రాజ ధర్మములు

పట్టాభిషేకమందిన ప్రతియొక రాజునకును ముఖ్యతమ కృత్యమేమి? నీవింతయు ఎరిగినవాడవు కావున తెలుపవేడుచున్నాననిన మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను: రాజు అభిషేకముతో తలతడి ఆరకుండగ ఉన్నప్పటినుండియు రాజ్యమును చూచుకొనుటకై తగిన సహాయులను ఎన్నుకొనవలయును; ఏలయన వారియందే రాజ్యము నిలిచియున్నది; చాల చిన్న పనియును ఒకడే చేయజాలడనిన మహోదయమగు రాజ్యము మాట చెప్పవలసినదేమి? కావున రాజు తానే కులీనులు కులీన జాతీయులు శూరులు బలయుక్తులు సంపద (ముఖశ్రీ) గలవారు రూపము సత్త్వము (నిబ్బరము) గుణములు కలవారు సజ్జనులు క్షమాపరులు క్లేశమును ఓర్చువారు మహోత్సాహులు ధర్మజ్ఞులు ప్రియంవదులు రాజునందు స్వామి భక్తులై హితమును ఉపదేశించువారు తమకును రాజునకును కీర్తి కోరువారునగు సహాయులనెన్నుకొని వారిని ఆయా మంచి పనులందు నియోగించవలెను. రాజు స్వయముగా పరీక్షించి చూచి ఈ చెప్పినన్ని గుణములులేని గుణహీనులైనను గ్రహించి వారిని తగిన పనులయందు భాగక్రమమున నియోగించవచ్చును; (ఇది రాజ సహాయుల సామాన్య లక్షణము;) కులీనుడు, శీలసంపన్నుడు, చతుర్వేద విశారదుడు, హస్తి శిక్షా అశ్వ శిక్షలయందు కుశలుడు, మృదుభాషి, శుభాశుభములగు నిమిత్తములను శకునములను ఆయా చికిత్సా విధానములను ఎరిగినవాడు కృతజ్ఞుడు కార్య శూరుడు, క్లేశసహుడు ఋజుస్వభావుడు వ్యూహములతత్త్వమును వ్యూహ విధానమును ఎరిగినవాడు తేలికయైన విషయమేదో బరువగు విషయమేదో ఎరిగినవాడు అగు బ్రాహ్మణునికాని క్షత్రియునికాని సేనాపతిగా నియోగించవలెను; పొడగరి సురూపుడు దక్షుడు ప్రియవాది పొగరు లేనివాడు సర్వుల మనస్సులకు నచ్చువాడు- అందర మనస్సులలోని భావములను గ్రహించగలవాడు అగు వాని ప్రతీహారునిగా (ద్వారాధికారిగా) నియమించుకొనవలెను. దూత (రాయబారి) చెప్పిన విషయము చెప్పినట్లు ఇతరులకు అందించువాడు దేశభాషా విశారదుడు శక్తి కలవాడు క్లేశసహుడు మాటకారి దేశకాల విభాగముల నెరిగినవాడు దేశకాలముల గుర్తించి ప్రవర్తించగల వాడు (ఏ దేశ మందే కాలమందెట్లు వర్తించవలయునో తెలిసి యుండుట మొదటిది-దానిని ఆచరణ యందుంచి ప్రవర్తించుట రెండవది); రాజ హితము కోరువాడు రాజనీతి విషయములను తగిన సమయమందు తగినట్లు మాటలాడువాడును అయి యుండవలయును.

పొడగరులు, పొడవు బాహువులవారు, శూరులు, దృఢభక్తులు దేనికిని కలతపడనివారు క్లేశసహులు హితకరులునై రాజ రక్షకులుండవలెను, తమ్మపడిగ పట్టువారు (తాంబూల కరండ ధారులు) స్త్రీలుకాని పురుషులుకాని కావచ్చును, వారు అనాహార్యులు (ఆహార్యము-వేషధారణము) ఎక్కువ ఆకర్షణీయము ఆడంబరద్యోతకము అగు వేషము ధరించనివారు క్రూరతలేనివారు రాజు నందు దృఢభక్తులు అయి యుండవలెను; సంధి-విగ్రహము యానము - ఆసనము- ద్వైధము-ఆశ్రయము అను షాడ్గుణ్యపు తత్త్వమును దాని ఆచరణ విధానమును ఎరిగినవాడు దేశభాషా విశారదుడు రాజనీతి విశారదుడునయి 'సంధి విగ్రహకుడు' (విదేశ వ్యవహారముల చూచుమంత్రి) ఉండవలెను; రాజు కడనుండు ఖడ్గదారి రాజభృత్యులలో ఏది ఎవరు చేసిరో చేయుదురో చేయవలెనో ఎవరు తమ కర్తవ్యమును ఆచరించనివారో గమనించగలవాడు దేశరక్ష ణాసక్తుడు, సురూపుడు, తరుణుడు, ప్రాంశుడు (పొడగరి) దృఢభక్తుడు, సత్కులోద్భవుడు, శూరుడు, క్లేశసహుడు అయి ఉండవలెను; రాజుకడనుండు ధనుర్ధారి శూరుడు బలయుక్తుడు గజాశ్వరథ (తత్త్వమునందును- వానిని నడుపుట యందును) కోవిదుడు సర్వక్లేశసహుడు శుచి (కపటము లేనివాడు) అయియుండవలయును, రాజసారథి నిమిత్తములందు (ఉత్పాతములు మొదలగు వానియందు శకునములందు) ఎరుకగలవాడు హయశిక్ష విశారదుడు హయా యుర్వేద తత్త్వజ్ఞుడు భూభాగములు ఎచ్చట ఎట్టివిగా ఉన్నవో ఎచ్చట ఏయే ప్రదేశము లున్నవో ఎరిగినవాడు రథి (కుని) బలాబలముల నెరిగిన వాడు స్థిరదృష్టి కలవాడు ప్రియంవదుడు శూరుడు (యుద్ధ )విద్యయందారి తేరినవాడు అయియుండవలయును: సూదమునకు (వంట శాలకు, వంటపనులకు) అధ్యక్షుడు ఆడంబరపు వేషము ధరించనివాడు (శీరమున చిత్తమున) శుచి దక్షుడు చికిత్సా విధానములు నెరిగినవాడు సూద(పాక) శాస్త్రమును దానిని చేయుటను ఎరిగినవాడు అయియుండ వలెను; మహానసమందు (వంటశాలయందు) ఉండు పనివారు సూద (పాక) శాస్త్రమును దాని విధానమును ఎరిగినవారు ఇతరులకు (అంతర్బహిశ్శత్రువులు మొదలగువారి భేదోపాయములచే) భేదింప అలవికాని వారు గోళ్ళను జుట్టును కత్తిరించుకొని ఉండువారు అయి యుండవలెను. ధర్మాధికృతుడు (న్యాయాధికారి), శత్రుమిత్రుల యందు సముడు ధర్మశాస్త్రము నందు పండితుడు కులీనుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడునయి యుండవలెను. ఇట్టి ద్విజముఖ్యులే అతనికి సహాయులగు ధర్మ సభాసదులుగా నుండవలయును. రాజునకు అన్ని అధికరణముల (డిపార్టుమెంట్) యందును లేఖకలు ఉండవలయును; లేఖకుడు తలకట్టులు కలవి నిండైనవి సరియగు వరుసలయందుండునవి సమపరిమాణము కలవి అగు అక్షరములు వ్రాయువాడు ఉపాయముల నెరుగుటయందు అవగాహనము చేసికొనుట యందు నేర్పరియు సర్వశాస్త్ర విశారదుడును కొలది వాక్యములతోనే విస్తృతార్థమును చెప్పగల వాడు వాక్యాభిప్రాయ తత్త్వము నెరిగినవాడు దేశకాల విభాగమును (ఏ కాలమందేది చేయవలెనో మాటలాడవలెనో) ఎరిగినవాడు వేషాడంబరము లేనివాడు, శక్తి (బుద్ధి స్ఫురణము) కలవాడు అయి యుండ వలయును; పురుషుల (ఆయా వ్యక్తుల) స్వభావములందలి భేదమును గురుతింపగలవారు పొడగరులు ధనాశరహితులు జనులను తమవైపునకు త్రిప్పుకొన గలవారు ధర్మాధికరణ శాఖయందు నియోగింపబడవలెను; రాజునకు దౌవారికులు (ద్వారా పాలురు)ను ఇట్టివారే అయియుండవలెను; ధనాధ్యక్షుడు లోహములు వస్త్రములు చర్మములు రత్నములు మొదలగువాని తత్త్వమును విధానమును (ఆయా వస్తువుల స్వరూప లక్షణములును ఏది ఎట్లున్నదో మంచిదో, మంచిదికాదో తెలియుట తత్త్వమును ఎరుగుట-ఆయా వస్తువులలో ఏది ఏపనికి వచ్చునో ఎట్లు దేనిని వినియోగించు కొనవచ్చునో ఎరుగుట విధాన జ్ఞానము) ఎరిగిన వాడు కొంచెపుది ఏదియో గొప్పది ఏదియో ఎరిగినవాడు వేషాడంబరము లేనివాడు నిర్మలమగు నవ్వు కలవాడు నిపుణుడు ఏమరుపాటు లేనివాడు ధనాధ్యక్షుడుగ ఉండవలయును: ఆయ ద్వారము (ఆదాయపు సాధనములగు శాఖ) లన్నిటి యందును, వ్యయ ద్వారముల (శాఖల) యందును ధనాధ్యక్షునితో సములగువారేయుండవలయును; శల్యము శాలాక్యము కాయ చికిత్స భూత విద్య కౌమార భృత్య అగదతంత్రము రసాయన తంత్రము వాజీకరణ తంత్రము-లేదా-కాయము బాలము గ్రహము ఊర్ధ్వాంగకము శల్యము దంష్ట్ర-జర-వృషము అను ఎనిమిది వైద్యాంగముల యందును చికిత్సా ప్రక్రియయందును నిపుణుడు వంశపరంపరా క్రమమున వచ్చినవాడు వేషమున నిరాడంబరుడు ధర్మ మనస్కుడు ఉత్తమ వంశమున పుట్టినవాడు రాజ వైద్యుడుగా నియోగింప బడవలెను. అతడు రాజునకు ప్రాణాచార్యుడు, కావున భూభర్తయగు రాజు ఎల్లప్పుడును ఆతడు చెప్పిన మాటను సాధారణ జనులు పాటించినట్లే పాటించి ఆచరించవలయును, గజ శిక్షా విధానము బాగుగ నెరిగినవాడు క్లేశమును ఓర్చుకొనువాడు వనగజ జాతులను బాగుగ నెరిగినవాడు గజాధ్యక్షుడుగా నుండవలెను, ఇవే గుణములతో కూడినవాడును అందునను ముఖ్యముగా మూల వ్యాధి మొదలగునవి లేక బాగుగ కూర్చుండగలవాడు రాజు గజారోహుడుగ (మావటివాడుగ) నుండవలయును, ఇట్టివాడు సర్వకర్మల యందును ప్రశస్తుడు. హయశిక్షను హయచికిత్సను తుదముట్ట నెరిగినవాడును (మూలవ్యాధి మొదలగునవి లేక ఎంత సేపయిన బాగుగ కూర్చుండగలవాడు) రాజునకు అశ్వాధ్యక్షుడుగ నుండవలయును. నిరాడంబర వేషుడు శూరుడు మాట నేర్పరి ప్రాజ్ఞుడు - కులీనుడు సర్వకాలములందును సదా పూనికలో నుండువాడు దుర్గాధ్యక్షుడుగా నుండవలయును, వాస్తు విద్యను వాస్తు విధానమును బాగుగ నెరిగినవాడు లఘుహస్తుడు (శీఘ్రముగా పనులు చేయగలవాడు) శ్రమకోర్చువాడు దూర దర్శియు శూరుడునగువాడు రాజునకు వడ్లంగిగా నుండవలయును; యంత్రములతో విడుచునవి చేతితో విడుచునవి ధనుస్సు నుండి విడుచునవి విడిచి మరల గ్రహించి పట్టుకొనునవి అగు ఆయుధములందు కుశలుడు ఉద్వేగము లేనివాడు రాజునకు అస్త్రాచార్యుడుగ ఉండ వలయును, వృద్ధుడు కులీనుడు చక్కని మాటలాడువాడు పితృ పితామహాది వంశక్రమాగతుడు మనశ్శరీర ములందు శుచియగువాడు వినయము (మంచి నడువడి) కలవాడు అంతః పురాధ్యక్షుడుగా నుండలయును; రాజు ఈ విధముగా (ఈ చెప్పిన వానిలో ప్రధానములగు) ఏడధికారము లందును ఏడుమంది రాజ పురుషులను చక్కగా పరీక్షించి పురమందు అచరించ వలసిన సర్వ కర్మముల నిర్వహణములందును నియోగించవలెను, వీరుకాక-రాజు ఆయుధా గారాధ్యక్షునిగా అయా యాయుధములను అమర్చు విధపు తత్త్వమును బాగుగ నెరిగినవాడు నిరంతరము మెలకువతో నుండువాడు సర్వకర్మములందును సదా పూనికతో నుండువాడు అగు వానిని నియోగించవలయును, నృపకులోద్వహుడవగు మనూ! రాజునకుగల కార్యములు అపరి మిత ములు; అవి ఉత్తమములు మధ్యమములు అధమములునని మూడు విధములు; వాని తరము నెరిగి రాజువాటిని వరుసగా ఉత్తములు మధ్యమములు అధములునగు పురుషులయందు నిలుపవలయును, నరులుచేయు కర్మలవ్యత్యాసము వలన రాజు వ్యసనమును- కీడును పొందును, వారివారి అధికారమును- దానిని వారు నిర్వహించు తీరును వారి పౌరుషమును వారు ఆపనుల నిర్వహించుటలో చూపు పూనికను వారి రాజభక్తిని శాస్త్ర జ్ఞానమును, శౌర్యమును, కులమును, రాజనీతి జ్ఞానమును ఎరిగియే రాజు రాజ పురుషులను నియోగము (అయా అధికారములందు నిలుపుట) చేయవలసి యుండును, ఇది చేయుటలో రాజు ఆయా పురుషుల అంతర (చిత్తము లందలి) విజ్ఞాన (అనుభవ పూర్వక విషయ పరిజ్ఞాన) సారమును తత్త్వ (విషయపరిజ్ఞాన) సారమును ఎంతటివియో ఎరిగి వానిని ఆధారముగా తీసికొనవలెను.

రాజు తన ఇష్టము వచ్చినంత మందితో వేరువేరుగా మంత్రణము చేయవచ్చును; కాని మంత్రాలోచనపరుడగు రాజెప్పుడును మంత్రులకు కూడ ఇతర మంత్రులు చెప్పిన మంత్రణమును బయలుపరచగూడదు; రాజు ఏ మానవులను నమ్మరాదు; అయా మంత్రులు చెప్పిన మంత్రణ ములపై నిశ్చయము మాత్రము తానే చేయవలెను. కాని-రాజైనవాడు ఇతరులు చెప్పిన దానిమీద కూడ తన బుద్ధితోనే నిశ్చయము చేసికొనవలెను; వేదశాస్త్రములను బాగుగనేర్చి వాటియందు దృఢపాండితిగల బ్రాహ్మణులను రాజు సేవించవలెను; అనచ్ఛాస్త్రము లను చదివిన మూఢులను సేవించరాదు. వేదవేత్తలు నిర్మలమనస్కులునగు విప్రులనే సేవించవలెను, తాను వినయ సంప న్నుడై వారినుండి ఇంకను వినయమును ఎడతెగక శిక్షణ పొందుచుండవలెను, దీనిచే రాజు పృథివిని అంతటిని తన వశముచేసికొన గలుగును; చాలమంది రాజులు అవినయము వలన తాము తమ పరివారముతో కూడ భ్రష్టులయిరి; వినయము వలన ధనములను రాజ్యములను పొందిరి.

రాజు వేదత్రయము నందును తదంగ శాస్త్రములందును పండితులగు వారినుండి వేదశాస్త్రాది విద్యలను శాశ్వతము (సార్వకాలికము) అగు దండనీతిని తర్కశాస్త్రమును ఆత్మ విద్యను నేరువలెను; వాణిజ్యము కళలు మొదలగు వానిని లోకపు నడువడిక నుండి తెలిసికొన వలెను; ఇంద్రియ జయమునకై యోగమును నిరంతరమభ్యసించవలెను, ఏలయన జితేంద్రియుడే ప్రజలను తన అదుపులో ఉంచుకొనగలుగును. ధర్మసాధనకై రాజు బహుదక్షిణలతో కూడ క్రతువులతో దేవతల నారాధించవలయును; విప్రులకు ధనభోగముల నీయవలెను, ఆప్తుల ద్వారమున ఏటేట రాష్ట్రము నందలి ప్రజల నుండి రావలసిన పన్నులను సేకరించుకొనవలెను; స్వాధ్యాయపరుడై ఎప్పుడును వేదశాస్త్రాదులను అధ్యయనము చేయుచు ఉండవలెను. జనులకు తాను తండ్రివలె బంధువువలె నడుచుకొనవలెను, గురుకులము నుండి విద్య ముగించి వచ్చిన స్నాతకులగు విప్రుల పూజించ (ఆదరించ) వలెను. ఇది రాజులకై బ్రహ్మ (ప్రజాపతి) ఏర్పరచిన అక్షయ (శాశ్వత) విధానము. అని శాస్త్రమున చెప్పబడుచున్నది; ఈ విధమగు ప్రక్రియలచే సంపాదించిన అక్షయనిధిని దొంగలుకాని, శత్రువులుకాని హరించజాలరు; అది తనంతట తాను నశించునదియు కాదు; కావున రాజు ఈ బ్రాహ్మమగు అక్షయ విధానమును పాటించి నడువ వలెను; అపుడపుడు రాజు ప్రజల యందలి ఉత్తములు సాధారణులు అధములు అను మూడు వర్గములకు చెందిన ప్రజల(లోముఖ్యు)లను తనకడకు పిలిపించుకొని (వారిని అనువర్తించుచు) ప్రజలను పాలించవలెను.

క్షత్త్రియ వ్రతధర్మమును జ్ఞప్తియందుంచుకొని యుద్దములందు వెనుదిరుగ కుండవలెను; సంగ్రామములందు మరలకుండుట ప్రజలను సరిగా పాలించుట బ్రాహ్మణులను సేవించుట - ఇవి రాజులకు పరమనిఃశ్రేయన (పరలోక సుఖ) సాధనములు; దీనులు అనాధులు వృద్ధులు విధవలు-వీరిని కనుపెట్టి చూచుచు పాలించుటతో పాటు వారి యోగక్షేమములకు జీవనమునకు ఏర్పాటు చేయవలెను; రాజెప్పుడును స్వధర్మము తప్పి నడుచు వారిని దానియందు నిలుపవలెను, ముని ఋష్యాద్యాశ్రమములందలి వారికై అన్నమునకు వస్త్రమునకు పాత్రలకు ఏర్పాటు చేయ వలెను; వారిని సత్కార పూర్వకముగా రాజ్యములోనికి (నగరమునకు) పిలుచుకొనివచ్చి సత్కరిం చవలెను; వారిని సత్కరించవలెనే కాని లోక సత్కారము పొందుచుండు అట్టి పెద్దలను ఎన్నడు నవమానించరాదు; వారికి తాను చేయు (పరిపాలన సంబంధి) సర్వకార్యములను (నేనిది ఇట్లు చేయుచుంటినని) నివేదించవలెను; రాజ్యమును తను తన పరివారాదికమును కూడ (ఇది అంతయు తమ అధీనమేయని) యత్పరుడై నివేదించవలెను, దేవతలనువలె వారి నర్చించవలెను, మనుసంప్రదాయము ననుసరించి రాజులు ఋజ్వీ (వంకరలేనిది) వక్రా (వంకరమగునది) అను రెండు ప్రజ్ఞలను (వర్తన విధానములను ఆలోచనా సరణులను) తెలిసి కొనవలెను; కాని తాను మాత్రము ఋజ్వీ ప్రజ్ఞనే పాటించవలెను; ఇతరులు వక్రప్రజ్ఞను తనపై ప్రయోగించుచో దానిని గుర్తించి దాని నెదుర్కొని దానికి ప్రతీకారము చేయవలెను; తాను మాత్రము సాత్త్విక భావము నవలంబించి ఋజ్వీ ప్రజ్ఞనే ఆచరణములోనికి తీసికొనవలెను; తన ఛిద్రము (లోపము)ను ఇతరులకు తెలియనీయక పరచ్ఛిద్రమును తెలిసికొనుచు తన అవయవములను కప్పుకొనునట్లును తనలో దొరలు లోపములను కూడ కప్పిపుచ్చుకొనుచు (ఇతరులకు బయలు పడనీయక) వాటిని రక్షించుకొనుచు (తప్పులను సవరించుకొనుచు) ఉండవలయును; తను నమ్మని వానిని తానునమ్మరాదు; నమ్మినవానినికూడ మితిమీరి నమ్మరాదు; దానివలన కలుగు భయము (కీడు) సమూలముగా నాశము కలిగించును, వాస్తవములగు హేతువులతో ఇతరులను తాను నమ్మించవలెను; కొంగవలె (కపట ధ్యానముతో నిశ్చల చిత్తముతో) రాజకీయ విషయములలో చించవలయును సింహమువలె పరాక్రమింపవలెను, తోడేలువలె దోచవలెను, డేగవలె శత్రువులను పడగొట్టవలెను, అడవి పందివలె గట్టి దెబ్బ కొట్టవలెను, నెమిలివలె పలువన్నెల రూపములు (వేషములో కాదు; తన ప్రవర్తనములో) తాల్చవలెను, కుక్కవలె అశ్వమువలె దృఢభక్తితో నుండవలెను; కోకిలవలె తీయగా పలుకవలెను.

అపరిచితులను త్వరగ నమ్మక, కాకివలె సదాశంకతోనే ఇతరులను చూడవలెను; ముందుగా ఆప్తులతో పరీక్షించక ఆహారమును తినరాదు; వస్త్ర అలంకార పుష్పాదికము ప్రయోగించరాదు; జనసమ్మర్దము లోనికి పోరాదు; ఎరుగని నీటి తావులకు పోరాదు; అశిక్షితమగు చిన్నవయసు ఏనుగునెక్కరాదు; అట్టి గుర్రమునెక్కరాదు; ఎరుగనిస్త్రీని కలియరాదు; దేవతోత్సవము లందు నిలువరాదు; రాజు లక్ష్మీ రక్షకుడును శ్రమను లెక్కచేయనివాడును కావలయును, పృథివిని జయించగోరు రాజు తన భృత్యులను సరిగా పోషించుచు సంమానించుచు తనకు సహాయులుగా నుంచుకొనవలయును; అర్హతానుసారము రాజు ఆయాపనులయందు భృత్యులను నియోగించ (పనియందుంచుకొన) వలయును. ధర్మకార్యము లందు ధర్మిష్ఠులను యుద్ధకర్మలందు వీరులను ధనాధి విషయములందు అర్థవిషయ నిపుణులను స్త్రీల (రక్షణాదికముల) యందు నపుంసకులను దారుణ కృత్యములందు తీక్క్ష్ణోలను నియమించ వలెను, చిత్త నిర్మలత్వము ఇందరకు అందరకు నుండవలసిన సాధారణ లక్షణము; ధర్మము, అర్థము, కామము, భయము అను నాలుగు ఉపధల యందు పరీక్షించిన తరువాతనే వారిని భృత్యులనుగా నియమించవలెను; ఆయా కానుకలను తెచ్చి ఇచ్చుచుండు వనచరులను (అడవి జాతుల వారిని) రాజు అడవికి సంబంధించిన పనులకై కొలువు నందుంచుకొని వారిలో ఎవరే యే స్థానములందు బాగుగ వెదకుచు ఆయా స్థానవిషయములను గమనించి కనుపెట్టి చూచుచుందురో అట్టి పూనికగల వారిని ఆపనులకు అధ్యక్షులనుగా నియమించవలెను; రాజు ఈ మొదలగు పనులను సరిగా చేయవలెను, ఏమయినను రాజు తీక్క్ష్ణోపకరణమునకు పూనరాదు.

పాపాచరణముతో సాధింపదగు పనులను సత్పురుషులు ఆచరించరు; కావున రాజులు అట్టివానిని అవలంబించరాదు; రాజులకు తీక్ష్క్ష్ణోపకరణ క్రియ తగదు; అనుమాటకు ఇదియే అర్థము; ఏ పనియందెవరికి మిక్కిలి నేర్పుగలదో వారిని వానియందు పరీక్షించి నియోగించ వలెను, జ్ఞాతి సంబద్ధములగు పనులయందుకాక మిగిలిన ప్రతిపని యందును పితృపితామహ క్రమాగతులగు భృత్యులను నియమించుట మంచిది; ఏలయన వీరు సదా రాజహితకరులుగా నుందురు; దాయాదులు (రాజ సోదరులును రాజకుటుంబముతో సన్నిహితులగు ఇతర దాయాదు లును) చేయవలసిన కొన్ని పనులు యందు మాత్రము వారే - దాయాదులే-బాగుగు ఇమిడి పోవుదురు, వానిని ఇతరులు ఆచరించుట సముచితముగాడు; జనులను తనవైపునకు త్రిప్పుకొని తనలోనికి చేర్చుకొను కోరిక యున్నను పరరాజ గృహము నుండి వచ్చిన వారిని మాత్రము- వారు దుష్టులైనను అదుష్టులైనను ఆశ్రయించరాదు; వారిని విడుచుటకే యత్నించవలయును, వారిలో దుష్టుని గుర్తించవలెను; అట్టివానిని రాజు నమ్మకుండవలెను, అట్టివానికి కూడ రాజు జీవనవృత్తి నేర్పాటుచేసి జనులను తనవైపున నుంచుకొన యత్నించవలెను; అంతేకాదు; దేశాం తరము నుండి వచ్చిన వానిని రాజు మిక్కిలిగ గౌరవించ వలెను, వీడు గతిలేక నా దేశమునకు వచ్చినాడు లెమ్మను అవమాన దృష్టితో ఆలోచించరాదు; రాజెన్నడును అధిక సంఖ్యలో భృత్యులను నియమించుకొనరాదు; వారిలో బాగుగ పనిచేసిన వారిని బహుమానించ కుండరాదు; ఏలయన రాజునకు శత్రువులు-అగ్ని విషము - ఖడ్గము (మొదలగు ఆయుధములు) సర్పములు -ఇన్నియును ఒక ఎత్తు; కోపించిన భృత్యులు ఒక ఎత్తు; (కావున వారిని కోపింప జేయరాదు)

రాజు సర్వదాచారుల ద్వారమున భృత్యుల నడువడిని గుర్తెరిగి వారిలో సద్గుణులను గౌరవించుచు గుణహీనులను శాసించుచు ఉండవలయును; మనురాజా! రాజులు చారచక్షులు (చారులే కన్నులుగా కలవారు,) అని శాస్త్రమునందు చెప్పబడినది; తన దేశమునందును పరదేశము నందును జ్ఞానశీలురు విచక్షణులు నిరాడంబర వేషులు క్లేశ సహులు అగు చారులను నియోగించవలయును, వారు జనులకు తెలియబడక సౌమ్యులై పరస్పరము మాత్రము తెలిసి యుండవలెను, వణిజులను మాంత్రికులను జ్యోతిషికులను వైద్యులను సన్యాసులవలె నుండు వారిని (బైరాగులు సాధులు మొదలగువారిని) చారులుగా నియోగించవలెను, గూఢచరు డొక్కడే చెప్పినది సుభాషితమేయైనను (విశ్వసనీయమేయైనను) నమ్మరాదు; ఇరువుర మాటలలోని పరస్పర సంబంధమును వానిలోని ఐకమత్యమును ఎరిగి అది సరిపోయినవారి మాటలను నమ్మవలెను, అట్టి వారిరువురును పరస్పర మెరుగని వారైనను సరియే; కావున రాజు ప్రయత్నముతో చారులను గూఢులనుగా చూచి నియోగించవలెను; ఏమయినను రాజులు చారులే తమ కన్నులుగా నుండుట రాజునకు క్షేమమూలము; ఈచరులను కూడ రాజు యత్న పూర్వకముగా పరీక్షించవలెను; భృత్యులు కాని రాజ్యజనులు (ప్రజలు) కాని రాజునందు రక్తులో విరక్తులో వారు సద్గుణులో దుర్గుణులో తెలియుట మొదలగునవి చారాధీనము కావున వారి విషయమున రాజు ఎచ్చరిక కలిగియుండవలెను; రాజ్య మందలి జనులును భృత్యులును నా విషయమందు ఏ హేతువుచే రక్తులగుచున్నారు; ఏ హేతువుచే విరక్తులగుచున్నారు? అనునది రాజు లెరుగుచుండవలెను, అనురాగకరమగు పనులు చేయుచుండవలెను, విరక్తులగు జనులతోడి సంబంధమును ప్రయత్నముతో విడువవలయును, భాస్కర వంశచంద్రా! మనూ! రాజులకు లక్ష్ములు జనులకు తనయందుగల యనురాగమువలననే సిద్ధించును. కావున నరేంద్ర ముఖ్యులు మానవుల హృదయములలో తన యందనురాగము కలుగజేసికొన యత్నించవలెను.