మత్స్య మహా పురాణము
త్రిపుర దుర్గమున దైత్యదానవులు ప్రవేశించుట
అసుర శిల్పియగు మయుడు నిర్మించిన త్రిపుర దుర్గపు నిర్మాణము పూర్ణమయ్యెను. అది పరస్పరము బద్ధవైరులగు సురలకును, అసురులకును దుర్గత్వమును పొందెను. సురలకు అది దుర్గమము చొరరానిది-అయ్యెను. అసురులకు అది దుర్గము-రక్షణ స్థానము ఆశ్రయము అయ్యెను. యమునివంటి అసురు లెందరో తమకళత్రములతో పుత్రులతో శస్త్రములతో మా(మ)యా విష్టములగు ఆయా గృహములందు ప్రవేశించిరి. వన మనేక సింహములతోవలెను మహా సముద్ర మనేక నక్రములతోవలెను వీరులు అతిపౌరుషములతోవలెను శరీరము రోమము లతో వలెను త్రిపుర దుర్గము బలశాలురగు దేవాసురులతో అధిష్ఠితమయి వ్యాప్తమయ్యెను. అది నూరులకోట్ల దైత్యులతో దట్టమయి కల్లోలితమయి కనబడెను. ఆయా పర్వతములందుండు వారును దానవాలయమగు పాతాళభేదమయిన సుతలమందుండువారును అగు దానవు లందరును ఈ అంతరిక్ష దుర్గము నాశ్రయించిరి.
ఈత్రిపుర దుర్గమును చేరినవారిలో ఎవరుఏదికోరిన-వారికి అదెల్ల ఆ మయుడచట మాయతో అమర్చుచుండెను. చంద్రుడు వెలుగుచుండు ప్రదోషములందును పద్మములు వికసించిన సరస్సులందును మామిళ్ళు అందగించు ఆరామములందును తపోవన సదృశవనములందును అసురులు చందనములు పూసికొన్న ఒడళులతో నలుపు తెలుపు మచ్చలు కనబడు మదపుటేనుగులవలె కానవచ్చుచు శుద్ధములగు ఆభరణములు వస్త్రములు మాలలు మెయి పూతలు దాల్చి కామసమేతలై ప్రియుల వాంఛించుచు హావభావములు ప్రకటించు ప్రియురాండ్రగు స్త్రీలతోకూడి ముదితులగుచు దానవులందు సతతము ఆనందించుచుండిరి. మహాబలులగు ఆ అసురులు మయనిర్మితమగు ఆ స్థానమున మోదించుచు తమ మతులను ధర్మార్థ కామము లందు నిలిపి ప్రవర్తిల్లుచుండిరి. ఇట్లు పురుషార్థత్రితయమున ప్రవర్తిల్లుచుండు అమర వైరులకు ఆ త్రిపుర దుర్గమున చాలాకాలము స్వర్గమందువలె గడచెను. పుత్రులు తండ్రులను పత్నులు పతులను యత్న పూర్వకముగా శుశ్రూష చేయుచు కలహములు లేక పరస్పరము సానురాగులై యుండిరి. ఆ త్రిపుర దుర్గవాసులలో అధర్మముకాని అనృతముకాని లేకుండెను. వారు ఆలయము లందు హరు నర్చించుచుండిరి. ఎల్లయెడల ఎల్లవేళల విపుల పుణ్యాహ ధ్వనులును ఆశీర్వాద శబ్దములును వినబడుచుండెను. మంజుల మంజీర రవములును వీణావేణు స్వనములును విహరించు వరనారీ జనులయు-దానవేంద్రులయి-హాసధ్వనులును వినవచ్చుచుండెను.
ఇట్లు త్రిపుర దానవులు దేవతల నర్చించుచు బ్రాహ్మణుల నమస్కరించుచు ధర్మ కామార్థా సక్తులై ప్రవర్తించుచుండ చాలకాలము గడచెను. ఇట్లుండ ఒకానొక సమయమున ఒకే మారు లోభము క్రోధము కలహము అనెడు కలి లక్షణములు త్రిపుర దుర్గమును ప్రవేశించెను. వారు అసురావాసమగు ఆ త్రిపురదుర్గమును సంధ్యాకాలమున ప్రవేశించి అది మొదలు వ్యాధులు శరీరమును వలె ఘోరరూపులయి జనులు బాధింపసాగిరి.
వేకువ సమయమున త్రిపుర దుర్గమందలి అసురులకును దానవులకును ఎల్లరకును ఉత్పాతములు కననయ్యెను. వారవి తమలోతాము చెప్పుకొని విమర్శించుకొనసాగిరి. అంతలో సూర్యోదయమయ్యెను. రవి తన శుభకర తేజస్సులతో వెలుగుచుండెను. పద్మము రవి తేజస్సును వలె మయుడు సభను ప్రవేశించెను. అతడు మేరుపర్వత శృంగమువంటి సువర్ణ భూషిత పీఠ మున సజలమగు మేఘమువలె కూర్చుండెను. మదపుటేనుగునకు రెండువైపుల రెండు గున్న ఏనుగులవలె అతనికి రెండువైపుల సమీపమునందు తారకాక్షుడును విద్యున్మాలియు కూర్చుండిరి. అంతంతలలో అమరారులును శిష్టులును సమరాంగణమున విశిష్టులునగువారు ఠీవిగ ఉపవిష్ణు అయిరి. వారి నడుమ అ మయుడు దేవతల నడుమ దేవరాజువలె నుండెను.
దానవేంద్రు లందరును సుఖాసనగతులయిన యనంతరము మాయాజనకుడగు మయుడు వారితో నిట్లనెను. ఖేచరులగు దైత్యరాజులారా! దానవ సత్తములారా! అసురులారా! రాక్షసులారా! దాక్షాయణీ (దితి) సుతులారా! నేను గాంచిన భయావహ స్వప్నము వినుడు. మహాబలము మహాక్రోధము ఉగ్రముఖము కల ముగ్గురు పురుషులును ముగ్గురు స్త్రీలును పగలే త్రిపురదుర్గము ప్రవేశించిరి. అతులవిక్రములగు వారు రోషావిష్ణులై బహుశరీరములు దాల్చి ఇచటి వారి శరీరములందు ప్రవేశించిరి. త్రిపురనగర మంతయు మీరేకాదు-ఇండ్లే కాదు- రథాశ్వగజములే కాదు-అంతయు చీకటితో నిండిపోయెను. (గుడ్లగూబ, ముక్కుకల దిస్సమొల స్త్రీ గాడిద నెక్కి కొందర స్త్రీలతో కూడి నవ్వుచు (అందరను) ముద్దు పెట్టుకొనుచుండెను. చంద్రుని తిలకముగా ధరించిన త్రిలోచనుడు-చతుష్పాదుడునగు పురుషు డొకడు స్త్రీని పోలిన వాడు కనబడెను. వాడు బహుశః ఆస్త్రీని చూచియుండును. అతడే నన్ను మేలుకొలిపెను. నాకిట్టి మహా భయం కరియగు స్త్రీ కనబడినది.
నాకిట్టి కల రాత్రివేళ వచ్చుటకు ఫలముగా ఎట్టి నీచమగు అసుఖము మనకు సంభ వించునో ఎరుగజాలను. మీకు నేను తగిన రాజననియు నేను చెప్పు ఈ మాట మీకు హితకర మనియు భావించినచో మీరు మంచి మనస్సులతో నా వచనమును గ్రహించుడు. దానియందు దోషములు పట్టుకొనవలదు. మీరందరును మనస్సులను నియమములందు నిలిపి కామమును రోషమును ఈర్ష్యను వదలి సత్య శమ దమములందును ముని వచనములందును మనస్సు లుంచుడు. శాంతలాచరించుడు. మహేశ్వరు నర్చించుడు. నేను ఇట్లు చెప్పుచున్నానే కాని వచనములందును మనస్సులుంచుడు. శాంతు లాచరించుడు. మహేశ్వరు నర్చించుడు. నేను ఇట్లు చెప్పుచున్నానే కానీ ఈ స్వప్నమునకు ఇట్లు కూడ ఉపశాంతి జరుగదేమో! అసురులారా! ఈ త్రిపుర దుర్గమున నిరంతరముగా ఇట్టి ఉత్పాతములే కనబడుచుండుట బట్టి చూడగా దేవదేవుడుగు త్రిలోచనుడే మనపై అలిగినట్లున్నది. ఏమయినను మీరు కలహము విడిచి ఋజు ప్రవర్తన మవలంబించి స్వప్నశాంతి జరిపి ఆ శాంతిఫలమును కాని అభ్యుదయకరకాలమును గాని ఎదురు చూచుచుండును.
దైత్యులు మయుని ఈ మాటలు విని క్రోధవ్యాకులిత నేత్రులును శిష్టాచార వినాశకులు నయిరి. అలక్ష్మీకాలము చేరువయైనందునను నాశము దాపురించినందునను వారందరును మయుని మాటలు సహించక క్రోధముతో కనులెర్రజేసి పరస్పరము చూచుకొనిరి. తత్క్షణము వారికి దైవము ప్రతికూలించెను; త్రిపుర దానవు లెల్లరును సత్యధర్మములను విడిచి అకార్యములు చేయ సంకల్పించి వాని నారంభించిరి.
నాటినుండి త్రిపుర దానవులు బ్రాహ్మణుల ద్వేషించసాగిరి. దేవతల నర్చించుట మానిరి. పెద్దల నవమానింపసాగిరి. పరస్పరము క్రుద్ధులగుచుండిరి. కలహాసక్తులగుచుండిరి. అధర్మము లాచరించి ఆనందించుచుండిరి. పరస్పరము నిందించుకొనుచుండిరి. సదా అప్రియములు పలుకుచుండిరి. గురువులతో బిగ్గరగా మాటలాడుచుండిరి. పూజ్యులతో (అదరముతో కాదు-మొదలే) మాటలాడకుండిరి. ఆకస్మికముగా తహతహపాటు చెంది కన్నీరు కార్చుచుండిరి. రాత్రులందు పెరుగుతో సక్తువును (పేలపిండిని) త్రావుచు వెలగపండు తినుచునుండిరి. (ఇవి రాత్రులందు తినుటయు త్రాగుటయు నిషిద్ధము) ఎంగిలిగా ఉండియే ఆహారము తినుచు నిండు ముసుగుతో పండుకొని నిద్రించుచు ఉండిరి. మూత్ర విసర్జనమయిన తరువాత ఉదకోప స్పర్శనము చేయకయే కాళ్లయిన కడుగుకొనకయే శౌచముకాని సదాచారముకాని పాటించకయే శయ్యలపయి నిద్రించుచుండిరి. పిల్లులనిన పక్షులు ముడుచుకొని పోవునట్లు ఏ కొంచెము భయకారణమునకును ముడుచుకొని పోవుచుండిరి. పత్నులు పతులు నిందించుచుండిరి. పతులు పత్నులయందు నిర్దయులయిరి. త్రిపురవాసి దానవు లొకప్పుడు సుశీలురుగా నున్నవారే ఇప్పుడిట్లు దుశ్శీలురయిరి. దేవతలను తపోధనులను బాధించుచుండిరి. రాక్షసులకు వినాశము దాపురించి నందున వారు యజ్ఞములకు విఘాతములను బ్రాహ్మణులకు విప్రియములను ఆచరించుచు విప్రులతో కలహించుచుండిరి. వైభ్రాజక చైత్రరథాశోక వరాశోక సర్వర్తుక వచనములను తపోధన వనములను బలాన్వితులగు దానవులు క్రుద్ధులగుచు ధ్వంసము చేయుచుండిరి.
వారిట్లు దేవాలయములను ఆశ్రమములను ధ్వంసము చేయగా దేవాలయ ధ్వజములను యూప స్తంభములను విరుగగొట్టగా జగత్తంతయును అమర రాజావాసమగు స్వర్గము కూడ దేవ శత్రువులచే ఉపద్రవముల పాలయ్యెను.