మత్స్య మహా పురాణము
సావిత్రికి చతుర్థవరము
సావిత్రి యమునితో ఇట్లనెను. ధర్మాధర్మ విధానమును ఎరిగిన వాడా! సర్వధర్మములను ప్రవర్తిల్లజేయువాడా! జగములకు నాథుడవు (రక్షకుడవు) ప్రజా సంయమనుడవు అగుటచే యముడవు నీవే. వారివారి కర్మములకు తగినట్లుగా ప్రజలను అదుపులో ఉంతువు కావున దేవా! యముడు అను నామముతో వ్యవహరించబడుచున్నావు. విభూ! ఈ ప్రజలను అందరను ధర్మముచే ఆనందింపజేయుదువు కావున 'ధర్మరాజు' అని నిన్ను సజ్జనులు అందురు. మృతులయిన జనులు తమ సుకృతమునో దుష్కృతమునో తమ ముందుంచుకొని నీ సమీపమును చేరుదురు కావున నీకు మృత్యువు అను పేరు వచ్చినది. (మృతాః-యాంతి -ఏనం-ఇతి మృత్యుః అని వ్యుత్పత్తి; వీనిలో-మృత-య =మృత-యు=మృత్యు) కల (540 రెప్పపాటులు) దాని అంశములు మొదలగు కాలావయవ పరిమాణములతో ప్రాణిజీవితములను గణనచేయుచు కాలవ్యవస్థ నేర్పరతువు కావున నీకు కాలుడు అని పేరు. సర్వభూతములకు అంతమును కలిగించు మహాతత్త్వమవు కావున నీకు అంతకుడు అని వ్యవహారము; సూర్యుని మొదటి కుమారుడవు గావున నీవు వైవస్వతుడవు; ఆయువును ఈ జన్మపు ప్రారబ్ద కర్మమును ముగియగనే ప్రాణులను నీ దగ్గరకు తీసికొనెదవు కావున నీవు సర్వప్రాణహరుడవు.
దేవేశా! నీ యనుగ్రహముననే వేదత్రయ ధర్మము నశించకున్నది; ప్రాణులు ధర్మమందు నిలిచియుందురు, ధర్మములు పరస్పరము సంకీర్ణము కాకయున్నవి; సజ్జనులకు ఎల్లప్పుడును గతి నీవే, ఈ జగత్తున న్యాయధర్మముల హద్దును రక్షించు జగన్నాధుడవు నీవే. దుఃఖితను శరణాగతను అగు నన్ను రక్షించుము, దేవశ్రేష్ఠా! ఈ రాజపుత్రుని తల్లిదండ్రులును నా వలెనే దుఃఖితులయి యున్నారు; అనగా యముడు ఇట్లనెను. ధర్మజ్ఞవగు అబలా! నీ భక్తితోను, స్తవముతోను సంతుష్టుడనగు నేను నీ భర్తయగు సత్యవంతుని వదలితిని; నీ కోరిక నెరవేరినది కదా! నీవు వెడలి పొమ్ము; అతడు నీతో కూడి నాలుగు వందల ఏండ్లు రాజ్యమేలును, అనంతరము స్వర్గమును ఆరోహించి నీతో కూడి సుఖించును; ఇతడు నీయందు నూరుమంది పుత్రులను కనును. వారు రాజులుగా దేవసమానులుగా అగుదురు. వారు రాజులలో ముఖ్యులును నీ పేరుతో అనగా సావిత్రులు అని ప్రసిద్ధులును, శాశ్వతులును నగుదురు. నీ తండ్రికి నీ తల్లియగు మాళవియందు మాళవులను ప్రసిద్ధ నామముగల వారు (కీర్తిచే) శాశ్వతులు పుత్ర పౌత్రవంతులును అగు నూరుగురు కుమారులు కలుగుదురు; నీ తమ్ములందరును దేవ సములగు క్షత్రియులతో అగుదురు; ధర్మజ్ఞా! ప్రభావతమున మేలుకాంచి ఈ స్తోత్రముతో నన్ను ఎవరు స్తుతింతురో వారు కూడ దీర్ఘాయుష్మంతులగుదురు. అని ఇట్లు చెప్పి మహాత్ముడగు యమ భగవానుడు రాజసుతుడగు సత్యవంతుని వదలి కాలునితోను మృత్యువుతోను అదృశ్యుడయ్యెను.