పాద్మకల్ప వృత్తాంతారంభము

ఋషులు సూతుని ఇట్లడిగిరి, నరసింహరూపుడగు నారాయణుని మాహాత్మ్యమును విస్తరముగ చెప్పితివి. మరలను ఆ దేవునిదే మరియొక మాహాత్మ్యమును విస్తరించి చెప్పుము. విష్ణు నాభినుండి పద్మరూప మెట్లేర్పడెను? హేమపద్మమయమగు జగమెట్లు ఏర్పడెను? విష్ణువు ఆ పద్మ మధ్యము నుండి సృష్టి నెట్లారంభించి సాగించెను? అనగా సూతుడిట్లనెను: నరసింహుని మహాత్మ్యమును విస్మయమున కన్నులు వికసింపగా విని వైవస్వతుడు మత్స్యరూప కేశవుని మరల నిట్లడిగెను: పూర్వము పాద్మ మహాకల్పమున జలార్ణవమందు జలమున నిద్రించుచుండిన పద్మనాభుని ప్రభావమున అతని నాభియందుండి పద్మమయ (పద్మపు పరిణామ) మగు జగత్తు ఎట్లేర్పడెను? పూర్వము ఆదికాలమందు దేవతలును ఋషిగణములును పుష్కరముల (జలముల -  పద్మముల యందుండి ఎట్లు కలిగిరి? దేవా! జనార్దనా! నీవు యోగవేత్తలకు అధిపతివి. కావున ఈ యోగ (ప్రవృత్తి ప్రవర్తిల్లిన క్రమ)ము నంతను నాకు తెలుపుము. అతని గుణకీర్తనము వినుచుండగా నాకు ఎంతకును తృప్తియే కలుగుటలేదు. పురుషోత్తముడు (సముద్ర జలములందు) ఎంతకాలము పండుకొనును? ఎంతకాలము నిద్రించును? ఈ కాలసృష్టి ఎట్లు? ఎంతకాలమున కతడు మేలుకాంచి లేచును? తరువాత ఈనిఖిల జగత్తును ఎట్లు సృష్టించెను. మొదట నుండిన (అది) ప్రజాపతులెందరు? సనాతనమగు (అనాది ప్రవాహ రూపమగు ) చిత్రలోకమును అతడెట్లు నిర్మించెను? ఈజగము ఏకార్ణవము శూన్యమయి స్థావర జంగమ ప్రాణులు పదార్థములు నశించి దేవాసుర నరనాగ రాక్షసులెల్ల నశించి ఆకాశము వాయువు అగ్ని పృథివి నశించి (పంచ భూతములలో నీ రొకటి మాత్రము మిగిలియుండగా) మహాభూత (సూక్ష్మ) ములు కూడ లేక కేవలము గహ్వరము (మహాశూన్యము) కాగా విభువు (సర్వవ్యాప్తి) మహాభూతములకు కూడ అధినాధుడు మహాతేజస్కుడు (స్వయంప్రకాశుడు) మహాకారవంతుడు దేవశ్రేష్ఠుడు అగు నారాయణుడు యోగ ప్రక్రియ నాశ్రయించి యోగవంతుడై (యోగము - అన్నియు లయ మందిన ఏకైకతత్త్వముగా నుండుట అని ఇచట అర్థము) ఎట్లుండెను? ధర్మజ్ఞుడవును పరబ్రహ్మ రూపుడవునగు దేవా! పరమభక్తితో అదియంతయు వినగోరుచున్నాను. కావున నాకదియంతయు చెప్ప వేడుచున్నాను. శ్రద్ధతో కూర్చుండియున్న మాకందరకును భగవన్! నారాయణాత్మకమగు భగవత్కీర్తిని ప్రతిపాదింపుడు అనెను.

ఓ రవికుల శ్రేష్ఠా! నారాయణుని యశమును వినవలెనని నీకు కోరిక కలుగుట ఆ నారాయణాంశ భూతుడగు రామునకు మూల పురుషుడవగు నీకు సముచితమే. వేదములనుండి గ్రహింపబడి అది పురాణముల యందు వినబడుచున్న విధమున తెలిపెదను; వినుము; అని మత్స్యుడు మనువునకు చెప్పిన విధమున ఋషులారా! నేను (సూతుడను)మీకు చెప్పదను. ఈఆది పురాణముల యందలి విషయములను బృహస్పతి సమ విజ్ఞాన తేజముగల పరాశరసుతుడు మా గురుడు నగు ద్వైపాయనుడు తపముచే దర్శించి (బ్రాహ్మణులకు తెలుపగా) ఆ బ్రాహ్మణుల నోటినుండి వినినది వినినట్లు నా శక్తికొలది ఋషిమాత్రుడనగు నాకు తెలియ శక్యమయినంత మాత్రము మీకు తెలిపెదను. విశ్వములకు ఆశ్రయుడగు బ్రహ్మయును ఏ తత్త్వమును వాస్తవరూపమున తెలుపజాలడో అట్టి నారాయణాత్మక పరతత్త్వమును ఎవరు ఎరుగగలరు? ఆ నారాయణ తత్త్వము సర్వవేదములచే ప్రతిపాద్యమగు (యజ్ఞాది వైదిక) కర్మానుష్ఠానము; అది మహర్షులకును ఎరుగరాని రహస్యము; సర్వయజ్ఞములందు స్తుతింపబడుతత్త్వము; సర్వదర్శులగు వారు దర్శించు తత్త్వము అది; అధ్యాత్మ తత్త్వ విచారకులు ఆలోచింప వలసిన తత్త్వమది; విరుద్ధ కర్మల నాచరించువారికి నరకమును ఆ తత్త్వమే; దేవతలలో అధిదైవతత్త్వము యజ్ఞముల లోని అధియజ్ఞ తత్త్వమును భూతముల యందలి అధిభూత తత్త్వమును పరమర్షులకును అందరాని పరతత్త్వమును వేదములచే నిర్దేశింపబడిన యజ్ఞమును తపస్సును కర్త - కారకుడు (కర్మ ప్రేరకుడు - కర్మ సాధనములు) బుద్ధి - ధర్మము - క్షేత్రజ్ఞుడు (దేహమునందుండు చేతన తత్త్వము) (భగవదుపాసన సాధనమగు) ప్రణవము (ఉపాస్యుడగు) పురుషుడు (అంతర్యామియై) శాసించువాడు - ఇవన్నియు ఒక్కటియే యని భావన చేయబడు తత్త్వమును (ప్రాణాపాన వ్యానోదాన సమానములను) పంచవిధ ప్రాణములును ధ్రువమగు అక్షరతత్త్వమును కాలమును (కాలవశమున కలుగు) పరిపాకమును పరిపాకము నొందించు వాడును వీటికి ద్రష్ట (సాక్షి)యగు వాడును స్వాధీనుడు (స్వతంత్రుడును) వివిధ భావము (రూపము)లతో ఉన్నట్లు చెప్పబడు వాడును అతడే; అతనికంటె పరుడు (గొప్పవాడు) ఎవరును లేరు; ఆ భగవానుడే సర్వమును సృష్టించును; పరిణమింపజేయును; మనచే చేయించును, అన్యులను (తన్నుపాసించని వారిని) వ్యాకులపరచును, ఆద్యుడగు ఆ నారాయణునే యజించు చున్నాము; అతనినే (పొంద) కోరుచున్నాము; అతని వలన ఆనందమునంద గోరుచున్నాము, వినబడునదియు వినదగినదియు పరిజల్పనము చేయబడు నదియు (అసంబద్ధముగా అనావశ్యకముగా మాటలాడుట పరిజల్పనము) చెప్పువాడును చెప్ప బడునదియు చెప్పదగినదియు నేను మీకేది చెప్పుచున్నానో అదియు ఎవరిని కూర్చిన మాటలు జరుగుచున్నవో - అతడును శ్రుతులు యత్పరములై (ఎవనిని తెలుపుచు) ఉన్నవో అతడును విశ్వమును విశ్వ రక్షకుడును సత్యమును అమృతతత్త్వమును అక్షర (నశించని) తత్త్వమును పరమ తత్త్వమును భూతము (గడచినది) ఈ పదమును (వర్తమానము -  ఇప్పుడు జరుగుచున్నది) భవిష్యమును చరమును (చలించునది) అచరమును (కదలని వస్తువు) ఈ చెప్పిన దేదియుకాక మిగిలినది ప్రతియొక్కటియు, పురుష శ్రేష్ఠుడు ప్రభువు పురాణుడు (ఈ విశ్వము అను పురమునందు చైతన్య రూపుడై శ్వాసించువాడు -  పుర+అన -  పురాణ)ను ఆ నారాయణుడే.