రసకల్యాణ తృతీయా వ్రతము

ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను, పాపనాశకమగు మరియొక తృతీయా వ్రతమును తెలిపెదను. రసకల్యాణినీ తృతీయావ్రతమని పురాణములందు దీనికి పేరు.

మాఘ శుక్ల తృతీయా తిథినాడు ఉదయమున ఆవుపాలతోను, నూవుల (నూవు పిండి- నూవులనూనె)తోను స్నానము చేయవలయును. దేవిని తేనెతో చెరకు రసముతో పన్నీటితో స్నానమాడించి కుంకుమముతో పూజించవలెను. పూజను పాదాదిశిరోంఽతముగా మొదట కుడి అవయవములను తరువాత ఎడమ అవయవములను పూజించవలెను. భవాని-కామిని వాసుదేవి-జగఛ్చ్రీ-ఆనందదానందా సుభద్రా-శబ్ద వాచ్యురాలగు దేవికి నమస్కారము; అని ఇట్లు యథావిధిగ దేవిని పూజించి విప్రదంపతులను ఆదరించవలెను. మత్సరము మొదలగు భావవికారము లేవియు లేకుండ చిత్తశుద్ధితో వారికి మధురములగు అన్నపానీయములను లడ్డులను ఉదక కలశమును రెండు తెల్లని వస్త్రములను ఈయవలయును. బంగారు కమలమును గంధమాల్యములను అర్పించి అర్చించవలయును. దానము నిచ్చునపుడు ‘కుముదా ప్రీయతామ్’ అనుమంత్రమును చెప్పవలెను. లవణ వ్రతమును (ఉప్పులేని ఆహారమును తినుట) పాటించ వలెను. ఈ విధానముతో దేవిని ప్రతిమాసమునను అర్చించుచుండవలెను.

ఆయా మాసములందు విడువవలసిన ఆహారములు, మాఘమున లవణమును ఫాల్గుణ మున బెల్లమును చైత్రమున తవరాజమును (యవలు మొదలగు వాని నుండి తీసిన చక్కెర) వైశాఖమున తేనెను-జ్యేష్ఠమున పానకమును ఆషాఢమున జీలకర్రను శ్రావణమున పాలను భాద్రపదమున పెరుగును ఆశ్వయుజమున నేతిని కార్తీకమున పుట్ట తేనెను మార్గశిరమున ధనియాలను పుష్యమున చక్కెరను విడువవలెను.

వ్రత విధాన పూజ కాగానే ప్రతి మాసమునను నిండు కరకమును (గరిగ అనెడు ఒక విధమైన మట్టిపాత్ర) భక్ష్య పాత్రమును ఆనాటి సాయంసంధ్యా కాలమున దానము ఈయవలెను. ఎట్లనగా కరకముపైని భక్ష్య పాత్రను ఉంచవలెను. ఆ భక్ష్య పాత్రయందు మాఘమాసమున లడ్డులు-ఫాల్గునమున శోకవర్తులు చైత్రమున సంయావము (గోధుమ రవ్వను పాలతో చక్కెరతో ఉడికించిన వంటకము) వైశాఖమున పూరీలు జ్యేష్టమున ఘాటికలు ఆషాఢమున ఘృతపూరము (బాదుషాఅని ఈనాటి పేరు) శ్రావణమున బూరెలు భాద్రపదమున మండిగలు (గోధుమతో చేయు పిండివంట) ఆశ్వయుజమున పాలు కార్తీకమున ఆకుకూర మార్గశిరమున పెరుగన్నము పుష్యమున శోకములేని ఇండు అను వంటకము-ఇవి నింపవలెను. (వీటిలో శోకవర్తికలు- శోకము–ఇండు-ఘాటికలు అనునవి ఈనాడు అంతగా తెలియనివి. పెద్దలవలన తెలిసికొన వలెను. తెలియనిచో వీటికి మారుగా మరేదైన మధుర పదార్థము ఉంచవచ్చును.)

దానము ఇచ్చునపుడు మాఘమున ‘కుముదా ప్రీయతాం’; ఫాల్గుణమున ‘మాలతీ ప్రీయతాం’; చైత్రమున ‘గౌరీ ప్రీయతాం’; వైశాఖమున ‘రంభా ప్రీయతాం’; జ్యేష్ఠమున ‘భద్రా ప్రీయతాం; ఆషాఢమున ‘జయా ప్రీయతాం’ శ్రావణమున ‘శివా ప్రీయతాం’; భాద్రపదమున ‘ఉమా ప్రీయ తాం’ ఆశ్వయుజమున ‘రతిః ప్రీయతాం’; కార్తీకమున ‘సతీ ప్రీయతాం’; మార్గశిరమున ‘మంగళా ప్రీయతాం’ పుష్యమున రతిలాలసా ప్రీయతాం’ అను మంత్రమును చెప్పవలెను.

అన్ని మాసములందును వ్రతదినమున పంచగవ్యము ఆహారముగా ఉపవాసముండవలెను. శక్తి లేనివారు పగలు ఉపవసించి సనక్తమున (రాత్రి కాగానే) భుజించవచ్చును.

ఇట్లు మాఘమాసము మొదలు పుష్యమాసము వరకు చేసిన తరువాత మరల మాఘ మాసము రాగానే ఈ చెప్పబోవు విధమున దానము చేయవలెను. బొటనవ్రేలి పరిమాణముతో బంగారు గౌరీ ప్రతిమ చేయించవలెను. దానికి పంచరత్నములు తాపటము చేయవలెను. జప మాలయు కమండలువును ప్రతిమకు చేతియందుండవలెను. చతుర్భుజములు శిరమున చంద్ర రేఖ తెల్లని వస్త్రపు మేలిముసుగు ఉండవలయును. కరక(గరిగ) పాత్రలో చక్కెర పోసి పాత్ర పైభాగమున ఈగౌరీ ప్రతిమ నుంచవలెను. అట్లే గోమిథున (ఆవు-ఎద్దు) ప్రతిమను తెల్లని రంగుతో (వెండితో) చేయించి బంగారు అలంకారములు తెల్లని వస్త్రపు పైకప్పడముతో చేయించ వలయును. వస్త్రములను పాత్రములను వీటికి తోడుగా చేర్చవలయును. ఇవి అన్నియును ‘భవానీ ప్రీయతామ్’ అను మంత్రముతో ఆచార్యునకు దానము చేయవలయును.

ఈ విధానముతో ఈ రసకల్యాణినీ తృతీయా వ్రతమును చేయువాడు తర్జణమున సర్వపాపములనుండి ముక్తుడగును. తొమ్మిదివేల అర్బుదముల సంవత్సరముల కాలము ఏ దుఃఖములనెరుగక సుఖించును. వేయి అగ్నిష్టోమముల వలన కలుగు ఫలమునందును, స్త్రీలలో కూడ కన్యగాని సువాసిని కాని విధవ కాని అమాయికురాలు కాని ఎవరు చేసినను ఇంత ఫలమును పొంది సౌభాగ్యారోగ్య సంపన్నయై గౌరీలోకమున ఆదరపాత్రమై సుఖించును. దీనిని చదివినను సకల కలుషముక్తుడై గౌరీలోకము చేరును. ఉత్తమ జ్ఞానము పొందును.