రవి ప్రతిమా లక్షణము

సూతుడు ఋషుల కిట్లు చెప్పెను. ద్విజులారా! ఇప్పుడు రవి ప్రతిమను తెలిపెదను వినుడు; ఈదేవుడు రథస్థుడు, వరదహస్తుడు, సులోచనుడు, సప్తాశ్వమగు ఏకచక్ర రథము ఇతనిది; ఇతడు విచిత్రముకుటధారి; తామరవూపు లోపలి వన్నెకల దేహచ్ఛాయవాడు; నానాభరణ భూషిత భుజుడు; పద్మములను చేతుల ధరించును; అవి అపుడపుడు విలాసముగ భుజములపై ఉంచుకొనుచుండును; చొక్కా ధరియించునట్లును కొన్ని మూర్తులందు చూపుట కలదు; ఇతడు సాధారణముగా వస్త్రద్వయము (ధోవతి - ఉత్తరీయము) లనుధరించును; పాదములు తేజోవృతములు; ఇతని రెండు పార్శ్వము లందును దండుడు పింగళుడు అను ప్రతీహారు లుందురు; వారు ఖడ్గహస్తులు; పార్శ్వమందు లేఖిని ధరించి బ్రహ్మఉండును; నానా దేవగణము ఈ రవిని కొలుచుచుండును. ఈరవికి సారథియగు అరుణుడు తామరాకువంటి దేహచ్ఛాయ కలవాడు; అతనికి రెండు ప్రక్కలందును ఏడుఅశ్వములు సర్పపాశములతో బంధింపబడినవై కిరణములతో కూడినవై మెడలు ముందునకు ఎత్తుగా చాచికొని బయలు దేరుచున్నట్లు ఉండవలయును; రవి పద్మమునందు నిలిచియున్నట్లుకాని వాహన (రథ)మునందు కూర్చున్నట్లు కాని మూర్తిని నిర్మించవచ్చును.