హిరణ్య అశ్వ దాన విధానము

శ్రీమత్స్యుడు మనువునకిట్లు చెప్పెను, ఇప్పుడిక షోడశమహాదాన క్రమమునందలి హిరణ్యాశ్వదాన విధానమును తెలిపెదను; ఇది చాల ఉత్తమమయినది; దీని నిచ్చినందువలన దాత భువనములందు విలక్షణముగ అనంతమగు ఫలమునందును; పుణ్యకరమగు శుభతిథి యందు విప్రులచే పుణ్యాహవాచనమును లోకపాల ఆవాహనమును ఋత్విజులను మండపమును సంభారములను, భూషణములను, వస్త్రములు మొదలగు వానిని తులాపురుష దానము నందువలెనే జరుపవలెను. స్వల్ప ప్రక్రియతో జరుపదలచినవారు ఏకాగ్ని విధానముతోనే ఈ హిరణ్యాశ్వ దాన యజ్ఞమును జరుపవలెను, బంగరు గుర్రమును తన శక్తి ననుసరించి మూడు పలములకంటె ఎక్కువగ సహస్ర పలములకు మించని బంగారుతో చేయించి దానిని వేదీ మధ్యమందు కృష్ణాజినముపై నూవులయందు పట్టువస్త్రములతో చుట్టి ఉంచవలయును, దాని దగ్గర పాదుకలు పాదరక్షలు ఛత్ర చామరాసన పాత్రములు ఎనిమిది పూర్ణకుంభములు మాల్యములు చెరకుగడలు ఫలములు ఉపస్కరములతో కూడ శయ్య బంగరు సూర్యుడు - ఇవి అన్నియు ఉంచవలెను. తరువాత యజమానుడు బ్రాహ్మణులచే సర్వౌషధీ స్నానము జరిపించుకొని దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రముచ్చరించ వలయును:

“సర్వదేవేశా! మత్స్యరూపమున వేదములను తెచ్చుటయందు ఆసక్తి కలవాడా! (హయగ్రీవ) అశ్వరూపముతో నీవును మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము; భాస్కరా! నీవే ఛందోరూపమున ఏడుగానయి (వేదమునందలి ప్రధాన ఛందస్సులు ఏడు మాత్రమే) లోకములను ప్రవర్తిల్లజేయుచున్నావు; కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము.”

ఇట్లుచ్చరించి ఆ అశ్వమును గురువున కర్పించవలయును; దానిఫలముగా పాపక్షయ మగుట వలన శాశ్వతమగు భానులోకమును పొందును; తరువాత యథాశక్తిగా గోవులతో ఋత్విజులను పూజించవలయును, సర్వధాన్యోప కరణములను గురునకు ఈయవలెను. శయ్య మొదలగునవి కూడ (పాత్రులకు) దానముచేసి తైలరహితమగు ఆహారమును భుజించవలయును; పురాణ శ్రవణమును భోజనాదికమును జరిపించవలెను.

ఈ హిరణ్యాశ్వ దాన మొనర్చినవాడు పాపముక్తుడై స్వర్గమున సిద్ధులచే ఇతర దేవ సంఘములచే పూజితుడగుచు నారాయణపద ప్రాప్తుడగును; దీనిని పఠించువాడును సకల పాపముక్తుడై అశ్వమేధఫలము నందును; కనకమయ విమానమున రవిలోకమేగి అట అప్సరః పూజితుడగును; అల్పధన పురుషుడు దీనిని వినినను, చూచినను, స్మరించి మెచ్చినను, అట్టివాడును పాపనాశమున శుద్ధదేహుడై ఇంద్ర, రుద్రాదులు వసించు లోకములందును.