కాలనేమికృత సమరసన్నాహ వర్ణనము

దేవతలకు శుభకరుడగు ఇంద్రుడు వరుణుని మాటకు సంతోషముతో సరేయని మంచు ఆయుధముగా గల చంద్రుని ముందుగ యుద్ధమునకు పొమ్మని సందేశమంపెను. “సోమా! నీవు వెళ్లి వరుణునకు సాయపడుము. అసుర వినాశమును దేవజయమును కలిగించుము. నీవు లోపలను వెలుపలను కూడ శక్తికలవాడవు; జ్యోతిస్సులకు పరమేశ్వరుడవు. లోకములందలి రసద్రవ్యమంతయు చంద్రమయమని వేదవేత్తలందురు. నీమూలమున సముద్రమునకున్నట్లే నీ మండలమునందును క్షయవృద్ధులు కలవు. కాలమును జగత్తున కన్వయింపజేయుచు అహోరాత్రముల నేర్పరచుచున్నావు. ప్రపంచపు నీడతో ఏర్పడిన గుర్తు నీయందు కుందేటివలె విలాసము చూపుచున్నది. నక్షత్రములకును మూలభూతు (నక్షత్రాధి దేవత) లగు దేవతలకు కూడ నీమహిమ తెలియదు. నీవు అదిత్య పథము నకును నక్షత్ర పథమునకును కూడ పైగానున్నావు. నీవు నీశక్తితో చీకటిని పోగొట్టుచు అఖిల జగత్తు ప్రకాశింప జేయుదువు. నీ కిరణములు తెల్లనివి, నీ కాంతి హిమమయము, నీవు జ్యోతిస్సుల కధిపతివి, ప్రాణుల కధిక శుభము కూర్తువు; కాలపు వ్యవస్థయే నీ రూపము, యజ్ఞమందారాధింపబడువాడవును యజ్ఞమును నీవే, అవ్యయుడవు; ఓషధుల కధిపతివి, కర్మలకు జన్మకారణుడవు; హరుని శిరో భూషణమును ధరించువాడవు; చల్లని కిరణములు గలవాడవు; అమృతమునకు నీవు ఆశ్రయమవు; ఏపనినైనను చేయవలెనను కొనగానే ఆపని చేయుటకు త్వరపడువాడవు; మనోహర శరీరుల శరీరకాంతి నీవే; సోమపానము చేయు యజమానులకును యాజ్ఞికులకును సోమము నీవే, సర్వభూతముల యందును సౌమ్యత గలవాడవు, చీకటులు నశింపచేయువాడవు, నక్షత్ర రాజవు, ఇట్టివాడవు కావున నీవు కవచధారియైన వీరుడగు వరుణునితోకూడి మహాసేనలోనికి పొమ్ము; మమ్ములను దహింపజేయు అసుర మాయను అణచి వేయుము;” అనగా చంద్రు డింద్రునితో ఇట్లనెను. “వరప్రదుడవగు దేవరాజా! నీవు స్వయముగా నన్ను యుద్ధమునకై ప్రేరించుచున్నావు కావున నీవనునట్లే దైత్యమాయను తగ్గించుమంచును వర్షింతును. ఈ దైత్యులందరును నా మంచుచే కాల్చబడి చుట్టివేయబడి మహాయుద్ధ మందు మాయారహితులు మదహీనులు అగుదురు, చూడుము.”

అట్లు పలికిన హిమకరుడు ప్రయోగించిన మంచువానలు మేఘగణములవలె ఆ ఘోరదైత్యులను చుట్టుకొనసాగెను. పాశధరుడగు వరుణుడును చల్లని కిరణములు దాల్చిన చంద్రుడును  -  ఈ మహాబలులిద్దరును పాశపాతములతోను హిమపాతములతోను దానవులను చావగొట్టుచుండిరి. ఇద్దరును జలాధిపతులే; వారికి పాశమును హిమమును ఆయుధములు; కనుకనే వారు యుద్ధమునందు కల్లోలితమయిన మహాసముద్రమువలె పొరలుచున్న నీటితో కూడి యుద్ధమున సంచరించుచుండిరి. వారిచే ముంచివేయబడిన ఆ దానవసేన జగత్ప్రళయ మేఘములు తమ సేనయందు ప్రవేశించగా వాటిచే తాము చుట్టబడిరేమో యనునట్లుండిరి. ఇట్లు జలాధిపతులగు చంద్రవరుణులు పరాక్రమించి మయదైత్యుడు నిర్మించిన మాయను శమింపజేసిరి. చంద్రుని శీతల కిరణములతో నిర్దగ్ధులయియు వరుణుని పాశములతో బంధించబడియు దైత్యులు రణమున కదలలేక శిఖరములులేని కొండలవలె ఉండిపోయిరి. చల్లని కిరణములతోను నీటితోను మంచుతోను బాగుగ దెబ్బతిని బాధనందుచు మంచుతో ముంచబడిన సర్వావయవములుకలవారగుచు వారు వేడిమిపోయిన అగ్నులో అనునట్లుండిరి. ఇట్లైన ఆ దైత్యుల విమానములు అంతరిక్షమునందు పైకిని క్రిందికిని ఎగిరెగిరిపడుచు లేచుచుండెను. మాయావియగు మయునకు తమ వారందరును పాశములతో కట్టివేయ బడుటయు శీతల కిరణములతో కప్పి వేయబడుటయు కనబడెను. అంతట వాడు అన్నివైపుల నుండియు పర్వతమయ మాయను సృజించెను. దానితో పర్వత సమూహములు వ్యాపించెను. ఖడ్గములు పలకలు (డాలులు) అసి (ఒక విధమగు ఖడ్గముల) సమూహము బిగ్గరగ నవ్వుచున్నవో అనునట్లుండెను. అంతులేనన్ని చెట్లతో నిండిన శిఖరాగ్రములును కందరములందు వ్యాప్తమయిన అడవులు సింహవ్యాఘ్ర గణములు ఘీంకరించు ఏనుగుల మందను వాటి నాయక గజములను ఈహామృగ గణములను ఆ పర్వతము లందంతట ఉండెను. వాయు వంశమున అందలి చెట్లు మ్రోతలతో క్రిందికి ప్రక్కలకు పైకి పొరలు చున్నట్లుండెను. ఆ పర్వతమాయ తన సంకల్పానుసార మంతరిక్షమున అంతట సంచరించుచుండునట్లు వాడు నిర్మించెను.

ఆ పర్వతమాయ ఖడ్గముల కదలికలతోను శిలా వర్షములతోను వృక్షపాతములతోను దేవ సంఘములను చంపుచు, దానవులను జీవింపజేయుచుండెను. రాలతోను ఇనుప ఆయుధముల గనులతోను దేవగణములతోను దట్టమయి త్రొక్కులాటలతో ఇరుకైన ఆయుద్ధ భూమి పర్వతములతో నిండినదో అనునట్లయి సంచరించుటకే వీలుకాకపోయెను. దేవతలు చిన్నరాలతోను పెద్ద బండలతోను ముద్గర ఆయుధములతోను దెబ్బలు తినుచుండిరి. వృక్షములచే అడ్డగించబడనివాడు దేవతలలో ఒక్కడును లేకుండెను. ఒక్క గదాధరుడు (విష్ణువు) తప్ప దేవతలందరును ధనువులు విడిచినవారో, ఆయుధములు విరిగినందున దుఃఖముచే కాంతి హీనులో అయిపోయిరి. వారు ఏ ప్రయత్నమును చేయజాలక యుండిరి. శ్రీమంతుడును జగదధిపతియు అగు గదాధరుడు మాత్రము యుద్ధరంగమందే చలించక నిలిచియుండెను. కోపించనయినలేదు. ఏలయన అతడు ఈశానుడు (సర్వశక్తిశాలి) సహన శక్తిశాలి; కాలతత్త్వము నెరిగినవాడు; కావున అపుడు నల్లని మేఘమువలె ప్రకాశించు ఆ హరి యుద్ధమందు తగిన సమయమునకు ఎదురుచూచుచు దేవాసురులు దొమ్మి యుద్ధమును చూచుచు, కొంత తడవు ఉండి పోయెను. అంతలో అతనికి అగ్నివాయువులు కనబడగా వారు నారాయణునిచే ప్రేరింపబడి మయ మాయను నశింపజేయ నారంభించిరి. వారు ఇద్దరును ఆమహాయుద్ధమున మహావేగమున వృద్ధినంది, ఆపర్వతమాయను దహించి భస్మమొనర్చి నశింపజేసిరి. వారిద్దరును పరస్పర సహాయముతో ప్రళయ కాలమందువలె వ్యాపించి ఆ దైత్యసేనను కాల్చివేసిరి.

మొదట వాయువు ఆ సేనలో ఒక చోటికి పోవును, అంతట అగ్నియు పోయి అచట క్రమ్మును, ఇట్లు వారిరువురు ఆటలాడుచున్నట్లా దానవ సేనయందు సంచరించిరి. ఇందుచే దానవ విమానములు భస్మ రేణువులయి ఎగురుచు పడుచు లేచుచుండెను. కొన్ని విమానములు ముక్కలై అంతటను పడుచుండెను. కొన్ని వాతస్కంధము (గాలిపొర)లలోనికి ఎగురగొట్టబడెను. అగ్ని తనపని తానుచేసెను. దేవతలు మాయాబంధ ముక్తులైరి. గదాధరుడు స్తుతులందుకొను చుండెను. దైత్యులు ప్రయత్నహీనులయిరి. త్రిలోకములును బంధముక్తినందెను. దేవతలందరును బాగు బాగనుచు సంతోషించుచుండిరి. ఇంద్రుడు జయించెను; దైత్యులోడిరి. దిక్కులెల్ల నిర్మలము లయ్యెను. ధర్మమువిస్తరమంది లోకమున ప్రవర్తిల్లెను. చంద్రుడు మరల తన స్థానమునకు మరలి వచ్చెను. దివాకరుడు స్వస్థానమున నిలిచెను. మూడు లోకములును సత్ప్రవర్తనము కలిగి తమతమ స్వభావ సిద్ధ ధర్మములందుండెను. సర్వప్రాణులును యజ్ఞము లాచరించ (దేవతల నారాధించ) సాగెను. పాపము అణగెను. మృత్యువు అదుపులో నుండెను. అగ్నియందు హోమములు సాగుచుండెను. దేవతలు యజ్ఞ (భాగ)ములతో శోభిల్లుచుండిరి. వారు యజ్ఞ ఫలములను (జనులకు) అందజేయుచుండిరి. లోకపాలురందరును తమతమ ఆధిపత్యముగల దిక్కులందు తగిన విధమున వర్తిల్లుచుండిరి. తపఃసిద్ధులు లభించుచుండెను: పాపకర్మము లెచ్చటను లేకపోయెను. దేవపక్ష మానందించెను. దైత్యపక్షము దుఃఖించెను. మూడుపాళ్ళు ధర్మము ఒకపాలు అధర్మము ఉండెను. ధర్మాచరణమహాద్వారము తెరచుకొనెను. సన్మార్గము నడచుచుండెను. లోకమునందు ఆయా ధర్మములు జరుగుచుండెను. బ్రహ్మచర్యా ద్యాశ్రమములందున్న జనులు తమతమ ఆశ్రమ ధర్మములందు నిలిచియుండిరి. రాజులు ప్రజారక్షణ తత్పరులయి ప్రకాశించుచుండిరి. లోకమున కల్మషము ప్రశాంతమయ్యెను. దానవుల తమోగుణ మణగెను.

ఇట్లు అగ్ని వాయువులు జరిపిన యుద్ధ కృత్యము ముగిసెను. లోక విస్తారమంతయు అగ్ని వాయుమయములయ్యెను. ఈ విజయకార్యము వారు నెరవేర్చినదేకదా! అందుచే అన్ని లోకములయందును అందరును వారినే కీర్తించుచుండిరి.

ఇట్లు అగ్ని వాయువులు దానవులకు మహాభయము కలిగించిరని విని కాలనేమియను ప్రసిద్ధ దానవుడు తన రూపమందరకు కనబడజేసెను. వాని కిరీటము రవివలె ప్రకాశించు చుండెను. వాని ఆభరణములును భుజకీర్తులును మ్రోతలును ఈనుచుండెను.

వాడు మందర (మంథ) పర్వతమువలె వెలుగుచుండెను. బంగారుతో కప్పబడెనో యనునట్లు బంగరు ఆభరణములు దాల్చియుండెను. నూరు ఆయుధములు దాల్చి భయంకరుడై ఉండెను. నూరు బాహువులతో, నూరు మొగములతో, నూరు తలలతో శోభిల్లుచు శతశృంగ పర్వతమువలె వాడు ఉండెను. వేసగి కాలపు అగ్నివలె మహా కోపముతో ఉండెను. పొగరంగు తలవెంట్రుకలు పచ్చని మీసములు కలిగి పెదవులు త్రైలోక్యాంతర్భాగ మంతయు విస్తరిల్లి నిండునంత పెద్ద శరీరము కలిగి ఉండెను. భుజములతో ఆకాశమును కదల్చుచుండెను. అడుగులతో కొండలను విసరి నెట్టుచుండెను. శ్వాసవాయువులతో వర్షించు నీటితో నిండిన బరువగు మబ్బులను కూడ చెదరగొట్టుచుండెను. అడ్డముగా ఉండి పొడవైన ఎర్రని కన్నులును సుందరమయి యుండియు తీవ్రము భయంకరమునైన వర్చస్సును కలిగియుండెను. సర్వదేవ గణములను యుద్దమున కాల్చివేయదలచి ఉన్నాడేమో అనునట్లుండెను. దేవ గణములను బెదరించుచుండెను. దశదిశలను కప్పివేయుచుండెను. ప్రళయకాలమునందు దప్పిగొని ఆవేశముతో లేచివచ్చుచు ఉండిన, మూర్తీభవించిన మృత్యువేమో అనునట్లుండెను. చక్కని అరచేయి కలిగి ఎత్తయి విపులములగు వ్రేళ్ళ కణుపులు కలిగి వ్రేలాడుచున్న ఆభరణములతో నిండి కొంచెముగ కదలించబడుచున్న చొక్కావంటి దుస్తులు కలిగి పైకి ఎత్తి ఉంచబడిన సుందరమగు కుడి ముంజేతితో అదివరకు జరిగిన యుద్ధమున దేవతల చేతిలో మరణించిన దానవులను “లేచి రండు” అని పిలుచుచు ప్రోత్సహించుచుండెను. యుద్ధమున శత్రువుల విషయమున యమునివలె ప్రవర్తించి భయము గొలుపుచు నాశము కలిగించు ఆ కాలనేమిని దేవతలందరును భయత్రస్త నేత్రులై చూడసాగిరి. తన అడుగులతో విక్రమించుచున్న రెండవ నారాయణుడో యనునట్లుండి ముందునకు అడుగులు వేయుచున్న కాలనేమిని సర్వ భూతములును చూచుచుండెను. మిగుల పైకెత్తుచున్న ముందటి అడుగుతో చెలరేగిన గాలితో ఆకాశమునే ఘూర్ణిల్ల జేయుచు ఆ కాలనేమి అసురుడు యుద్ధరంగమునందున్న దేవతలను మిగుల భయపెట్టెను. తరువాత అసుర శ్రేష్ఠుడగు మయుడు తను అలింగనము చేసికొనగా ఆ కాలనేమి విష్ణువుతో కూడిన మందరపర్వతమువలె ప్రకాశించుచుండెను. అట్లు రెండవ కాలయముడువలె తమ వైపునకు వచ్చుచున్న కాలనేమిని చూచి ఇంద్రాదిదేవతలు వ్యథ చెందిరి.