మత్స్య మహా పురాణము
అగ్ని సూర్యుల పరస్పర తేజోఽను ప్రవేశము
ఋషులు సూతునిట్లడిగిరి, నీవు ప్రతిపాదించిన ఖగోళ విషయము అంతయు వింటిమి. జ్యోతిర్గోళములు దేవగృహములు అంటివి. అది ఎట్లో వర్ణించుము అన సూతుడిట్లనెను: సూర్య చంద్రుల గతివిధానమును సూర్య చంద్రాది గ్రహములు దేవగృహములగు విధమును తెలిపెదను. అవ్యక్త తత్త్వము (మాయాశబలము) నుండి జన్మించిన బ్రహ్మకు ఒకరాత్రి ముగిసి మరల తెల్ల వారుసరికి ఈదృశ్య ప్రపంచమంతయు ఈ వస్తువునకు ఇది రూపము-ఇది పేరు అను విభాగము లేక రాత్రి సంబంధియగు చీకటితోనిండి (చీకటిలో ఏ వస్తువునకుగాని ఇది రూపము-ఇదిపేరు అని తెలియనట్లే) యుండెను. ఈ నాలుగు వేదములును ఇది ఈ వేదమని అనుశాసించుటయు అప్పటికి జరుగలేదు. అట్టి సమయమున లోకసృష్టి రూపమగు అర్థమును (పనిని) సాధించదలచి భగవానుడగు స్వయంభూబ్రహ్మ మిణుగురు పురుగువలె మినుకు మినుకుమని ప్రకాశించుచు జగదావిర్భావము ఎట్లు జరుపవలెనాయని ఆలోచింపసాగెను. అట్టి సమయమున అతనికి అగ్ని జలమును పృథివిని ఆశ్రయించి యున్నట్లు కనబడెను. స్వయంభూబ్రహ్మ జల పృథివులనుండి ఆ అగ్నిభూతమును ఒకచోటికి చేర్చి దానినంతయు మూడుగా విభజించెను. పవ(మా)నుడుగా వాయువు నందు కనబడుచున్న నిర్మథనముతో ఏర్పడెడి అగ్ని పార్థివమగు (పృథివీ సంబంధియగు ) అగ్ని, ఈరవియే శుచియను అగ్ని, జఠరమునందుండి జీర్ణాది ప్రక్రియల చేయుచు నిర్మథనముతోకాక ఇంధనములతో పనిలేక వెలిగెడి అగ్ని వైద్యుతాగ్ని, అదియే పావకాగ్ని. వినిలోనొక యగ్ని (సౌరాగ్ని) తేజస్సులతోనే శాంతించును. (తన ప్రకాశమును కోల్పోవును) మరి యొకటి (వూద్యుతాగ్ని) ఇంధనములతో పనిలేకయే వెలుగును. (అది నీటితో చల్లారదు) నిర్మథ్యాగ్ని మాత్రము కాష్ఠములతో వెలుగును. నీటితో శమించును. పవమానాగ్ని యనబడెడి నిర్మథ్యాగ్ని (పార్థివాగ్ని) జ్వాలలుండియు ప్రభలు తక్కువయగుటచే సౌమ్యుడుగా కనబడుచుండును. రవి మండలమునందు వేరొక యుష్ణముతో పనిలేకయే ప్రకాశించు అగ్నికి సంబంధించి సౌర ప్రభయందలి మూడు పాదములు అగ్నియందు ప్రవేశించును. అందువలన అగ్ని రాత్రులందు రవికంటె అధికముగా నున్నట్లు ప్రకాశించును. మరల రవి ఉదయించునపుడు ముందటి దినమున అస్తమయకాలమున రవినుండి ప్రకాశము పొందిన అగ్ని మరల రవిని ప్రవేశించును. అందుచే అగ్ని పగటివేళల నాలుగవ వంతు తేజస్సుతో మాత్రమే వెలుగును. ఇట్లు ఆగ్నేయ సౌర ప్రకాశములు రాత్రింబవళ్ళలో పరస్పరాను ప్రవేశమున పరస్పర పూరణము చేసికొనుచుండును.
ఇట్లు అగ్ని భూమికి ఉత్తరార్ధ దక్షిణార్ధములందు స్థాన పరివర్తనమున తన తేజమును పరివర్తనము చేసికొనుచు ప్రకాశాధిక్యమును పొందుచు కోల్పోవుచు నుండును. ఇట్లే సూర్యుడుదయించగానే రాత్రి (కాల ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచే పగటి వేళలందు నీరు అగ్నివలెనే ఎర్రగా కనబడును. మరల రవి అస్తమించగనే పగలు (పగటికాలపు ప్రభావము) నీటియందు ప్రవేశించును. అందుచేతనే నీరు రాత్రులందు రవివలె తెల్లగా కనబడును. ఈ క్రమమున భూమి దక్షిణోత్తరార్ధములందు రవ్యగ్ని ప్రకాశముల పరస్పర ప్రకాశ పరివర్తనముచే ఉదయాస్తమయ ప్రభావానుసారము రవియు అగ్నియు జలములందు ప్రవేశించుచు వాటి వర్ణమును కూడ మార్చును. ఈసౌరాగ్ని (రవి మండలము) వేయికిరణములతో పరివారితమై ఒక కడవవలె నున్నది. అతడు తన వేయినాడులతో నదీ సముద్ర హ్రద కూపాదుల నుండి నీరుపీల్చి తన యందు నింపుకొనును.
సూర్యుని వేయి కిరణములలో నాలుగు వందల కిరణములు శరద్వర్షా కాలములందు వాన కురియును. ఆకిరణములు చల్లనివి పవిత్రములు తక్కువ వేడిమినిచ్చునవి. వాటికి అమృత కిరణములని నామము. ఇవికాక మూడు వందల కిరణములు హేమంత శిశిర ఋతువులందు రవియందు సేకరింపబడియున్న జలమును హిమ రూపమున లోకమున కందించును. ఈ కిరణ సముదాయమునకు చంద్రములు అని పేరు. ఇవి యన్నియు పవిత్రములును ఆనందము కలిగించునవియును. మరి మూడు వందల కిరణములు వసంత గ్రీష్మములందు మర్మమును ఆవిరిని వదలును. వీనికి శుక్ల కిరణములని వ్యవహారము.
ఇట్లు రవి తన సహస్రకిరణ ప్రవృత్తి ద్వారమున ఓషధులతో మానవులను స్వధాద్రవ్య (కవ్య)ముతో పితరులను అమృతముతో దేవతలను సమముగా పోషించుచున్నాడు. ఈ సహస్ర కిరణములు కూడ ఋతుభేదమున మరియు అనేక విధముల మార్పును పొందుచుండును.
ఇట్లు శుక్లవర్ణమై ప్రకాశశీలమైన ‘లోకమను సంప్రదాయసిద్ధ వ్యవహార నామముగల రవియే నక్షత్రములకు (తారా) గ్రహములకు సోమునకు గూడ జన్మహేతువును స్థితికారణమునై యున్నాడు. చంద్రుడు నక్షత్రములు గ్రహములు ఇవి యన్నియును సూర్యుని రశ్ములు-అనెడి నాడుల నుండియే జనించి తృప్తిని పుష్టిని పొందునని తెలియవలయును. ఎట్లన-సుషుమ్నా అనెడి నాడి (రశ్మి) క్షీణుడగు చంద్రుని పరిపోషించును. హరికేశము అను రశ్మి నక్షత్రములను దక్షిణమునందుండెడి విశ్వకర్మయను నాడి బుధుని వెనుక నుండెడి విశ్వావసునాడి శుక్రుని సంవర్ధననాడి అంగారకుని అర్వావసువను అరవనాడి బృహస్పతిని స్వరాట్అనునాడి శనైశ్చరుని అప్యాయన మొందించును. క్షయము నొందవు కావున నక్షత్రములు (న-క్ష-త్ర) ఇవి సూర్యుని క్షేత్ర(స్థాన)ములుగా నుండి తమ కిరణములతో సూర్యుని తపింపజేయును. సూర్యుడు అనంతక్షేత్ర రూపములగు ఆ నక్షత్రములలో తానును నక్షత్రత్వము పొందియున్నాడు. ఈ లోకమునుండి పై లోకములకు దాటిపోయిన సుకృతాత్ములను దాటించునవి కావునను తెల్లనివి కావునను తారకలు (తరింప-దాటునట్లు-చేయునవి) అని వీనికి పేరు. పృథివీగతులగు వారిలో దివ్య వంశముల వారిని వారితపోబలమును తనతేజో బలమును ఆశ్రయించి తనలోనికి గ్రహించును కావున సూర్యునకు ఆదిత్యుడు (ఆదత్తే-తనలోనికి తీసికొనును) అని పేరు. స్యన్దనము-స్రవింప జేయుట అను అర్థమునిచ్చు ‘సూ’ అనుధాతువునుండి ‘సవితా’ అను పద మేర్పడినది. తేజస్సును ప్రసరింప జేయువాడు కావున సూర్యుడు ‘సవిత’ అనబడును. ‘చది’ అను ధాతువునుండి ‘చంద్ర’ అనెడు శబ్దము ఏర్పడినది. తెల్లగా అమృతరూపుడై చల్లనై-ఆనందింపజేయువాడై-ఉండును అని అర్థము. ఇట్టి సూర్య చంద్రులు మండలములు ప్రకాశవంతములు దివ్యములు ఆకాశగాములు తెల్లనివి గుండ్రని కుండల వంటివి. వీరిలో రవి తేజోమయుడు-చంద్రుడు జలమయుడు. తమ సుకృతములచే దేవత్వమందిన కర్మదేవులు ఆయా మన్వంతరములందెల్ల ఈరవి నక్షత్ర చంద్రగ్రహ లోకము లందు తమ పుణ్యానుసారము ప్రవేశింతురు. ఇవి వారికి స్థానములగును. కావున వీనికి ‘దేవ గృహములు’ ‘కర్మదేవులకు ఇండ్లు’ అని పేరు ఏర్పడినది. ఇంతేకాదు. సూర్య శుక్ర బృమస్ప త్యంగారక శనైశ్చర బుధ రాహువులు ఇతర నక్షత్రములు కూడ వాస్తవమున దేవతాతత్త్వములే. వీరును తమ సుకృతమున కర్మదేవులై ఆయా జ్యోతిర్గోళములను తమతమ ఇండ్లుగా పొందిరి. ఈ కనబడు జ్యోతిర్గోళములు కేవలము జడ పదార్థములు కావు. వానికి అధిష్ఠాతలుగా రవ్యాది దేవతలున్నారు.
ఈ కారణములచే ఈ జ్యోతిర్గోళములన్నియు సుకృతము చేసికొనిన కర్మదేవుల ఇండ్లయినందున దేవగృహములయ్యెను. ఇవి ప్రళయకాలము వరకు ఇట్లే యుండును. ప్రతి మన్వంతర మునందును ఆయా స్థానములకు అభిమానులగు దేవతలు ఇట్లే వానిని మరల మరల తమ ఇండ్లుగా చేసికొందురు. అతీత మన్వంతరములందు అతీత దేవతలును వర్తమాన మన్వంతరములందు వర్తమాన దేవతలును భావిమన్వంతరములందు భావి కర్మదేవులును ఇట్టే ఉండిరి- ఉన్నారు ఉందురు.
ఇక వీరి దేవతాత్వములు ఇట్లుండును: అదితి కుమారులలో ఎనిమిదవవాడగు ‘వివస్వాన్’ అను నతడే సూర్యదేవుడు; ద్యుతి (కాంతి) కలవాడు ధర్మయుక్తుడు నగు సోమ(చంద్ర) దేవుడు వసువులలో నొకడు; శుక్రుడు అసురుల యాజకుడు (యజ్ఞాదులు చేయించు పురోహితుడు) ఐనను దేవతాకోటిలోని వాడు; దేవాచార్యుడగు బృహస్పతి అంగిరుని కుమారుడు; బ్రహ్మాంశ సంభూతుడు; బుధుడు మనోహరరూపుడు త్విషి(చంద్ర) పుత్రుడు; శనైశ్చరుడు విరూపుడు- రవికి సంజ్ఞాదేవియందు కలిగినవాడు; కేతువులు అనువారు అగ్నిదేవునకు వికేశి అను భార్యయందు జనించినవారు; దాక్షాయణులు (దక్షపుత్రికలు) నక్షత్రములు; భూతము (ప్రాణు)లకు సమ్మోహము కలిగించు స్వర్భానుడు (రాహువు) సింహికా పుత్రుడగు అసురుడే యైనను చంద్రార్క గ్రహనక్షత్రములందు ఒకడుగా అభిమతుడై ఆరాధింపబడుచున్నాడు.
ఇట్లు జ్యోతిః స్థాన తత్త్వమును ఆ స్థానముల కభిమానులగు దేవతలను తెలిపితిని. అ జ్యోతిః స్థానముల భౌతిక సంస్థానమును తెలిపెదను. సహస్రాంశుడగు వివస్వంతు (సూర్యు)ని స్థానము అగ్నిమయ జ్యోతిర్గోళము. చంద్ర స్థానము కూడ వేయి కిరణములు గల జలమయ గోళము. మనోజ్ఞుని గోళముకూడ జలమయమే; బృహస్పతి గోళము ఐదునాడులుకలది; శుక్ర గోళము పదునారు నాడులుకల జలమయగోళము; అంగారకునిది తొమ్మిది నాడులుగల జలమయ గోళము; బుధునిది పండ్రెండు నాడులుగల పచ్చని ప్రకాశముగల గోళము; రాహు స్థానమగు గోళము భూత సంతాపము కలిగించునది; ఇతని కిరణములు హిరణ్యయములు శుక్ల నామకములయి తెల్లని వగుటచే తారకములని కూడ పేరుగల సూర్య కిరణములే; ఇవి తారలకు కూడ తాపము కలిగించును.
రవిమండల వ్యాసము తొమ్మిది వేల యోజనములు. చుట్టు కొలత దానికి మూడింతలు; చంద్రుని వ్యాసము సూర్యుని వ్యాసమునకు ద్విగుణము; తారకలు వీటికి పైగా నున్నవి. వాని వ్యాసము అర్ధ యోజనము మాత్రమే. అదే వ్యాసముతో రాహువు నక్షత్రములకంటే క్రిందుగా సంచరించును. ఇతడు పృథివీఛాయను మండలాకారమున చేసికొనియుండును. రాహు స్థానము పెద్దదే కాని తమోమయము; అతడు చంద్రపర్వములందు (పూర్ణిమలందు) సూర్యుని నుండి చంద్రుని కడకును రవిపర్వములందు (అమావాస్యలందు) చంద్రునినుండి సూర్యుని కడకును పోవుచుండును. తనభానువులతో (కిరణములతో) భానుని బాధించును కావున అతనికి స్వర్భానుడని పేరు. చంద్రునిలో పదునారవవంతు శుక్ర మండలము; శుక్ర మండలములో నాల్గవవంతు తగ్గించినచో బృహస్పతి మండల మగును. బృహస్పతి మండలములో నాల్గవవంతు తగ్గించినచో అంగారక మండలమగును; శని మండలము అంగారక మండలముతో సమానము. అంగారకుని మండలములో నాల్గవవంతు తగ్గించినచో బుధ మండలమగును. తారా నక్షత్రములన్నియు బుధ మండలముతో సమానమండలము కలవి. ఇవి ఒకదానికంటె మరియొకటి తక్కువ తక్కువ పరిమాణముకలవి. ఇవి వందలుగా ఐదులుగా నాల్గులుగా మూడులుగా పండ్రెండులుగానున్నవి. ఈ తారానక్షత్ర మండలములకు పైగా నక్షత్రములున్నవి. లోగడ చెప్పినట్లు వీనిలో ఒక్కొక్కదాని మండలము అర్ధ యోజనము; ఇంతకంటె చిన్న మండలముకల జ్యోతిస్సులు లేవు; వాటికి పూగానున్న గ్రహములగు శని బృహస్పత్యంగారకులు మంద సంచారులు; నక్షత్రములకు క్రిందుగా రాహు కేతువులున్నవి. సోమ శుక్ర బుధులు శీఘ్ర సంచారులు; వీరును నక్షత్ర మండలమునకు క్రిందుగానే యున్నారు.
దేవత్వమును పొందిన నక్షత్రాత్ములెందరు కలలో అన్ని కోట్ల తారక లంతరిక్షమందు ఉన్నవి. (కావున అవి ఇన్నియని లెక్కింపజాలము.)
అన్నిటికంటెను దిగువగా సూర్యుడున్నాడు. అతని మీదుగా చంద్రుడు-అతనికి పైగా బుధుడు అతనిపై శుక్రుడు అతనిపై కుజుడు అతనిపై బృహస్పతి అతనిపై శనైశ్చరుడు అతనికి పైగా సప్తర్షి మండలము దానిలో ఊర్ధ్వమున ధ్రువుడు ఉన్నారు. ఇట్లే ద్యులోకమంతయు ధ్రువుని యందు నిబద్ధమయి యున్నది. ఈ గ్రహాదులన్నియు ఒకదానికి మరియొకటి రెండు (వేల ఒక వంద) లక్షల యోజనముల ఎడముతో పైపైగా ఉన్నవి. ఈతారా గ్రహములును చంద్ర సూర్యులును ద్యులోకమున దివ్య తేజస్సుతో ప్రకాశించుచు అశ్విన్యాది నక్షత్రములందు నియమానుసారము సంచరించు చుండును. ఇవి నీచోచ్చమృదు గతులలో సంచరించును. వీనికి సమాగమము భేదము అను స్థితులును కలుగుట కనబడుచుండును. ఈ సమాగమ భేదములు గణనవశమున పండితులు తెలిసి కొందురు. వాస్తవమున అవి కలియుట జరుగదు. ఏలయన అవి ఒకదానిని మరియొకటి తాకని చక్రమున (కక్ష్యలలో) నియతముగా తిరుగుచుండును. కాని వాని కన్నింటికి దిగువగా నున్న మనకు అవి అట్లు కనబడును.
ఇట్లు పృథివీ సన్నివేశము జ్యోతిః సన్నివేశము ద్వీప సముద్ర పర్వతనదీ వర్ష సంనివేశము-జ్యోతిరాత్మక దేవగృహ సంనివేశము సూర్యాశ్రిత జ్యోతిర్వ్యవస్థ ధ్రువాశ్రితమగు ఆద్యన్త ప్రాంత మధ్య ప్రదేశములందలి అంతరిక్ష జ్యోతిర్గోళ వ్యవస్థ మీకు తెలిపితిని. గుండ్రని భవనముల వలె కనబడు ఈ ఉన్నత జ్యోతిర్గోళముల వ్యాసములు మొదలగు కొలతలు లోక సంవ్యవహారార్థము ఈశ్వరుడు సంకల్పించిన విధమున కల్పాదియందు స్వయంభూ బ్రహ్మ బుద్ధి (ఆలోచన) పూర్వకముగా ఏర్పరచెను. మీకు నేను తెలిపిన జ్యోతిర్వ్యవస్థ దాని ననుసరించినదే; ప్రధాన (ప్రకృతి) పరినామమే ఈ విశ్వరూపము (విరాట్స్వరూపము) దీనిని ఉన్నదున్నట్లు గణన చేయుట కాని జ్యోతిర్గోళముల గతాగత రూప సంచారము కాని మాంసచక్షువుతో నుండు మానవునకు సాధ్యము కాదు.