మత్స్య మహా పురాణము
తటాకాది ప్రతిష్ఠా విధానము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, తటాకములు, ఆరామములు (తోటలు), బావులు, దిగుడు బావులు, సరస్సులు, దేవాలయములు వీని ప్రతిష్ఠ జరుపు 1. విధానమును అచట కావలసిన; 2. ఋత్విజులు; 3. వేదికలు; 4. దక్షిణలు; 5. బలులు; 6. కాలము; 7. స్థానము; 8. ఆచార్యుడు; 9. ద్రవ్యములు ఏవి ఎట్టివిగా నుండవలెనో తెలుపుము అని మనువు మత్స్య నారాయణు నడిగెను. మత్స్యనారాయణుడిట్లు చెప్పెను, మహాబాహు! రాజా! పురుషశ్రేష్ఠా! వినుము. ఈ విధానమంతయు (వైదికములగు) పురాణములయందు “ఇతిహాస” రూపమున ఇతి-హ-ఆస-; (ఉండెను అనికాదు-ఇది ఇట్లుండవలెను అని ఇచ్చట అర్థము.) అని చెప్పబడియున్నది. 6. (కాలము) ఉత్తరాయనము-శుక్లపక్షము-బ్రాహ్మణులు నిర్ణయించిన శుభ దినము ప్రశస్తములు. బ్రాహ్మణులచే స్వస్తి వాచనము జరిపించిన తరువాతనే ఈ ప్రతిష్టాకార్యము జరుపవలెను. 7. (స్థానము) తటాకము-(ఆరామము-కూపము-వాపి-దేవాలయము) సమీపమున తూర్పునకు ఉత్తరమునకు వాలుగా ఉన్న ప్రదేశము ప్రశస్తము. 3. (వేదికలు) నాలుగేసి మూరల భుజములతో చతురస్రముగా నుండు నాలుగు ముఖములు గల వేదికను పదునారు మూరల భుజములుగల చతుర్ముఖ మండపములో నిర్మించవలెను. వేదికకు చుట్టును మేఖలలతో కూడినవియు పిడిమూర భుజములు లోతునుగల గుంటలు తొమ్మిదికాని, ఏడుకాని, ఐదుకాని త్రవ్వవలెను. ఇవికాక పండ్రెండంగుళముల పొడవును ఆరేడంగుళముల వెడలు పునుగల యోని (అధోముఖ త్రిభుజా కృతి వేది) నాలుగు గుంటలు ఏర్పరచవలయును. ఈ గుంటలలో ప్రతిదానికి చుట్టును మూడు వరుసలలో ఎత్తైన మేఖలలు ఉండవలెను. (మేఖల = చుట్టును ఉండెడి గట్టు) అనేక వర్ణముల పతాకలను జెండాలను (తోరణములను) రావి మేడి జువ్వి మర్రి కొమ్మలతో చేసి అమర్చిన ద్వారములును మండపము చుట్టును ఏర్పరచవలెను. 2. (ఋత్విక్కులు మొదలగువారు) ఎనిమిది మంది ద్వారపాలురు-ఎనిమిది మంది హోతలు ఎనిమిది మంది జపకర్తలును వేదపారంగతు లయిన బ్రాహ్మణులుండవలెను. 8. (ఆచార్యుడు) సర్వ వైదిక లక్షణములు కలిగి మంత్రవేత్త జితేంద్రియుడు కులశీలవంతుడునగు బ్రాహ్మణుడు ఆచార్యుడు (ప్రధాన ఋత్విక్) గా నుండవలెను. 9. (ద్రవ్యములు) ప్రతియొక గుంట దగ్గరను కలశములు యజ్ఞోపకరణములు (స్రుక్ స్రువములు దర్భలు మొదలగునవి) విసనకర్ర తెల్లని చామరములు వెడల్పయిన రాగిపాత్ర ఉండవలెను. 5. (బలులు) ప్రతియొక దేవతను ఉద్దేశించి అనేక వర్ణములు గల బలులు ఏర్పరచి అన్ని విషయములను ఎరిగిన ఆచార్యుడు వాటిని మంత్రసహితముగా వేయవలెను. 9. (యూప ము) యూపస్తంభము మూడు పిడిమూరల పొడ వునగాని, యజమానుని ఎత్తునగాని ఉండుట క్షేమప్రదము. (భూషణములు) ఇరువదియైదు మంది ఋత్విజులకును బంగారుతో కుండలములు భుజకీర్తులు చేతి కడియములు వ్రేళ్ళకు పవిత్రములు చేయించవలెను. వివిధములగు వస్త్రము లియవలెను. దక్షిణలు అందరకును సమానముగాను ఆచార్యునకు మాత్రము ఒక్కొక్క ఋత్విజునకు ఇచ్చినదానికి ద్విగుణముగాను ఇచ్చుట కేర్పరచవలెను. వారి కింకను మంచము పరపు మరింకేదైన తనకు నచ్చినదికాని బంగారుతోచేసిన కూర్మమకరములను వెండితో చేసిన చేపను నీటిపామును రాగితోచేసిన ఎండ్రికప్ప, నీటికాకి శిశుమారము మత్స్యము ఇట్టివికూడ చేయించవలెను.
ఇట్టివి సమకూర్చుకొనిన తరువాత యజమానుడును అతని భార్యయు సరౌషధీ జలములతో విప్రులు పఠించు వేదమంత్రములతో స్నానమాడి తెల్లని వస్త్రములను తెల్లని గంధములను తాల్చి పుత్ర పౌత్రులతో కూడి పడమటి ద్వారమునుండి యాగ మంటపమును ప్రవేశించవల యును. మంగళ వాద్యములు మ్రోగుచుండ ఐదువన్నెల మ్రుగ్గుపొడితో చతురస్రమును దాని నడుమ వృత్తమును దానిలోపల షోడశారచక్రమును దాని నడుమ పద్మమునందు బ్రహ్మను లిఖించవలెను. ఇట్లలంకరించిన వేదికపై ఆయా దిక్కులందును స్థానములందును దిక్పాలకులను గ్రహములను ఆయామంత్రములతో నిలుపవలెను. వారుణ మంత్రములతో కూర్మము మొదలగు ప్రతిమలను త్రిమూర్తులను గణపతిని లక్ష్మీపార్వ (సరస్వతీ)తులను సర్వభూత గణములను నిలుపవలెను. మంటపమున (పీఠముపై)వస్త్రము పరచి దానిపై పుష్పాక్షత ఫలములనుంచి రత్నములతో. జలములతో నిండిన కలశములుంచి వాని నడుమనే పై విధముగా గ్రహాదులను నిలుపవలయును. తరువాత ద్వారపాల ఋత్విక్కులను జాపకులను ఆచార్యుని హోతలను పూజించవలెను. ద్వారపాలురలో ఋగ్వేదులను ఇద్దరను తూర్పున యజుర్వేదులను ఇద్దరను దక్షిణమున సామ వేదులను ఇద్దరను పడమట ఆథర్వణులను ఇద్దరను ఉత్తరమున కూర్చుండ పెట్టవలయును. యజమానుడు తాను మంటపములో దక్షిణ దిశను ఉత్తరమునకు తిరిగి కూర్చుండవలెను. ద్వారపాలురను వేదపఠనము చేయుడనియు జాపకులను జపించుడనియు హోతలను యజనము చేయించుడనియు ఋత్విగ్వరణము చేసి ప్రార్థించవలెను.
తరువాత అగ్నికి పర్యుక్షణము చేసి అర్చించవలయును. గ్రహములను ఇంద్రుని ఈశ్వరుని మరుత్తులను లోక పాలురను విశ్వకర్మను ఉద్దేశించి వారుణ మంత్రములతో నేతితో సమిధలతో హోమము చేయవలెను. ఈ హోమకాలములోనే ద్వారపాలురలో ఋగ్వేదీయులు రాత్రి-రుద్ర-పవమాన-పురుష సూక్తములను పఠింతురు. యజుర్వేదులు శాక్త-రౌద్ర-సౌమ్య-కూశ్మాండ-జాతవేదన-సౌర-సూక్తములు పఠింతురు. సామవేదులు వైరాజ – పౌరుష – సౌపర్ణ - రౌద్ర - శ్యైత పంచనిధన – గాయత్ర - జ్యేష్ఠ సామ –వామదేవ్య - బృహత్సామ గౌరవ-రథంతర-గవాంవ్రత- వికర్ణ-రక్షోఘ్న-వయన-సూక్తములు పఠింతురు. అథర్వణులు వరుణ దేవతాకము లగు శాంతిక పౌష్టిక మంత్రములు పఠింతురు.
ఇంకను గజములు, అశ్వములు, రథములు నిలుచు ప్రదేశముల నుండియు పుట్ట నుండియు నదీసంగమ-హ్రద-గోకుల ప్రదేశముల నుండియు ఇండ్ల ముంగిళ్ళ నుండియు తెచ్చిన మృత్తికను కడవలలోవేసి వానియందు నింపిన నీటితో గోరోచనా యవ సిద్ధార్థ (తెల్ల ఆవలు) గంధ గుగ్గులు చూర్ణములతో పంచ గవ్యముతో ఆయా మంత్రములతో వరుణునకు యథావిధముగ స్నపనము చేయించవలెను. ఇదంతయు తటాక ప్రతిష్టకు ముందటి దినమున చేయవలసిన ప్రక్రియ.
ప్రతిష్ఠా దినమున ఉదయకాలమున బ్రాహ్మణులకు నూరుకొని అరువది ఎనిమిది కాని ఏబదికాని ముప్పదిఆరుకాని ఇరువదికాని గోవుల దానమీయవలెను. తరువాత జ్యోతిషికులు చెప్పిన శుభలగ్నము నందు వేద-గాన-వాద్య ధ్వనుల నడుమ బంగారుతో అలంకరించబడిన గోవును (ఈ క్రొత్త తటాకపు) నీటిలో దింపి పిమ్మట దానిని సామ వేదియగు బ్రాహ్మణునకు దానమీయవలెను. పిమ్మట పంచరత్నములు తాపటము చేసిన బంగారు పాత్రలో మకరమత్స్యాది ప్రతిమలను వేసి వేదవేదాంగ పారంగతులైన నలుగురు విప్రులు దానిని పట్టుకొనగా దానిలో నదీ జలములు దధి-అక్షతలు నింపి ఉత్తరాభిముఖులైన ఆ విప్రులచే దానిని నీటిలో దింపించ వలెను. ఆథర్వణసామ మంత్రములతో ‘పునర్మామా’ ‘ఆపోహిష్ఠా’ అను మంత్రములతో ఆపాత్రను నీటిలో పడవేసి మంటపమునకు వచ్చి సదస్సును (సదస్సులోని పెద్దలను) పూజించి మంటపము నకు అన్ని దిక్కులందు బలి వేయవలెను.
తరువాత నాలుగు దినములు వరుసగా హోమము జరిపి నాలుగవనాడు కర్మ సమాప్తి జరుపవలెను. వరుణునకు (మంత్ర పూర్వకముగా) క్షమాపణము చెప్పి యజ్ఞ పాత్రములను యజ్ఞోపములను మండపసామగ్రిని దక్షిణలను ఋత్విజులకు సమముగా పంచవలెను. హోమ పాత్రను శయ్యను ఆచార్యునకు ఈయవలెను. తరువాత యథాశక్తిగా వేయి అష్టోత్తర శతము ఏబది-ఇరువది-మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను.
ఇది (వైదిక) పురాణములందు చెప్పియున్న తటాక ప్రతిష్ఠా విధానము. బావులు, దిగుడు బావులు, కోనేళ్ళు మొదలగు జలాశయ ప్రతిష్ఠలన్నిటియందు ఇదేవిధానము. ప్రాసాదములు ఉద్యానములు భూమిప్రతిష్ఠించుట దానమిచ్చుట మొదలగువానిలో మంత్రములు భేదించ వచ్చును. శక్తిలేనివారు దీనిని సంక్షిప్తపరచి ఏకాగ్ని (వానప్రస్థుడు) వలెనైన జరుపవచ్చును. తనకు ధనము విషయమున శక్తి యుండియు కొరత చేయరాదు.
ఈ శాస్త్ర విధానమున ప్రతిష్ఠించిన జలాశయములలోని నీరు ప్రాణులకు ఉపయోగింప బడి వర్షాకాలము నందుపయుక్తమై అగ్నిష్టోమమను యజ్ఞముచే కలుగు ఫలమును శరత్కాలమున ఉపయోగపడి ఉర్థ్య యజ్ఞఫలమును హేమంతమున ఉపయోగపడి వాజపేయ యజ్ఞఫలమును శిశిరమున ఉపయోగపడి అతిరాత్ర యజ్ఞఫలమును వసన్తమున ఉపయోగపడి అశ్వమేధ ఫలమును గ్రీష్మమునకూడ ఉపయోగపడి రాజసూయముకంటె అధికఫలమును ఇచ్చును.
ధనము ఉన్నంతలో నిర్మల బుద్ధి కలిగి ఈ విశేష ధర్మముల నాచరించినవాడు పవిత్రుడై శివలోకమునకేగును. అనేక కల్పముల కాలము స్వర్గమున నానందించును. రెండు పదార్ధముల పాటు తన ధర్మపత్నితో కూడ మహర్జనాది లోకములందు సుఖించి యోగసిద్ధులకు మాత్రము లభించు విష్ణు పరమపదమును కూడ పొందును.