పురూరవసుడు తపమాచరించుట

హిమాలయమునందలి ఇట్టి ప్రదేశములో చాల ఎత్తయిన రెండు శిఖరములు కలవు. వానియందు అధికముగా వర్షము కురియుచు మంచుపడుచు ఉండును. ఈ రెంటి నడుమ వీనికంటె చాలఎత్తయిన మూడవ శిఖరముకలదు. దానిశిలలు ఎడతెగక ఎండతో కాలుచుండును. అయినను అచట శ్రమ తోచదు. ఆ శిఖరమునకు దిగువలో పడమటగా చెట్ల గుబురులో జాజి తీగలు క్రమ్మినదై చూడముచ్చటగా నున్న గొంది ఒకటి కనబడగా కుతూహలము కలిగి పురూరవ రాజందు ప్రవేశించెను. చీకట్లు దట్టముగా క్రమ్మియున్న ఆ ప్రదేశము నల్వ మాత్రము (నాలుగు వందల ధనువులు; ధనువు=నాలుగు మూరలు) పొడవుండెను. అది దాటిన తరువాత చక్కని కాంతులే ఆభరణములుగా ప్రకాశించుచున్నది చాల ఎత్తైనిది చాల లోతుకలది (లోపలికి వ్యాపించినది) గుండ్రనిది ఒకచోటు కలదు. అచట సూర్యుడు తన ఎండను చంద్రుడు తన వెన్నెలను ప్రసరింపజేయరు. ఐనను అది అహర్నిశములు పగలువలె ప్రకాశించుచుండును. దానియందు క్రోశముకంటె ఎక్కువ వ్యాసముగల సరస్సు అందగించు చుండెను. ఈ సరస్సునకు అన్ని వైపులను వ్యాపించి కొండను అంటుకొని వేదిక (పొదరిండ్లతో నిండిన ప్రదేశము) ఒకటి కలదు. కన్నులకింపగు కాంతులే ఆభరణములై ప్రకాశించు మణి కుసుమములుకల బంగారు వెండి పగడపు చెట్లట నుండెను. ఆ సరస్సునందలి తామర పూవుల దళములు పద్మరాగములతో కేసరములు వజ్రములతో ఆకులు మరకతములతో వైడూర్యములతో దుద్దులు బంగారుతో ఏర్పడి సుగంధయుతములై యుండెను. ఆ సరస్సు నందును పరిసరములందును ప్రదేశము బురద లేక అది నానావిధ రత్నములతో పద్మములతో గవ్వలతో శంఖములతో ముత్తెపు చిప్పలతో మకరమత్స్య కూర్మాదులతో వెలయుచుండెను.

పద్మరాగేంద్ర నీలమహేంద్ర నీలకార్కోటక తుబుక-విష్ణుమణి-రాజావర్తక-రుధిరాక్ష- సూర్యకాంత చంద్ర కాంత-పీలు-వైరాతల-జ్యోతీరస-సమక పురోరగ-బలాక్ష-స్ఫటిక-గోమేద విత్తక-మరకత-వైదూర్య-సౌగంధిక-రాజమణి- ఖంజ-ముక్త-బ్రహ్మమణి-తారాస దృశ ముక్తాఫల-రత్న ఖండములట నుండెను. ఆ కొలనీరు స్నానమాడినంతనే చలి పోయి హాయి గొల్పునంత వేడిగా నుండును.

ఆ సరస్సు నడుమ వైదూర్య శిల ఉపశోభిల్లుచుండెను. దాని (ఒక్కొక్క భుజము) ప్రమాణము రెండు వందల ధనువులు; అది చతురస్రమును రమ్యమునునై యుండునట్లు అత్రి మహాముని నిర్మించెను. (ఇచ్చటి ఈ రమ్య పవిత్ర ప్రదేశములన్నియు అత్రి తపో నిర్మితములే.) అచట సరస్సు నడుమ పర్వత బిలద్వార సదృశములగు ఉద్దేశములు (చిన్న చిన్న ప్రదేశములు) గల హిరణ్మయ ప్రదేశపు ద్వీప మొకటి ఉండెను. ఆ మనోహర ద్వీపము నడుమ మిగుల ప్రకాశించు వైదూర్య శిలాతలము నడుమ కంటికింపగు చతురస్ర పుష్కరిణి కలదు. దానియందును పద్మములు కలవు. దాని నీరు మిగుల చల్లనిది స్వచ్ఛమయినది మధురమయినది తేలికయైనది సుగంధ యుతము. అది త్రావినచో కంఠము బాధ నొందదు; కడుపు నిండి బరువెక్కదు; కాని ఆనీరు పరమ తృప్తిని శరీరమునకు మహా సుఖమును కలింగించును.

ఆ పుష్కరిణి నడుమ అత్రి మహాముని తన తపముచే నిర్మించిన ప్రాసాదము (దేవాలయము) ఒకటి కలదు. దాని నిర్మాణమునకై అమర్చిన చోటిని పుష్కరిణి నీటినుండి వేరుపరచుటకు నలువైపుల చతురస్రాకారమున నిర్మించిన అడ్డుకట్ట (సేతువు) నానా రత్నములు పొదిగిన బంగారుతో నిర్మితమై శోభిల్లుచుండెను. ఆలయము చంద్ర కిరణములవలె వెలయు వెండితో దాని మెట్లు వైదూర్యములతో ప్రాకారము పగడములతో లోపలి కప్పుపైనుండు మహాచక్రము బంగారు పొదిగిన ఇంద్రనీలములతో మహాస్తంభములు పద్మరాగములతో వేదికలు మరకతములతో నిర్మితములు; ఇట్లు అది రత్న కిరణరాశితో తళతళలాడుచు దృష్టిమనోహరము రమ్యమునై యుండెను. ఇట్టి ఆలయమున దేవదేవుడు భగవానుడు నగు జనార్ధనుడు (నారాయణుడు) అర్చామూర్తియై ఉండెను. ఆ దేవుడు అనంతుని పడగల గమిపై పండుకొన్నవాడు సర్వాలంకార భూషితుడు; ఆ దేవదేవుడగు చక్రి కుడి మోకాలు కొంచెముగ ముడుచుకొని రెండవపాదము అనంతుని యందు ఉంచబడియుండెను. ఆ శేషశాయి దృష్టి లక్ష్మిపై అసక్తమై యుండెను. ఆ దేవదేవుని ఎడమ పైభుజము ఫణీంద్రుడగు ఆదిశేషుని పడగలపై దిండుగా నుంచబడెను. కుడిపైభుజము పూర్తిగా చాచబడి దాని మణికట్టు దేవదేవుని ముడుచుకొనిన మోకాలిపై ప్రకాశించుచుండెను. ఎడమ దిగువ భుజమును కొంచెముగ ముడిచి అదేవుడు నాభిదేశమునకు ఉదరమునకు సూటిగా పానుపై ఉంచుకొనెను. కుడి దిగువ చేతితో పారిజాత (కల్పవృక్ష) కుసుమమును వాసన చూచుటకై ముక్కునకు దగ్గరగా ఉంచుకొనెను. ఆ దేవదేవుని పాదములను లక్ష్మీదేవి పద్మపత్రములను బోలు కరములతో సంవాహనము చేయుచుండెను.

ఆ భగవానుడు కల్పవృక్షపు పూలతో మకుటముతో హారములతో అందెలతో భుజ కీర్తులతో అంగుళీయకములతో శోభించుచుండెను. ఫణీంద్రుని పడగలయందలంకారముగా ఉంచబడిన మనోహర రత్న శిఖలతో స్వామి ప్రకాశించుచుండెను. జ్ఞానులకును అగమ్యుడు అత్రి మహామునిచే ప్రతిష్ఠితుడు సిద్ధులకును సతతము అభిపూజ్యుడు. సతతము పూజా కుసుమాన్వితుడు. దివ్య గంధానులిప్తాంగుడు దివ్య ధూప ధూపితుడు సిద్ధులు సదా తెచ్చి కానుకలిచ్చిన సరసములును హృదయమున కింపుగొల్పునవియునగు మంచి ఫలములతో ప్రకాశించుచుండు ఉత్తమ పార్శ్వము కలవాడు. కలువలు అలంకారముగానున్న శీర్షము కలవాడు నగు ఆనారాయణుని తన సమక్షమునగాంచి ఆ మద్రరాజగు పురూరవసుడు నిలువబడి ఉండియే నమస్కరించెను.

అంతట అతడు మోకాళ్ళను శిరస్సును నేలకానించి నారాయణునికి నమస్కరించి సహస్ర నామములతో మధుసూదనుని స్తుతించెను. అనంతరము అతడు లేచి ప్రదక్షిణమును నమస్కారమును మరలమరల చేసెను. ఆ ఆలయము అతి రమ్యము నుండుట చూచి ఆ ఆశ్రమమునందే తన నివాసము నేర్పరచుకొనెను. పుష్కరిణీ జలమునకు వెలుపల అతి మనోహరమగు ఒకానొక గుహను ఆశ్రయముగా ఏర్పరచుకొని దానియందే నానావిధ పుష్ప ఫలమూలములతో గోరసముల (ఆవుపాలు, పెరుగు, నేయి మొదలగు వాని)తో మధుసూదన పూజా పూర్వకముగా తప మాచరించెను. ఆతడు అనుదినమును త్రిషవణములందు స్నానము చేయును. అగ్నిని హోమముతో పూజించును. దేవ నిర్మితములగు (మనుష్యులు త్రవ్వియుండని) బావుల నీటితో ప్రాణ ధారణము చేయును. మరి ఆహారమును తీసికొనడు. ఇతరులు ఎవ్వరును ఆశ్రయించి ఉపయోగించుకొనుచుండని గుహలయందు నిద్రించును. కేవలము నియమపరుడై ఆహారగ్రహణము విడిచియున్నను ఆతని శరీరము శ్రమ చెందెడిదికాదు. ఇది ఆశ్చర్యము గొలుపు విషయముగదా! ఇట్లారాజు ధ్రువ నిశ్చయుడై దేవదేవుని విడువక సదా పూజించుచు తపమాచరించుచు స్వర్గతుల్యమగు ఆ ఆశ్రమమున ఏ దుఃఖమును ఎరుగక కొంతకాలము గడపెను.