మత్స్య మహా పురాణము
శుక్ర వృషపర్వ సంవాదము
శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను, తరువాత కవిమహామునికి కుమారుడును భృగు వంశ శ్రేష్ఠుడును అగు శుక్రుడు మిగుల త్వరతో పోయి కొలువుదీరి యున్న వృషపర్వునితో ఇట్లు పలికెను, ”రాజా! భూమిలో విత్తనమువేసినను వెంటనే ఫలించనట్లు ఆచరించిన అధర్మము కూడ వెంటనే ఫలించదు. మెల్లగా అవృత్తి చేయుచుపోగా అది వేళ్ళనుకూడ పెకలించి వేయును. తాను ఆచరించిన పాపకర్మము తనయందో తన కుమారులయందో మనుమలయందో, ముని మనుమలయందో ఫలింపకున్నను మూడు తరముల దాటి తరువాతివారికైనను తగలితీరును. తినిన బరువయిన ఆహారము ఉదరములో రోగముగా పరిణమించినట్లు పాపముకూడ ఫలించియే తీరును. ఆనాడు నీవు పుణ్యశీలుడును ధర్మజ్ఞుడును నా శుశ్రూష చేయుచు నా ఇంటిలో ఉన్న వాడును అంగిరసుని మనుమడును బ్రాహ్మణుడును ఏ విధముగను చంపరాని వాడును అగు కచుని చంపించుటవలనను నా కూతును కొట్టించుట వలనను నేను నిన్నును నీ వారి నెల్లరను కూడ విడిచివేయుచున్నాను. నీతో కలిసి ఈ దేశము నందుండ జాలను. నీవు ఇప్పుడు నన్నును మిథ్యాప్రలాపియగు (అనినంత పనిని చేయజాలని) దైత్యునిగా భావించుచున్నట్లున్నది. అందు చేతనే నీ పొగరుబోతు కుమార్తెను ఏమియు అనక ఊరకున్నావు.”
వృషపర్వు డిట్లనెను, ”భార్గవా! నీవు స్వధర్మపరుడవు. మృషలుపలుకవు. అని నాకు తెలియును. నీవు సత్యమునకును ధర్మమునకును ఆధారమవు. కనుక నీవు మమ్ముల ననుగ్రహింప వేడుచున్నాను. నీవు ఇపుడు మమ్ములను విడిచి వెళ్ళినచో మేము సముద్రములోనికి పోయి దాగవలసినదే. మాకంతకంటె వేరే దిక్కులేదు.”
శుక్రుడు ఇట్లనెను, ”సముద్రములో ప్రవేశించినను సరియే. మీరందరును దిక్కులకు పారి పోయినను సరియే. నాకు మిగుల ప్రీతిపాత్రురాలగు నా కుమార్తెకు ఆప్రియము జరిగె ననునది నేను వినజాలను. నా జీవితమునకు ఆధారమగు దేవయానిని నీవు అనుగ్రహింప జేసికొనినచో ఇంద్రునకు బృహస్పతివలె నేను నీ యోగక్షేమములను చూతును.”
వృషపర్వుడు: ”భార్గవా! ఈ భూలోకమున రాక్షసుల ఆస్తిగా ఏనుగులు గుర్రములు గోవులు ధనము మొదలయినది ఏది యేదిగలదో దానికంతటి కిని రాక్షసులకును నాకును నీవే ప్రభువవు.”
శుక్రుడు: ”రాక్షస రాజా! మహాసురులారా! మీరన్నట్లు దైత్యేంద్రుల ద్రవ్యమంతటికిని నేనే ప్రభుడ ననుట నిజమయినచో దేవయానిని బ్రతిమాలి ఆమెనుఅనుగ్రహింపజేసికొనుడు.”
తరువాత వెంటనే శుక్రుడు త్వరితగమనముతో వృషపర్వునితో కలిసి దేవయాని ఉన్నచోటికి వచ్చి ”పుత్రీ! నీవు అదృష్టవంతురాలవు. రాజు నీ మాటను అంగీకరించి నాడు” అనెను. దేవయానియు ”తండ్రీ! భార్గవా! రాజ ధనమునకు అంతటికిని నీవు స్వామివి అగునో కాదో నాకేమి తెలియును? నీ మాట నేనెట్లు అంగీకరింతును? రాజే నాతో స్వయముగా ఆ మాట చెప్పనిమ్ము” అనెను వృషపర్వుడు! దేవయానీ! నీ హృదయము నిర్మలమయి నీవు ఒక చిరునవ్వు నవ్విన మాకంతియ చాలును. నీవేది ఏది కోరిన నది ఎంత సుదుర్లభమయినను దానిని నెరవేర్చుదును. దేవయాని: ”తనదాసీకన్యా సహస్రముతో శర్మిష్ఠ నాకు దాసి కావలయును. నాతండ్రి నన్నెచ్చటికిచ్చిన నచ్చటి కామెయు నావెంట రావలయును.” వృషపర్వుడు: ”దాదీ! నీవు పొమ్ము. శీఘ్రమే శర్మిష్ఠను పిలిచికొని రమ్ము. దేవయాని ఏది కోరిననది ఆమె చేయ వలయును.
వెంటనే దాది శర్మిష్ఠకడకు పోయి ఇట్లు చెప్పెను, అమ్మాయీ! శర్మిష్ఠా! లెమ్ము. మీ పుట్టింటివారికి సుఖము కలిగించుము. దేవయాని ప్రేరణచే శుక్రుడు తన శిష్యులను విడుచు చున్నాడు. అందులకై నీవు ఇపుడు దేవయాని కోరినదెల్ల చేయవలసియున్నది. నీవు ఎంతయో శోభనరూపురాలవు. ఐనను దేవయానికి దాసీత్వమును అంగీకరింపవలసి యున్నది. శర్మిష్ఠ: “ఆమె ఏదికోరిన నేనిపుడది చేయుదును. నామూలమున శుక్రుడుగాని దేవయాని కాని కోపింప కుండుట కావలయును.”
వెంటనే తనతండ్రి ఆజ్ఞతో శర్మిష్ఠ వేయిమంది తన దాసీకన్యలు తనవెంట రాగా పాలకి నెక్కి తనతండ్రి పురము నుండి బయలు వెడలెను. శర్మిష్ఠ దేవయానీతో: ”నేను నా దాసీ కన్యా సహస్రము నావెంటరాగా నిన్ను నీతండ్రి ఇచ్చినచోటికి నీవెంట వత్తును. ” దేవయాని: ”స్తుతించుచు, యాచించుచు, ప్రతిగ్రహించుచు ఉండువాని కూతురను నేను. స్తుతించబడు వాని కూతురవు నీకు నాకు దాసి వెట్లగుదువు?” శర్మిష్ఠ: ”ఏ విధముగ నైనను కన్య తన పుట్టినింటి వారికి సుఖము కలిగింపవలెను కనుక నీ తండ్రి నిన్నెచ్చటికి ఇచ్చిన అచ్చటికి నీ వెంట వత్తును.” ఇట్లు వృషపర్వుని కూతురు తనకు దాసి యగుటకు అంగీకరించగా దేవయాని తన తండ్రితో ఇట్లనెను: ”ద్విజ శ్రేష్ఠుడవగు తండ్రీ! నేను హర్షముతో పురములో ప్రవేశింతును. మీ విజ్ఞానమును విద్యాబలమును ఆమోఘమయినవి.” తన కూతురు ఇట్లు పలికిన మీదట మిగుల గొప్పకీర్తి కల ఆ శుక్రుడు తనను రాక్షసులు ప్రశంసించుచుండ వృషపర్వుని పురము ప్రవేశించెను.