దేవయానీ వనవిహారము

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను, ఇట్లు చాలాకాలము గడచెను. దేవయాని ఆవృషపర్వుని పురమునందే నివసించుచుండెను. ఒకమారు ఆ మహాసుందరి క్రీడార్థమయి తాను పూర్వము పోయిన వనమునకే వెళ్లెను. తనదాసీ సహస్రముతో శర్మిష్ఠయు ఆమె వెంట నుండెను. దేవయాని అప్పటి ప్రదేశమును చేరెను. ఆయా చెలికత్తెలు అందరితో కూడి మిగుల సంతోషముతో తన ఇచ్చవచ్చినట్లు విహరించెను. వారందరును ఆ వసంతరువులో చాల ఆనంద ముగా క్రీడించుచు మధ్యమును త్రాగిరి. వివిధ భక్ష్యములను భక్షించుచు వివిధ ఫలములను తినుచుండిరి.

ఇంతలో నహుష పుత్రుడగు యయాతి దైవసంకల్పమున వేటకై వచ్చి అలసి నీటికై ఆ ప్రదేశమునకే వచ్చెను. అచ్చట అతనికి దేవయానియు శర్మిష్ఠయు వేయిమంది శర్మిష్ఠ దాసీ జనమును కనబడిరి. వారందరును దివ్యాభరణములతో అలంకరించుకొని మద్యము త్రావుచు విలాసములు అనుభవించుచుండిరి. వారందరనడుమ దేవయాని కూర్చుండి యుండెను. ఆమె చిరునవ్వు నిర్మలము. ఆమె రూపము సాటిలేనిది. ఆమె స్త్రీలలో ఉత్తమురాలు. శర్మిష్ఠ ఆమెకు పాదములొత్తుట మొదలగు సేవలు చేయుచుండెను.

యయాతి ఇట్లు పలికెను, ”ఇచ్చట ఇద్దరు కన్యలున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్యా సహస్రము పరివారముగా ఉన్నది. కనుక నేను ఆ ఇద్దరి నామగోత్రములు తెలిసికొనగోరు చున్నాను. దేవయాని: ”రాజా చెప్పెదను. నామాటనే ప్రమాణముగా గ్రహింపుము. రాక్షస గురుడు శుక్రుడున్నాడే-అతని కూతురను నేను. ఇది నాపరిచయము. ఈమె నాకు చెలిగా ఉండు దాసి. నేనెచ్చటికి పోయిన అచ్చటికి వచ్చును. ఈమె దానవేంద్రుడగు వృషపర్వుని కూతురు.” యయాతిః ”ఈమె రాక్షసరాజు కూతురు. చక్కని కనుబొమలు (మొదలగు మహా సౌందర్య లక్షణములు) కలిగిన ఉత్తమస్త్రీ కదా ఈమె! ఈకన్య నీకు దాసి ఎట్లయినది? నాకు విన వేడుకగా ఉన్నది.” దేవయాని: ”రాజూ! ప్రతిఒక్కరును విధి విధించిన విధానమును అనుసరించి నడుచుకొన వలసినదే. అది ఎరిగినచో నీకు ఆశ్చర్యము కలుగదు. నీ రూపమును వేషమును రాజునకువలె నున్నవి. బ్రాహ్మణుని వాక్కు కలిగి ఉన్నావు. నీ పేరు ఏమి? ఎక్కడి వాడవు? నీ తండ్రి ఎవరు?” యయాతి : ”బ్రహ్మచర్య వ్రతమున నేను వేధము అంతయు అధ్యయనము చేసితిని. నేను రాజును. రాజవంశమున పుట్టినవాడను. నా పేరు యయాతి.” దేవయాని: ”ఏదో పని మీదనే నీవీ ప్రదేశమునకు వచ్చియుందువు. నీటినుండి లభించుదాని నేదైన గ్రహింపగోరియా? వేట కోరియా?” యయాతి: ”నేను వేటకై వచ్చి నీటికొరకు ఇక్కడకు వచ్చితిని. నీవడిగిన అన్ని ప్రశ్నలకును సమాధానము ఇచ్చితిని. నేను పోయివత్తును. అనుజ్ఞ ఇమ్ము.” దేవయాని: ”ఈ రెండువేల దాసీకన్యాజనముతోను దాసియగుశర్మిష్ఠతోను నీ ఆధీనురాల నగుచున్నాను. పూజ్యుడవగు నీవు నాకు మిత్రుడవును భర్తవును కమ్ము. యయాతి: ”అగుగాక! నీవు శుక్రుని కూతురవు పూజ్యురాలవు. కోపింపకుము. నేను నిన్ను వివాహమాడ అర్హుడను కాను. నీ తండ్రి క్షత్రియులతో వివాహసంబంధమును అంగీకరించడు.” దేవయాని: ”బ్రహ్మము క్షత్రము తోను క్షత్రము బ్రహ్మముతోను పరస్పరము కలిసియే యున్నవి. (బ్రహ్మము-బ్రాహ్మణజాతి ప్రధాన లక్షణములు; క్షత్రము - క్షత్రియజాతి ప్రధాన లక్షణములు) నీవు ఋషివీ-ఋషి పుత్రుడవును. నహుష కుమారుడవు నీవు. ఇప్పుడయిన నీవు నన్ను పెండ్లాడుటకు అంగీక రించుము. యయాతి: ”సుందరీ! నాలుగు వర్ణములును ఒక దేహము నుండి పుట్టినవే. కాని వాని ధర్మములును రూపములును వేరువేరు. ఈనాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. (కనుక శ్రేష్ఠ వర్ణ స్త్రీని తక్కువ వర్ణపు పురుషుడు పెండ్లాడరాదు.) దేవయాని: ”రాజా! ఈనా పాణిని ఇంతకుముందు ఏ పురుషుడును గ్రహించలేదు. మొట్టమొదట (బావిలో నుండి తీసినప్పుడు) నీవే అది పట్టుకొంటివి. అందుచేతనే నేను నిన్ను వరించుచున్నాను. ఋషి పుత్రుడవును స్వయముగా ఋషివి ఐన నీవు గ్రహించినది ఈచేయి. నేను అభిమానవతిని, అట్టి నాయీ కరమును మరెవరుగానీ ఎట్లు గ్రహింపదగుదురు? యయాతి: ”కోరలనిండ విషము కలిగినదియు కోపించినదియు అగు సర్పము కంటెను-అన్ని వైపులకును మంటలు రేగుచున్న అగ్నికంటెను విప్రుడు స్పృశించి కలతపరచరానివాడు. ఈ విషయము విజ్ఞులకు మాత్రమే తెలియును. దేవయాని: ”పురుషశ్రేష్ఠా! ఇది యెట్లో తెలియగోరుచున్నాను.

అంత యయాతి, ”పాము ఒక్కనినే కరచును. శస్త్రము ఒక్కనిని మాత్రము చంపును. కాని-కోపించిన బ్రాహ్మణుడు రాష్ట్రములను (గ్రామాదిజన నివాసస్థానములను) పురములను (రాజధానీ స్థానములను) కూడ నశింపజేయగలడు భయపడకుము. ఈ కారణముతోనే బ్రాహ్మణుడు పైచెప్పినవాటి అన్నిటి కంటెను దురాధర్షతరుడు (స్పృశించి కలతపరచరాని వాడు) అని నేనంటిని. అందువలననే పూజ్యురాలవగు నిన్ను నీ తండ్రియే స్వయముగా ఇచ్చిననే కాని వివాహమాడను. దేవయాని: ”రాజా! నేనై స్వయముగా కోరినందునను మాతండ్రి స్వయముగా నన్ను నీకు ఇచ్చిన మీదటను నన్ను నీవు పెండ్లాడబోవుచున్నావు. అంతేకాని నీవు కోరుటలేదు. అడుగకయే ఇచ్చిన దానిని ప్రతి గ్రహించుట దోషము కాదు.

            పిమ్మట వెంటనే దేవయాని తన దాదిని తన తండ్రి ఆశ్రమమునకు పంపెను. ఆమె శుక్రునితో తాను వినిన విషయము వినినట్లుచెప్పెను. వినిన వెంటనే శుక్రుడును వచ్చి రాజునకు దర్శన మిచ్చెను. ఇట్లు తన దగ్గరకు వచ్చిన విప్రుడు-వేదములందు మహాపండితు-కవిమహాముని కుమారుడు అగు శుక్రుని యయాతిరాజు నమస్కరించి దోసిలిపట్టి వినయముతో వంగి ఎదుట నిలువబడెను. శుక్రుడు అతనిని చాల ఇంపైన నెమ్మది మాటలతో పలుకరించి మాటలాడెను.

దేవయాని, ”ఈ రాజు నహుషపుత్రుడు. ఇతడు ఒకప్పుడు దుర్గ ప్రదేశము (తప్పించు కొని బయటపడ అలవికాని ప్రదేశము) నందున్న నాచేతిని పట్టుకొనెను. (పాణిని గ్రహించెను. ) నీకు వందనము. నన్ను ఇతని కిమ్ము. లోకమున నేను మరెవ్వరిని పతిగా వరించను.” శుక్రుడు: ”ఓ వీరా! నిన్ను ఈ నా కుమార్తె తానే వరించినది. అది నేను ఇష్టపడుచున్నాను. ఈమెను నేనే నీకు ఇచ్చుచున్నాను.” నీ వీమెను గ్రహించి రాణిగా చేసికొనుము. యయాతి: ”పూజ్య బ్రాహ్మణుడ వగు భార్గవా ఇట్లు చేయుటవలన నాకు అధర్మదోషముకాని, వర్ణసంకరముచేసిన పాపముకానీ నాకంటకుండునట్లు నాకు వరమీయ ప్రార్థించుచున్నాను.” శుక్రుడు, ”ఇదే కాదు. నీ వింకేదయిన ఈప్సితవరమును కూడ కోరు కొమ్ము, ఇత్తును. నిన్ను అధర్మమునుండి విడిపించుచున్నాను. ఈ పెండ్లి వలన నీకు ఎట్టి హానియు కలుగదు. నీ పాపములను నేను ఖండించు (తెగనరకు) చున్నాను. ఈ శుచిస్మితయగు దేవయానిని ధర్మపత్నిగా గ్రహింపుము. ఇది ధర్మమేకాని ధర్మము కాదు. ఈమెతోకూడి నీవుసాటిలేని సుఖ మనుభవింపుము. వృషపర్వుని కూతురగు ఈ కుమారి శర్మిష్ఠయు నీకుసతతము ఆదరణీయురాలే. కానినీవుఈమెను శయనమున గ్రహించరాదు.

ఇట్లు పలికిన శుక్రునకు ప్రదక్షిణము చేసి ఆ మహాత్ముని అనుమతి పొంది యయాతి హర్షముతో తన రాజధానికి పోయెను.