మత్స్య మహా పురాణము
వేదాదికము ఉత్పత్తి చెందుట
మనువు ఇట్లడిగెను, లోకపితామహుడగు బ్రహ్మ ఏల చతుర్ముఖుడయ్యెను? (వేద)వేత్తలలో శ్రేష్ఠుడు అగు బ్రహ్మ లోకములను ఎట్లు సృష్టించెను?
మత్స్యము ఇట్లు చెప్ప ఆరంభించెను. దేవతలకును పితామహుడగు బ్రహ్మ మొదట తపస్సు ఆచరించెను. అంతట అంగములతో ఉపాంగములతో పదములతో క్రమముతో (ఘన జట మొదలగు వానితో) కూడ వేదములు అతనికి సాక్షాత్కరించెను. నిత్య శబ్దమయమును శతకోటి గ్రంథ (32 అక్షరములు గ్రంథము అని పరిభాష) విస్తరము కలది అగు పురాణమును ధర్మశాస్త్రములతో కూడ మొదట బ్రహ్మ స్మరించి (పూర్వ కల్పములందు తనకు తెలిసిన వానినే) కొనెను. తరువాత అతని ముఖముల (నోళ్ల) నుండి వేదములును ఎనిమిది (ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, అర్థాపత్తి, అసంభవము, ఐతిహ్యము, పురాణము) ప్రమాణ ములతో కూడ న్యాయ విద్యలు బయటకు వచ్చెను. వేదములను ఆవృత్తము చేయుచునే ఉన్న వాడును ప్రజలను సృష్టింప సంకల్పించిన వాడును అగు అతని మానసమునుండి సంకల్పముచే మొదట సృష్టింపబడిన పుత్రులు మానస పుత్రులైరి. వారు వరుసగా-మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతుడు, వసిష్ఠుడు, భృగువు. వీరందరును జీవ పుత్రులు (తమ నుండి పుత్రులను ఉత్పన్నులనుచేసి జీవింప జేసినవారు. ఆత్మహీనులు (దేహము లేనివారు) అగు బ్రహ్మ పుత్రులను గురించి తెలిపెదను. బ్రహ్మ కుడిబొటన వ్రేలి నుండి దక్షుడు (ఇతడు మాత్రము దేహము కలవాడు. సృష్టిని కొనసాగించి ప్రజాపతి ఐనవాడు.) నాభినుండి ధర్మము హృదయము నుండి మన్మథుడు, కనుబొమ్మల నడుమనుండి క్రోధము, క్రింది పెదవినుండి లోభము, బుద్ధినుండి మోహము, అహంకారము నుండి మనస్సు, చెవి నుండి ప్రమోదము (సంతోషము), కన్నులనుండి మృత్యువు అను కుమారులును అంగజ అనెడి కన్యయు కలిగిరి.
మనువు మరల ఇట్లడిగెను, బుద్ధియొక్క కుమారుడు మోహము అహంకారుని పుత్రుడు మనస్సు అంటిరి. బుద్ధి అనగా ఏమి? అహంకారుని కుమారుడగు మనస్సు అనగా ఎట్టిది?
మత్స్యము ఇట్లు పలికెను, సత్వము రజస్సు తమస్సు అనునవి మూడు గుణములు. వీటి మూడింటి సమత్వస్థితిని ప్రకృతి, ప్రధానము, అవ్యక్తము అందురు. ప్రకృతి ఈ మూడు గుణముల తోనే సృష్టి జరుపును. సృష్టిలోని పదార్థముల పరిణమింప జేయును. లయముకూడ పొందించును. క్షోభము (స్పందము) పొందిన మూడు గుణములనుండి ఒకే మూర్తియగు ప్రకృతి నుండీ ముగ్గురు దేవతలు జనించిరి. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వికారము నొందని ప్రధానము నుండి మహత్తత్త్వము పుట్టును. దాని మూలముననే లోకములకు మహాన్ (దృష్టికి గోచరమగునంత పెద్ద పరిమాణము కలవి) అను ప్రసిద్ధి ఏర్పడును. మహత్ నుండి మాన (గర్వ)మును వృద్ధిచేయు అహంకారము దానినుండి బుద్ధి వశములగు ఐదు జ్ఞానేంద్రియములు-త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణములును కర్మ వశములగు ఐదు వాక్పాణిపాద పాయూపస్థములను కర్మేంద్రియములును జనించెను. వరుసగా స్పర్శము రూపము శబ్దము రసము గంధము అనునవి జ్ఞానేంద్రియములకు గోచరములగు విషయములు. వచనము ఆధానము గతి ఉత్సర్గము ఆనందము (ఆనందింపచేయుట) అనునవి కర్మేంద్రియములు చేయు పనులు. ఈ ఇంద్రియముల జ్ఞాన కర్మలక్షణములుగల మనస్సు వీనితో పదునొకండవది. విద్వాంసులు మాత్రము దర్శింపగల సూక్ష్మములగు ఇంద్రియావయవములు పంచతన్మాత్రలను (పంచభూత సూక్ష్మాంశములను) ఆశ్రయించి ఉండును. అందుచేత ఈ ఇంద్రియ తన్మాత్రల సంఘాతము శరీరము అనబడును.
ప్రకృతి ఆ పరమేశ్వరుని సృష్టి సంకల్పముచే ప్రేరింపబడినదగుచు పరమేశ్వరుని మనస్సు, ప్రకృతిని పరిణమింపజేయును. శబ్ద తన్మాత్రనుండి శబ్ద గుణము కల ఆకాశమును అది పరిణమించగా శబ్దస్పర్శ గుణములుగల వాయువును, అది పరిణమించగా శబ్ద స్పర్శరూప గుణములు కల అగ్నియు, అది పరిణమించగా శబ్ద, స్పర్శ, రూప, రసములుగల జలమును, అది పరిణమించగా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు గుణములుగాగల పృథివియు ఉత్పత్తి పొందెను. వీటి అన్నింటిలో బుద్ధి శ్రేష్ఠమయినది. ఐదు మహాభూత (సూక్ష్మ)ములు అహంకారము బుద్ధి అవ్యక్తము మనస్సుతో కూడ పదునొకండు ఇంద్రియములు ఇంద్రియ విషయములు అను ఇరువదినాల్గు తత్త్వములకు అతీతుడగు(ఇరువది ఐదవ) పురుషుడు (జీవుడు) ఈ ఇరువది నాల్గింటిచే సాధింపబడిన సుఖదుఃఖాదులను అనుభవించుచుండును. అంతర్యామి అగు ఈశ్వరునకు వాచకుడనియు జలాత్మ అనియును పేరులు. ఇతడు ఇరువది ఆరవవాడు. అందుచే మానవ శరీరము నాశ్రయించిచేయు తత్త్వ విచారణమును షడ్వింశకమందురు. ఇట్లు ఇది సంఖ్యారూపము కావున దీనిని సాంఖ్యము అని కపిలుడు మొదలగు వారు అందురు. (సంఖ్యా అనగా జ్ఞానము అని అర్థము)
బ్రహ్మ ఇట్లు షడ్వింశత్ తత్త్వరూపమయిన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపజేసెను. అతడు లోకసృష్టి జరుపు సంకల్పములో సావిత్రీ తత్త్వమును హృదయమున నిలుపుకొని సమాధిస్థితుడయ్యెను. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమయి సగము స్త్రీరూపమును సగము పురుషరూపమును అయ్యెను. ఆ స్త్రీరూపమునకే శతరూప, సావిత్రి, సరస్వతి, గాయత్రి అని వ్యవహారము. తన దేహమునుండి ఉత్పన్నయైన ఆమెను అతడు తన కుమార్తె (ఆత్మజ) అనియు ఆయనయే వ్యవస్థ చేసెను. ఐనను ఆదేవుడు ఆమెను చూచిన తత్క్షణమే కామబాణములచే బాధనొంది ఎటువంటి రూపము! ఎటువంటి సౌందర్యము! అని ఆశ్చర్యముతో పలికెను. వసిష్ఠుడు మొదలగువారు అక్కా! అని అరచిరి! కాని బ్రహ్మ ఆమె మొగమును చూచు ఆసక్తిలో అది ఏమియు చూడలేదు. మాటిమాటికి ఎంత సౌందర్యము! అని పలుక సాగెను. అంతలో తన ముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతనికి కనబడెను. అంతట ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణము చేసెను.
ఆమె సౌందర్యమును చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆపని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్లుకల దక్షిణ ముఖమును, అశ్చర్యముతో వణకుచున్న పెదవులుకల పశ్చిమ ముఖమును, మన్మథ బాణములచే బాధపడు చున్న (కామ పరవశమయిన) నాలుగవదగు ఉత్తర ముఖమును కలిగెను. అతడపుడట్లు కామానుచరుడగుట వలన అదిచూచి ఆ సావిత్రి పైకి గంతువేయుచు ఇదేమను కుతూహలముతో పైకి ఆకాశమువైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు ఐదవదగు ఊర్ధ్వ ముఖము ఉత్పన్నము అయ్యెను. అట్లు ఆ ప్రభువునకు అక్కడక్కడనే మరొక ముఖము (ఐదవది) కూడ మొలచెను.
కాని తన కుమార్తెనే పొందగోరుటవలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ తీక్షణమగు తపస్సంతయు నాశమునందెను. అది చూచి కలవరపడుచున్న తన (మానస) పుతులతో బ్రహ్మ మీరందరును కూడి దేవాసురమానవులు మొదలగు ప్రజలను సృష్టించుడు. అని ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారందరును వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించిరి.
మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో ఉన్నదై ఏ దోషమును లేని పవిత్రురాలగు ఆ శతరూపను విశ్వమునకు ఆత్మ భూతుడగు ఆ బ్రహ్మ వివాహమాడెను. అతడు (లోక) విభుడయ్యును ఆమె విషయమున కామముచే బాధపడిన వాడయ్యెను. ఆ దేవుడు సామాన్య మానవునివలె నూరేండ్లపాటు తన స్థానమగు పద్మపునడుమ అనెడి గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను. చాల కాలమునకు బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను. అతనికే 1.స్వాయంభువుడు (స్వయంభూ యొక్క కొడుకు) అనియు 2. విరాట్ (వివిధ రూపములతో ప్రకాశించువాడు) అనియు పేరులు మనకు అనుశ్రుతముగా వినవచ్చుచున్నవి. ఇతని రూపమును గుణములును బ్రహ్మరూప గుణములతో సమానముగా ఉండుటచే అతనికి 3. ఆదిపూరుషుడు (మొదటి పురుషుని నుండి పుట్టిన మరొక పురుషుడు.) అనియు పేరు. ఈ స్వాయంభువుని నుండి స్వారోచిషుడు, ఉత్తముడు మొదలగు పదునాలుగు మంది మనువులు బ్రహ్మతో సమానముగా రూప గుణములు కలవారు ఉత్పన్నులైరి. ఇప్పుడు వారిలో ఏడవ మనువు పాలించుచున్నాడు.