మత్స్య మహా పురాణము
కాలము
ఎల్ల దేవతల ప్రతిష్ఠలకును చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాఘ ఫాల్గుణ మాసములు ప్రశస్తములు; శుక్ల పక్షమును ఉత్తరాయనమును మంచివి; తిథులలో ద్వితీయా తృతీయా పంచమీ సప్తమీ దశమీ త్రయోదశీ పూర్ణిమలు మంచివి; ఈ చెప్పిన వానియందు యథావిధిగ ప్రతిష్ఠ జరిపినచో బహు ఫలము లభించును.
నక్షత్రములలో పూర్వాషాడోత్తరాషాఢలు - మూలోత్తర ఫల్గున్యుత్తరాభాద్రలు జ్యేష్ఠ శ్రవణము, రోహిణి, పూర్వాభాద్ర, హస్త, అశ్విని, రేవతి, పుష్యమి, మృగశిర, అనూరాధ, స్వాతి - ఈ నక్షత్రములు మంచివి; బుధ బృహస్పతి శుక్రులు అను మూడు గ్రహములలో ఏవి కాని చూచుచుండు లగ్నమును, నక్షత్రమును ప్రశస్తములు.
గ్రహ బల తారాబలములను చూచికొని గ్రహపూజను జరిపి ప్రశస్తమగు నిమిత్తమును శకునమును చూచికొని అద్భుతములు మొదలగు క్రూరములగునవేవియు జరుగని సమయమున శుభయోగమున క్రూర గ్రహములు లేని శుభ స్థానమున (రాశియందు) శుభలగ్నమునందు శుభ నక్షత్రమునందు అయన పుణ్యకాల విషువ పుణ్యకాల షడశీతి ముఖ్య పుణ్యకాలములందు శాస్త్ర విధానమునందు చెప్పిన ఆయా కర్మలను అనుష్టించుచు దేవతా ప్రతిష్ఠ జరుపవలయును.
ముహూర్తముల విషయమున ప్రాజాపత్య ముహూర్తమునందు దేవతార్చామూర్తి శయ నమును, శ్వేతముహూర్తమునందు ఉత్థాపనమును, బ్రాహ్మ ముహూర్తమునందు స్థాపనమును, (ప్రతిష్ఠాపనమును) జరుపవలయును.