములు నాటిదివలె పాసి పోవును! రుచియు వాసనయు చెడిపోవును. నెమిలి పించెములవంటి రంగు లేర్పడును. వ్యంజనములు అంటే కూరలు పచ్చడులు మొదలగునవి విషమిశ్రితములయినచో ఎండిపోవును: ద్రవ పదార్థములైనచో వానిపై బుడగలు వచ్చును, ఉప్పు వేసిన వస్తువులయినచో వానిపై నురుగు లేర్పడును; పంటపైరు లెర్రపడును! పాలు నీలమగును; మద్యమును నీరును కోకిల వర్ణమగును: వడ్లును ఆమ్లములును నల్లపడును. కొర్రలు కపిల వర్ణమగును: మజ్జిగ తేనెవలె చామనచాయ అగును. నీలమయిన పసుపుపచ్చని దైననగును: నేయికూడ నీటివలెనే అగును; మీగడ కపోత వర్ణమగును; తేనె ఆకుపచ్చగ నగును; తైలము అరుణ వర్ణమగును, విష సంసర్గము చెందిన పచ్చికాయలు త్వరగ పండును, పండినవి క్రుళ్ళి పోవును; పూవులు వాడి పోవును, గట్టివిమెత్తనగును. మెత్తనివి గట్టివగును. సూక్ష్మ వస్తువులు రూపము చెడినవై అల్పకాలిక జీవితము కలవగును; వస్త్రములపై నల్లని మచ్చలేర్పడును; లోహములును, మణులును, బురదవంటి మాలిన్యము కలవగును; అనులేపన గంధ ద్రవ్యములును, పూవులును వాసన చెడును; వన్నె చెడిపోవును. నీరు పచ్చనిదివలె చాయనందును; దంతములు, పెదవులు, చర్మము నల్లపడి, శక్తిహీనములగును; ఈ మొదలగు చిహ్నములనుబట్టి ఆయా పదార్థముల విష సంసర్గ మును గురుతించవలెను. కావున రాజెల్లప్పుడును మణి మంత్రౌష ధౌషధులతో రక్షణ నంది ఏమరుపాటులేక యుండవలయును; రాజు ప్రజావృక్షమునకు మూలము; దానిని కాపాడినచో రాష్ట్రము వృద్ధినందును; కావున ప్రతివాడును యత్నపూర్వకముగా రాజును రక్షించవలయును.
రాజ కర్తవ్య స్వపుత్ర శిక్షాదిక్రమము
మత్స్యనారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను. రాజా! రాజు తన కుమారుని రక్షించుకొన వలయును. ఇతనికి ఆచార్యుని రక్షకులనుకూడ ఏర్పాటు చేయవలెను. వారెపుడును ఇతనిని రక్షించుచుండవలెను. ఆచార్యునిచే ధర్మ కామార్థశాస్త్ర ధనుర్వేద రథగజ విద్యలయందు శిక్షితుని చేయించవలెను. నిరంతరముగ వ్యాయామము చేయించవలెను, శిల్ప విద్యలు నేర్పవలెను. ఆప్తులును ఇతనితో మిథ్యా ప్రియములు పలుకరాదు. శరీర రక్షణము అను మిషతో ఇతనిపై రక్షకులనుంచవలెను. ఇతనిని రాజుపై క్రుద్ధులతో లుబ్ధులతో రాజాపమానితులతో కలియనీయరాదు ? యౌవనమందు ఇంద్రియములచే అవకర్షింపబడకుండగను పెద్దలు నడచు సుదుర్గమ మార్గమునుండి తొలగ కుండునట్లును మంచినడవడికలో ఇతని నుంచవలెను. స్వాభావిక రీతులతో మంచి గుణములు కలిగించుట ఆశక్యమగునట్లున్న వాడైనచో సురక్షిత రహస్య ప్రదేశముననే అన్ని సుఖములతో బంధించి (అచటి నుండి బయటకు పోనీయక) ఉంచవలెను. ఏలయన రాజకుమారు డవినీతుడైనచో రాజవంశమే శిథిలమగును; వినీతుడుఅగు రాజకుమారుని మొదట చిన్న వానియందును తరువాత క్రమముగా గొప్పవాని యందును ఆయా అధికారముల యందు నియోగించుచుండవలెను.