మూర్తివ లక్షణము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, ఇప్పుడు ఇక దేవతా ప్రతిష్ఠా ప్రక్రియయందు ఋత్విక్ లుగా ఉండదగిన ‘మూర్తివ’ అనబడువారికిని ప్రధాన ఋత్విక్, అధ్వర్యుడు, ఆచార్యుడుగా నుండదగిన స్థాపకుడు అనబడు విప్రునకును ఉండవలసిన లక్షణములను తెలిపెదను.

స్థాపకుడు అంగవైకల్యము ఏమాత్రమును లేక సర్వావయవయుక్తుడును వేద మంత్రముల యందు వైశారద్యము, గొప్ప ఎరుక కలవాడును పురాణములను ఆధ్యాత్మిక తత్త్వమును ఆగమాది శాస్త్ర తత్త్వమును ఎరిగినవాడును దంభము, కపటాచారాదికము, లోభము లేనివాడును నల్లని చారలుగల జింకలుండు దేశమున జన్మించినవాడును చక్కని ఆకారము కలవాడును, నిరంతరము శారీర మానస శుచిత్వము కలవాడును, సదాచారమును కలవాడును పాషండ (వేదనిందక, వేదబాహ్య) జనులయందు ఎట్టి ఆసక్తియు లేనివాడును శత్రుమిత్రుల యందు సమభావము కలవాడును బ్రహ్మ విష్ణు రుద్రులయందు ప్రీతి గలవాడును ఆయా విషయములను వహించుట యందును తగనివానిని అపోహించుట (వానిని గురుతించి వదలి వేయుట) యందు నేర్పుగల వాడును ఆయా ప్రతిష్ఠాది శాస్త్ర తత్త్వములను ఎరిగినవాడును వాస్తుశాస్త్ర పారంగతుడును ఏ ఒక దోషములును లేనివాడును ఆచార్యుడు, ప్రతిష్ఠాకార్య ప్రక్రియ యందు అధ్వర్యుడు, ప్రధాన ఋత్విక్ గా నుండవలయును, ‘మూర్తిపులు’ కూడ సద్వంశమునందు జనించి ఋజు స్వభావము కల విప్రులై యుండవలయును, ఈ మూర్తిపులు జ్యేష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠ యందు ముప్పది ఇరువురును మధ్యమ పరిమాణక లింగప్రతిష్ఠ యందు పదునారు మందియు కనిష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠయందు ఎనిమిది మందియు ఉండవలయును.

అనంతరము లింగమునుకాని అర్చామూర్తినికాని స్నపన (స్నాన) మండపమునకు తీసికొని పోయి అచట గీత మంగళశబ్దముతో పంచగవ్యముతోను కషాయ మిశ్రితోదకముతోను మృత్తిక తోను (హోమ) భస్మోదకముతోను స్నానము చేయించవలయును; ఆ సందర్భమునందు శౌచార్థము ఈ చెప్పబోవు నాలుగు వేదమంత్రములను జపించు (బిగ్గరగా పఠించు) చుండ వలయును, అవి 1. సముద్రజ్యేష్ఠాః, 2. యాఆపోదివ్యా, 3. యాసాంరాజా, 4. అపోహిష్ఠా అనునవి; ఇట్లు దేవుని స్నపనముచేయించి గంధానులేపనములతో పూజించి ‘అభివస్త్రా’ అను మంత్రముతో వస్త్రముల చాపుతో కప్పి తరువాత ‘ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే!’ ‘అమూరజ’ ‘రథేతిష్ఠన్’ అను మంత్రములతో దేవుని లేవదీయవలయును, మూర్తిని తెచ్చి రథమునందుకాని బ్రహ్మరథము నందుకాని శిల్పులచేఎక్కించి రథమును లాగించికొని తీసికొనివచ్చి మండపము నందు ప్రవేశింప జేయవలయును.

అంతట అందు దేవుని అర్చామూర్తిని నెమ్మదిగా దించి ఉంచవలయును, అచట దర్భలను పరచి వానిపై పూవులను ఉంచి ఇట్లేర్పరచిన శయ్యయందు మూర్తిని ప్రాఙ్ముఖముగా పండుకొన పెట్టవలయును; ‘ఆపోదేవీః’ ‘ఆపోఽస్మాన్ మాతరా’ అను మంత్రములను పఠించుచు లోపల బంగారమునుంచి పైని నూతన వస్త్రములను చుట్టిన నిద్రాకలశమును దేవుని శిరో భాగమునందు ఉంచవలయును, తరువాత దుకూల పట్టములతో దేవుని కప్పవలయును; తరువాత ఉన్నిబట్ట పొదిగియున్న వస్త్రముతో చేసిన దిండుకాని (దిండువలె) పట్టువస్త్రమును కాని ఉంచవలయును, తరువాత దేవునికడ కూర్చుండి తేనెతోను నేతితోను అభ్యంజనము (పూయుట) చేయవలెను, తెల్ల ఆవలతో పూజించవలయును, ‘ఆప్యాయస్వ’ ‘యాతేరుద్ర’ అను మంత్రములతో అర్చామూర్తిని అంతటను గంధ పుష్పములతో పూజించవలయును; ‘బార్హస్పత్య’ అను మంత్రముతో తెల్లని ప్రతిసరమును ధరింపజేయవలెను; దూది నూలుతో నిర్మించిన దుకూల పట్టములతోనో నానావిధముల చిత్రములుగల వస్త్రములతోనో దేవుని మూర్తిని కప్ప వలయును; పార్శ్వములందు దగ్గరలో ఛత్త్రము చామరము అద్దము ఉంచవలయును, ఆ పడకకు పైగా పూవులతో మేలుకట్టు అమర్చవలయును, ‘అభిత్వాశూర’ అను మంత్రముతో యజమానుడు తన విభవము కొలదిని వివిధములగు పాత్రలను శయనములను ఆసనములను అచ్చట నుంచవలయును, పాలుతేనె నేయి భక్ష్య భోజ్యాన్న పాయసములు ఇట్టివానితోను షడ్విధరస (ఆహార)ములతోను ‘త్య్రంబకం యజామహే’ అను మంత్రముతో పూజా పూర్వకముగా బలిని సమర్పించవలయును, తరువాత మూర్తిపులను నెమ్మదిగా ఆయా స్థానములందు సర్వదిక్కులందు కూర్చుండబెట్టవలయును, నలుగురును ద్వారపాలురనుగా ద్వారము లందు కూర్చుండబెట్టవలయును. వీరిలో 1. తూర్పు ద్వారమందుండు బహ్వృచుడు (ఋగ్వేది) శ్రీ - పవమాన, సోమ - శాంతి, కాధ్యాయేంద్ర, రక్షోఘ్న, సూక్తములను పఠించును; దక్షిణ ద్వారమందలి అధ్వర్యుశాఖా (కృష్ణ యజుఃశాఖా) ధ్యాయి రౌద్ర సూక్త, పురుషసూక్త, శుక్రియాను వాకమను శ్లోకాధ్యాయములను పఠించును; పశ్చిమ ద్వారమందలి సామవేది, వామదేవ, బృహత్, రథంతర, జ్యేష్ఠ, సామములను పురుషసూక్త రుద్ర సూక్తములను శాంతి కాధ్యాయమును భారుండ సామమును పఠించును, ఉత్తర ద్వార మందలి ఆథర్వణ వేదీయుడు అథర్వాంగిరస మంత్ర భాగమును నీల సూక్తమును రౌద్ర సూక్తమును అపరాజితాదేవీ సూక్త సప్తకమును శాంతి కాధ్యాయమును పఠించును.

దేవుని శిరఃస్థానమందు స్థాపకుడు (ప్రధాన ఋత్విక్ - ఆచార్యుడు) వ్యాహృతి పూర్వకము లగు శాంతికపౌష్టిక మంత్రములతో పలాశము ఉదుంబరము, అశ్వత్థము, అపామార్గము, శమి ఈ సమిధలతో ఒక్కొక్క ఆవృత్తిలో సహస్రాహుతులతో హోమముచేసి ఒక్కొక్క సహస్రము కాగానే వరుసగా దేవుని పాదములను - నాభి మధ్యమును, వక్షమును, శిరమును తాకుచు పోవలెను. సర్వ దిశల యందు ఉన్న మూర్తిపులు మేఖలలతో కూడినవయి హస్తమాత్ర పరిమాణమున (లోతు - వెడల్పు - పొడవు) కల కుండములందు ఆదరపూర్వకముగ హోమము చేయుచుందురు, ఈ కుండములకు వక్త్ర (ముఖ - ముందు) భాగము నందు ‘యోని’ (అను పేరుగల నిర్మాణము) ఉండవలయును.

యోని లక్షణము: ‘యోని’ అనగా ఏదేని వస్తువులను (ఇచట హోమ పరికరములను) ఉంచుటకు ఉపయోగించు స్థానము అని అర్థము. (యోనిః - ఆసాదనస్థానమ్ అని శ్రీశంకర భగవత్పాదులు). ఇది అనేక విధములుగా ఉండవచ్చును. ఇందుండి ఏ విధమునైనను గ్రహించి ‘యోని’ని కుండ సమీపమున ఏర్పరచ వచ్చును.

1. ఇది దీర్ఘ చతురస్రాకృతితో (ఆయతముగా) వితస్తి 12 (భారతీయాంగుళములు) మాత్రము పొడవును ఆరుగాని ఏడుగాని అంగుళముల వెడల్పును కలిగియుండ వలయును.

2. పండ్రెండు భారతీయాంగుళముల పొడవుతో గజోష్ఠము (ఏనుగు పెదవి) వంటి ఆకృతితో ఉండవలయును.

3. పైని (1లో) చెప్పినట్లు ఆయత (దీర్గచతురస్ర)మై పండ్రెండు భారతీయాంగుళముల పొడవును ఆరుగాని ఏడుకాని అంగుళముల వెడల్పును కలిగి (నడుమ కూర్మ పృష్ఠమువలె వంపుతో ఎత్తుగాను పార్శ్వములందు కలా మాత్రము (కుండపు కొలతలో 1/16 పదునారవ వంతు) ఎత్తుగాను నుండవలెను. కుండము ఒక హస్తమాత్రము - అనగా ఇరువది నాలుగు భారతీయాంగుళములు పొడవు వెడల్పు లోతులు కలిగి ఉండవలయును అనుటచే దానిలో పదునారవ వంతు అనగా ఒకటిన్నర భారతీయ అంగుళములగును. మరియు కుండ పరిమాణము ఇంతకంటె ఎక్కువయో తక్కువయో ఉన్న సందర్భములలో దీనిని బట్టి ఈ పదునారవ వంతు పరిమాణము మారవచ్చును.

4. పొడవును వెడల్పును ఎత్తును ఒకే విధముగా నాలుగు భారతీయాంగుళములు మాత్రమే యుండవచ్చును.

ఈ కుండములు అన్నియు వేది భిత్తినుండి పదుమూడంగుళముల దూరములో ఉండవలయును. ఇట్లు ఈ సందర్భములో ఉండవలసిన తొమ్మిది కుండములకును ‘యోని’ నిర్మాణము చేయవలయును. ఆగ్నేయ కోణము నందును తూర్పు దిశ యందును దక్షిణ దిశ యందును ఉన్న ఋత్విజులు ఉత్తరాభిముఖులై కూర్చుండి శాంత్యర్థమయి లోకపాలురను శివుని అష్టమూర్తులను మూర్త్యధి దేవతలను ఉద్దేశించి హవనము జరుపవలయును; 1. పృథివి, 2. జలము, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశము, 6. రవి, 7. సోముడు, 8. యజమానుడు అనునవి శివుని మూర్త్యష్టకము.

మూర్తుల పేరులతో పాటుగ ఆమూర్తుల అధిదేవతలను గూడ పేర్కొందును: వరుసగా 1. శర్వుడు, 2. భవుడు, 3. పశుపతి, 4. ఈశానుడు, 5. భీముడు, 6. రుద్రుడు, 7. సోముడు, 8. ఉగ్రుడు అనువారు అష్ట మూర్త్యధిపతులు: మూర్తి ప్రతిష్ఠా ప్రక్రియల యందు శివుని విషయమున గ్రహింపవలసిన మూర్తులను మూర్తుల అధిపతులును వీరే. వీరిని ఉద్దేశించి వారివారికిచెందు వైదిక మంత్రములతో హోమము ఆచరించవలయును.

ప్రతికుండ సమీపమునందును హోమ సమయమందే శాంతి ఘటములను నిలుప వలయును, నూరేసి ఆహుతులు కాని వేయేసి ఆహుతులు కాని కాగానే ఒక్కొక్కసారి పూర్ణాహుతి జరుపవలయును, పూర్ణాహుతి సామగ్రిని సమపాదుడై నేలపై నిలిచియుండి హోమకుండమందు వేయవలయును. హోమము జరుపునపుడు ప్రతి ఆహుతియందును దర్వియందు మిగిలిన ఆహుతి శేషాంశమును పూర్ణ ఘటములయందు వేయ (వదల) వలయును, దీనితో మిశ్రిత మయిన జలముతో దేవుని మూలాంగ (పాద) మధ్యమాంగో (నాభి) త్తమాంగము (శిరము)లను తడుప వలయును, దేవుని నిలువబెట్టి ఆహుతి శేషమిశ్రిత జలముతో స్నపనము కూడ చేయించ వలయును.

ప్రతి యామమునందును చందనోదకముతో అవసేచనమును ధూపమును నైవేద్యమును జరుపవలయును. అట్లే పర్యాయ క్రమమున మరల మరల హోమమును జరుపుచు పోవలయును; ప్రతి పర్యాయమును యజమానుడు ఋత్విజులకు దక్షిణలు, తెల్లని వస్త్రములు వివిధములగు బంగారు కడియములు, బంగరు హారములు, బంగరు సూత్రములును, సువర్ణాంగుళీ యకములును, పానుపులను ఈయవలయును; నూతన వస్త్రములను కట్టబెట్ట వలయును; భోజములును బాగుగా జరుపుచుండవలయును, అధివాసనము ముగియువరకును ఇదియంతయు జరుపుచుండవలెను. మూడు సంధ్యలయందును అన్ని దిశలయందును భూతబలి వేయుచుండ వలయును. ప్రతిపూటను మొదట బ్రాహ్మణులకును అనంతరము మిగిలిన వర్ణములవారికిని (జనులకు) భోజనములను యథేష్టముగా పెట్టుచుండవలయును. నృత్య గీతాది మంగళ లక్షణములతో రాత్రియందు మహోత్సవము (గొప్ప వేడుక) జరుపుచుండవలెను; చతుర్థీ కర్మ (క్రియా) ముగియు వరకును (‘చతుర్థీ క్రియా’ అనగా ప్రతిష్ఠాక్రియా అగును. ) ఎల్లరును ప్రయత్నపూర్వకముగా యథాశక్తిగా పూజించుచుండవలయును.

ఈ ప్రక్రియకు ‘అధివాస ప్రక్రియ’ అని వ్యవహారము; ఇది ఒకటికాని, మూడుకాని, ఐదుకాని, ఏడుకాని, (అహో) రాత్రములపాటు జరుపవలయును; కొన్నికొన్ని సందర్భములలో సద్యో అధి వాసనము (ప్రతిష్ఠకు కొంచెము ముందుగానే) అధి వాసమును జరుపుటయును కలదు; ఈ అధివాసప్రక్రియా ప్రాముఖ్యము ఏమియనిన దీనిచే సర్వయజ్ఞఫలము లభించును.