మత్స్య మహా పురాణము
నద్యాది వైకృత శాంతి
గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను, నదులును హ్రదములును, సెలయేళ్ళు, నీటి ఊటలు బుగ్గలు మొదలగునవి నగరమునకు దగ్గరగా నున్నవి దూరముపోవుట, దూరమున ఉన్నవి. దగ్గరకువచ్చుట, వీటి నీరు రుచి తప్పుట, వివర్ణమగుట కలుషమగుట, క్రాగుట, నురుగులు సుడులు ఏర్పడుట, కలతపడుట, కాలువల నీటియందు, నూనె పాలు విషము ప్రవహించుట జరిగినచో ఆరు మాసములకులోగా ఆ దేశమందు పరచక్ర భయమేర్పడును, జలాశయములు మ్రోగుట, మందుట మంటలనో, పొగనో ధూళులనో వెలిక్రమా్యుట, త్రవ్వకయే నీరు పైకి వచ్చుట, జలాశయములందు జల జంతువులు అధికమగుట, నీటినుండి సంగీతధ్వనులు వినబడుట జరిగినచో జనమరణ భయము కలుగును. దీని శాంతికై దివ్యములగు జలములును తేనెయు -నూనెలును జలాశయములందు వేయుచు వారుల మంత్రములతో హోమము జరుపవలెను; వారుణమంత్ర జపము జరిపించవలయును.బ్రాహ్మణులను తేనెతో, నూనెతో కూడిన పరమాన్నము భుజింపజేయవలయును. గోవులను తెల్లని వస్త్రములను ఉదకుంభములను బ్రాహ్మణులకు దానము ఇవ్వవలెను. దోష శాంతి యగును.