మత్స్య మహా పురాణము
కనకకల్పలతికా దాన విధానము
శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను. ఇప్పుడు ఇక మహాపాతక నాశనమగు మహా కల్పలతా మహాదాన విధానమును తెలిపెదను; పుణ్యకరమగు తిథినాడు బ్రాహ్మణులచే పుణ్యా హవాచనము జరిపించవలెను; ఋత్విక్ లును మండపమును సంభారములును భూషణములు ఆచ్ఛాదనములు మొదలగునవియు లోకపాలకావాహనమును తులా పురుష దానము నందువలెనే చేయవలయును; బంగారుతో పది కల్పలతలను చేయించవలయును. అవి శుభములును (చూడ నింపగునవియు) నానా పుష్ప ఫలసహితములును నానావస్త్ర విభూషితములు అయి ఉండవలయును, విద్యాధరగరుడ దంపతులును హారములు నా కల్పలతల నుండి తీసికొన గోరుచుండు సిద్దులును ఫలములను గ్రహింపగోరు పక్షులును లోకపాలురవంటి దేవతా ప్రతిమలును వానిని ఉపశోభింప జేయుచుండవలయును; లవణము మీద బ్రాహ్మిణి అనంతశక్తిని ఉంచవలెను; వారి హస్తములందు శంఖచక్రములుండును; దిగువను ఆ లతల నడుమయందు గజాననముపై తూర్పు దిక్కున బెల్లముపై వజ్రాయుధధారిణియగు ఇంద్రాణీయు పనుపుపై కూర్చుండి ఆగ్నేయమున స్రువమును చేత ధరించి అగ్నాయీ దేవతయు దక్షిణమున బియ్యముపై మహిషముపై నెక్కి గదినీదేవియు నైరృతమున నేతియందు దక్షిణకరమున ఖడ్గము ధరించిన నైరృతీదేవియు పడమట పాలయందు మత్స్యముపై కూర్చుండి నాగపాశము ధరించియున్న వారుణియు, వాయవ్యమున శర్కరపై మృగవాహనయగు పతాకినీదేవియు ఉత్తరమున తిలలయందు నిధులపై(తో) కూర్చుండియున్న శంఖినియు ఈశాన్యమున వృషభవాహనయు త్రిశూల ధారిణియునగు మాహేశ్వరియు నుందురు; వీరందరును కిరీటములను చెవులయందు బావి లీలను ధరించి, వరదముద్రతో నుందురు; ఇవి అన్నియు ఐదు పలములకు తక్కువ కాకుండ సహస్ర ఫలముల వరకు గల తూకపు బంగారముతో చేయించ వలయును, వీరందర మీదకు వచ్చునట్లు ఐదు వన్నెల మేల్కట్టు (చాందినీ - వితానకము) చేయించవలయును, ధేనువులును, కుంభములును, వస్త్రయుగ్మములును ప్రతివిధమగునవియు పదిపది చొప్పున సిద్ధపరచు కొనవలయును, ప్రతిమలలో నడుమనుండు బ్రాహ్మిని అనంతశక్తిని ఆచార్యునకును మిగిలిన ఎనిమిదింటిని ఎనిమిది మంది ఋత్విజులకును ప్రతి ప్రతిమకును ఒక్కొక్క ధేనువు కుంభము వస్త్రయుగ్మము చొప్పునచేర్చి దాన మీయవలయును; తరువాత సంప్రదాయ మెరిగి యజమానుడు మంగళవాద్య ధ్వనులతో స్నానమాడి తెల్లని వస్త్రములను ధరించి ఆ విప్రులను ప్రదక్షిణించి ఈ మంత్రములను పలుకవలయును; “పాపవినాశినులును బ్రహ్మాండ లోకేశ్వర పాలినులును కోరినంతకంటె అధిక ఫలములను వరముగా నిచ్చువారును నగు దిగ్దేవతలకును కల్పలతా దేవతలకును నమస్కారము” అనుచు ఇట్లు సకల దిగ్దేవతా దానమును చేయువారు ముప్పది బ్రహ్మ సంవత్సరములకాలము స్వర్గలోకసుఖముల ననుభవింతురు; ఈవ్రతము సంసార భయ నాశకము; అభిమతఫలప్రదము; దీని నాచరించువాడు క్షణార్ధకాలములోనే సంసారజనిత పాపరాశి నుండి పవిత్రత నందిన శరీరము కలవాడయి తన పితరులను వందమందిని కూడ తరింపజేయును; సురపతి స్త్రీ సహస్రపరివృతుడయి సుఖించును, బ్రహ్మచేతకూడ ప్రశంసితుడగును.