కుశద్వీప వర్ణనము

మూడవదగు కుశద్వీపము శాకద్వీపము చుట్టును గుండ్రనై నదీజలములతో సర్వవిధగైరిక ధాతువులతో వివిధ వర్ణములు కలవై మణులతో వృక్షములతో అలంకృతములయి ఇంకను వివిధ రూపములు కలవై మేఘములవలె కనబడు పర్వతములతో వ్యాప్తము. జనపదములతోను పుష్పఫలోపేతములగు వృక్షములతోను రమ్యము, అంతటను ధనధాన్య సహితము. ఎడతెగక ఎప్పుడు ఎల్లయెడల సకల పుష్పములతో సర్వరత్నములతో గ్రామ్యములు ఆరణ్యములునగు పశువులతో కూడియుండునది. ఇది ద్వీపముల నామక్రమానుసారమున సంగ్రహముగా చెప్పదగిన విషయము. ఇక ఈ ద్వీప విషయము అంతయు విస్తరముగ చెప్పెదను; వినుడు; కుశ ద్వీపమునకు చుట్టును సురాసముద్రమున్నది; వైశాల్యములో ఇది శాక ద్వీపమునకు ద్విగుణము, దీనియందు రత్నములకు జన్మస్థానములగు పర్వతములును అట్టివే నదులును కలవు. ఈవర్ష పర్వతములుకల వర్షములును ఏడేసి చొప్పున రెండేసి పేరులు కలవిగా ఉన్నవి.

పర్వతములు: 1.సూర్యునితో సమమగు-కామదము-విద్రుమోచ్చయము; 2. సర్వధాతుమయ శృంగములతోను శిలాజాలములతోను కూడిన- ఉన్నతము-హేమము; 3. హరితాళ  (అరిదళము) మయశృంగములతో ఆ ద్వీపము నన్ని వైపులను క్రమ్మిన కాలాంజనమ వలాహకము-ద్యుతి; 4. విశల్యకరణి మృతసంజీవని అను ఓషధులు కల-ద్రోణము-పుష్పవాన్; 5. సారవంతమయి దివ్యపుష్పఫలములతో దివ్యలతలతో కూడినది అగు-కంకము-కుశేశయము; 6. మేఘసదృశము-నీటినుండి జనించిన మహిషుడను అగ్నికి వాసస్థానము అగు మహిషము- హరి; 6. సర్వగైరిక ధాతు యుక్తమగు-కకుద్మాన్-మందరము; మన్ అనగా జలమును-దర- చీల్చునది కావున దీనికి ఈ పేరు; ప్రజాపతి ప్రజల నిమిత్తమై స్వయముగా ఇంద్రునకు ఇచ్చిన అనేక రత్నములను అతడు ఈ పర్వతమునందుంచి కాపాడుచున్నాడు. ఈ పర్వతముల నడిమి వ్యాసము శాకద్వీప పర్వతముల అంతర విష్కంభము (నడిమి వ్యాసము) నకు ద్విగుణము.

వర్షములు: 1. కామదము-ఉన్నతము; 2. లోహితము-వేణు మండలకము; 3. జీమూతము రథాకారము; 4. హారికము-లింపకము; 5. కురు- మతిమత్; 6. మహిషము-ప్రభాకరము; 7. కకుద్మత్-కపిలము.

నదులు: ఇవి అన్నియు పుణ్యజలవంతములు 1. ధూతపాప-యోని; 2. సీత-నిశ; 3. తృష్ణ-పవిత్ర; 4. హ్లాదిని-చంద్రమస్; 5. విద్యుత్-శుక్ల; 6. షండా-విభావరి; 7. మహతీ -ధృతి; వీటియందు అచట ఇంద్రుడు తరచుగా కురియించెడి వర్షములవలన ఏర్పడెడి వందల వేల-కొలది నదులు కలియుచుండును.