పార్వతీదేవీ వృత్తాంత కథనము

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, ఇట్లు సింహాసనమునందు కూర్చుండి యున్న తారకాసురుని కడకు వచ్చి ద్వారపాలుడు ఎదుట నిలిచెను; వాడు శుచియై చీనాంబరము (పట్టు వస్త్రము) ధరించియుండెను. వాడు మోకాళ్ళు నేలకు ఆనించి చేతితో నోరు మూసికొని అల్పాక్షరములు కలిగియుండియు స్పష్టార్థములతో అలంకృతమగు వచనమును రవి సమూహములంత ప్రకాశమానమగు శరీరముకల తారకు నుద్దేశించి ఇట్లు పలికెను, ప్రభూ! “కాలనేమి దేవతలను బంధించికొనివచ్చి వాకిట నిలిచియున్నాడు. బందీలు ఎట నుండ వలయునని మనవి చేయుచున్నాడు. అనగా ప్రతీహారుని వచనమువిని దైత్యుడిట్లనెను. “వారు తమ ఇచ్చ వచ్చినచోట ఉండవచ్చును. భువనత్రయమును నాఇల్లే. వారికి పాశబంధములు మాత్రము త్వరగ వదలించుడు.” ఇట్లు చేసిన తరువాత దేవతలు నొచ్చుచున్న మనస్సులతో జగద్గురుడును (గురుడు=తండ్రి) పద్మ సంభవుడును శరణ్యుడునునగు బ్రహ్మను దర్శింపబోయిరి. ద్వారపాలురచే నివేదించబడి ఆ ఇంద్రాదులు శిరస్సులు ధరణికి మోపి స్పష్టములగు వర్ణములును అర్థములును కల వచనములతో కమలాసను నిట్లు స్తుతించిరి.

అది మధ్యాంతములందెల్ల వ్యాపించియుండు ప్రణవత్రయ స్వరూపుడును ఇప్పుడిట్లు అనంతభేద భిన్నమైయున్న ఈ విశ్వమునకు మొదట అంకురమై ప్రసవరూపుడై సంభవ (సృష్టి) రూపుడై అనంతరము సత్త్వ (స్థితి) రూపుడై కడపట సంహారరూపుడునగు కాలమూర్తీ: నీకు నమస్కారము. నీవు నీ శరీరమును స్వమహిమతోనే వ్యక్తమొనర్చి నీపేరితో ప్రసిద్ధమగు బ్రహ్మాండము అండము నుండియే (స్థూల ప్రపంచముగా) రూపొంది అచింత్యుడవయితివి. ఈ అండము నుండియే నీవు ద్యావా పృథివులనెడు ఊర్ధ్వాధర ఖండములుగా విభాగమొనర్చితివి.

నీయందే ఈ విశ్వము వ్యక్తినొంది నీనుండియే సంభవించినది; నీవు రచించిన వికారము జగత్పరిణామము విషయమున మాకు తెలిసినది ఇదియే. జన్మము లేనివాడును శాశ్వతుడును అనంతుడును దేహధారులు అంతఃకరణ వర్తియునగు నీవు వ్యక్తుడవగుటయే అనగా జగత్తుగా పరిణమించుటయే నీ జన్మము. ద్యులోకము నీ శిరస్సు. చంద్ర, సూర్యులు నీకన్నులు. సర్పాది సరీసృపములు నీకేశములు. దెసలు నీచెవులు; నీ అవయవములందే మూల ప్రకృతియు ద్యులోకమును నున్నవి. భూమి నీ పాదములు. నీ నాభిరంధ్రము నందు సముద్రములున్నవి; నీవు వేదములచే మాయయు కార్యమును కారణమును శాంతుడవును ఆద్యజ్యోతియును నీవేయని చెప్పబడి ప్రసిద్ధుడవయి యున్నావు. వేదార్థముల యందు అనుభవముగల వృద్ధులగు వారు నిన్ను హృత్పిండాంత ర్భాగమున అమరియున్న ప్రాచీనతమ తత్త్వమునుగా చెప్పుచున్నారు; యోగనిష్ణాతులు నిన్ను ఆత్మనుగా చెప్పుదురు; సప్త సూక్ష్మ తత్త్వములుగా ప్రసిద్ధములగు 1. మహత్; 2. అహంకారము; 3. పంచతన్మాత్రలు (సూక్ష్మ భూతములు) నీవేయని సాంఖ్యులందురు. ఏ ఏడింటికిని హేతువగు ఎనిమిదవతత్త్వముగా పేర్కొనబడిన (అవ్యక్త) తత్త్వమును కూడ స్వస్వరూపముతో నీవే అపిధానుడవై మరుగుపడిన, అసాక్షాద్భూత, రూపముతో ఉజ్జీవింప జేయుచున్నావు. దృశ్యమగు స్థూల ప్రపంచమును (స్థూల భూతములను కూడ) సూక్ష్మమూర్తిని నీవే సృష్టించితివి; కారణ తత్త్వములు అని కొందరచే చెప్పబడినవి అదిసర్గమం (సృష్టియం)దు నీ నుండియే ఉత్పన్నమయినవి; మరల నీనుండియే అవి స్వస్వవాసనను (సంస్కారమును) పొందును. ప్రపంచమునకు భావ వ్యక్తిని (రూప స్పష్టీకరణమును) దానికి వాసమును (స్థితిని) దానికి సంహారమును అనంతత్వమును (సంసారము అనాదికావున) కలిగించువాడవు నీవే; గూఢమును అమేయమును (తత్త్వమెరుగరానిది, పరిమితి నిర్ణయించనలవికానిది) సంఖ్యా వికల్పమునకు అందరానిదియగు కాలముకూడ నీ సంకల్ప మాత్రముచేత అంతము నందును. స్థూల భూతములు అనియు సూక్ష్మభూతములు అనియు పేర్కొనబడినవి ఏవి కలవో వాని అంతర్భాగమునవానికి ఆత్మ భూతుడవైయున్న వాడవును నీవే; పురాణ (శాశ్వత) రూపుడవగు నీవే వాటికంటెను స్థూల రూపుడవయియు ప్రపంచ రూపుడవయి పరిణమించి గోచరించుచున్నావు; భూతిభాజులు (సంభూతిని, జన్మమును - పొందు ప్రాణులు) పొందు ప్రభవము (ప్రభవము=ఉత్పత్తి) నందు భూతరూపుడవు (వారికంటె ముందుకూడ ఉన్నవాడవు) నీవే; అమరిన రూపమును నిరసించి (తొలగించుకొని) ఈ ప్రపంచమునకు భావి (తరువాతకూడ ఉండువాడు) కూడ నీవే; వ్యక్త ప్రపంచము స్థితి నొందుటకు అనుకూలమగు వ్యక్త వ్యాపారమును (ప్రవృత్తిని) నీవే కల్పించుచున్నావు. భక్తిభాక్కులగు వారికి నీవేరక్షకుడవనుట స్పష్టము; అనంతమూర్తీ! మాకును నీవు రక్షకుడవు కమ్ము.

అని ఇట్లు దేవతలు అవికారియగు బ్రహ్మను స్తుతించి వినమ్రులయి ఇష్టార్థ ప్రాప్తిని ప్రార్థించుచున్న మనస్సులతో నిలిచిరి. ఇట్లు స్తుతింపబడిన బ్రహ్మయును మిగుల అనుగ్రహ వంతుడయ్యెను. వరదుడనగుదునని వామహస్తముతో నిర్దేశించుచు ఇట్లు పలికెను:

ఆకస్మికముగ భర్త గతించగా భూషణములు విడిచిన స్త్రీవలె నీశరీరమును మొగమును వాడి కేశముల అలంకరణాదికము లేక ప్రకాశింపకయున్నదేమి. హుతాశనా! నీవు పొగలేకయు అడవిని కాల్చి చాలకాలమట్లే యుండి బూడిదతో కప్పువడినవాడివలె ప్రకాశింపకున్నావేమి? యమా! వ్యాధిమయమయిన శరీరముతో కూడి(నట్లు) అడుగడుగునను దండమును అసరా చేసికొని నడుచుచు ఉన్నావేమి? నిరృతీ! నీవు నిశాచరులకు అధిపతివై ఉండియు భయపడినట్లు తోచుచున్నావు; శత్రులను గాయపరచు నీవు రాక్షసేంద్రా! శత్రువు చేతిలో గాయపడినట్లున్నావే! సర్పములు చాల కాలమునకు ముందు విడిచిన (వట్టి త్రాటిరూపములోనున్న) పాశమును చూచుకొనుచు వరుణా! అగ్ని చుట్టివేసినవాడువలె తెగ ఎండిపోయియున్నావేమి? వాయుదేవా! శత్రువులచేతిలో ఓడిపోయినట్లు చేతోరహితుడవయి యున్నావేమి? పౌలస్త్యా! నీవు కుబేరత్వమును (ధనాధి పతిత్వమును) కోల్పోయినట్లు మాటాడకున్నావేమి? ఈ రుద్రులు శూలధారులయ్యు బహు శూలములు (కడుపు నొప్పులు) కలవారమని చెప్పకయే చెప్పుచున్నారు. ఎవరు మీయంతటి వారి తేజమును కూడ హరించిరి. మధుసూదనా! నీకరము తీక్ష్ణమును నల్లకలువవలె ప్రకాశించు నదియునగు చక్రముతో ప్రకాశించక ఏమియు చేతకాని దానివలె నయినదేమి? విశ్వతోముఖా! ఱెప్పవాల్పక నీవు నీ ఉదరమునందే జనించి (రక్షింతువని) అచ్చటనే దాగియున్న భువనములను (ఎట్లు రక్షింతునాయని) చూచుచున్నావేల? ఇట్లు వేదమూర్తి యగు బ్రహ్మపలుకగా వాక్కునకు ప్రధానుడు (ప్రకృతి, మూలకారణ) రూపుడు కావున దేవతలు వాయుదేవుని ప్రేరించిరి.

అంతట విష్ణువు మొదలగు దేవతల ప్రేరణచే వాయుదేవుడు చతుర్ముఖుడగు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను, చరాచర (ప్రపంచ విషయ) మును నీవెరుగుదువు కదా! దేవా! నీవు వధించిన క్రతువులు ఆశ్చర్యకర గుణములు కలవయి విస్తృతిని పొందెను. మరియు వాటిచే ద్విజనాధులును దేవగణములును పుష్టిని పొందినవారును తాము కోరిన ఫలములను పొందినవారునునయిరి. ఇదివరకును స్వర్గము దేవతలదిగా నుండెను! కాని ఇప్పుడో  -  నీవిచ్చిన వరయోగ సంబంధమున తారకుడు నిరంతరముగా దేవతల విమాన గణమును అపహరించుటతో స్వర్గలోకమిపుడు మరుదేశము (ఎడారి)తో సమానమయి యున్నది. సర్వగుణాతి శయముతో కూడిన ఏమేరు పర్వతమును సకల పర్వత రాజముగా చేసియుంటివో, అదియు నిరంతరముగా అధివాసమునకును విహారమునకును గగనమునందుపయోగించుటతో ఆ దానవుడు దాని శిఖరములను నెత్తములను భగ్నమొనర్చినాడు. దాని గుహల యందలి రత్నము లన్నియు దోచివేసి ఆపర్వత భాగములన్నియు బహు దైత్యులకాశ్రయముగా నొనర్చినాడు. దేవరాజా! ఆ మేరువు వానికి భయపడి విషాదముతో నిండిన శరీరము కలిగి కూర్చుండుటకు చాలకాలము దైత్యులకు ఉపయోగించునదై తన విమల కాంతులతో దిఙ్ముఖములను నింపుచునున్నది. ఆదియుగమున నీవే నిర్మించినవియు మొక్కపోనివియు భేదింపనలవి కానివియు అగు దేవతల వేలకొలది ఆయుధములు ఆదైత్యుని శరీరమును చేరగానే అల్పబుద్ధియగు వాని బుద్ధి పండితుల ఎదుట భేదిల్లిన విధమున భిన్న భిన్నములయి పోయినవి. వాని సేనాముఖము నందలి ధూళితో సర్వా వయవములును ధ్వంసముకాగా మేము వాని వాకిట ద్వారపాలురవలె నిలిచి మిగుల శ్రమమీదట ఆదేవ విరోధి సభలోనికి ప్రవేశము సంపాదించగలిగితిమి. గొప్పవారుగా అటనుండి వేత్రహస్తులు మమ్ములను కూర్చుండబెట్టగా నోరు మెదల్పక కూర్చుంటిమి. అటనున్న శత్రువులు మమ్మెగతాళి చేసిరి. “దేవతలారా! మీరు మహాపూజ్యులు. సర్వార్థములు సిద్ధి పొందినవారు; మీరు మిత భాషులు; ప్రశంసతో కూడినదియు అధికార్థములతో కూడినదియునగు మాట ఏదైనను ఇపుడెక్కువగా మాటాడుడు. ఇది దైత్య సింహుడుగు తారకుని సభ; ఇంద్రుని సభవంటిది. కాదిది” అని ఇట్లక్కడనున్న తారకుని సేవకులు మమ్ములను మిక్కిలిగా ఎగతాళి చేసి వెక్కిరించిరి. క్రతువులు మూర్తిమంతములయి అహర్నిశము వాని నుపాసించును; వదలినచో అపరాధ మగునేమోయని అవి క్షణమయిన వానిని వదలవు; సిద్ధ గంధర్వ కిన్నరులు తంత్రీవాద్యములతో మంద్రమధ్య తార త్రివిధలయలతో రాగయుక్తముగా వాని గృహములందు సన్నిహితులయియుండి గానము చేయుచుందురు. అయ్యయో! వాడు వీరు మిత్రులు వీరు శత్రువులు అని కాని వీరు గురుజనులు (బరువైనవారు) వీరు తేలికవారు అనికాని లెక్కపెట్టడు; మరుగు చొచ్చినవారిని కూడ విడిచివేయును; సత్యమునకు పరిశ్రయ మీయనే ఈయడు. వాని అవినయమును నిఃశేషముగ ఒక్కమాటలో ఇట్లు చెప్పవలసినదే, ఐనను కాకున్నను వాని అవినయమంతయు ఎవరు నిశ్శేషముగా చెప్పగలరు? సృష్టికర్తవగు నీవే ఈ విషయమున శరణము (రక్షకుడవు) కావలయును.

ఇట్లు దేవతలు (వాయు ముఖమున) తారకదైత్య చేష్టలు విన్నవించగా విని ఆ భగవానుడు చిరునగవు మొగమునందు తోచుచుండ వారితో నిట్లు పలికెను, దేవతలారా! దేవతలందరు కూడియు తారకుని చంపజాలరు. ఎవనికి వాడు వధ్యుడో అట్టి పురుషుడు త్రిభువనము లందు ఎచ్చటను పుట్టలేదు. నేను వానికి కోరిన వరములనిచ్చి త్రిలోకములను దహించివేయగల తపస్సునుండి వానిని వారించితిని. ఏడు దినముల వయస్సుగల శిశువు వలన తనకు మృతి కావలెనని వాడు వరము కోరెను. అట్టి సప్త దినవయస్కుడగు బాలుడు శంకరుని వలన ఎవడు కలుగునో, అతడే - రవి తేజస్కుడగు అతడే - తారకుని హంతయగును. భగవానుడును ప్రభువునగు శంకరుడు ఇంకను అపత్నీకుడుగా ఉన్నాడు. ఇదియుగాక ఏదేవి కరము ఎల్లప్పుడును ఉత్తానమయి (నిట్టనిలువుగను విప్పుకొనియు) ఉండునో ఆమె కుమారుడే వానిని చంపుననియు చెప్పియుంటినిగదా! ఇదిగో! ఈ దేవీకరము పరదమయి ఉత్తానమయియే యుండును కదా! ఆ దేవి ఇకముందు హిమశైల పుత్రియగును. శర్వాణియగు ఆమెయందెప్పుడు భగవానుడు కామప్రవృత్తుడై ఆ కుమారుని జనియింపజేయునో అప్పుడు ఆతనితో కూడి (యుద్ధము చేసి) తారకుడు తిరస్కృతుడు (నశించినవాడు) అగును. ఏ విధముగ ఇది జరుగునో ఆయుపాయము నేను చేసియుంటిని. ఎక్కువ వ్యవధానము లేకుండగనే తరువాత కొలది కాలములోనే వాని విభవమంతయు వినాశమందును. మనస్సులందు భయ సందేహములు లేక కొలదికాలము వేచియుండుడు అని పద్మసంభవుడు స్వయముగా చెప్పిన మాటవిని దేవతలు ఆయనకు నమస్కరించి తమతమ అనుకూలత ననుసరించి వెడలిపోయిరి.

దేవతలు వెడలిన అనంతరము లోకపితామహుడును దేవేశుడును అగు బ్రహ్మ సృష్ట్యాది యందు మొట్టమొదట ఏర్పడిన తన రూపమేయగు విభావరిని [ప్రళయకాల రాత్రిని] స్మరించెను. పిమ్మట వెంటనే భగవతి (దేవతా రూప) యగు రాత్రి బ్రహ్మదేవుని ఎదుట నిలిచెను. ఆ సమయమున ఆచట మరెవ్వరును లేరు. అట్టి వివిక్త స్థానమందు ఆ విభావరినిచూచి ఆమె నుద్దేశించి బ్రహ్మ ఇట్లు పలికెను: విభావరీ! దేవతలకొక మహా కార్యము ఇపుడు తటస్థించి యున్నది. వాని విషయమున నీవు చేయవలసిన పని నిశ్చిత స్వరూపమును తెలిపెద; వినుము. తారకుడను దైత్యేంద్రుడు దేవతలకు ధూమకేతువు వలె పీడాకరుడై ఉండుటేకాక జయింపబడక యున్నాడు. వాని నాశము కొరకై భగవానుడగు ఈశ్వరుడు కుమారుని జనియింపజేయును. అతడు తారకుని అంత మొందించు వాడగును.

శంకరుని భార్యయగు దక్షపుత్రి సతియుండెను గదా! ఆమె యొక కారణాంతరమున తన తండ్రి విషయమున కుపితురాలయ్యెను. (దేహత్యాగమును కూడ చేసెను) లోకభావని (సృష్టికిని స్థితికిని హేతుభూత) యగు ఆదేవి హిమశైల పుత్రియగును. సతీదేవి విరహముచే హరుడు జగత్రయమును శూన్యమయినట్లు భావించి సిద్ధ సేవితమగు హిమవత్పర్వత కందరమునందు తప మొనరించును. అతడట్లు కొంతకాల మామె జననమునకై ప్రతీక్షించుచు అట వసించును. (పార్వతియు ఆతనికై తపస్సు నాచరించును.) అట్టు మిక్కిలిగా తపస్సాచరించిన వారి కిరువురకును లోక శుభకరమగు కలయిక (వివాహ రూపమున) జరుగును. అనంతరము వారి కిరువురకును స్వల్పమగు వాక్కలహము జరుగవలయును. ఏలయన - అట్లు జరిగినచో తారకుని నాశము విషయమున సంశము ఉండదు. అందులకై నీవు సురతాసక్తి కారణముగా సంయోగము చెందుచుండు ఆ పార్వతీ పరమేశ్వరులకు సంతానము కలుగుటలో విఘ్నము కలిగించవలసి యున్నది. అది ఎట్లందువేమో - చెప్పెదను వినుము.

నీవు పార్వతీ మాతయగు మేనా గర్భమును ఆశ్రయించియుండి ఆ గర్భ స్థ పిండమునకు నీవర్ణము కలుగునట్లు చేయుము. అందువలన వివాహానంతరము శివుడు శృంగార వినోద పూర్వకముగా మాటలాడుచు (ఆమె దేహచ్ఛాయ విషయమున) విభ్రాంతి నొంది వినోదమునకై ఆమెను బెదరించును. (రాత్రిదేవీ దేహచ్ఛాయ నలుపుకావున ఆమె మేనా గర్భము నందు వసించి నాటినుండియు పార్వతీ దేహచ్ఛాయ సహజముగ తెలుపే అయినను నల్లగా కనబడునట్లు చేయును. వివాహానంతరము శివుడు పార్వతి యందపుడపుడు కనబడు నలుపు చాయనే గమనించి నల్లనిదానా! అని ఎగతాళి చేయుచు ఇట్టి నీవు నాకక్కరలేదని ఇట్లు బెదరించును.) అంతట పార్వతి కుపితురాలయి (ఆ నల్లని దేహచ్ఛాయను వదలించుకొని తెల్లనిచాయ సంపాదించి) గౌరి  -  గౌరచ్ఛాయ కలియగుటకై తపస్సాచరించపోవును. ఆమెయట్లు తప మవలంబించి శివుని వలన అమిత తేజోమండలమండితుడగు కుమారుని జనింపజేయును. అతడు నిస్సంశయముగ (తారకాది) దైత్యుల చంపువాడగును. దేవీ! నీవును లోకములకు దుర్జయులుగానున్న దైత్యులను చంపవలయును. కాని నీవు సతీదేవి (రూపయగు పార్వతీ) దేహముతో సంబంధము కలిగి (ఆమె దేహమునందావేశించి) యున్నంతవరకును నీవు దైత్యవధ చేయజాలవు. (పార్వతి తన తపోబలమున నిన్ను తననుండి వేరుపరచును. తరువాత ఆమె గౌరదేహచ్ఛాయతో గౌరియై శివునికడ కేగును. తరువాత శివుని యనుగ్రహమున కుమారుని కనును. ఈ నడుమ కాలములో నీవు మహిషుడు శుంభనిశుంభులు మొదలగు దానవులను చంపవలయును. దానిచే తారకుని బలమును తగ్గును. వారు స్త్రీవలన మరణమును కోరుట కుమారునివలన మరణము కోరుటయను వరములును నెరవేరి మరణింతురు. పిమ్మట పార్వతీ పుత్రుడు సప్తదిన వయస్క శిశువుగా తారకుని వధించును అని బ్రహ్మదేవుడు విభావరికి చెప్పి నీవు ఇట్లు చేయగా అమెయు తన స్వస్వరూపమును పొందగోరి పూనిన తపో నియమమును ముగించును. అంతట పార్వతియును తన స్వస్వరూపమును పొందును. నీ దేహమును సహజస్వరూపము నొందినదయి గౌరీ రూపమే తనయందు కలదిగానగును. నీరూపము, విభావరీ రూపము, ఆకృతియందు గౌరిగాను, దేహచ్ఛాయ మాత్రము నల్లదిగాను నగును.

నీవు ఇట్లు ఉమ (పార్వతి) రూపాంశముతో కూడిన దానవయ్యెదవు. వరదురాల వగు విభావరీ! లోకము నిన్ను (పార్వతితో) ఏకాత్మక తత్త్వము అనియు ‘అనంశ’ ‘ఈమె సాక్షాత్పార్వతియే కాని ఆమెకు అంశభూతురాలుకాదు’ అనియు భక్తితో పూజించును. ఆవిధముగా నీవు అనేక విధములుగా ఉండు ఆకారములతో సర్వమునందు నుండి కోరికలను సిద్ధింపజేయుదువు. వేదతత్త్వవేత్తలగు ఉపాసనాపరులగు విప్రులు ‘ఓంకార వక్త్ర’, ఓంకారము ముఖముగా గలది, వేదస్వరూప’ అనియు ‘గాయత్రి’ అనియు క్షత్రియులు ‘ఊర్జితమగు - బలశక్తులతో కూడిన - ఆకారముగల ఆక్రాంతి’ అనియు వైశ్యులు ‘భూదేవత’ అనియు శూద్రులు ‘మాతా’ ‘అమ్మతల్లి’ అనియు నిన్ను పూజించి సేవింతురు. నీవు మునులయందు కలవరపరచ నలవిగాని క్షాంతి ‘ఓర్పు’గా నియమవంతుల యందు ‘దయ’గా నయశాస్త్రము ననుసరించి వర్తించు వారియందు మహోపాయ సందోహములతో కూడిన ‘నీతి’గా ‘స్వధర్మముల’కు ‘పరిచ్ఛిత్తి’ ‘పరిమితి’గా ప్రాణుల హృదయములందు వసించు ‘ఈహ’ ‘వాంఛ’ ‘ప్రయత్నము’గా ఉందువు. కీర్తిమంతుల యందు ‘కీర్తి’ సర్వదేహ ధారుల యందును ‘మూర్తి’ ‘ఆకృతి’గా అనురాగయుత చిత్తము కల వారియందు ‘రతి’ ‘పరస్పరానురాగము’గా హృద్య - మనోహర - మగు వానియందుగల సౌందర్యమును చూచి యానందించు వారి హృదయములందలి ‘ప్రీతి’ ‘ఆనందానుభవము’గా సర్వ భూషణము లందలి ‘కాంతి’గా దుష్ట కర్మాచరణములందలి ‘శాంతి’గా సర్వభూతముల హృదయము లందలి ‘భ్రాంతి’ ‘ఒకదాని జూచి మరియొకటి యనుకొనుట’గా తమ ఇచ్చవచ్చినట్లు నడుచుకొనువారియందు ‘శ్రాంతి’ ‘అలసట’గా సముద్రములందు ‘చెలియలికట్ట’గా విలాస వంతులయందు ‘లీల’ ‘ఒయ్యారము’గా సత్తాత్మక పదార్థములందలి ‘సంభూతి’ ‘పుట్టుక’గా లోకపాలకులయందు ‘స్థితి’ ‘లోక వ్యవస్థ లోక జీవనము’గా సకల భువన నాశనియగు ‘కాళరాత్రి’ గా, ప్రియ కంఠాశ్లేషము వలని ఆనందము నందజేయు ‘రాత్రి’ ‘విభావరి’గా ఇట్లనేక విధముల దేవీరూపవై లోకమునందు నీవర్చింపబడెదవు. వరదు రాలవగు దేవీ! ఎవరు నియతులై నీతత్త్వము నెరుగుదురో పూజింతురో వారికి అన్ని కోరికలును ఈడేరును; ఇందేమియు సంశయములేదు.

బ్రహ్మ ఇట్లు పలుక సరేయని నిశాదేవి (విభావరి, కాళరాత్రి రూపయగు మహామాయ) కృతాంజలియై త్వరితముగా దేవతాత్ముడగు హిమవంతుని మహాగృహమున కేగెను. అచట ఆమెకు మహా హర్మ్యమునందు కూర్చుండిన హిమవత్పత్ని మేనాదేవి కనబడెను. ఆమె రత్న భూషణములుదాల్చి కొంచెము తెల్లనైనముఖపద్మ కాంతితో ఉండెను. కొంచెము నలుపెక్కిన మొనలు కలిగి పైకెత్తినట్లున్న స్తన భారముచే ముందునకు వంచబడి నట్లుండెను. మహౌషధి సమూహముతో కూర్చి కట్టబడిన మంత్రరాజము (మహా మంత్ర రక్షాబంధము ఆమె దేహము నాశ్రయించి ఉండెను. శుద్ధమగు హంసాతకముతో చేయబడి కట్టబడిన జీవరక్షాప్రద మహాసర్పము కలిగి ఉండెను.

విభావరి అచటకు వెళ్ళిన సమయము పగలు; అయినను ఆమెయుండిన గృహాంతర్భాగము మణిదీప గణములు జ్యోతిస్సుల నుండి వెలువడు గొప్ప వెలుగుతో ప్రకాశితమై తెల్ల ఆవాలు చాల వెదజల్లబడి ఎందరో పరిచారికలు కలిగి శుచియగు పట్టు వస్త్రములు కప్పి యుంచిన గొప్ప పడకల పరపులతో ప్రకాశించుచు ధూపముల వాసనలతో మనోహరమయి సర్వ ‘సర్జ’ రసాదిరస ద్రవ్యముల ఉపయోగముతో కూడియుండెను. క్రమముగ పగలు గడచెను. అది దూరమయ్యెను. రాత్రి అయ్యెను. అపుడు ఆ మేనాదేవీ మహాగృహము అత్యధికమగు సుఖ విశేషము కలది అయ్యెను. పురుషులలో చాలమంది గాఢనిద్ర యందు మునిగిరి. పరిచారికలు నిద్రతో తూగుచుండిరి. శివప్రీతికరమగు ఆప్రదేశ మంతయు శుభకరమును క్రొత్తదిగ కనబడునదియునై ఉండెను. రాత్రి సంచారి పక్షులు అటునిటు సంచరించుచుండెను. రాక్షసులు సంచరించుచుండిరి. ముంగిళ్ళ యందు క్షుద్ర భూతములు తిరుగుచుండెను. పరస్పర ప్రీతిపాత్రులగు ప్రియాప్రియులు గాఢ కంఠాలింగనమున మునిగిరి. ఇట్టి రాత్రికాలమున మేనా నేత్ర పద్మ ద్వయము కూడ విశ్రాంతికై కొంచెము కలవరపడుచుండెను. అదే సమయమున రాత్రి దేవి మేనాదేవితో సంగమము (కూడిక) చెంది ఆమె ముఖమునుండి మేనా శరీరమున ప్రవేశించెను.

నిరుపమానమగు జగన్మాతృ జననము జరుగబోవుచున్నదని ఎరిగి రాత్రి దేవి ఆ జగన్మాతృ మాతృ గర్భాంతర్భాగమును ప్రవేశించెను. తక్షణమే అచ్చట వ్యాపించి విభావరీదేవి గుహునకు అరణియగు (గుహుడనగా కుమారస్వామి; గుహుడను అగ్ని జనించుటకు అరణి వంటిది పార్వతి. ప్రాచీన సంప్రదాయమున అగ్నిని ఉత్పత్తి చేయుటకై మథించు కొయ్య పనిముట్టునకు అరణియని పేరు. ఇది రెండు భాగములు, క్రింది భాగము గుంతతో ఉండునది పూర్వారణి; మథించు పైభాగము ఉత్తరారణి) పార్వతి దేహకాంతిని జయించి ఆమె శరీరచ్ఛాయ నలుపగునట్లొనరించెను. అటుతరువాత బ్రాహ్మ ముహూర్తమునందు సుభగ (భర్తకు ప్రీతి పాత్రము) అగు హిమవత్పత్ని మేనాదేవి జగత్తు నందంతట నిర్వాణము (సుఖము, మోక్షము) నకు హేతువగు గుహారణిని (గుహునకు జన్మస్థానమగు పార్వతిని) కనెను.

ఆ పార్వతి జనించుచుండ స్థిరచరములగు సర్వలోక నివాసి ప్రాణులు అన్నియు సుఖవంతము లయ్యెను. నరకవాసులకును ఆ సమయమున సర్వ శరీర వ్యాపియగు మహా సుఖము కలిగెను. క్రూరమగు అంతఃకరణ వృత్తికల ప్రాణుల చేతస్సుకూడ శాంత మయ్యెను. జ్యోతిస్సుల కన్నిటికిని అపుడు మిక్కిలిగ తేజస్సధికమయ్యెను. ఓషధులును అధిక వీర్యముచే ఆశ్రయించబడినవి మహా శక్తిమంతములు అయ్యెను. పూవులు సుగంధ యుతములును ఆకాశము విమలమును అయ్యెను. వాయువులు సుఖ స్పర్శములును దిశ అతిమనోహరములును నయ్యెను. పృథివీ దేవియు ఉద్భూతమగు ఫలము (పంట) కలదియు వరిపైరు పంటల వరుసలతో అతి సుందరియు పంటల పరిపాకముతో నిండినదియు నయ్యెను. చాల కాలమునుండియు భావితాత్ములయి (ఉత్తమ సంస్కారము నొందించబడిన అంతఃకరణ వృత్తి కలవారయి) నిర్మల చిత్తులై ఆచరించినను ఫలవంతములు కాక యుండిన తపస్సులును ఆ సమయమున సాకల్యము నొంది ఫలించెను. శాస్త్రపండితులు చదివి మరచిన శాస్త్రములును ఆసమయమున వారి చిత్తము లందు సాక్షాత్కరించెను. ఉత్తమ తీర్థముల ప్రభావము ఎప్పటికంటె పుణ్యతమ మయ్యెను. మహేంద్ర హరిబ్రహ్మ వాయువహ్ని ప్రముఖులగు దేవతలు వేలకొలది మంది అంతరిక్షమునందు విమానములయందుండి హిమవంతుని మీద పూలవాన కురియించిరి. గంధర్వ ముఖ్యులు పాడిరి; అప్సరోగణములు వర్తించెను. మానవులుగా మూర్తిమంతము లయి మేరువు మొదలగు మహాపర్వతములన్నియును సాగరములును నదులును అన్నియును దివ్య హిమాచలుని ఇంట చేరువ అయిన ఆ దివ్య మహోత్సవమునకై వచ్చెను. ఆ పర్వతోత్తముడగు హిమాచలుడు ఆ సమయమున సర్వభూతములలో మేలగు వాడును సర్వ చరాచర భూతము లకును ఆశ్రయణీయుడును సేవనీయుడును నయ్యెను. దేవతలును దేవనాగ గంధర్వ పర్వత జాతులవారును వారివారి లీలా విలాసవతులగు స్త్రీలును ఆ ఉత్సవము ననుభవించి తమతమ నివాసములకు సంతోషముతో వెడలిపోయిరి. లక్ష్మీవాణీ దేవతలును దేవతాశ్రేష్ఠులును (వారి స్త్రీలును) నేను ముందు నేను ముందనుచు ఆ హిమశైలపుత్రిని క్రమముగా పెంచి పెద్ద చేయుచుండిరి. ఆ పర్వతపుత్రి పార్వతి అసాధారణములగు రూప సౌభాగ్య ప్రబోధముల (వికాసముల) తోను రూపలక్ష్మితోను క్రమముగ లోకత్రయమును జయించెను.

ఇదే సమయమునందు ఇంద్రుడు దేవపూజ్యుడును దేవర్షియు నగు నారదుని తమ దేవకార్యమును సాధించుకొను త్వరతో స్మరించెను. భగవానుడా నారదుడును ఇంద్రుని కోరిక నెరిగి మోదయుక్తుడయి మహేంద్రభవనమునకు వచ్చెను. సహస్రనేత్రుడా వాసవుడు (ఇంద్రుడు) ఆతని చూచి తన మహాసనమునుండి లేచి యథార్హములగు పాద్యము (మొదలగు ఉపచార పూజల)తో పూజించెను. ఇంద్రుడు యథావిధిగా ఒనరించిన ఆ పూజనందుకొని నారదుడు పాకాసురుని అణచినవాడగు ఇంద్రుని కుశల మడిగెను. ఆ కుశలప్రశ్నమునకు సమాధానముగా విభుడగు ఇంద్రుడు ఈ వచనము పలికెను. భువన త్రయమునకును కుశలము కలిగించు అంకురము (దేవి) జనించినది. ఆమొలకనుండి ఫలము సంభవించి సంపన్నమగుటలో నీవును అతంద్రితుడవు (ప్రయత్న పరుడవు) కమ్ము; నీవును ఈ విషయమంతయును ఎరుగుదువు; ఐనను నీవు అడుగుచున్నావు. అదియుగాక తన హృదయమందలి విషయము సుహృజ్జనమునకు తెలుపుటచే పరమ సుఖముకలుగును. కావున నీవడిగినది చెప్పుచున్నాను. అది ఎట్టిది యనిన శైలజాదేవి పినాకి (శివుని)తో వివాహ సంబంధముతో కూడిక నందవలయును. కావున మన పక్షము వారందరును అందులకై ప్రయత్నము చేయవలయును.

ఇట్లు ఇంద్రుడు చెప్పగా విషయమంతయు ఎరిగి అట్లేయగుగాక యని పలికి నారదుడు ఇంద్రుని కడ వీడ్కోలు అందుకొని ఇంద్ర భవనమునుండి హిమాలయుని భవనమునకు పోయెను. అచ్చట బహు విధములగు వేత్రలతలను (పేము బెత్తములను) ధరించి తమతమ విధులందు వ్యాకులులైయున్న ద్వారపాలకుల నమస్కారములందుకొని (వారు పోయి తెలుపగా) ముందునకు వచ్చిన హిమాలయుడు శీఘ్రమే లోనికి ప్రవేశింపజేయగా నారదుడు భువనములకే అలం కారమగు ఆ పర్వతుని భవనమును ప్రవేశించెను. అచట అమల ప్రకాశుడగు ఆ మునివరుడు స్వయముగా హిమాలయుడే పరచిచూపిన సువర్ణ మహాసనము నందు కూర్చుండెను. ఆ పర్వతుడు ఆయనకు యథార్హముగా అర్ఘ్యపాద్యాదికములను నివేదించెను నారదముని ఆ అర్ధ్వాధిక మును యథావిధానముగా గ్రహించెను. పిమ్మట హిమాలయుడు వికసితముఖ పద్మముతో మెల్లగా మృదువగు వాక్కుతో ఆ మునివరుని తపోవిషయమున కుశల మడిగెను.

వెంటనే నారదమునియు పర్వతరాజును పర్వతరాజ్యపు కుశల మడిగెను. తరువాత అతనిని నారదుడు సాదరముగ ఇట్లు ప్రశంసించెను. (హిమవంతుడు స్థూల దృష్టికి పర్వత శ్రేష్ఠము, తత్త్వదృష్టితో అతడు దేవతాత్ముడైన శివోపాసకుడు. ఈ నారదుడు చేయు ప్రశంస అందులకు తగినట్లు భావన చేయవలసియుండును.)

మహాగిరీ! నీ శరీరపు అన్ని సన్నివేశములు (అమరికలును) అవతారితములుగా నున్నవి. (నీవు పర్వత మాత్రుడవు కాక దేవతావతార రూపుడవు అని తెలుపుచున్నవి.) అచలమా! (స్థిరప్రజ్ఞుడవగు ఉపాసకుడా!) నీ కందరముల (ఎత్తైన శిలల నడుమనుండు లోతగు విశాల ప్రదేశముల) విశాలత నీ మనస్సు లోతులతో సమానము; స్థావర రూపుడవగు నీ గురుత్వము (బరువు) దేవతాత్ముడవగు నీ గుణగణముల గురుత్వము (గొప్పదనము) వలెనే లోకములందలి అన్నిటి గొప్పదనమును మించియున్నది. నీయందలి నీటి ప్రన్నత (తేటదనము) నీ మనస్సు నందలి ప్రసన్నత (నిర్మలత్వము) వలెనే గొప్పది, శైలేంద్రమా! ఇంతకంటె గొప్పదనము ఎచ్చటను మాకు కనవచ్చుటలేదు. ఏలయన నీకందరములు తమ ఆశ్రయ స్థానములుగా చేసికొని నానా తపస్సుల ననుష్టించువారును అగ్నితో రవితో సమానముగా తేజోవంతులునగు పావనమునులు నిన్నెడతెగక పావనుని చేయుచున్నారు. తమ యానములగు విమానములను అలక్ష్యముచేసి అంతరిక్ష సంచారము నందు విరక్తిచెంది దేవగంధర్వ కిన్నరులు తండ్రి ఇండ్ల యందువలె నీ ప్రదేశములందు వసించుచు నీకు చేరువయై యున్నారు. శైలేంద్రా! అహో! నీవు ధన్యుడవు; ఏలయన లోకనాథుడగు హరుడు యోగసమాధానము (చిత్తమును పరతత్త్వమున సమాహితము చేయుట) పరాయణము (పరమలక్ష్యము) గా నీకందరమును ఆశ్రయముగా చేసికొని ఇపుడు న్నాడు. (నీ హృదయాంతరాళమును పరమేశ్వరుని ఆవాసముగా చేసికొన్న మహోపాసకుడవు నీవు.)

ఇట్లు దేవర్షియగు నారదుడు సాదరమగు వాక్కుతో పలుకునంతలో హిమాచలుని రాణియగు మేనాదేవి మునిని దర్శించు కోరికతో తన కూతురగు పార్వతి తన వెంట రాగా కొలదిమంది చెలులును పరిచారికలును తోడురాగా లజ్ఞాప్రీతులతో ముడుచుకొనిన అవయవములతో ఆగృహ ప్రదేశమును ప్రవేశించెను. నిగృహీతేంద్రియుడగు మునివరుడు నారదుడు అక్కడ హిమశైలుని దగ్గరనుండెను. తపోరాశియగు ముని అటకు వచ్చి యుండుట చూచి శైలుని ప్రియపత్ని హస్త పద్మములతో కృతాంజలియై చేతితో నోరు కప్పుకొని (పెద్దలతో మాటాడునపుడు ఇది అచారము) నమస్కారమనుచు నమస్కరించెను. మహాభాగుడును అమిత తేజోవంతుడునగు అదేవర్షి ఆమెను చూచి అమృత ప్రవాహ రూపములగు ఆశీస్సులతో ఆ శైల పత్నియగు మేనను వర్ధిల్లజేసెను. అంతట దేవియగు హిమవద్గిరి పుత్రి విస్మిత చిత్తురాలయి ఆశ్చర్యకర రూప తేజస్సులు గల మునిని మొగమెత్తి చూచెను. మునియు ప్రీతియుక్తమగు వాక్కుతో ‘బిడ్డా! ఇటు రమ్ము!’ అనెను. పార్వతి తండ్రిని కంఠమున గ్రహించి అతని తొడపై కూర్చుండెను. తల్లియగు మేన ఆదేవితో “పుత్రీ! భగవానుని అభివందనము చేయుము. దానిచే ధన్యుడును పూజ్యుడునునగు పతిని పొందెదవు” అనెను. తల్లి ఇట్లుపలుక ఆమె వస్త్రపు అంచుతో మొగము కప్పుకొని కొంచెముగా మొగము వంచుకొనెనేకాని ఏమియు ననలేదు. అంతట తల్లి మరల పుత్రితో ఇట్లు పలికెను:

“బిడ్డా! దేవర్షికి నమస్కరించుము. నామాట వినినచో నేను నీకై చాలకాలము నుండి ఒక రతనాల మంచి ఆటవస్తువును దాచి ఉంచితినికదా! అది నీకిత్తును.” తల్లి పలికిన ఈ మాటవిని పార్వతి శీఘ్రముగా మొగమెత్తి తన కేలుదామర మొగ్గల జంటను తలపై నిలిపి మునికి నమస్కరించెను. తరువాత పార్వతీమాత తన కన్నులయందు స్త్రీ స్వభావ సిద్ధముగ తల్లులకు తమ బిడ్డల విషయమున నుండు చింతను తోపజేయు కనుచూపుతో చూచుచు పార్వతికి కలుగబోవు సౌభాగ్య లబ్దిని తెలుపు శరీర లక్షణము లెట్లున్నవో ముని నడుగుమని తన సఖిని ప్రేరించెను. హిమవంతుడు తన హృదయమున తన రాణి హృదయాభిప్రాయమును ఎరిగియు తన మొగమున తన మనస్సులోని భావము బయటపడనీయలేదు. కాని ఇది ఏదియో శుభమే జరుగనున్నదని మాత్రము తలచెను. హిమవంతుని రాణియగు మేన సఖి అడుగగా మహాభాగుడగు నారదుడు చిరునవ్వు తన మొగమున తోప ఈ వాక్యమును పలికెను:

“అమ్మాయీ! భద్రే! (యోగ్యురాలవగు మేనాదేవీ!) ఈమెకు పతి ఇంకను పుట్టియుండ లేదు. అదియునుగాక ఈ కన్య (మంచి) లక్షణములు లేనిది; ఈమె చేతులు ఎల్లప్పుడును వెల్లకిల తిరిగి యుండును. ఈమె పాదములు ఎల్లప్పుడును తమ నీడ ఉన్నచోట నిలువక చంచలములయి పోవుచుండును. ఈమె ఇట్టిది. ఇంకను వేరుగా ఎక్కువగా చెప్పవలసిన దేమున్నది” అనిన నారదుని మాటలు విని మహాగిరియగు హిమాచలుడు ధైర్యము నశించి తడబడుచు కన్నీటిచే డగ్గుత్తికపడు కంఠము కలవాడగుచు నారదునితో ఈ విధముగా మారు పలికెను, “నేను ఏల దుఃఖపడుచుంటినన సంసారము అతి దోషయుక్తము; దీని గమనము ఎరుగుట సుసాధ్యము కాదు; ఏలయన తప్పక జరిగియే తీరవలసి జరుగుచుండు సృష్టియందు సర్వాతిశాయియగు పరమాత్మరూపుడగు అనిర్వచనీయ శక్తిగల సృష్టికర్తచే సంసారస్థులగు జీవులకు ఈచెప్పబోవు విధమున మర్యాద (వ్యవస్థ) చేయబడినది, ఎట్లన ఎవడు, ఎవని వీర్యము వలన జనించునో, ఆ తండ్రికిని ఈపుత్రుడు పుణ్యలోకముల సాధించు వాడుకాడు; కనిన తండ్రియు ఈ జనించిన జీవునకు ఏమియు మేలు కీడులు చేయగలవాడు కాడు; వివిధ భూత జాతులును ఆయా ప్రాణులుగా స్వకర్మానుసారముగనే జనించుచుండును; అండజములు అండజముల నుండియే పుట్టును; ఈ జన్మమందు అండజముగానున్న జీవుడే మరియొక జన్మ మున మానవుడు కావచ్చును, మానవుడుగా ఇపుడున్న జీవుడును మరియొక జన్మమున సరీసృప యోని యందైనను మానవ యోనియందైనను జనించవచ్చును. అందునను తాను చేసికొనిన కర్మ ఫలానుసారము ధర్మోత్కర్షము ననుసరించి శ్రేష్ఠప్రాణి జాతియందు జీవుడు పుట్టును. మనుష్యులు తప్ప మిగిలిన ప్రాణులు ఆయా కర్మానుష్ఠానమునకో పుణ్యలోక ప్రాప్తికో పుత్రులు కలుగవలయునను విషయమును ఎరుగవు; వాటికి పితృ పుత్ర సంబంధమును బట్టి తండ్రి కొరకై కుమారుడో కుమారుని కొరకై తండ్రియో చేయు కర్మములునులేవు; ఏలయనగా మానవులు పుట్టుకతోనే శ్రాత స్మార్త కర్మానుస్థాన యోగ్యతగల గృహస్థులుగా పుట్టుటలేదు. బ్రహ్మచారి వ్రతముతో ఆరంభమయి క్రమముగా అయా యాశ్రమములు సంప్రాప్తించును, ఇదియును ఏ సృష్టికర్త సంసారమును వర్ధిల్లజేయునో ఆ కర్తచేయు అజ్ఞచేతనే జరుగును. అందరు మానవులును నిరృహులు (గృహమనగా గృహిణీ గృహ ముచ్యతే యను న్యాయానుసారము గృహమనబడు ఇల్లాలు; ఆమె లేనివారయి గృహస్థులు కానివారు) అయినచో సంసారము ఉత్పన్నము కానేకాదు; అందుచేతనే సృష్టికర్తచేత శాస్త్రములందు పుత్రీ లాభముకంటె పుత్రలాభము మేలని ప్రశంసింప బడినది; ఇట్లు చెప్పుట మానవులను మమకార మోహమున నిలుపుటకును నరకము నుండి కాపాడుటకును అని ఎరుగవలయును. కాని స్త్రీ లేనిదే సృష్టి జరుగు అవకాశములేదు. స్త్రీజాతి ప్రకృతిసిద్ధముగానే దీనత్వమునకు పాత్రము; (దయనీయమయినది); (స్త్రీలు సృష్టికర్తచేతనే ఇట్లు శాస్త్ర విచారణా సామర్థ్యము కాని కర్మానుష్ఠానయోగ్యత కాని లేనివారైరి; ఐనను ఈ హేతువుచే వారిని అవజ్ఞా (అవమాన) దృష్టితో చూడరాదనియు వారిని ఆదరించుట బహు పుణ్యలోక ద్వారమును మహాఫలప్రదముననియు శీలరహిత కాని కన్య పదిమంది పుత్రులతో సమురాలనియు సృష్టికర్తయే శాస్త్రములందు అసందిగ్ధముగా, స్పష్టముగా చెప్పియున్నాడు; కాని ఆలోచించగా ఈ వాక్యము నిప్పుల మయినదియు పురుషులకు మనోవ్యథను ప్రకోపింప జేయునదియు నయియున్నది; ఏలయనగా కన్య (కూతురు) దయనీయురాలును (ఆమె విషయ మున) శోకింప వలసినదియు తండ్రికి దుఃఖమును వృద్ధి చేయునదియు అయియున్నది; పతి పుత్ర ధనాదుల విషయమున ఏ కొరతయు లేక సర్వార్ధ పూర్ణురాలైనను ఇంతే; మరి దుర్భగం (భర్త) ప్రీతికి నోచుకొననిది)యు పతి పుత్ర ధనాదులందు కొరతకలదియు ఐనచోఇక చెప్పవలసిన దేమి? అదికాక మీరు నాకూతు శరీరము నందు అనేక దోషము లున్నవని పలికితిరి. అయ్యో! అది విని నాకు మతిపోవు చున్నది; శోకము కలుగుచున్నది! శ్రమయగు చున్నది; శరీరమును చిత్తమును పట్టుతప్పుచున్నవి. నారదా! ఇప్పటి నా స్థితిలో తగని విషయమే యైనను పొందరానిదే యైనను ఈ విషయమిట్టిదని తాము చెప్పవలయును.

అనుగ్రహముతో మునీ! కన్య విషయమున నాకుగల దుఃఖమును ఛేదించుము. సంశయము కలిగించిన విషయములో ఇది ఇంతే; ఇంతకంటె మేలు కలుగు అదృష్టము లేదు; అని నిశ్చయము కలిగినను మనస్సు అవమానమునకు పాలుపడియున్నను ఇంకను ఫలము కలుగునేమోయను విషయమునగల ఆశమనస్సును దొంగిలించి తన వశముచేసి కొనును గదా! ఏలయన స్త్రీల జన్మము ఉభయవంశముల (పుట్టిన మెట్టిన ఇండ్ల) వారలకును మేలు కలిగించునది; మంచి మగడు దొరకుట ఈ ఇరు పక్షములవారికిని ఇహ పరఫల సాధకము; గుణహీనుడైనను స్త్రీలకు మొదలు భర్త దొరకుటయే దుర్లభము - పుణ్యములులేనిదే పతియే ఎన్నడును దొరకుడు -  అందురనిన సత్పతి దొరకుట మరియు దుర్లభము గదా! ఏలయన తాను సాధనము చేయకయే ధర్మ ఫలమును పరిమితిలేని సుఖాను భవమును జీవితాంతము వరకు ధనమును స్త్రీకి భర్తయందే ఆధారపడి యున్నది; నిర్దనుడు కురూపుడు దుర్భగుడు. (సౌందర్యాధి లక్షణములు లేనందున స్త్రీలప్రీతికి పాత్రుడు కాని వాడు) మూర్ఖుడు ఏసల్లక్షణములును లేనివాడు ఐనను స్త్రీకి సదా పతియే పరమ దైవతమని శాస్త్రము చెప్పుచున్నది. కాని మీరో దేవరీ! ఈమెకు ఇంకను పతి పుట్టనే లేదంటిరి; ఈ దౌర్భాగ్యము సాటిలేనిదియు లెక్కచేసి పరిమితి నిర్ణయించ నలవి కానిదియు చాల బరువయినదియు (తల్లి దండ్రులకు) దుస్సహమును; చరాచర భూత సృష్టియందే ఇప్పటికిని ఆతడు (ఈమెకు పతి) పుట్టలేదంటిరే! దానితోనే నా మనము వ్యాకులమైనది; మనుష్య దేవ జాతులవారలకు శుభాశుభములను తెలుపు లక్షణములను హస్తపాదములందు అమరిన చిహ్న ములను బట్టియేకదా! ఇది ఇట్లుండ మునిపుంగవా! ఈమె ఉత్తాన హస్త (అరచేయి పైకి వచ్చు నట్లు పెట్టుకొని యుండునది) యంటిరి; ఈ లక్షణము ఎల్లప్పుడును యాచించుకొనువారలకే కాని శుభోదయము (శుభసమృద్ధి) కల ధన్యులకును ఇతరులకు ఇచ్చుదాతలకును ఎన్నడును అట్లుండదు. ఈమెపాదములు తననీడ యున్నచోటి నుండి కదలిపోవుచు చంచలములయి యుండునంటిరి. ఆ లక్షణము నందు కూడ ఆమెకు శ్రేయము లభించు నాశ నాకు కనబడుట లేదు. సౌభాగ్యము ధనము పుత్రులు ఆయువు పతి లభించునని తెలుపు వేరువేరు ఫలముల ఆయా శరీరలక్షణములు ఎన్నియో కలవుకదా! అవియు ఏవియు ఈమెకు లేవని ముని పుంగవా! మీరంటిరి. నాకు తెలిసినంత వరకు మీరు సర్వజ్ఞులు; సత్యవచనులు; కావునను మీమాట విని మునిశార్దూలా! నాకు మోహము (ఏమియు తోచక పోవుట) కలుగుచున్నది; హృదయము బ్రద్దలగుచున్నట్లున్నది అని ఇట్లు తన మహా దుఃఖమును తెలిపి హిమవంతుడు ఊరకుండెను.

శైలరాజ ముఖ పద్మము నుండి వెలువడిన ఈ వచనమును విని దేవ పూజితుడగు నారదుడు చిరునగవుతో ఇట్లనెను; మహాహర్ష హేతువగు విషయమున నీవు దుఃఖము ప్రకటించుచున్నావు. మహాగిరీ! వాక్యార్థమును స్పష్టముగ ఎరుగక వ్యామోహమందు చున్నావు. రహస్యార్థమును వివరించు నామాటను విని నేచెప్పిన దాని విచారణమునందు మనస్సు సమా హిత మొనర్చుము. హిమాచలా! ఈమెకు పతి పుట్టలేదంటినే: దాని యర్థము ఏమన  -  అతడు మహాదేవుడు (శివుడు)ను భూతముల వ్యక్తస్థితిని ఉద్భవింపజేయువాడు అగుటచే భవుడనబడును; అంతే కాని అతడు పుట్టినవాడుకాడు; శరణ్యుడు, శాశ్వతుడు, ఎల్లరను శాసించువాడు, శంకరుడు(శుభమును కలిగించువాడు) పరమేశ్వరుడు (ఈశ్వరులకును ఈశ్వరుడు) (బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మునులు మొదలగు వారికెల్లరకు గర్భజన్మ జరా బాధలు కలవు; వారెల్లరు పరమేశునిచేతి ఆట వస్తువులు; ఈ బ్రహ్మాండము ఆ భువన ప్రభుని ఇచ్ఛ (సంకల్పము -  ఇచ్ఛాశక్తి) వలన జనించును; విష్ణువు ప్రతియొక యుగమునందును నానాజన్మలనందు మహాతనువు (శరీరము) కలవాడై పుట్టును; ఇట్లు అంటినని యుగయుగము నను విష్ణువుకూడ మాయకు వశుడై పుట్టునను కొనుచున్నా వేమో! స్థావర ప్రాణులగు వృక్షముల వరకు గూడ ఏ దేహమునందును ఆత్మకు వినాశము లేదు; సంసారమున పుట్టుచు, చచ్చుచు నుండు దేహికి దేహమే నశించును కాని ఆత్మకు నాశములేదు. కాని ఇతరమగు దేహి జన్మమృత్యు దుఃఖములతో బాధనందుచు దేనియందును అవశుడై (తన యధీన మందేమియు లేక) దేహము నుండి దేహమునకు మారుచుండును. కాని మహాదేవుడో - అచలుడు - స్థాణువు - ఎప్పుడును స్థిరుడు - అతడు ఇతరము (రు)లను జనింపజేయునే కాని తాను జనింపడు; జర (వార్ధక్యము) నందదు. జగన్నాధుడు నిరామయుడు (ఏదోషమును లేనివాడు) అగు అతడు ఈమెకు పతియగును. ఈదేవి లక్షణ వర్ణిత అనిన నామాటకుకూడ లెస్సగా విచారణము నిట్లెరుగుము. లక్షణము అనునది దైవకము (మన సంకల్పము లేకయే కలుగునది); అది శరీరావయవముల నాశ్రయించియండు గురుతు; (అవయవములందు గోచరించు ఆ లక్షణము వంశము - ఆయువు - ధనము - సౌభాగ్యము - ఇట్టివాని పరిమాణమును (ఎంతయను విషయము) తెలుపును; అనం తము - అప్రమేయము (హద్దుకాని పరిమాణముకాని లేనిది) అగు ఈమె సౌభాగ్యమునకు లక్షణము అని చెప్పదగిన గురుతు ఏదియు ఈ శరీరము నందు నిరూపింప దగినదిలేదు. ఇందువలన మహామతీ! శైలా! ఈమె శరీరమున లక్షణములు లేవంటిని.

ఈమె ఎప్పుడును ఉత్తానకరమైయుండునంటిని, అదియేమి అనిన  -  ఈదేవీకరము ఎల్లప్పుడు వరము లిచ్చుటకై ఉత్తానమయి వెల్లకిలనయి అరచేయి బయటపడుచు నుండును. ఈయమ సురలకును అసురులకును వరము లొసగునదియగును. ఈమె చరణములు తమ నీడయున్నచోట నిలువక చరించుచుండు నంటివి గదా! శైలసత్తమా! ఈ మాటకు నా వచో వివరణము వినుము; పద్మ సమానములును నిర్మల నఖములతో ఉజ్జ్వలములును నగు ఈమె చరణములు ఈమెను నమస్కరించు సురాసురుల విచిత్ర వర్ణములుకల కిరీట మణికాంతు లతో ప్రకాశించుచుండ ఆచరణముల ప్రతిబింబము లాకిరీట మణులందు ప్రతిబింబించు చుండును; (నమస్కరించువారు మారినకొలదిని ఆ ప్రతిబింబముల స్థానములును మారు చుండునును.) మహీధరా! ఈమె జగద్భర్త యగు వృషభధ్వజునకు భార్యయగును; భూత సృష్టికర్తయగు సర్వలోక జననియే అగ్ని ప్రకాశయగు ఆ శివ (శివుని పత్ని)మిమ్ములను పవిత్రుల జేయుటకే నీక్షేత్రమునం (భార్యయందు సంభవించినది; కావున శైలేంద్రసత్తమా! ఈమె శీఘ్రముగా పినాకి (శివుని)తో కూడునట్లు నీవు యథావిధిగా చేయవలయును. హిమ భూధరమా! ఇందు దేవతల సుమహాకార్యము కూడ కలదుసుమా! అనగా మేనాపతియగు ఆ శైలేంద్రుడు నారదుని వలన ఇట్లంతయు వినినమీదట తాను మరల పుట్టినట్టే భావించెను. ధీమంతుడును వృషభ ధ్వజుడునునగు మహాదేవునకు (స్వచిత్తమున) నమస్కరించి హిమాచలుడు చక్కగ హర్షము చెంది నారదునితో ఇట్లనెను: విభూ! నీవు నన్ను దుస్తర ఘోర నరకములో పడకుండ లేవనెత్తితివి; నన్ను పాతాళమునుండి పైకెత్తి ఏడు ఊర్ధ్వ లోకములకును అధిపతిగా జేసితివి; ఇంతవరకును మునివరా! హిమాచలుడని విఖ్యాతుడనయి యుంటిని; ఇపుడంతకంటే నూరింతల సమున్నతి నందితిని. మునీ! ఇపుడు నాహృదయము ఆనందామృతము అనుభ వించుచున్నది. కాని నేను వాక్కులకు అధీశుడగు బృహస్పతియా, బ్రహ్మయో అయి యుండినను మీగుణముల విచారణమున యత్నించి మీ ఆయా కృత్యముల ప్రవిభాగమును విచారించుటలో కూడ నా హృదయమునకు శక్తి చాలదు; తమవంటి వారి దర్శనము వ్యర్థముకాదు; మహామునీ! ఇందు మా విషయమున మీకు గల చాపల్యము (చూడవలెనను కొనగానే వచ్చి చూచి అనుగ్రహించుట) నాకు స్పష్టముగ గోచరించుచున్నది. నేను స్వయముగ పాపముల చేయువాడనే అయినను తమవంటి వారిచే తమవంటి మునుల కును దేవతలకును నివాసమునకు యోగ్యుడుగా చేయబడితిని. అయినను ఒక విషయము నందు నాకు మీరు అజ్ఞనీయవలయును.

పర్వతరాజిట్లు హర్షనిర్భరుడై పలుకగా నారదుడు ప్రభూ! సర్వమును సరిపోయినది; దేవకార్యమేదియో అదియే నీ సుమహత్తర కార్యమును; కనుక ఇకవేరుగా చెప్పవలసినదియు చేయవలసినదియు ఏమియులేదు” అని పలికి శీఘ్రమే అటనుండి స్వర్గమేగెను. అతడట దేవేంద్ర భవనమునకుపోయి అతనిని సందర్శించెను. ఆముని యచట మనోహర మహాసనమున కూర్చుండెను. ఇంద్రుడడుగు పార్వతీ విషయక వృత్తాంత మతనికి తెలిపి “నేను చేయతగినది చేసితిని. ఇక ఇపుడు మన్మథునికి పనిపడు సమయము వచ్చినది” అనెను. కార్యదర్శి (ఏపని ఎట్లుచేయవలెనో తెలిసి తెలుపు) నారదుడిట్లు పలుక పాకాసురుని చంపిన భగవానుడు దేవరాజు అస్త్రముగా చూతాం కురము (మామిడి పూమొలకను) ధరించు మన్మథుని తలచెను. ధీమంతుడగు సహస్రాక్షుడు సంస్మరించి నంతనే మత్స్యధ్వజుడగు రతిపతి సవిలాసముగా వచ్చి ఎదుట నిలిచెను. ప్రాదుర్భూతుడయిన అతనిని చూచి ఇంద్రు డతనితో సాదరముగ ఇట్లు పలికెను. “బహువచనములు పలుకవలసిన దేమున్నది? నీ విషయమున ప్రియ వచనములేమి పలుక గలను. నీవు మనోభవుడవు (మనసు నందుండువాడు - మనసు నుండి పుట్టువాడు), కావుననే ప్రాణుల మనోగతముల నెరుగగలవు. కావున నీవు వాస్తవముగ స్వర్గవాసులకు ప్రియకరమగు పని చేయవలయును. శంకరుని శీఘ్రమే గిరిపుత్రితో కూర్చుము. నీవు దుర్జయుడవు; మధుమాస (వసంత) ఋతువుతో కూడి వెళ్ళుము.” “స్వార్థసిద్ధికై శక్రుడిట్లు పలికినదివిని పంచబాణుడగు మదనుడు భయపడి శతక్రతునితో ఇట్లనెను;” ప్రభూ! దేవరాజా! ఈ దేవసామగ్రితో శంకరదేవుడు దుర్జయుడని నీవు ఎరుగవా! ఆ దేవుని అవ్యయ (ఎన్నడును తరుగని) క్రియాశక్తి ఎట్టిదో నీకు తెలియును. తరచుగా (సాధారణముగా) మహాపురుషుల అనుగ్రహము కాని కోపముగాని ప్రతిదియు పెద్దదిగనే యుండును. స్వర్గమందలి సుందరులు సర్వోపభోగములును సారమని (ప్రధానమని) భావించువారు; నీవు చేయబోవు (చేయించబోవు) ఈ కష్ట(నాశకర) చేష్టవలన ఇంతవరకు నిన్ను అధ్యాశ్రయించి సౌఖ్యముకూడ నీ పొరబాటునకు వశమయి విభ్రంశము (తొలగిపోవుట)ను పొందవచ్చును. ఈశ్వరుని విషయమున ఇదియంతయు నీవు ముందే ఆలో చించవలయును. ఏలయన పూర్వము నుండి ప్రాణులు చేయు పనుల ఫలితములలో ఎక్కువ ఏదియో కోరి పనిచేయగా ఉన్నదికూడ ఊడిపోవుట దానికి ఫలమగుట కనబడుచున్నది. కనుక నీవును ఏదో మహాకార్యము సాధించబోయి ఉన్న సుఖసంపదలను కూడ పోగొట్టుకొను పని చేసికొనకుము.

మదనుని ఈ మాటలువిని ఇంద్రుడు తన చుట్టునున్న దేవతల భావములకు తగినట్లు ఇట్లనెను: “రతీపతీ! నీవు ఏమియు సందేహింపకుము. ఆ విషయమున ప్రమాణభూతులము మేము; సందంశము అనగా పట్టుకారు లేనిదే అయస్కారునకు (ఇనుప పనిచేయు కమ్మరివానికి) శక్తి ఏమియులేదు. ఒక్కొక్కనికి ఒక్కొక్క పనియందు మాత్రమే సమర్థత కనబడుచున్నదికాని అన్ని పనులయందును సమర్థతలేదు.” మన్మథా! మా ఆజ్ఞానుసారము నీవుచేయు ఈ పనివలన శివునికి కలుగు కోప ఫలమును మేమనుభవింతుము. చెడి పోయినచో మేమే చెడిపోయెదము. దానివిషయమున నీకు సందేహములు కలిగి నీవాలో చించి మాకు మంచి చెడ్డల నుపదేశించు పని నీకేమి కలదు? కమ్మరివానికి పట్టుకారువలె నీవు మాకు పనిముట్టు మాత్రమే. వాని పనివలన కలుగు మంచి చెడ్డలను పట్టుకారు ఆలోచించక తనపని తాను కమ్మరి చెప్పినట్లు చేయును  -  మాకు వానిని ఆలోచించుట తెలియును. పనిచేయుట నీవిధి. మాకుపదేశింప నీవెవడవు? పోయిచెప్పిన పనిచేయుము.

ఈ మాటవిని మన్మథుడు తన మిత్రుడగు వసంతుని తోడుతీసికొని రతీదేవితో కూడి బయలుదేరి హిమాలయపు నెత్తము చేరెను. ఆతడచ్చట తన పనికై ఉపాయ పూర్వకముగా ఇట్లాలోచించెను: మహాతత్త్వవేత్తలు ఎట్టి కంపమును లేనివారునగు వారి మనస్సును ఎవరుసు జయింపజాలరు. (శివుడు అట్టివాడు) కావున మొదటనే అట్టి వారి మనస్సును కలవరపరచినచో వానిని జయించుట సుకరమగును. అట్లు చేసినవారు కార్యసిద్ధి నందుదురు. ఆయనపై ద్వేషము నాకేమియు లేకున్నను వివిధ భావములతో ఆయనను ఆకర్షించవలయును. క్రోధమునకు క్రూరతరమయిన చెలిమి కత్తెయగు భయంకర ఈర్ష్యాదేవిని చాపల్య భావపు తలపయి నిలుప వలయును. అది ధైర్య ఔన్నతపు మహాబలమును ధ్వంసము చేయును. ఆ చాపల్య భావమును ఇతని (శివుని)పై ఉపయోగింతును. దానిచే ఇతని మనస్సునందు వికృతి(మార్పు) కలుగును. ధైర్య ద్వారములు మూయబడును. (ధైర్యమును కోల్పోవును. సంతోషము తగ్గిపోయువు. ఇట్లు చేయునన్ను తెలిసికొనగల పండితు డెవడును లేడు. ఇది చేయుదమా అది చేయుదమా అని వికల్పములలో ఉన్నంతవరకు మనస్సు నిశ్చయమందక వికృతమయి పోవును. అటుతరువాత ప్రధానక్రియను ఆచరించుట చేతకాక సుడిగుండములలో పడి కార్యగతి ప్రవాహమును తరించుట శక్యము కాకపోవును. కనుక నేనెక్కువగా ఆలోచించక రమ్యములు అగు సాధన సంవిధానముతో అతని ఇంద్రియములను ఆవరించి స్థిరచిత్తుడగు హరుని తపస్సును హరింతును.

ఇట్లాలోచించి మదనుడు భూతపతియగు శివుని ఆశ్రమమునకు పోయెను. అది లోక సారము; సరళ వృక్షముల క్రింద అరుగు లచ్చటగలవు. ఆ ఆశ్రమము శాంతములగు ప్రాణులతో వ్యాప్తము; ఆ ప్రాణులన్నియు నిశ్చలములై యుండెను. నానా పుష్పములుగల లతలట నుండెను. ఆ ఆశ్రమ పుటాకాశమున ఆయాప్రమథ దేవ గణాధి పతులుండిరి. దివ్య శరీరియగు వృషభ మటనుండెను. నల్లని పచ్చిక బయళ్ళతో నిండిన నెత్తములయందు ఆ ఆయాశ్రమముండెను. అచ్చట త్రినేత్రునితో పాటుగ వీరులకు అధిపతియు శివుని తేజమువంటి తేజము కలవాడు అగు వీరకుడను ఉపాసక శ్రేష్ఠుడు యక్ష కుంకుమ పూవుల కేసరముల రాశివలె పింగవర్ణ జటలు మీసములు గడ్డముకలవాడు వేత్రము చేత దాల్చి సావధానుడై విభూతి నాగశ్రేష్ఠ భూషణ ములు దాల్చినవాడు అచట నుండెను.

క్రమముగ మన్మథుడు మెల్లగ దగ్గరకు రాగారాగా అతనికి శంకరుడు కనబడెను. విప్పారిన తామర పూరేకులవంటి కనులు మూసికొని సూటియగు స్థానమున స్థిరముగ నాసాగ్రము నందు కన్నులు నిలిపిచూచుచు అతిమనోహరమయి సింహచర్మముతో పాటు వ్రేలాడు ఉత్తరీయ మునుదాల్చి, చెవులయందలి సర్పములు నోళులనుండి విడువబడు ఊర్పు వాయువులచే పచ్చనై, చెక్కిళ్ళవరకు సొరపిందెలవంటి జడలు వ్రేలాడుచు, వాసుకి సర్పమును మొలత్రాడుగా చుట్టుకొని నాభి మూలమున ముడిగా అమర్చుకొని యున్న ఆ శివుని మన్మథుడు చూచెను. క్రిందికి వంగిన చెట్టుగల సానువులయందు వ్యాపించిన తుమ్మెదల ఝంకారమునందు ప్రవేశించి మన్మథుడు చెవి రంధ్రపు మార్గమున శివుని మనస్సును ప్రవేశించెను. మన్మథునితో వ్యాప్తమయిన ఆ ధ్వనిచే శివుడు తన మనస్సు రంజితము కాగా పార్వతిని తలచెను. ఆమె అతని ప్రీతికి పాత్రురాలు; అతి నిర్మలయగు ఆ పార్వతియు అంతవరకు అంతర్హిత అయియుండియు శివుడు స్మరించగనే సమాధి భావనయందు కనవచ్చు ప్రత్యక్షరూపము కలదై నిలచెను. విఘ్నముచేత తన హృదయము దెబ్బ తినగా శివుడు పార్వతితో తన్మయ భావన నందియు ఇంద్రియనిగ్రహము కలవాడు కావున ఇది మదనునిచే కలిగిన మనోవికారమని ఎరిగెను. కొంచెము కోపమందెను. ధైర్యము నవలంబించెను. తన మనమున మదనుని ఉనికిని తొలగించుకొనగోరి ధూర్జటి యోగమాయను (శక్తి త్రయాత్మికయగు శ్రీదేవిని) తనయందు వ్యాపింప జేసికొనెను. అంతట మదనుడు ఆయోగ మాయావ్యాప్తిచే మండెను. (ఆ మంటతో బాధనందియు) వాడు కామరూపుడును సుకరముగ జయింపరాని వాడును రోషాది మహాదోషములకు ఆశ్రయుడును కావున వాసనా (చిత్త సంస్కార) జనిత వ్యసనరూపుడై శివ హృదయము నుండి వెలికి వచ్చెను. బహిఃస్థలమాశ్రయించి నిలిచెను. వాని వెంట మనోహరుడగు వసంతుడు నుండెను. వాని ప్రభావమున తీయ మామిడి చెట్టునందు మందమారుత చలితమగు మామిడి పూగుత్తి మదనునకు కనబడెను. సత్వరముగా మకరధ్వజుడు మోహమను బాణమును ధనువున సంధించి హరుని వక్షమున ఆ చూతకుసుమ స్తబక భావితమగు ఆశరమును వదలెను. సులభముగ నశించు లక్షణముగల ఆ మహాశరము శివుని శుద్ధ హృదయమున పడెను. అది పరుషమును దీర్ఘమును మిగుల మోహశక్తి కలదియు; కావున శివుడు ఆదెబ్బ తినినంతనే తాను సహజముగ పర్వతమువలె అచలమగు ధైర్యము కలవాడయినను ఇంద్రియ నిగ్రహము కోల్పోయి మదన పరవశు డయ్యెను. బహిఃప్రపంచము నందలి విఘ్న జనక సామగ్రీరూపమగు ఆయా రాగభావముల ప్రభావమే అధికమగుటచే శివుని చిత్తమున సంక్షోభము కలిగెను.

అంతట రౌద్ర శరీరుడగు రుద్రుని కోపాగ్ని సంజనిత ఘోరహుంకార భయానకమగు ముఖము నందలి తృతీయ నేత్రము జగత్ప్రళయ భయంకరమయి అగ్ని వ్యాప్తమయ్యెను. ఆ యగ్నిని ధూర్జటి తన సమీపస్థుడగు మదనునియందు వ్యాప్త మొనర్చెను. నాకవాసులు దేవతలు గగ్గోలుపెట్టుచున్నను లెక్కింపక ఆ నేత్రాగ్ని కణరాశి కాముకులకు మదన పారవశ్యము కలిగించు కందర్పుని కడు శీఘ్రముగా భస్మీభూతుని జేసెను. కాని ఆఅగ్నిమదన దహనానంతరము జగములదహింప విజృంభించెను. జ్వాలా సమూహములతో లోకములను తిని పొట్ట నింపుకొన ఆత్రపడుచున్న ఆ అగ్నిని శివుడు లోకానుగ్రహార్థమై తీయమామిడి చెట్టు, వసంత ఋతువు, చంద్రుడు, మంచి పూవులు, తుమ్మెదలు కోకిలలు, వీనియందు పంచెను. ఇది మన్మథుడు శివునిపై ప్రయోగించగా శివుని అంతః కరణమునందు ఆ దేవుని బహిరంగముల యందును వ్యాపించి విజృంభించి అగ్ని రూపము నంది శివనేత్రాగ్ని సంపర్కమున తీవ్రహుతాశనుడై నందున మన్మథ సంబంధమున అనురాగ స్నేహముల బలమున ప్రజ్వలించును. అందునకే అది ఇట్లు ఈపదార్థములయందు విభజింపబడియు వారింప శక్యముకాక విజృంభించి లోకము నందలి ప్రాణుల హృదయములకు సంక్షోభము కలిగించుచుండెను. కాముకులగు స్త్రీ పురుషుల హృదయము లందలి స్నేహానురాగములనెడు నూనెతో తడిసి ఇంకను అది జ్వలించి సుఖాత్మ కముగా కనబడుచు లోకములను బాధించుచున్నది. ఈ కామాగ్ని భయంకర మయినది; చికిత్స చేయనలవికానిది.

ఇది ఇట్లుండ మదనునిపత్ని రతితనపతి హరహుంకార జనితజ్వాలలచే భస్మీకృతుడగుట చూచి తన సోదరుడగు వసంతునితోకూడ క్రూరముగా విలపించెను. వసంతుడు ఓదార్చిన మీదట ఆమె చంద్ర మౌలియగు త్రిలోచనుని శరణు వేడెను. తుమ్మెదలు వెంట నంటుచున్న పూచిన మామిడి రెమ్మను దర్భపవిత్రముగా చేత ధరించి ఆడు కోకిల తన చెలికత్తెగా తన వంక ముంగురులనే జటాజూటముగా అమర్చికొని హృద్యమై తెల్లనిదగు తన పతి భస్మమునే భూతిగా ధరించి మోకాళ్లను నేలకు ఆనించి ఇట్టి శివసేవా దీక్షా నియమములతో రతి శివునితో ఇట్లు పలుకుచు ఆ దేవుని స్తుతించెను.

(ఓమ్)-లోకములకెల్ల శాంతియగుగాక! ఏ దోషమును నాశమును లేనివాడును మనోమయుడును సురార్చితుడును భక్త కృపావరుడునునగు భగవానునకు నమస్కారము. సంసార రూపుడు సంసార జనకుడు మన్మథ నాశకుడు రహస్య మహావ్రతములు నాచరించు వాడు స్వమాయకు గూఢముగా ఆశ్రయభూతుడగు దేవునకు నమస్సు. దుష్టహింసకుడు సిద్ధుడు త్రిపురాంత కరుడు కాలరూపుడు కాల ప్రేరకుడు జ్ఞాన వరప్రదుడునగు మహాదేవునకు నమ స్కారము. కాలావయవములకు అతీతుడు స్వస్వరూపమనెడు నిర్మల భూషణముకలవాడు అమేయుడు అంధకాసుర నాశకుడు శరణ్యుడు నిర్గుణుడునగు పరమేశునకు నమస్కారము. భయంకర గుణములు తన వెంట నుండు వాడు నానా భువనములకును ఆదికర్త నానా జగ న్నిర్మాత చిత్ర (వివిధ) ఫలదాతయగు శివునకు వందనము. సర్వావసానమునందు కూడ నశించని నేత్రములు కలవాడు నానావిధ యజ్ఞ భాగ భోక్త కర్మ సంజనిత ఫలనిర్మాత సంసార సంబంధ నాశకుడు అగు మహా దేవునకు ప్రణామము. అనంతరూపుడు అసహ్యకోపుడు చంద్ర చిహ్నుడు అమేయమగు కొలత కలవాడు అగు నీకు నమస్సు. వృషభేంద్ర వాహనుడు పురాంతకరుడు ప్రసిద్ధుడు మహౌషధ రూపుడు భక్తాభిమత ప్రదుడు సర్వార్తి హరుడునగు నీకు నమస్సు; చరాచర జగమందలి సకల ప్రాణుల, సకల పదార్థముల నడువడిని ఎరుగు వారితో శ్రేష్ఠుడు ఆచార్య (గురు) రూపుడు సంకల్ప మాత్రమున భూతసృష్టి యొనర్చువాడు చంద్రమౌళి సర్వ ప్రియుడు అప్రమేయుడు గొప్పవారిలో గొప్పవాడు మహేశుడునగు నిన్ను శరణు పొందితిని, ప్రభో! కామునకు (నా పతికి) కీర్తి సమృద్ధి నిమ్ము. కామదేవుని మరల బ్రదికింపుము. ప్రియ జీవితమును కరుణతో ఇచ్చుటకు సర్వప్రాణి ప్రియమగు ఆత్మ రూపుడవగు నీవు తప్ప ఈ భువనము లందు మరెవ్వరు కలదు? మదనప్రియయగు నాకు ప్రభువును ప్రియముల నొసగువాడును పరాపరార్థములు నిర్మించి భక్తుల కొసగువాడును సర్వ భువన నాధుడును దయాపరుడును భక్తభీతి నాశకుడును నగువాడు నీవు తప్ప మరి ఎవ్వరును లేరు.

మన్మథుని పత్ని ఇట్లు స్తుతించగా సుఖము కలిగించువాడు వృషాకపి అనగా ధర్మరక్షకుడు అయిన శంకరుడు, చంద్రఖండ ధారియగు ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను అనుగ్రహపు చూపుచూచి ఇట్లు పలికెను. “పుత్రీ! నీవు కోరినట్లే ఈ మదనుడు అనంగుడు (శరీరము లేని వాడు) అని లోక ప్రసిద్ధినందును” అని అనగా కాముని ప్రియురాలు రతి శిరసు వంచి గిరీ శుడగు శివునికి నమస్కరించి హిమవంతము నందలి రమ్యమగు ఉపవనమునకు పోయెను. అచట ఆమె శివుని ఆజ్ఞ ననుసరించి మరణ ప్రయత్నము నుండి విరమించెనేకాని ఆర్తురాలయి ఒక రమ్య స్థలమున దీనభావముతో విలపించెను.

తరువాత హిమవంతుడు నారదుని ప్రేరణచే, తన తనయయగు పార్వతిని ఆభరణ ములతో అలంకరింపజేసి, శుభసమయోచిత శుభసంస్కారములతో సంస్కరింప జేసి స్వర్గమందలి (కల్పవృక్షపు) పూవులను శిరస్సున అలంకరింపజేసి శుభమగు పట్టు వస్త్రము ధరింపజేసి, ఇద్దరు సఖులామె వెంట వచ్చుచుండ శుభయోగము సమకూరెనని నిండిన మనస్సుతో బయలు దేరి పోవుచుండెను. అతడట్లు కాననములను ఉపవనములను గడచి పోవుచుండ త్రోవలో అతనికి ఊహింప అలవికాని మహాతేజస్సుకలది లోకమందెచ్చటను సాటిలేని రూపము కలది రమ్యరూపము కలది దేవతల మనస్సులనుకూడ హరించునది అగు స్త్రీఏడ్చుచు కనబడెను. హిమవంతుడామెను ప్రీతితోపరామర్శించి ఆమె సమీపమునకు ఏగి ఆమెను ఇట్లడిగెను. “కల్యాణీ! నీవు ఎవరవు? ఎవరిదానవు? నీవెందులకై ఏడ్చుచున్నావు? గొప్ప నిబ్బరము కల దానవును లోకైక సుందరియు అగు నీవు ఏడ్చుటకేదో గొప్ప కారణమే యుండుననుకొందును” అనగా విని అంతవరకు వసంతునితోకూడి ఏడ్చుచుండిన ఆమె ఇంకను ఏడ్చుచు నిట్టూర్చుచు విను వారికి శోకమును జాలియు కలుగునట్లు ఈమాట పలికెను, నన్ను మన్మథుని భార్యయగు రతిగా ఎరుగుము. ఈ గిరియందు భగవానుడు గిరీశుడు (శివుడు) తపమందున్నాడు. తనకు కలిగిన తపో విఘ్నమునకు కోపించి అతడు తన అగ్ని నేత్రముతెరచి అగ్ని శిఖాజ్వాలను వదలి కాముని భస్మావశేషితునిగా జేసెను. నేను భయవిహ్వలనయి ఆ దేవుని శరణుచొచ్చి స్తుతించితిని. ఆ సంస్తుతికి మెచ్చి శివుడిట్లు పలికెను:

“కాముని ప్రియురాలా! నేను తుష్టి చెందితిని. నీ ఈ కోరిక నెరవేరును. నీవు నన్ను ఉద్దేశించి చేసిన స్తుతి భక్తితో అధ్యయనముచేసి నన్ను శరణుచొచ్చిన నరుడు తాను కోరిన కోరికల నీడేర్చుకొనును; ఇటువంటి దుర్మరణమును పొందడు.”

నేను ఆశా బలముతో ఆ శివుని వాక్యపు ఫలమును ఎదురుచూచుచు ఓ మహాతేజశ్శాలీ! కొంతకాలము ప్రతీక్షింతునని రతి పలికెను. ఈ మాటవిని హిమాచలుడు సంభ్రమమును భయమునుచెంది తనకూతురుగు పార్వతిని చేత గ్రహించి తన పురమునకు తిరిగిపోదలచెను. భవితవ్యము అవశ్యభావి కావున భూతభవత్ (వర్తమాన) భావి సంఘటనములకు హేతుభూతు రాలగు శక్త్యాత్మిక పార్వతి బిడియపడుచు తన తండ్రితో ఇట్లనెను. తండ్రీ! దుర్భగమగు (ప్రియప్రీతి పాత్రముకాని) ఈ శరీరముతో ప్రయోజన మేమి? అట్టి అనిర్వచనీయ సుఖములభించుట కనుకూలముగా అట్టి పతిఎట్లు లభించును? తపస్సుచే అభీష్టము లభించును. ఏలయన తపమా చరించువానికి సాధ్యముకాని దేదియు లేదు. లోకము (నందలి జనము) సాధనములు ఉండియు కొన్ని కార్యములు దుర్భర మగుచున్నది. (దేవతానుగ్రహమును సాధింపలేక పోవుచున్నది.) తపస్సువలన సాధ్యముకాని దేదియులేదను నిశ్చయముతో భ్రష్ట సందేహుడై జిగీషతో (కార్యసాధన సంకల్పముతో) ఉద్యమమునకు పూనవలయును. తపస్సు చేయక దురదృష్ట వంతమగు జీవితము గడపుటకంటె మరణమే మేలు. కావున తపస్సాచరింతును. ఏలయన నేను దుర్లభమగు దానిని గూడ పొంది తీరుదును. ఏమాత్రము ఇందులో సందేహము లేదు. నియమములతో నా తను వును ఎండింప జేసికొందును అని పార్వతి పలుకగా శైలరాజు, పుత్రీస్నేహముతో వివశుడై డగ్గుత్తికచే స్నేహ పూర్ణముగా వినబడు వర్ణములుండునట్లు ఇట్లు పలికెను. ఉ-మా-(అమ్మాయీ! వద్దు); పుత్రీ! నీవు అతిచపలు రాలవు; (మనస్సులోనికి వచ్చిన ఆలోచనములను వెంటనే ఆచరించ వలెనని త్వరపడెదవు.) నీవు సౌమ్యదర్శనవు. (సుకుమార రూపవు; క్లేశ ప్రధాన క్రియా సాధ్యమగు తపః శ్రమను నీ తనువు సహించజాలదు; నీ విషయములో ఏవేవి జరుగవలసి యున్నవో అవి తప్పక జరిగితీరును; మనకు ఇష్టమున్నను లేకున్నను భవితవ్య విషయములు సంభవించియే తీరును; కావున బాలా! (అమాయికురాలా!) తపస్సువలన నీకు వేరుగకలుగు ప్రయోజనము ఏమియు లేదు. నేనిపుడింటికి పోవుదును. అక్కడనే యాలోచింతును. అని ఇట్లు తండ్రి ఎంత చెప్పినను శైలజ ఇంటికి వచ్చుటకు ఇష్ట పడలేదు; రాలేదు. అనంతరము హిమవంతుడు ఈ పుత్రి పట్టుదలకు చింతావిష్టుడయ్యును తుదకు ఆమెను ప్రశంసించెను. అనంతరము అంతరిక్షము నుండి భువన శుభకరమగు ఈ మాట వినబడెను. అతి చపలవగు పుత్రీ! వద్దు (ఉ-మా) అంటివి కావున ఈమె నామము భువనములందు ‘ఉమా’ అని ప్రసిద్ధ మగును. ఇంతేకాదు; మూర్తీభవించిన సిద్ధి రూపయగు ఈమె తన చింతనమును సిద్ధింప జేసి కొనును అను ఈ అంతరిక్ష వచనమునువిని రెల్లు పూవువలె తెల్లని ఆ హిమవంతుడు ఆమెను తపమాచరింప ననుమతించి త్వరితముగా స్వగృహమున కేగెను.

శైల పుత్రియగు పార్వతి దేవతలకు కూడ చేరనలవికాని పర్వత భాగమును చేరెను. ఆ నగరాజ పుత్రివెంట ఇద్దరు చెలికత్తెలు మాత్రముండిరి. ఆయమ చేయుటకు సిద్ధపడియున్న తపోనియమమున కనుకూలముగా పర్వత శిఖర భాగమంతయు పుణ్య కరమును నానాగైరిక ధాతువులతో అలంకృతమునై ఉండెను. దివ్య పుష్పలతలు ఆటనుండెను. సిద్ధ గంధర్వులు నానా మృగగణములు సంచరించు చుండిరి. చెట్లపయి తుమ్మెదలు ఝమ్మను చుండెను. మేలగు సెలయేళ్ళు దిగుడుబావులు చక్రవాకములు మొదలగు నానాజల పక్షులు మరి ఇతరము లగు పక్షులు చక్కగ వికసించిన జలస్థల పుష్పములు వివిధ విచిత్ర కందరములు మనోహర గుహా గృహములు అటగలవు. కల్పవృక్షములును ఆయా వృక్షములపై కూయు పక్షుల కూతలును ఇంపు గొలుపుచుండెను.

ఇట్టి ప్రదేశపు నడుమ పచ్చని ఆకులతో నిండిన పెద్ద కొమ్మలు గల వృక్ష మొకటి ఆమెకు కనబడెను. అది సర్వ ఋతుకుసుమ భరితము. అది ఎన్ని కోరికలనైన తీర్చగలిగి ప్రకాశించుచుండెను. నానా పుష్ప ఫలములతో వ్యాప్తమయినది; వేరయి యుండియు దట్టముగ క్రమ్ముకొనిన చిగురాకులతో అది అందగించుచుండెను. అట్టి తావున పార్వతి వెలగల తన వస్త్ర భూషణములు విడిచి నారవస్త్రములను దర్భల మొలత్రాటిని ధరించెను. త్రిషవణ (ప్రాతర్మ ధ్యాహ్న సాయంకాలములందు ముమ్మారు) స్నానమాచరించుచు శరీరము ఎర్రవారి వందలకొలది ఏండ్లు తపమాచరించుచు గడపెను. ఒక దినమునకు ఆహారముగా ఎండి రాలిన ఒక ఆకుతో నూరేండ్లుండెను. మరి నూరేండ్లు ఆ తపోనిది నిరాహారగనే యుండెను.